హైదరాబాద్ మహానగర విస్తరణ, అభివృద్ధికి సర్కారు కార్యాచరణ
కీలకమైన హెచ్‌ఎండీఏపై ప్రభుత్వం దృష్టి
ప్రణాళికా విభాగం ప్రక్షాళన.. రెట్టింపు కానున్న జోన్లు
సేవల్లో పారదర్శకతే లక్ష్యం
ఇకపై పూర్తిస్థాయిలో టీజీ బీపాస్ ద్వారానే సర్విసులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగర విస్తరణ, అభివృద్ధికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ దిశలో కీలకమైన హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) వరకు ఉన్న ప్రాంతాన్ని కూడా హెచ్‌ఎండీఏ పరిధిలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా ఈ మేరకు హెచ్‌ఎండీఏలోని వివిధ విభాగాలను బలోపేతం చేయనున్నారు. ప్రస్తుతం 7 జిల్లాల్లో సుమారు 7,200 చదరపు కిలోమీటర్ల వరకు హెచ్‌ఎండీఏ సేవలు విస్తరించి ఉన్నాయి.
ట్రిపుల్ ఆర్ వరకు పరిధి పెరిగితే ఇది 10 వేల చదరపు కిలోమీటర్ల వరకు విస్తరిస్తుంది. ఈ మేరకు అధికార యంత్రాంగం, ఉద్యోగులు, సిబ్బంది సంఖ్యను కూడా పెంచవలసి ఉంటుంది. ఇందులో భాగంగా మొదట కీలకమైన సంస్థ ప్రణాళికా విభాగాన్ని విస్తరించడం ద్వారా సేవలను మరింత పారదర్శకం చేయనున్నారు. ప్రస్తుతం ప్రణాళికా విభాగంలో శంకర్‌పల్లి, ఘటకేసర్, మేడ్చల్, శంషాబాద్ జోన్లు ఉన్నాయి. నిర్మాణ రంగానికి సంబంధించిన అనుమతులన్నీ ఈ నాలుగు జోన్ల నుంచే లభిస్తాయి.
వాస్తవానికి హెచ్‌ఎండీఏ పరిధి గతంలో కంటే ప్రస్తుతం నాలుగు రెట్లు పెరిగింది. కానీ ఇందుకనుగుణంగా జోన్లు, ప్లానింగ్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మాత్రం పెరగలేదు. దీంతో అధికారులపై పని ఒత్తిడి బాగా ఎక్కువైంది. వందల కొద్దీ ఫైళ్లు రోజుల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. టీజీబీపాస్ (తెలంగాణ బిల్డింగ్ పరి్మషన్ అండ్ సెల్ఫ్ సరి్టఫికేషన్ సిస్టమ్) ద్వారా వచ్చే దరఖాస్తుల పరిశీలనలోనూ తీవ్రమైన జాప్యం నెలకొంటోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడున్న 4 జోన్లను 8కి పెంచాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ దిశగా ప్రణాళికలను సిద్ధం చేశారు.
నలువైపులా అభివృద్ధి
పడమటి హైదరాబాద్‌కు దీటుగా తూర్పు, ఉత్తర, దక్షిణ హైదరాబాద్ ప్రాంతాలను అభివృద్ధి చేస్తేనే రాబోయే రోజుల్లో సుమారు 3 కోట్ల జనాభా అవసరాలకు నగరం సరిపోతుందని అంచనా. ఈ క్రమంలో హెచ్‌ఎండీఏ బాధ్యతలు మరింత పెరగనునున్నాయి. టౌన్íÙప్‌ల కోసం ప్రణాళికలను రూ పొందించడం, రోడ్డు, రవాణా సదుపాయాలను అభివృద్ధి చేయడం, లాజిస్టిక్ హబ్‌లను ఏర్పాటు చేయడం వంటి కీలకమైన ప్రాజెక్టులను హెచ్‌ఎండీఏ చేపట్టనుంది. అన్ని వైపులా టౌన్‌షిప్పులను ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే నగర అభివృద్ధి సమంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు హెచ్‌ఎండీఏలో ప్రణాళికా విభాగాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయనున్నారు. ‘అధికారు లు, ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించడమే కాకుండా సేవల్లో పారదర్శకతను పెంచాల్సి ఉంది. అప్పు డే ప్రభుత్వం ఆశించిన ఫలితాలను సాధించగలం..’అని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.
జోన్ల విస్తరణ ఇలా..
ప్రస్తుతం ఉన్న ఘట్‌కేసర్ జోన్‌లో మరో కొత్త జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే శంకర్‌పల్లి, శంషాబాద్, మేడ్చల్ జోన్లను కూడా రెండు చొప్పున విభజించాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 8 జోన్లను ఏర్పాటు చేయాలనేది ఇప్పుడు ఉన్న ప్రతిపాదన.. మొదట 6 వరకు ఆ తర్వాత 8కి పెంచే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా భవన నిర్మాణాలు, లే అవుట్ అనుమతులను ఇక నుంచి పూర్తిగా ఆన్‌లైన్‌లో టీజీ బీపాస్ ద్వారానే ఇవ్వనున్నారు. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి చేసే లే అవుట్‌లు, భవనాలకు డెవలప్‌మెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (డీపీఎంఎస్) ద్వారా కూడా అనుమతులను ఇస్తున్నారు. ఈ నెలాఖరుతో డీపీఎంఎస్ సేవలను నిలిపివేయనున్నారు. హెచ్‌ఎండీఏలోని 7 జిల్లాల్లో ఉన్న 70 మండలాలు, సుమారు 1,032 గ్రామాల్లో టీజీబీపాస్ ద్వారానే అనుమతులు లభించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment