RRR: Regional Ring Road to Pass Through 113 Villages in Hyderabad Telangana - Sakshi
Sakshi News home page

ఆర్‌ఆర్‌ఆర్‌ తొలి గెజిట్‌కు గ్రీన్‌సిగ్నల్‌.. 113 గ్రామాలు.. 1904 హెక్టార్లు

Published Sat, Mar 26 2022 7:39 AM | Last Updated on Sat, Mar 26 2022 2:38 PM

Regional Ring Road to Pass Through 113 Villages in Hyderabad Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగానికి సంబంధించి తొలి నోటిఫికేషన్‌ (3ఎ) మరో 2 రోజుల్లో విడుదల కానుంది. గెజిట్‌ నోటిఫికేషన్‌పై కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఆమోదముద్ర వేస్తూ సంతకం చేశారు. దానికి భూసేకరణ నోటిఫికేషన్‌ జత చేసి విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమ–మంగళవారాల్లో గెజిట్‌ విడుదల కానుందని సమాచారం. ఈ ఉత్తర భాగానికి సంబంధించి కావాల్సిన మొత్తం భూమి, రోడ్డు నిర్మాణం జరిగే భూమి ఉన్న గ్రామా లు ఇతర వివరాలను అందులో పొందుపర్చారు. ఉత్తరభాగానికి సంబంధించిన తుది అలైన్‌మెంటు మ్యాపును కూడా జత చేశారు. నాలుగు జిల్లాల పరిధిలోని 15 మండలాలకు సంబంధించి 113 గ్రామాల మీదుగా రోడ్డు నిర్మాణం జరగనుంది. ఇందుకు మొత్తం 1,904 హెక్టార్ల భూమి అవసరమని గెజిట్‌లో పొందుపరిచినట్లు తెలిసింది. 

కావాల్సిన భూమి 1,904 హెక్టార్లు.. 
ఆర్‌ఆర్‌ఆర్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 158.645 కి.మీ. నిడివితో నిర్మితమయ్యే ఉత్తర భాగానికి మాత్రమే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దక్షిణ భాగానికి సంబంధించి ప్రతిపాదిత ప్రాంతాల మీదుగా వాహనాల ప్రయాణం తక్కువగా ఉన్నందున, అక్కడ ఎక్స్‌ప్రెస్‌వే తరహా రోడ్డు నిర్మాణం అవసరం ఉందా అనే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. ఆమోదముద్ర వేసిన ఉత్తరభాగం రోడ్డుకు.. భవిష్యత్తులో 8 వరసలకు విస్తరించేలా 100 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేసి, ప్రస్తుతానికి నాలుగు వరసలతోనే నిర్మించనున్నారు. 100 మీటర్ల వెడల్పుతో ప్రతిపాదిత అలైన్‌మెంటుకు 1,904 హెక్టార్ల భూమి అవసరమవుతుందని గెజిట్‌లో ప్రతిపాదించినట్టు తెలిసింది.  

సంగారెడ్డి టు చౌటుప్పల్‌.. 
ఈ ఉత్తర భాగం రోడ్డు సంగారెడ్డి పట్టణం వద్ద ప్రారంభమై చౌటుప్పల్‌ వద్ద ముగుస్తుంది. ఈ రోడ్డు నిర్మాణానికి కావాల్సిన 1,904 హెక్టార్ల భూమిని ఆయా గ్రామాల వారి నుంచి సేకరించనున్నారు. ఇందుకుగాను ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం 8 మంది అధికారులతో కూడిన కాంపిటెంట్‌ అథారిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో యాదాద్రి–భువనగిరి జిల్లాకు చెందిన ఒక అదనపు కలెక్టర్‌తో పాటు చౌటుప్పల్, భువనగిరి, గజ్వేల్, సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, జోగిపేట ఆర్టీఓలు ఉన్నారు.  

4 జిల్లాలు..15 మండలాలు 
రీజినల్‌ రింగురోడ్డు ఉత్తర భాగం సంగారెడ్డి, యాదాద్రి, మెదక్, సిద్దిపేట జిల్లాల పరిధిలో నిర్మితం కానుంది. ఈ నాలుగు జిల్లాల పరిధిలోని 15 మండలాలను అనుసంధానిస్తూ రూపుదిద్దుకుంటుంది. సంగారెడ్డి జిల్లా పరిధిలోని సంగారెడ్డి, చౌటకూరు, హత్నూరు మండలాలు, మెదక్‌ జిల్లా పరిధిలోని నర్సాపూర్, శివంపేట, తూప్రాన్‌ మండలాలు, సిద్దిపేట జిల్లా పరిధిలోని గజ్వేల్, వర్గల్, మర్కూక్, జగదేవ్‌పూర్‌ మండలాలు, యాదాద్రి జిల్లా పరిధిలోని తుర్కపల్లి, యాదాద్రి, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్‌ మండలాలు దీని పరిధిలోకి వస్తాయి. ఆర్డీఓ పరిధిని యూనిట్‌గా చేసుకుని గ్రామాల వివరాలను గెజిట్‌లో పొందుపరిచారు. 113 గ్రామాల పేర్లను ఇందులో వెల్లడించారు.  

చౌటుప్పల్‌ ఆర్డీఓ పరిధిలోని గ్రామాలు
చిన్న కొండూరు, వర్కట్‌పల్లి, గోకారం, పొద్దుటూరు, వలిగొండ, సంగెం, చౌటుప్పల్, లింగోజీగూడెం, పంతంగి, పహిల్వాన్‌పూర్, కంచెనపల్లి, టేకులసోమారం, రెడ్లరేపాక, నేలపట్ల, తాళ్లసింగారం, స్వాములవారి లింగోటం, తంగేడుపల్లి. 

భువనగిరి ఆర్డీఓ పరిధిలో.. 
రాయగిరి, భువనగిరి, కేసారం, పెంచికల్‌పహాడ్, తుక్కాపూర్, చందుపట్ల, గౌస్‌నగర్, ఎర్రంబల్లె, నందనం. 

యాదాద్రి–భువనగిరి అదనపు కలెక్టర్‌ పరిధిలో.. 
గంధమల్ల, వీరారెడ్డిపల్లె, కోనాపూర్, ఇబ్రహీంపూర్, దత్తాయపల్లె, వెలుపుపల్లె, మల్లాపూర్, దత్తార్‌పల్లె. 

గజ్వేల్‌ ఆర్డీఓ పరిధిలో.. 
బేగంపేట, యెల్కల్, బంగ్ల వెంకటాపూర్, మఖత్‌ మాసాన్‌పల్లె, కోమటిబండ, గజ్వేల్, సంగాపూర్, ముట్రాజ్‌పల్లె, ప్రజ్ఞాపూర్, శ్రీగిరిపల్లె, పాములపర్తి, మజీద్‌పల్లె, నెమ్టూరు, జబ్బాపూర్, మైలార్‌ మక్తా, కొండాయ్‌పల్లె, మర్కూకు, పాములపర్తి, అంగడి కిష్టాపూర్, చేబర్తి, ఎర్రవల్లి, అల్రాజ్‌పేట, ఇటిక్యాల, పీర్లపల్లి. 

తూప్రాన్‌ ఆర్డీఓ పరిధిలోని గ్రామాలు: 
వట్టూరు, జండాపల్లె, నాగులపల్లె, ఇస్లాంపూర్, దాతర్‌పల్లి, గుండారెడ్డిపల్లె, మల్కాపూర్, వెంకటాయపల్లె, కిష్టాపూర్, తూప్రాన్, నర్సంపల్లె. 

నర్సాపూర్‌ ఆర్డీఓ పరిధిలో.. 
వెంకటాపూర్, లింగోజీగూడ, పాంబండ, పోతులబోగూడ, కొంతాన్‌పల్లె, గుండ్లపల్లె, ఉసిరికపల్లె, రత్నాపూర్, కొత్తపేట, నాగులపల్లి, మూసాపేట్, మహ్మదాబాద్‌ జానకంపేట, రెడ్డిపల్లి, ఖాజీపేట, తిర్మల్‌పూర్, గొల్లపల్లి, అచ్చంపేట, చిన్నచింతకుంట, పెద్ద చింతకుంట, సీతారామ్‌పూర్, రుస్తుంపేట, మంతూరు, మాల్పర్తి, తుజల్‌పూర్‌.
 
సంగారెడ్డి ఆర్డీఓ పరిధిలో.. 
పెద్దాపూర్, గిర్మాపూర్, మల్కాపూర్, సంగారెడ్డి, నాగాపూర్, ఇర్గిపల్లె, చింతల్‌పల్లె, కలబ్‌గూర్, తాళ్లపల్లి, కులబ్‌గూర్, కాసాల, దేవులపల్లె, హట్నూరు, దౌల్తాబాద్‌ (కొత్తపేట), సికిందర్‌పూర్‌. 

జోగిపేట ఆర్డీఓ పరిధిలో.. 
శివంపేట, వెండికోల్, అంగడి కిష్టాపూర్, లింగంపల్లి, కోర్పోల్‌.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement