ట్రిపుల్ ఆర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం?
ఢిల్లీ ఔటర్ రింగురోడ్డు తరహాలో సగం కేంద్రం–సగం రాష్ట్రం
ఇప్పటికే దక్షిణభాగం అలైన్‌మెంట్ సిద్ధం.. ఖరారు దశలో ఎన్‌హెచ్‌ఏఐ
ఇక దానికి ఫుల్‌స్టాప్.. మళ్లీ కొత్త అలైన్‌మెంట్‌కు కసర
కొన్ని కన్సల్టెన్సీ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల సంప్రదింపులు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు (ట్రిపుల్ ఆర్) దక్షిణ భాగాన్ని సొంతంగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావి స్తోంది. అలైన్‌మెంట్ రూపొందించటంసహా భూసేకరణ, రోడ్డు నిర్మాణం అంతా సొంతంగానే చేపట్టే దానిపై కసరత్తు ప్రారంభించింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్ద జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించినట్టు తెలిసింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు మూడు కన్సల్టెన్సీ సంస్థలను సంప్రదించి అలైన్‌మెంట్‌పై చర్చించిననట్టు విశ్వసనీయ సమాచారం. గత నెలలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీని కలిసినప్పుడు మొదటిసారి ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
ట్రిపుల్ ఆర్‌లోని 162 కి.మీ. ఉత్తర భాగంలో ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ జరుగుతోంది. దీనికి సంబంధించి ఎన్‌హెచ్‌ఏఐ అన్ని గెజిట్లు జారీ చేసి, భూమిని తన అధీనంలోకి తీసుకుంది. అవార్డులు పాస్ చేసి భూ నిర్వాసితుల ఖాతాల్లో పరిహారం డబ్బులు జమ చేయటమే తరువాయి. ఆ వెంటనే టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తారు. దీంతో ఈ భాగం రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమం అవుతుంది. ఇక దక్షిణ భాగం విషయానికొస్తే.. ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ సంస్థ మూడు అలైన్‌మెంట్లను గతేడాదే ఎన్‌హెచ్‌ఏఐకి సమర్పించింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం–కేంద్రప్రభుత్వం మధ్య సఖ్యత కొరవడటంతో దక్షిణభాగంలో కసరత్తు నిలిచిపోయింది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు రాగా, అలైన్‌మెంట్‌కు కూడా ఆమోదం లభించలేదు. దీంతో దక్షిణభాగం రోడ్డు కసరత్తు ఇప్పట్లో మొదలు కాదన్న అభిప్రాయం నెలకొంది. ఈ తరుణంలో దక్షిణభాగాన్ని సొంతంగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించుకుంటుందన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
ఢిల్లీ తరహాలో...
ఢిల్లీ ఔటర్ రింగురోడ్డులో వెస్ట్రన్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్ వేను హరియాణా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఈస్ట్రన్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేను ఎన్‌హెచ్‌ఏఐ నిర్మించింది. ఇప్పుడు ఇదే తీరుగా.. హైదరాబాద్ రీజినల్ రింగురోడ్డులో ఉత్తర భాగాన్ని ఎన్‌హెచ్‌ఏఐ, దక్షిణభాగాన్ని తెలంగాణ చేపట్టాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళుతోంది.
ఖర్చు భరించగలదా..?
దాదాపు ఐదేళ్ల క్రితం ట్రిపుల్ ఆర్ ప్రతిపాదన వచ్చినప్పుడు రెండు భాగాలు కలిపి రూ.17 వేల కోట్ల వ్యయంలో పూర్తవు తుందని అంచనా వేశారు. కానీ, గతేడాది జనవరిలో దక్షిణ భాగానికి సంబంధించిన కన్సల్టెన్సీ సంస్థ రూ.12,900 కోట్ల అంచనాతో నివేదిక సమర్పించింది. ఇప్పుడు అది రూ.19 వేల కోట్లకు చేరింది. ఇంతపెద్ద మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించటం అంత సులభం కాదు. అయితే ప్రస్తుతం రోడ్ల నిర్మాణంలో ప్రైవేట్ సంస్థలే కీలకపాత్ర పోషిస్తున్నాయి. బీఓటీ, హెచ్‌ఏఎం పద్ధతులను అవలంబిస్తుండటంతో ప్రభుత్వంపై భారం తక్కువగానే ఉంటుంది. రోడ్డు నిర్మాణం, నిర్వహణ చూసే సంస్థలే ఎక్కువ మొత్తాన్ని భరిస్తాయి. ఈ పద్ధతిలో భారం ఉండకపోవచ్చన్న భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని సమాచారం.
అలైన్‌మెంట్ ప్రక్రియే కీలకం..
ట్రిపుల్ ఆర్ ఆలోచన మొగ్గ తొడిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఓ ప్రాథమిక అలైన్‌మెంట్ చేశారు. కేవలం గూగుల్ మ్యాప్ ఆధారంగా అది జరిగింది. దక్షిణభాగం పరిధిలో ఆ అలైన్‌మెంట్ మరింత గందరగోళంగా ఉంది. ఆ భాగానికి సంబంధించి తర్వాత ఎన్‌హెచ్‌ఏ ఢిల్లీకి చెందిన ఓ కన్సల్టెన్సీకి బాధ్యత అప్పగించింది. దాని ప్రతినిధులు కొన్ని నెలల పాటు క్షేత్రస్థాయిలో తిరిగి పాత అలైన్‌మెంట్ మొత్తం గందరగోళంగా ఉందని గుర్తించి, జలవన రులు, జనావాసాలకు దూరంగా వంకర టింకర లేని కొత్త అలైన్‌మెంట్ సిద్ధం చేశారు. 2023 జనవరిలో మూడు అలైన్‌మెంట్లను ఎన్‌హెచ్‌ఏఐకి ఆ సంస్థ సమర్పించింది.
అందులో 189.205 కి.మీ. నిడివి ఉండే అలైన్‌మెంట్‌ను ఎన్‌హెచ్‌ఏఐ దాదాపు ఖరారు చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపడితే, మళ్లీ కొత్తగా అలైన్‌మెంట్ చేయాల్సి ఉంటుంది. రాజకీయ నేతల నుంచి వచ్చిన ఒత్తిళ్లను ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలోని కన్సల్టెన్సీ సంస్థ పట్టించుకోకుండా శాస్త్రీయంగా అలైన్‌మెంట్‌ను రూపొందించింది. ప్రస్తుత అలైన్‌మెంట్ మారే అవకాశముందన్న వాదన వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment