Biometric machine
-
ఇక పోస్టాఫీసుల్లో ఆధార్ నమోదు
సాక్షి, పెదవాల్తేరు(విశాఖతూర్పు) : పోస్టాఫీసుల్లో ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. గత నెల 15వ తేదీన సీతమ్మధార దరి పీఅండ్‌టీ కాలనీలో గల పోస్టాఫీసులో ఆధార్ నమోదు కేంద్రాన్ని ప్రారంభించారు. దఫదఫాలుగా విశాఖ డివిజన్ పరిధిలోని 36 పోస్టాఫీసుల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో కొత్తగా ఆధార్ నమోదు చేసుకునేవారు ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరంలేదు. ఇక ఆధార్ కార్డులో పేర్లు, చిరునామా, వయసు తదితర వివరాల్లో సవరణలకు మాత్రం రూ.25 చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్‌కార్డు సాధారణ పోస్టు ద్వారా 15 రోజులలో ఇంటికొస్తుందని విశాఖ డివిజన్ తపాలాశాఖ సీనియర్ సూపరింటెండెంట్ హరిప్రసాద్‌శర్మ మంగళవారం ‘సాక్షి’కి తెలిపారు. ఆధార్ నమోదు ఇలా... ఇప్పటివరకు ఎక్కడా ఆధార్ కార్డు లేనివారు తమకు సమీపంలో గల పోస్టాఫీసులో చిరునామా ధృవీకరణపత్రంతో వెళ్లాల్సి ఉంటుంది. గ్యాస్‌బుక్, బ్యాంక్ పాస్‌బుక్, పాసుపోర్టు, డ్రైవింగ్లైసెన్సు, ఓటర్‌గుర్తింపు కార్డు, విద్యుత్‌బిల్లు, వంటి ఏదో ఒక ధృవీకరణపత్రం సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు అక్కడే బయోమెట్రిక్ విధానంలో ఫొటో తీసి, ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తారు. ఇక సవరణల కోసం అవసరమైన ధృవీకరణపత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ నమోదు చేసే పోస్టాఫీసులివే... వెలంపేట, రైల్వేస్టేషన్ వద్ద గల ప్రధాన పోస్టాఫీసులు, అక్కయ్యపాలెం (శ్రీనగర్), ఆంధ్రా యూనివర్సిటీ, డాబాగార్డెన్స్, ద్వారకానగర్ (డైమండ్‌పార్కు), డెయిరీఫారం, హెచ్‌బీకాలనీ, మధురవాడ, మహారాణిపేట (కలెక్టరేట్), ఎంవీపీకాలనీ, సాలిగ్రామపురం, ద్వారకాబస్‌స్టేషన్, పోర్టు, బీహెచ్‌పీవీ, భీమునిపట్నం, చిట్టివలస, గాజువాక, గాంధీగ్రాం, గోపాలపట్నం, ఇండస్ట్రియల్ఎస్టేట్, కంచరపాలెం, మల్కాపురం, మర్రిపాలెం, ఎన్ఏడికొత్తరోడ్డు, పెదగంట్యాడ, సింహాచలం, ఉక్కునగరం, విశాఖ నేవల్‌బేస్, విశాఖస్టీల్‌ప్లాంట్, విశాలాక్షినగర్ ప్రాంతాలలోని పోస్టాఫీసుల్లో ఆధార్ నమోదు కేంద్రాలు రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పనిచేస్తాయి. -
పంచాయతీల్లోనూ బయోమెట్రిక్ !
కడప ఎడ్యుకేషన్ :‘సార్.. విద్యుత్ కనెక్షన్ దరఖాస్తుపై మీ సంతకం కావాలి ఎక్కడున్నారు’.. ‘మా ఇంటి నిర్మాణానికి ప్లానింగ్ కావాలి సర్’... పంచాయతీ కార్యదర్శులకు ఆయా గ్రామాల ప్రజల అడిగే ఇలాంటి ప్రశ్నలకు అటువైపు నుం చే వచ్చే సమాధానం.. ‘బయట ఉన్నా... రేపు రండి’ అని. ఇక ఇలాంటి సమాధానాలకు చెక్ పడినట్లే. పంచాయతీ కార్యదర్శుల కోసం వెతుక్కుంటూ పోవాల్సిన కష్టాలకు కాలం చెల్లినట్లే.అవును ఇకపై పంచాయతీ సిబ్బంది కచ్చితంగా కార్యాలయంలో ఉండాల్సిందే. అక్కడ ఏర్పాటు చేసే బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదు చేసుకోవాల్సిందే. ఈ విధానాన్ని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని అన్ని పంచాయతీల్లో బయోమెట్రిక్ యంత్రాల ఏర్పాటుకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. అన్నిచోట్లా అమలయ్యేనా? జిల్లాలో 790 గ్రామపంచాయతీలకు గాను 617 వాటికి మాత్రమే సొంతభవనాలు ఉన్నాయి. మిగతా చోట్ల సొంత భవనాలులేవు. మరి ఇక్కడ బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేస్తారా ..లేదా అన్నదానిపై అనుమానాలు ఉన్నాయి. అలాగే పలు పంచాయతీల్లో కార్యదర్శులు కొరత కూడా ఉంది. ప్రస్తుతం క్లస్టర్లవారీగా కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. దీని ప్రకారం ఒక్కో గ్రామంలో ఒక్కో రోజు ఉండే విధంగా నిబంధనలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది ఎక్కడా అమలుకాకపోయినా.. బయోమెట్రిక్ నిబంధన అమలైతే ఆయా కార్యదర్శి కచ్చితంగా పంచాయతీ కార్యాలయానికి వచ్చి బయోమెట్రిక్ విధానంలో హాజ రును నమోదు చేసుకోవాల్సిందే. ఈ అడ్డంకులన్నీ అధిగమించి బయోమెట్రిక్ పద్ధతి అమలవుతుందా లేదా వేచి చూడాలి. బయోమెట్రిక్ తప్పనిసరి జిల్లాలోని అన్ని పంచాయతీల్లో బయోమెట్రిక్ డివైస్‌లు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. ఈ నెల చివరినాటికి కచ్చితంగా అన్ని పంచాయతీ కార్యాలయాల్లో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేయాల్సిందే. ప్రతి కార్యదర్శి ఏప్రిల్ 1 నుంచి కచ్చితంగా బయోమెట్రి క్ హాజరు నమోదు చేయాల్సిందే. – ఖాదర్‌బాషా, జిల్లా పంచాయతీ అధికారి -
‘ఉపాధి’కీ ఆధార్
ఒంగోలు సెంట్రల్: ఉపాధి హామీ పథకంలో అవినీతికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కూలీల ఆధార్ నంబరును వారి జాబ్‌కార్డులకు అనుసంధానం చేయడం ద్వారా వచ్చే నెల నుంచి చెల్లింపులు చేపట్టనున్నారు. వారం వారం కూలీలు వేతనాలు తీసుకునే సమయంలో బయోమెట్రిక్ యంత్రంలో తమ వేలిముద్రలు వేస్తేనే కూలిడబ్బులు ఇస్తారు. తద్వారా దొంగ మస్టర్లు, పనులకు రాకపోయినా నగదు చెల్లింపులు వంటి అక్రమాలకు ఇక తావుండదు. జిల్లాలోని 56 మండలాల్లో 38 వేల శ్రమశక్తి సంఘాలున్నాయి. వీటిలో 7.60 లక్షల మంది కూలీలు సభ్యులుగా ఉన్నారు. వీరిలో 5.75 లక్షల మంది కూలీలకు ఆధార్ కార్డులుండగా..ఇప్పటి వరకు 5.55 లక్షల మంది తమ ఆధార్ నంబరును జాబ్‌కార్డులకు అనుసంధానించుకున్నారు. 1.85 లక్షల మంది కూలీలకు ఆధార్ కార్డు ల్లేవు. మరో 2ఏ వేల మంది కూలీలు తమ ఆధార్ నంబరు అనుసంధానించుకోవాల్సి ఉంది. ఆధార్‌కార్డు కలిగిన వేతనదారుల నుంచి యూఐడీ, ఈఐడీ నంబర్లు తీసుకుని ఏరోజుకారోజు వివరాలను సంబంధిత మండల కేంద్రంలోని ఉపాధి హామీ కార్యాలయానికి క్షేత్ర సహాయకులు, మేట్లు అందజేస్తున్నారు. ఇలా వచ్చిన వారి వివరాలను ఉపాధి సిబ్బంది కంప్యూటర్లో నమోదు చేస్తున్నారు. ఆధార్ కార్డులున్న కూలీలకే వేతనాలు ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. మళ్లీ ఎంపీడీవోల పర్యవేక్షణ: ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు అరికట్టేందుకు పనుల పర్యవేక్షణను తిరిగి ఎంపీడీవోలకు అప్పగించనున్నారు. రాష్ట్రంలో పథకాన్ని పటిష్టంగా అమలు చేసే క్రమంలో పనుల పర్యవేక్షణ బాధ్యతను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకుండా ఎంపీడీవోల పరిధిలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయడంతో పాటూ, నీరు- చెట్లు కార్యక్రమాన్ని ఈ పథకంలోకి తీసుకురావడం కీలకమైంది. ప్రస్తుత ఓట్ సోర్సింగ్ విధానం కారణంగా పథకంపై ప్రభుత్వానికి అజమాయిషీ కొరవడిందన్న విషయాన్ని గ్రహించి, ప్రభుత్వ పరిధిలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. -
బయోమెట్రిక్ కొను‘గోల్మాల్’
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాల దరఖాస్తులను బయోమెట్రిక్ యంత్రం ద్వారా ఈపాస్ వెబ్‌సైట్‌కు అనుసంధానం చేయాలనే నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం కళాశాలలపై భారం మోపింది. 2013-14 విద్యా సంవత్సరం నుంచి నూతనంగా అమలులోకి తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం బయోమెట్రిక్ యంత్రాల ద్వారా విద్యార్థుల వేలిముద్రలను ఆన్లైన్లో అనుసంధానం చేస్తేనే వాటిని ఆమోదిస్తామని సంక్షేమ శాఖ అధికారులు కళాశాలల ప్రిన్సిపాళ్లకు తేల్చి చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం సూచించిన కంపెనీల నుంచి మాత్రమే ఈ బయోమెట్రిక్ యంత్రాలను కొనుగోలు చేయాలని ఆన్లైన్లోని ఈ పాస్ వెబ్సైట్లో కంపెనీల వివరాలను ఉంచారు. బహిరంగ మార్కెట్లో *6 వేలకు మించని బయోమెట్రిక్ యంత్రం ఆన్‌లైన్‌తో అనుసంధానం పేరుతో కొన్ని కంపెనీలు *28 వేలుగా నిర్ణయించాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 60 శాతానికి పైగా కళాశాలలు బయోమెట్రిక్ యంత్రాలను కొనుగోలు చేయలేదు. అందువల్ల విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం ఉపకార వేతనాలు అందే పరిస్థితులు కనబడటంలేదు. విజన్‌టెక్, అనలాగ్ అనే కంపెనీల నుంచి మాత్రమే బయోమెట్రిక్ యంత్రాలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వీరు మాత్రమే బయోమెట్రిక్ యంత్రాలను ఈ పాస్ వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసే సాఫ్ట్‌వేర్‌తో అమ్మకాలు జరుపుతున్నారు. అదే సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేస్తే ధర బాగా తగ్గుతుందని, విద్యార్థులకు త్వరగా ఉపకార వేతనాలు అందించవచ్చని కళాశాల యాజమాన్యాలు అంటున్నాయి. ఇక ప్రభుత్వ కళాశాలలు బయోమెట్రిక్ యంత్రాలను కొనుగోలు చేసేందుకు నిధుల కేటాయింపులు లేవు. కొన్ని కాలేజీలు విద్యార్థుల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. విద్యార్థుల నుంచి అయితే తక్కువ మొత్తంలో తీసుకున్నా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వ్యతిరేకత రాదని భావిస్తున్నారు. బయోమెట్రిక్ కంపెనీలు పేర్కొంటున్నట్లు రోజుకు 200 మంది వేలిముద్రల సేకరణ సాధ్యం కావడంలేదని, వీటిని ఇప్పటికే కొనుగోలు చేసిన కళాశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలకు ఈ పాస్‌లో రిజిస్టర్ చేయించుకున్న కళాశాలలు ఆదిలాబాద్- 285, ప్రకాశం-533, అనంతపురం-437, చిత్తూరు-664, తూర్పు గోదావరి- 746, గుంటూరు-732, హైదరాబాద్- 751, కడప- 522, కరీంనగర్-493, ఖమ్మం- 444, కృష్ణా-624, కర్నూలు-507, మహబూబ్‌నగర్-462, మెదక్-368, నల్గొండ-642, నెల్లూరు-439, నిజామాబాద్-375, రంగారెడ్డి-1140, శ్రీకాకుళం- 315, విశాఖపట్నం-624, విజయనగరం-344, వరంగల్-619, పశ్చిమగోదావరి-542. మొత్తం 12,608 కళాశాలలు ఉన్నాయి. వీటిలో దాదాపుగా 13,75,048 మంది రెన్యువల్ విద్యార్థులున్నారు. ప్రభుత్వం సూచించిన కంపెనీల ధరల ప్రకారం బయోమెట్రిక్ యంత్రాలు కొనుగోలు చేయాలంటే ఒక్కో యంత్రం విలువ *27 వేలు. ఆ లెక్కన రాష్ట్రంలోని కళాశాలలన్నీ యంత్రాలు కొనుగోలు చేసేందుకు 34 కోట్ల 4 లక్షల 16 వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. బహిరంగ మార్కెట్లో కొనుగోలుచే స్తే ఒక్కో బయోమెట్రిక్ యంత్రం 6 వేల లెక్కన రాష్ట్రం మొత్తం మీద 7 కోట్ల 56 లక్షల 48 వేల రూపాయలు సరిపోతుంది. ప్రభుత్వం సాఫ్ట్వేర్ పేరుతో కళాశాలల నుంచి, కళాశాలల వారు విద్యార్థుల నుంచి దోపిడీ చేస్తోంది 26 కోట్ల 47 లక్షల 68 వేల రూపాయలు అన్నమాట. బహిరంగ మార్కెట్లో తీసుకోవచ్చు.. అయితే.. కొమ్మతి సరస్వతి, సాంఘిక సంక్షేమ శాఖ డెప్యూటీ డెరైక్టర్ మొదట్లో ఆ రెండు కంపెనీల నుంచి బయోమెట్రిక్ యంత్రాలను కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు. ధరలు ఎక్కువగా ఉన్నాయని బహిరంగ మార్కెట్లో దొరికే యంత్రాలకు ఈ పాస్ డేటా కార్డ్ అనే పరికరంతో ఈ పాస్వెబ్సైట్కు ఆన్లైన్లో అనుసంధానం అవ్వచ్చని ప్రభుత్వం తెలిపింది. అయితే అవి ఇంకా అందుబాటులోకి రాలేదు. -
ఆసరా కోసం వేదన
జోగిపేట, న్యూస్‌లైన్: వృద్ధాప్యంలో ఆసరాగా నిలిచిన పింఛన్‌ను అధికారులు ఏవో సాకులు చెబుతూ ఇవ్వకపోవడంతో పండుటాకులు రోడ్డెక్కారు. పోస్ట్ ఆఫీస్‌లో వద్దు, పంచాయతీలోనే ఇవ్వాలంటూ రాస్తారోకో చేపట్టారు. వీరికి తోడుగా వికలాంగులు, వితంతువులు కూడా వచ్చి సంఘీభావం తెలిపారు. పోలీసులు వచ్చి నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు. వివర్లాకి వెళ్తే... జోగిపేట పట్టణంలోని పోస్టాఫీసులో పెన్షన్ తీసుకునేందుకు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు శుక్రవారం వచ్చారు. అయితే బయోమెట్రిక్ మిషన్ పనిచేయడంలేదని వెళ్లిపోవాలని సిబ్బంది సూచించారు. దీంతో ఆగ్రహించిన వృద్ధాప్య పింఛన్‌దారులు పోస్టాఫీసు ముందు ఆందోళనకు దిగారు. తమకు పింఛన్లు పోస్టాఫీసులో వద్దు నగర పంచాయతీలో చెల్లించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పెన్షన్‌దారులు రాస్తారోకో చేపట్టడంతో సంగారెడ్డి వైపు వెళ్లే రహదారిలో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊస మానిక్యం వారికి మద్దతు తెలిపారు. ప్రతి రోజు సాయంత్రం 5 గంటల వరకు పింఛన్లు చెల్లించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు వచ్చి వృద్ధులకు నచ్చజెప్పి ఈ విషయమై అధికారులతో మాట్లాడారు. దీనిపై పోస్టల్‌శాఖ అధికారి ఎంజిఎస్ ప్రసాద్ వివరణ ఇస్తూ శుక్రవారం కొద్దిమందికి ఇచ్చిన తర్వాత మిషన్ పనిచేయలేదని, అందుకే ఇవ్వలేదన్నారు. మున్సిపల్ ఉన్న చోట కమిషనర్ సిబ్బందే చెల్లిస్తున్నారని, ఇక్కడ కూడా అలాగే చెల్లిస్తే బాగుంటుందన్నారు. -
పింఛన్..టెన్షన్!
పిఠాపురం, న్యూస్‌లైన్ : పింఛన్ల పంపిణీలో అవకతవకలు జరగకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానం వృద్ధులను కష్టాల్లోకి నెట్టింది. గతంలో తీసుకున్న వేలిముద్రలతో వారి ప్రస్తుత వేలిముద్రలు సరిపోలడంలేదు. ఫలితంగా జిల్లాలో ఈ నెలలో సుమారు 26 వేల మంది వృద్ధులకు ఇంతవరకూ పింఛన్లు అందలేదు. దీంతో ప్రభుత్వం ఇచ్చే రూ.200 స్వల్ప మొత్తం కోసం వారు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన దుస్థితి దాపురించింది. జిల్లాలో వివిధ పింఛన్ల కింద ప్రతి నెలా రూ.12,39,47,700 అందజేస్తున్నారు. ఈ ఏడాది మే, జూన్, జూలై నెలల్లో మూడు విడతలుగా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేశారు. ఆగస్ట్ నుంచి జిల్లా అంతటా ఈ విధానం అమలులోకి వచ్చింది. అయితే నెట్వర్క సమస్యల వల్ల ఏజెన్సీలో మాత్రం దీనిని అమలు చేయడంలేదు. ఈ కొత్త విధానం అమలు కోసం కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్ (సీఎస్పీ) ద్వారా 941 మందిని నియమించి, వారికి 941 బయోమెట్రిక్ యంత్రాలు అందజేశారు. లబ్ధిదార్లకు పోస్టాఫీసుల్లోను, కొన్ని పంచాయతీల్లో ఐసీఐసీఐ బ్యాంకులోను ఖాతాలు తెరిచి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. అమలాపురం పోస్టల్ డివిజన్లో 132, కాకినాడ డివిజన్లో 84, రాజమండ్రిలో 148, రామచంద్రపురంలో 148, రాజోలులో 129, సామర్లకోట పోస్టల్ డివిజన్లో 300 బయోమెట్రిక్ యంత్రాలను పింఛన్ల పంపిణీకి ఉపయోగిస్తున్నారు. ఇదీ సమస్య పింఛను కోసం వెళ్లిన వృద్ధుల ఆధార్ నంబర్‌ను తొలుత బయోమెట్రిక్ యంత్రంలోకి ఎంటర్ చేస్తారు. వేలిముద్రలను సరిపోల్చేందుకు వారి చేతి వేళ్లను యంత్రంపై ఉంచుతారు. అవి సరిపోలిన వెంటనే వారి వివరాలు ఆన్లైన్లో అనుసంధానం అవుతాయి. అలా జరగకపోతే సంబంధిత లబ్ధిదారుడి పింఛను నిలిచిపోతోంది. ఎందుకంటే..! 2011లో ఆధార్ నమోదు జరిగింది. ఆ సమయంలో వేలిముద్రలు తీసుకున్నారు. ఆ తరువాత వృద్ధుల్లో శారీరక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ కారణంగా గతంలో తీసుకున్న వేలిముద్రలతో వారి ప్రస్తుత వేలిముద్రలు సరిపోలడంలేదని సిబ్బంది చెబుతున్నారు. ఈ నెలలో ఇప్పటివరకూ జిల్లాలో 2,42,876 మందికి బయోమెట్రిక్ పద్ధతిలో పింఛన్లు అందించారు. ఏజెన్సీలోని 1,05,990 మందికి కూడా పాత పద్ధతిలో పింఛన్లు పంపిణీ చేశారు. మరో 26,058 మందికి వేలిముద్రలు సరిపోలడం లేదు. దీంతో వారికి ఈ నెలలో ఇప్పటివరకూ పింఛన్లు అందలేదు. మరోపక్క నెట్వర్కులు పని చేయక కొన్నిచోట్ల, యంత్రాలు మొరాయించి కొన్నిచోట్ల పింఛన్ల పంపిణీలో జాప్యం జరుగుతోంది. కొన్నిచోట్ల బ్రాంచి పోస్ట్‌మాస్టర్ వేలిముద్రలతో కొందరికి పింఛన్లు ఇచ్చే అవకాశం కల్పించారు. అయినప్పటికీ ఈ నెలలో ఇప్పటికీ ఇంకా వేలాదిగా వృద్ధులు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని సకాలంలో పింఛన్లు అందించాలని పలువురు కోరుతున్నారు.