పోస్టాఫీసులో గల ఆధార్ నమోదు కేంద్రం
సాక్షి, పెదవాల్తేరు(విశాఖతూర్పు) : పోస్టాఫీసుల్లో ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. గత నెల 15వ తేదీన సీతమ్మధార దరి పీఅండ్‌టీ కాలనీలో గల పోస్టాఫీసులో ఆధార్ నమోదు కేంద్రాన్ని ప్రారంభించారు. దఫదఫాలుగా విశాఖ డివిజన్ పరిధిలోని 36 పోస్టాఫీసుల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో కొత్తగా ఆధార్ నమోదు చేసుకునేవారు ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరంలేదు. ఇక ఆధార్ కార్డులో పేర్లు, చిరునామా, వయసు తదితర వివరాల్లో సవరణలకు మాత్రం రూ.25 చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్‌కార్డు సాధారణ పోస్టు ద్వారా 15 రోజులలో ఇంటికొస్తుందని విశాఖ డివిజన్ తపాలాశాఖ సీనియర్ సూపరింటెండెంట్ హరిప్రసాద్‌శర్మ మంగళవారం ‘సాక్షి’కి తెలిపారు.
ఆధార్ నమోదు ఇలా...
ఇప్పటివరకు ఎక్కడా ఆధార్ కార్డు లేనివారు తమకు సమీపంలో గల పోస్టాఫీసులో చిరునామా ధృవీకరణపత్రంతో వెళ్లాల్సి ఉంటుంది. గ్యాస్‌బుక్, బ్యాంక్ పాస్‌బుక్, పాసుపోర్టు, డ్రైవింగ్‌లైసెన్సు, ఓటర్‌గుర్తింపు కార్డు, విద్యుత్‌బిల్లు, వంటి ఏదో ఒక ధృవీకరణపత్రం సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు అక్కడే బయోమెట్రిక్ విధానంలో ఫొటో తీసి, ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తారు. ఇక సవరణల కోసం అవసరమైన ధృవీకరణపత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది.
ఆధార్ నమోదు చేసే పోస్టాఫీసులివే...
వెలంపేట, రైల్వేస్టేషన్ వద్ద గల ప్రధాన పోస్టాఫీసులు, అక్కయ్యపాలెం (శ్రీనగర్), ఆంధ్రా యూనివర్సిటీ, డాబాగార్డెన్స్, ద్వారకానగర్ (డైమండ్‌పార్కు), డెయిరీఫారం, హెచ్‌బీకాలనీ, మధురవాడ, మహారాణిపేట (కలెక్టరేట్), ఎంవీపీకాలనీ, సాలిగ్రామపురం, ద్వారకాబస్‌స్టేషన్, పోర్టు, బీహెచ్‌పీవీ, భీమునిపట్నం, చిట్టివలస, గాజువాక, గాంధీగ్రాం, గోపాలపట్నం, ఇండస్ట్రియల్‌ఎస్టేట్, కంచరపాలెం, మల్కాపురం, మర్రిపాలెం, ఎన్‌ఏడికొత్తరోడ్డు, పెదగంట్యాడ, సింహాచలం, ఉక్కునగరం, విశాఖ నేవల్‌బేస్, విశాఖస్టీల్‌ప్లాంట్, విశాలాక్షినగర్ ప్రాంతాలలోని పోస్టాఫీసుల్లో ఆధార్ నమోదు కేంద్రాలు రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పనిచేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment