సాక్షి, ఖమ్మం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలను ఆదుకునేందుకు మరోసారి ముందుకొచ్చాయి. ఈ క్రమంలో రేషన్‌కార్డుదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించాయి. ఒకటి, రెండు నెలలు కాదు మళ్లీ ఆరు నెలల పాటు లబ్ధిదారులందరికీ ఉచితంగానే బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించగా, గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పొడిగింపు..
కరోనా కేసులు మొదలైన సమయాన పేదలు ఉపాధి కోల్పోయారు. దీంతో అప్పట్లో వారిని ఆదుకునేందుకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించగా గత నెలతో ప్రక్రియ ముగిసింది. దీంతో తాజాగా ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించాయి.
పంపిణీ వివరాలిలా..
రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతీ లబ్ధిదారుడిని ఆదుకునేందుకు ప్రభుత్వాలు బియ్యం కేటాయింపులు చేశాయి. ఆహారభద్రత లబ్ధిదారులకు ఒక్కొక్కరికి పది కేజీలు, అంత్యోదయ కార్డుకు 35కేజీలు ఇస్తుండగా... అదనంగా ఒక్కో లబ్ధిదారుడికి ఐదు కేజీల బియ్యం ఇవ్వనున్నారు. ఇక అన్నపూర్ణ కార్డుదారులకు మాత్రం యథావిధిగా పది కిలోల బియ్యం పంపిణీ చేస్తారు. కాగా, జిల్లాలో 669 రేషన్‌షాపులు, 4,16,826 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో ఆహార భద్రత కార్డులు 3,89,765, అంత్యోదయ కార్డులు 27,058తో పాటు అన్నపూర్ణ కార్డులు మూడు ఉన్నాయి.
నేటి నుంచి పంపిణీ చేస్తారు...
ఏప్రిల్ నెలకు సంబంధించి ఉచితంగానే బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. జిల్లాలో రేషన్‌కార్డు ఉన్న వారందరికీ ఉచిత బియ్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. నేటి నుంచి బియ్యం అందించాలని రేషన్ డీలర్లను ఆదేశించాం.
– రాజేందర్, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి
Comments
Please login to add a commentAdd a comment