కడప ఎడ్యుకేషన్ :‘సార్.. విద్యుత్ కనెక్షన్ దరఖాస్తుపై మీ సంతకం కావాలి ఎక్కడున్నారు’.. ‘మా ఇంటి నిర్మాణానికి ప్లానింగ్ కావాలి సర్’... పంచాయతీ కార్యదర్శులకు ఆయా గ్రామాల ప్రజల అడిగే ఇలాంటి ప్రశ్నలకు అటువైపు నుం చే వచ్చే సమాధానం.. ‘బయట ఉన్నా... రేపు రండి’ అని. ఇక ఇలాంటి సమాధానాలకు చెక్ పడినట్లే. పంచాయతీ కార్యదర్శుల కోసం వెతుక్కుంటూ పోవాల్సిన కష్టాలకు కాలం చెల్లినట్లే.అవును ఇకపై పంచాయతీ సిబ్బంది కచ్చితంగా కార్యాలయంలో ఉండాల్సిందే. అక్కడ ఏర్పాటు చేసే బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదు చేసుకోవాల్సిందే. ఈ విధానాన్ని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని అన్ని పంచాయతీల్లో బయోమెట్రిక్ యంత్రాల ఏర్పాటుకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి.
అన్నిచోట్లా అమలయ్యేనా?
జిల్లాలో 790 గ్రామపంచాయతీలకు గాను 617 వాటికి మాత్రమే సొంతభవనాలు ఉన్నాయి. మిగతా చోట్ల సొంత భవనాలులేవు. మరి ఇక్కడ బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేస్తారా ..లేదా అన్నదానిపై అనుమానాలు ఉన్నాయి. అలాగే పలు పంచాయతీల్లో కార్యదర్శులు కొరత కూడా ఉంది. ప్రస్తుతం క్లస్టర్లవారీగా కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. దీని ప్రకారం ఒక్కో గ్రామంలో ఒక్కో రోజు ఉండే విధంగా నిబంధనలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది ఎక్కడా అమలుకాకపోయినా.. బయోమెట్రిక్ నిబంధన అమలైతే ఆయా కార్యదర్శి కచ్చితంగా పంచాయతీ కార్యాలయానికి వచ్చి బయోమెట్రిక్ విధానంలో హాజ రును నమోదు చేసుకోవాల్సిందే. ఈ అడ్డంకులన్నీ అధిగమించి బయోమెట్రిక్ పద్ధతి అమలవుతుందా లేదా వేచి చూడాలి.
బయోమెట్రిక్ తప్పనిసరి
జిల్లాలోని అన్ని పంచాయతీల్లో బయోమెట్రిక్ డివైస్లు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. ఈ నెల చివరినాటికి కచ్చితంగా అన్ని పంచాయతీ కార్యాలయాల్లో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేయాల్సిందే. ప్రతి కార్యదర్శి ఏప్రిల్ 1 నుంచి కచ్చితంగా బయోమెట్రి క్ హాజరు నమోదు చేయాల్సిందే. – ఖాదర్‌బాషా, జిల్లా పంచాయతీ అధికారి
Comments
Please login to add a commentAdd a comment