
సాక్షి,హైదరాబాద్ : నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ సహాయక చర్యల్ని సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు. ఆదివారం ఎస్‌ఎల్‌బీసీ రెస్క్యూ ఆపరేషన్స్ పరిశీలించిన రేవంత్.. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్.. సహాయక చర్యలు పూర్తయ్యేందుకు రెండు మూడ్రోజుల సమయం పడుతుందన్నారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘ఎస్‌ఎల్‌బీసీ పనులు 2005లో మొదలయ్యాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్‌లను నిర్లక్ష్యం చేసింది. పనులు చేస్తుండగా అనుకోని ప్రమాదం జరిగింది. గత 10ఏళ్లలో రెండు కిలోమీటర్లు కూడా టన్నెల్ తవ్వలేదు. మేం వచ్చాక పనులు ఊపందుకున్నాయి. నిపుణలతో చర్చించి పనులు ప్రారంభించాం. ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలి. 11కేంద్ర రాష్ట్రాల రెస్క్యూ బృందాలు సహాకచర్యల్లో పాల్గొన్నాయి. తీవ్రంగా శ్రమిస్తున్న రెస్క్యూ సిబ్బందిని అభినందిస్తున్నా.
రెస్క్యూ ఆపరేషన్‌కు మరో రెండు మూడ్రోజుల సమయం
రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యే సరికి మరో రెండు, మూడు రోజులు పట్టే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే మంత్రులను పంపించా, సమీక్ష నిర్వహించా. ప్రపంచంలోనే ఇదే అతిపెద్ద,పొడవైన టన్నెల్. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బాధితుల పట్ల సానుభూతి చూపించాలి. ఎన్ని రోజులైనా మృత దేహాలను వెలికి తీయాల్సిందే.. బాధిత కుటుంబాలకు అప్పగించాల్సిందే. కన్వేయర్ బెల్ట్‌ను రేపటిలోగా అందుబాటులోకి తెస్తామన్నారు. కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వస్తే రెస్క్యూ వేగవంతం అవుతుంది. అవసరమైతే రోబోలను పంపి రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేయిస్తాం. ఏం జరిగినా ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయతం చేస్తున్నారు . ఏం జరిగినా ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలనే దృఢసంకల్పంతో ఉంది. గతంలో శ్రీశైలం ప్రాజెక్ట్‌లో ప్రమాదం జరిగితే చూసేందుకు వెళ్లిన నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు’ అని వ్యాఖ్యానించారు.
యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి
అంతకుముందు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద సీఎం రేవంత్ రెస్క్యూ ఆపరేషన్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. తక్షణం చేయాల్సిన పనులపై నివేదిక ఇవ్వవాలని అధికారులకు ఆదేశించారు. అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్.. ఈ ఘటనను కేస్ స్టడీగా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగాలి. మరింత మంది నిపుణులను రప్పించండి. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు. ఎన్‌జీఆర్‌ఐ నిపుణులు వచ్చాక మరింత వేగంగా సహాయక చర్యలు చేపట్టాలి. త్వరలో సిస్మాలజీ నిపుణులు కూడా వస్తారు. విభాగాల వారీగా చేయాల్సిన పనులపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలి. తక్షణం చేయాల్సిన పనులపై నివేదిక ఇవ్వాలని సూచించారు.
రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకంగా నీటి ఊట
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌కు నీటి ఊట ఆటంకంగా మారింది. దీంతో ఆ నీటి ఊట ఎక్కడి నుంచి వస్తుందో జియోలాజికల్ టీమ్ సర్వే చేసేందుకు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌పై భాగమైన అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో జియోలాజికల్ అధికారులు సర్వే నిర్వహించారు. అధికారుల సర్వేలో ప్రమాదం స్థలం పైభాగంలో 450 మీటర్ల లోతున నీటి పొరలు ఉన్నట్లు గుర్తించారు. స్థానికంగా ఉసురు వాగు,మల్లెల వాగు,రామతీర్దం, మల్లెల తీర్థం వాగుల నీరు ప్రవహిస్తుంటుంది.
ఈ వాగుల్లోని మల్లెల తీర్థం నుంచి వచ్చే నీటి ప్రవాహాం మారుతున్నట్లు అధికారులు గుర్తించారు. మల్లెలతీర్ధం నుంచి నీరు కృష్ణ నది వైపు ప్రవహిస్తున్నది. వాగుల ప్రవాహం వల్లే ఎస్‌ఎల్‌బీసీ టెన్నెల్‌లో నీటి ఊట ఉన్నట్లు నిర్ధారించారు. జియోలాజికల్ అధికారులు పరీక్షించారు. నీటి ఊట ఎక్కడి నుంచి వస్తుందో ఆరాతీశారు. అయితే ఉసురు వాగు,మల్లెల వాగు,రామతీర్దం, మల్లెల తీర్థం నుంచి ప్రవహించే నీరు కృష్ణ నది వైపు ప్రవహిస్తుంది. వాటిలో మల్లెల తీర్ధం నుంచి వచ్చే నీటి ప్రవాహాం మారుతున్నట్లు అధికారులు గుర్తించారు.
జీపీఆర్ ద్వారా గల్లంతైన వారి ఆచూకీ లభ్యం
మరోవైపు రెస్క్యూ సిబ్బంది జీపీఆర్ ద్వారా ఒక ప్రాంతంలో 2మీటర్ల లోతులో గల్లంతైన వారిలో నలుగురి ఆచూకీ , మరో ప్రాంతంలో ఏడు మీటర్ల లోతులో మరో నలుగురి ఆచూకీ లభ్యమైనట్లు సమాచారం.
ఎస్‌ఎల్ బీసీ వద్దకు సీఎం రేవంత్
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం సాయంత్రం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్నారు. టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది కోసం కొనసాగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించనున్నట్లు సమాచారం.
సీఎం రేవంత్ ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా ఎస్‌ఎల్‌బీసీ సొరంగం వద్దకు వెళ్లనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం, అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 18 ఏజెన్సీలు, వాటి పరిధిలోని 54 మంది ఉన్నతాధికారులు, 703 మంది సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. సింగరేణి నుంచి 200 మంది రెస్క్యూ సిబ్బంది వచ్చారు. ప్రతి షిప్టునకు 120 మంది చొప్పున 24 గంటలు పూడికతీత చేపడుతున్నారు. టీబీఎం కింద చిక్కుకున్న వారిని వెలికి తీయడానికి మూడు నుంచి నాలుగు రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
శనివారం ఆయన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, సీఎస్ శాంతికుమారితో కలిసి రెస్క్యూ ఏజెన్సీలు, సభ్యులతో టన్నెల్ వద్ద సమీక్ష నిర్వహించారు. అనంతరం, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల కోసం జరుగుతున్న సహాయ చర్యల్లో పురోగతి కనిపించిందని, ఆదివారం సాయంత్రానికి ఏదైనా సమాచారం లభ్యమయ్యే అవకాశముందని ఆబ్కారీ, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఈనేపథ్యంలో సీఎం రేవంత్ ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ఫిబ్రవరి 22న ఉదయం 8.30 గంటల ప్రాంతంలో పైకప్పు కూలిన విషయం తెలిసిందే. అక్కడ ఎనిమిది రోజులుగా సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment