సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020–21) రూ.1.6 లక్షల కోట్ల మేర అంచనాలతో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ రూపొందిస్తున్నట్లు సమాచారం. 2019–20 బడ్జెట్ ప్రతిపాదిత అంచనా లు, వాస్తవిక రాబడులు, ఆర్థిక మాంద్యం, వచ్చే ఏడాది రాబడుల అంచనా, ప్రభుత్వ ప్రాధాన్య రంగాలకు నిధుల కేటాయింపు ప్రాతిపదికన వాస్తవిక బడ్జెట్‌ను ప్రజల ముందుంచాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగానే వృద్ధి రేటు 10 శాతానికి అనుగుణంగా 2019–20 బడ్జెట్‌లో ప్రతిపాదించిన రూ.1.46 లక్షల కోట్లకు అదనంగా మరో 12–16 వేల కోట్లు కలిపి 2020–21 బడ్జెట్ తయారీ కోసం ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. అయితే రూ.1.65 లక్షల కోట్ల అంచనాతో ఈసారి బడ్జెట్‌కు తుదిరూపు ఇస్తున్నారనే చర్చ జరిగినా, కరోనా వైరస్ ప్రభా వం దేశీయ మార్కెట్లపై ఉండటం, ఆ మేర పన్నురాబడులపై ప్రభావం ఉం టుందనే అంచనా, వచ్చే ఏడాది మొదటి త్రైమాసికం వరకు ఆర్థిక మాంద్యం ప్రభావం ఉండే అవకాశాలున్న నేపథ్యంలో ఈసారి బడ్జెట్ అంచనాలు రూ.1.6 లక్షల కోట్ల వరకు ఉం టాయని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.
ప్రాజెక్టులకు ఈసారి అప్పులే..
ఆర్థిక శాఖ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం ఈసారి సాగునీటి రంగానికి రూ.10 వేల కోట్ల లోపే బడ్జెట్ కేటాయింపులుంటాయని తెలుస్తోంది. వీటికి అదనంగా అప్పులు కలిపి రూ.23 వేల కోట్ల వరకు ప్రతిపాదనలుండే అవకాశాలున్నాయి. సాగునీటి రంగంతో పాటు రైతు రుణమాఫీకి రూ.10 వేల కోట్ల వరకు కేటాయించనున్నట్లు సమా చారం. రైతు రుణమాఫీకి రూ.24 వేల కోట్లు అవసరం అవుతాయని బ్యాంకులు అంచనా వేయగా, 2019–20లో కేటాయించిన రూ.6 వేల కోట్లకు అదనంగా మరో రూ.18 వేల కోట్లు ఈసారి బడ్జెట్‌లోనే కేటాయించి ఈ ఏడాది పూర్తిస్థాయిలో రైతు రుణమాఫీని అమలు చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈసారి రూ.6వేల కోట్లు కేటాయించి ఈ ఏడాది నుంచి రుణమాఫీ అమలు ప్రారంభించాలనే భావనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
57 ఏళ్లకు కుదించిన వయసు ఆధారంగా అర్హులైన కొత్త పింఛన్‌దారులకు పెన్షన్ కింద రూ.12 వేల కోట్లు, జీతభత్యాలు, సబ్సిడీలు, వడ్డీలకు కలిపి రూ.47 వేల కోట్లు కేటాయింపులు అవసరం అవుతాయి. వీటితో పాటు పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలకు రూ.7,300 కోట్లు, రూ.10 వేల కోట్లు విద్యుత్‌రాయితీలు ప్రతిపాదించి మిగిలిన మొత్తాన్ని ఉపకార వేతనాలు, ఆరోగ్యశ్రీ, కల్యాణ లక్ష్మి, విద్య, సంక్షేమం, హోం శాఖలకు కేటాయించేలా బడ్జెట్ కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి కేసీఆర్ ఆపద్బంధు, కుట్టు మిషన్ల పంపిణీ పథకాలకు మాత్రమే కొత్తగా నిధులుంటాయని, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు, నిరుద్యోగ భృతి లాంటి జోలికి ప్రభుత్వం వెళ్లకపోవచ్చని తెలుస్తోంది. కాగా, ఈ బడ్జెట్‌ను ఈనెల 8న అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సగటున రూ.27,659 కోట్లు..
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ గణాంకాలను పరిశీలిస్తే 2014–15 నుంచి చివరి రెండు నెలల్లో సగటున రూ.27,659 కోట్ల ఆదాయం వచ్చింది. 2015 జనవరిలో రూ.38 వేల కోట్లు ఉన్న ఆదాయం మార్చి నాటికి రూ.63 వేల కోట్లకు చేరింది. అదే విధంగా 2015–16లో కూడా చివరి రెండు నెలల్లో రూ.25 వేల కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఆ తర్వాతి ఏడాది చివరి రెండు నెలల ఆదాయం రూ.34 కోట్లు రాగా, మళ్లీ 2017–18లో అది రూ.25వేల కోట్లకు తగ్గింది. 2018–19లో జనవరి నుంచి మార్చి వరకు రూ.27,610 ఆదాయం వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి వరకు వచ్చిన రూ.1.05లక్షల కోట్లకు ఆ మొత్తాన్ని కలిపితే రూ.1.33 కోట్లకు పైగా ఈసారి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఉండవచ్చన్నది ఆర్థికశాఖ వర్గాల అంచనాగా కనిపిస్తోంది. ఈ ఆదాయానికి కేంద్రం నుంచి ఇచ్చే రుణాలు, ఇతర మార్గాల ద్వారా వచ్చే మరికొంత ఆదాయం కూడా అదనం కానుంది. మొత్తంమీద 2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1.47 కోట్ల అంచనాలతో ప్రభుత్వం బడ్జెట్ పెట్టగా రూ.1.35–1.37లక్షల కోట్ల వరకు మొత్తం ఆదాయం వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment