![Central Government Has Focused On The Construction Of Regional Ring Road - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/22/REGINOAL-RING-ROAD.jpg.webp?itok=e2nvPmhe)
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర భాగం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే అనుమతి మంజూరు కావడం, అలైన్‌మెంట్ కూడా ఖరారు కావడంతో అధికారులు రోడ్డు నిర్మాణంపై దృష్టి సారించారు. 158.6 కి.మీ. నిడివితో రూపొందే ఈ భాగం రోడ్డులో 8 ప్రాంతాల్లో భారీ కూడళ్లు (క్లవర్‌లీఫ్ ఇంటర్‌ఛేంజెస్) ఏర్పాటు చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎక్స్‌ప్రెస్ వేలలో ఇవి మేటిగా ఉండ నున్నాయి.
ఇలాంటి నిర్మాణాలను భాగ్యనగరానికి పరిచయం చేస్తూ 12 ఏళ్ల క్రితం రూపుదిద్దుకున్న ఔటర్ రింగురోడ్డు (ఓఆర్‌ఆర్)లో భాగంగా నిర్మించిన క్లవర్‌లీఫ్ ఇంటర్‌ఛేంజెస్‌తో పోలిస్తే ఇవి మరింత భారీగా ఉండనున్నాయి. ప్రస్తుతానికి నాలుగు వరుసలుగానే ఆర్‌ఆర్‌ఆర్ నిర్మితం కానున్నా భవిష్యత్తులో 8 లేన్లకు దీన్ని విస్తరించనున్న నేపథ్యంలో భావి అవసరాలకు సరిపడేలా ఈ ఇంటర్‌ఛేంజ్ నిర్మాణాలు రూపుదిద్దుకోనున్నాయి.
ఒక్కోటి దాదాపు 60 ఎకరాల విస్తీర్ణంలో ఉండనున్నాయంటే వాటి పరిమాణం ఏ స్థాయిలో ఉండనుందో అర్థమవుతుంది. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను క్రాస్ చేసే చోట దాదాపు 100 మీటర్ల వెడల్పుతో ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించనున్నారు. ఈ క్రాసింగ్స్ వద్ద ఇప్పటికే ఉన్న రోడ్ల నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌పైకి వాహనదారులు రావడానికి, ఆర్‌ఆర్‌ఆర్ నుంచి దిగువనున్న రోడ్లకు వెళ్లేందుకు ఈ క్లవర్‌లీఫ్ ఇంటర్‌ఛేంజెస్ అవకాశం కల్పిస్తాయి. సర్వీసు రోడ్లతోనూ అనుసంధానమయ్యేలా వీటిని నిర్మించనున్నారు.
క్లవర్‌లీఫ్ ఇంటర్‌ఛేంజ్ స్ట్రక్టర్లు రానున్న ప్రాంతాలు...
1.హైదరాబాద్–ముంబై జాతీయ రహదారి: పెద్దాపూర్–గిర్మాపూర్ గ్రామాల మధ్య
2.సంగారెడ్డి–నాందేడ్ రహదారి: శివంపేట సమీపంలోని ఫసల్‌వాది సమీపంలో..
3.హైదరాబాద్–మెదక్ రోడ్డు: రెడ్డిపల్లి–పెద్ద చింతకుంట మధ్య
4.హైదరాబాద్–నాగ్‌పూర్ రోడ్డు: తూప్రాన్ సమీపంలోని మాసాయిపేట వద్ద
5.హైదరాబాద్–కరీంనగర్ రాజీవ్ రహదారి: గౌరారం సమీపంలోని గుందాన్‌పల్లి వద్ద
6.హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారి: భువనగిరి–రాయ్‌గిరి మధ్య భువనగిరికి చేరువలో..
7.జగదేవ్‌పూర్–చౌటుప్పల్ రోడ్డు: మందాపురం–పెనుమటివానిపురం మధ్య..
8.హైదరాబాద్–విజయవాడ హైవే: చౌటుప్పల్ సమీపంలోని బాగరిగడ్డ వద్ద
Comments
Please login to add a commentAdd a comment