Gazette Notification Released For Regional Ring Road Land Acquisition - Sakshi
Sakshi News home page

RRR: రీజినల్‌ రింగ్‌రోడ్డు విషయంలో తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం

Published Fri, Aug 26 2022 9:21 AM | Last Updated on Fri, Aug 26 2022 10:35 AM

Gazette Notification Released For Regional Ring Road Land Acquisition - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రీజినల్‌ రింగ్‌రోడ్డు ఉత్తర భాగం భూసేకరణకు సంబంధించి కీలకమైన నాలుగు 3ఏ (క్యాపిటల్‌ ఏ) గెజిట్‌ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఏప్రిల్‌ నెలలోనే భూసేకరణకు కాంపిటెంట్‌ అథారిటీగా ఉన్న యాదాద్రి–భువనగిరి అదనపు కలెక్టర్‌ పరిధి, ఆందోల్‌–జోగిపేట ఆర్డీవో, చౌటుప్పల్‌ ఆర్డీవో పరిధిలోని గ్రామాలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదలవగా.. ఇప్పుడు సంగారెడ్డి, భువనగిరి, గజ్వేల్, నర్సాపూర్‌ ఆర్డీవోల పరిధిలో భూసేకరణకు వీలుగా గెజిట్‌ నోటిఫికేషన్లను కేంద్ర జాతీయ రహదారుల శాఖ జారీ చేసింది. ఒక్క తూప్రాన్‌ ఆర్డీవో పరిధిలో భూసేకరణకు నోటిఫికేషన్‌ విడుదల కావాల్సి ఉంది.

అభ్యంతరాలకు 21 రోజులు గడువు
సంగారెడ్డి, భువనగిరి, గజ్వేల్, నర్సాపూర్‌ ఆర్డీవోల పరిధిలో భూసేకరణ గెజిట్‌ ప్రచురితమైన రోజు నుంచి 21 రోజులలోపు అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు అవకాశం కల్పించారు. ఆయా ప్రాంతాల వారు రోడ్డు నిర్మాణం వల్ల నష్టాలు, చేయాల్సిన మార్పుచేర్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గ్రామాల వారీగా భూసేకరణపై అభ్యంతరాలు, సూచనలను కాంపిటెంట్‌ అథారిటీకి అందించవచ్చు. అధికారులు వాటిని పరిశీలించాక.. సభ నిర్వహించి ఆయా అభ్యంతరాలపై సమాధానాన్ని వెల్లడిస్తారు. జాతీయ రహదారుల చట్టం 1956 (48) సెక్షన్‌ 3సిలోని సబ్‌ సెక్షన్‌ 1 ప్రకారం.. అభ్యంతరాలపై కాంపిటెంట్‌ అథారిటీ ఇచ్చిన ఆదేశమే తుది నిర్ణయం అవుతుందని గెజిట్‌లో పేర్కొన్నారు.

హద్దుల గుర్తింపునకు త్వరలో సర్వే..
రీజినల్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంటుకు సంబంధించి ఇప్పటికే మార్కింగ్‌ చేశారు. గెజిట్లు విడుదలైన నేపథ్యంలో రోడ్డు వెడల్పు 100 మీటర్లు కచ్చితంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందనేది గుర్తించి హద్దు రాళ్లు పాతనున్నారు. డిఫరెన్షియల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం పరికరాలతో వీటిని ఏర్పాటు చేస్తారు. అభ్యంతరాలపై సమాధానం వెల్లడించిన తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. కాగా ఏయే సర్వే నంబర్లలో ఎంత భూమి సేకరించనున్నారు, దాని యజమాని ఎవరనే వివరాలతో త్వరలో 3డి గెజిట్‌ నోటిఫకేషన్‌ను విడుదల చేయనున్నారు. 

ఏయే గ్రామాలు.. ఎంత భూమి?
- సంగారెడ్డి ఆర్డీవో పరిధిలోని.. దేవల్‌ పల్లె, దౌల్తాబాద్‌–కొత్తపేట, కాసాల, సికిందర్‌పూర్, గిర్మాపూర్, మల్కాపూర్, పెద్దాపూర్, చింతల్‌పల్లి, ఇరిగిపల్లె, కలబ్‌గూర్, కులబ్‌గూర్, నాగపూర్, సంగారెడ్డి, తాడ్లపల్లె గ్రామాలకు సంబంధించి 195.129 హెక్టార్లు.

- భువనగిరి ఆర్డీవో పరిధిలోని.. రాయగిరి, గౌస్‌నగర్, కేసారం, పెంచికల్‌ పహాడ్, తుక్కాపూర్‌ గ్రామాలకు సంబంధించి 199.103 హెక్టార్లు.

- గజ్వేల్‌ ఆర్డీవో పరిధిలోని.. బంగ్లా వెంకటాపూర్, మఖత్‌ మాసాన్‌పల్లె, మట్రా జ్‌పల్లె, ప్రజ్ఞాపూర్, సంగాపూర్, అల్రాజ్‌ పేట, ఇటిక్యాల, పీర్లపల్లె, అంగడి కిష్టాపూర్, చేబర్తి, ఎర్రవల్లి, పాముల పర్తి, బేగంపేట, ఎల్కల్, జబ్బాపూర్, మైలారం మక్త, నెమ్టూరు గ్రామాలకు సంబంధించి 389.96 హెక్టార్లు.

- నర్సాపూర్‌ ఆర్డీవో పరిధిలోని.. చిన్న చింతకుంట, కాజీపేట, మహమ్మదాబాద్‌– జానకంపేట, మూసాపేట, నాగులపల్లె, పెద్ద చింతకుంట, రెడ్డిపల్లి, తిర్మలాపూర్, తుజల్‌పూర్, గుండ్లపల్లి, కొంతాన్‌పల్లె, కొత్తపేట, లింగోజిగూడ, పాంబండ, పోతుల బోగూడ, రత్నాపూర్, ఉసిరక పల్లె గ్రామాలకు సంబంధించి 303.79 హెక్టార్లు.  

ఇది కూడా ‍క్లిక్‌ చేయండి: వెరైటీ కప్పుల గణపయ్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement