ఆర్‌ఆర్‌ఆర్ టెండర్లపై కేంద్రం యోచన
ఉత్తర రింగు వ్యయం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే
దక్షిణ భాగంలో నిర్మాణ సంస్థకు టోల్ బాధ్యత?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు నిర్మాణం, నిర్వహణపై నిశిత పరిశీలన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. రెండేళ్ల క్రితమే ఉత్తర రింగుకు సంబంధించి కసరత్తు ప్రారంభించి అలైన్‌మెంటు ఖరారు చేసినా, ఇప్పటివరకు టెండర్ల దశకు రాలేదు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అనంతరం కదలిక వచ్చింది. 162 కి.మీ. నిడివి ఉండే ఉత్తర భాగానికి సంబంధించి భూపరిహారం చెల్లింపు ప్రక్రియలో భాగంగా గ్రామాల వారీగా అవార్డులు పాస్ చేసేందుకు అంతా సిద్ధమైన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో వెంటనే టెండర్లు పిలవనున్నారు. ఉత్తర భాగానికి సంబంధించిన పట్టణాల మధ్య రాకపోకలు సాగిస్తున్న వాహనాల సంఖ్య భారీగా ఉంది. దీంతో ఈ ప్రాంతంలో 4 వరసల యాక్సెస్ కంట్రోల్డ్ హైవే అవసరం ఉందని కేంద్రం తేల్చింది. ఈ భాగంలో రోడ్డు నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయాన్ని సొంతంగా భరించాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ కనస్ట్రక్షన్ (ఈ పీసీ) పద్ధతిలో టెండర్లు పిలిచి రోడ్డు నిర్మాణానికి కాంట్రాక్టు సంస్థను గుర్తించాలని నిర్ణయించింది. రోడ్డు నిర్మాణం తర్వాత ఏర్పాటు చేసే టోల్ వ్యవస్థను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం మరో టెండరు పిలిచి కాంట్రాక్టు సంస్థను గుర్తించనుంది. కేంద్రమే టోల్ రుసుమును వసూలు చేసుకుంటుంది.
బీఓటీ కాకుంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్!
దక్షిణ భాగానికి వచ్చే సరికి ఈపీసీ టెండరింగ్‌కు వెళ్లొద్దని ప్రాథమికంగా నిర్ణయించింది. దాదాపు 180 కి.మీ. నిడివితో ఉండే దక్షిణ భాగాన్ని నిర్మించే ప్రాంతంలో ఉండే పట్టణాల మధ్య రాకపోకలు సాగిస్తున్న వాహనాల సంఖ్యను తెలుసుకునేందుకు సర్వే నిర్వహించింది. ఉత్తర ప్రాంతంతో పోలిస్తే దక్షిణ భాగం పరిధిలో వాహనాల సంఖ్య చాలా తక్కువగా ఉందని తేలింది. దీంతో అసలు దక్షిణ భాగానికి నాలుగు వరసల రోడ్డు అవసరం లేదన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసింది. చివరకు రింగురోడ్డులా ఉండాలంటే రెండు భాగాలూ ఒకే తరహాలో ఉండాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది.
అయితే ఈపీసీ పద్ధతిలో కాకుండా, బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్(బీఓటీ) పద్ధతిలో దక్షిణ భాగానికి టెండర్లు పిలవాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ పద్ధతిలో.. నిర్మాణ సంస్థ సొంత నిధులతో రోడ్డును నిర్మించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిర్ధారిత కాలం ఆ రోడ్డుపై టోల్‌ను వసూలు చేసుకోవటం ద్వారా ఆ ఖర్చును రికవరీ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ పద్ధతిలో రోడ్డు నిర్మాణ పని తలకెత్తుకునేందుకు నిర్మాణ సంస్థలు ముందుకు రాని పరిస్థితి నెలకొంటే.. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హామ్) పద్ధతిలో టెండర్లు పిలవాలని భావి స్తోంది. దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్మాణ వ్యయంలో 40% మొత్తాన్ని పది వాయిదాల్లో చెల్లిస్తుంది. మిగతా మొత్తాన్ని నిర్మాణ సంస్థ భరించాల్సి ఉంటుంది. వచ్చే జూన్, జూలైలలో దక్షిణ భాగానికి సంబంధించిన అలైన్‌మెంటుకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment