సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన రీజనల్ రింగురోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర భాగానికి బడ్జెట్ ఖరారైంది. ఉత్తర భాగంలో మొత్తం 162.46 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.13,200 కోట్లు ఖర్చవుతుందని కేంద్ర జాతీయ రహదారుల విభాగం తేల్చింది. ఇందులో రోడ్డు నిర్మాణానికి రూ.8 వేల కోట్లు, భూసేకరణకు రూ.5,200 కోట్లు అవసరం అవుతాయని నిర్ధారించింది. వాస్తవానికి ప్రాజెక్టును ప్రతిపాదించిన సమయంలో ఉత్తర భాగం నిర్మాణానికి సుమారు రూ.9 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా.. ఇప్పుడు మరో రూ.4,200 కోట్ల మేర పెరిగింది.
వాటా సొమ్ము ఇవ్వాలని రాష్ట్రానికి లేఖ
రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి మొత్తంగా 2 వేల హెక్టార్ల భూమి అవసరం పడుతోంది. ఇందులో ప్రభుత్వ భూములు తక్కువగా ఉన్నందున.. చాలావరకు భూసేకరణ చేయాల్సి వస్తోంది. పరిహారం రూపంలో భారీగా ఖర్చవనుంది. నిబంధనల ప్రకారం భూసేకరణకు అయ్యే వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం భరించాల్సి ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.2,600 కోట్లు తన వాటాగా ఇవ్వాలి. దీంతో ఈమేరకు సొమ్మును జమ చేయాల్సిందిగా ఎన్‌హెచ్‌ఏఐ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. భూసేకరణకు కసరత్తు ప్రారంభమైన నేపథ్యంలో దానికి సంబంధించిన నిధులు సిద్ధం చేసుకోవాల్సిన అవసరాన్ని అందులో ప్రస్తావించింది.
వ్యయం మరింత పెరిగే అవకాశం!
గ్రేటర్ హైదరాబాద్‌ను చుట్టేస్తూ ఔటర్ రింగ్ రోడ్డు అవతల చేపట్టిన రీజినల్ రింగురోడ్డు నిర్మాణానికి మొత్తంగా రూ.19 వేల కోట్లు ఖర్చవుతుందని తొలుత ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో ఉత్తర భాగానికి రూ.9 వేల కోట్లు, దక్షిణ భాగానికి రూ.10 వేల కోట్లు అవసరమని పేర్కొన్నారు. కానీ పలు రకాల కారణాలతో ఈ ప్రాజెక్టులో జాప్యం జరిగి.. నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతోంది. తాజాగా కేంద్రం ఆమోదించిన బడ్జెట్ ప్రకారం.. ఒక్క ఉత్తర భాగం నిర్మాణానికే రూ.13,200 కోట్లు ఖర్చవనున్నాయి. ఈ మార్గంలో ప్రధాన పట్టణాలకు చేరువగా రోడ్డు నిర్మాణం జరగనుంది. ఆ ప్రాంతాల్లో భూముల ధరలు విపరీతంగా ఉండటంతో పరిహారం ఖర్చు ఎక్కువగా ఉంటుందని.. అంచనా వ్యయం మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇక రీజనల్ రింగ్‌రోడ్డు దక్షిణ భాగం ఖర్చుకూడా భారీగానే ఉంటుందని అంటున్నాయి.
30 కిలోమీటర్లు మినహా వేగంగా..
భువనగిరి కాలా (కాంపిటెంట్ అథారిటీ లాండ్ అక్విజిషన్) పరిధిలో 22 కిలోమీటర్ల రోడ్డు, సంగారెడ్డికి చేరువగా ఉన్న గ్రామాలకు సంబంధించి 8 కి.మీ.ల రోడ్డుకు సంబంధించి భూసేకరణ సర్వేను స్థానికులు అడ్డుకున్నారు. ఈ 30 కిలోమీటర్ల పరిధిలో భూసేకరణ సర్వే కొనసాగుతుండగా.. మిగతా ప్రాంతాల్లో పూర్తయింది. ఆ ప్రాంతాలకు సంబంధించి అటవీ, పర్యావరణ అనుమతులు తీసుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనుమతులు రాగానే భూసేకరణ చేపడతారు. అవార్ట్ పాస్ చేస్తే సదరు భూమి ఎన్‌హెచ్‌ఏఐ పరిధిలోకి వెళుతుంది. ఈలోగా పరిహారం నిధుల్లో రాష్ట్రం వాటాను జమ చేయాలని జాతీయ రహదారుల విభాగం కోరింది.
Comments
Please login to add a commentAdd a comment