‘కుళాయి’ పేరిట తమ్ముళ్ల వసూళ్లు
మోసపోయిన కాలువ కట్ట వాసులు
అక్రమ క నెక్షన్లు తొలగించిన పంచాయతీ సిబ్బంది
యనమలకుదురు(పెనమలూరు): యనమలకుదురులో తెలుగుతమ్ముళ్లు కుళాయి కనెక్షన్‌లు ఇప్పిస్తామని అమాయక ప్రజల వద్ద నుంచి సొమ్ము దండుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. వ్యవహారం బయటపడటంతో పంచాయతీ సిబ్బంది ఆఘమేఘాలపై రంగంలోకి దిగి అక్రమ కుళాయి కనెక్షన్లు తొలగించారు. జరిగిన మోసాన్ని తెలుసుకున్న గ్రామస్తులు తెలుగు తమ్ముళ్లపై దుమ్మెత్తి పోస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. యనమలకుదురు గ్రామంలో బందరు కాలువ కట్ట ఇందిరానగర్ వన్, టు ప్రాంతాల్లో చాలామందికి వ్యక్తిగత కుళాయి కనెక్షన్లు లేవు. వారంతా వీధుల్లో ఉన్న పంచాయతీ కుళాయి నీటిపైనే ఆధారపడుతున్నారు. కాగా, తమ ఇళ్లకు కుళాయి కనెక్షన్‌లు ఇవ్వమని స్థానికులు కొద్ది రోజుల కిందట అప్పటి కార్యదర్శి రామకోటేశ్వరరావును కోరగా ఆయన కుదరదని నిరాకరించారు.
వీరి అవసరాన్ని ఇద్దరు తమ్ముళ్లు సొమ్ము చేసుకున్నారు. తమకు టీడీపీ బడా నేత అండదండలు ఉన్నాయని, తమకు సొమ్ము చెల్లిస్తే కుళాయి కనెక్షన్లు తామే ఇస్తామని గ్రామస్తులను నమ్మించారు. ఒక్కో కనెక్షన్‌కు రూ 5 వేలు నుంచి పదివేలు వసూలు చేశారు. దాదాపు 125 అక్రమ కనెక్షన్లు గత పదిరోజుల్లో ఇచ్చారు. వీటికి ఎటువంటి గ్రామ పంచాయతీ అనుమతులు లేవు.
జరిగిన మోసంపై పంచాయతీకి ఫిర్యాదు!
కాగా తమ్ముళ్లకు సొమ్ము కట్టి రశీదులు అందని వారు కొందరు జరిగిన మోసాన్ని తెలుసుకుని గ్రామ పంచాయతీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వైస్సార్‌కాంగ్రెస్ నేతలు పేదలకు మద్దతుగా నిలిచారు. అక్రమ కనెక్షన్ల గుట్టురట్టవ్వటంతో టీడీపీ నేతలు కంగారుపడి సొమ్ము వసూళ్లు చేసిన వారితో తమకు సంబంధం లేదని, అక్రమ కుళాయి కనెక్షన్లు తొలగించాలని పంచాయతీపై ఒత్తిడి తీసుకు వచ్చారు. దీంతో గురువారం పంచాయతీ సిబ్బంది రంగంలోకి దిగి అక్రమ కనెక్షన్లు తొలగించారు. తమ వద్ద సొమ్ము వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తమకు అధికారికంగా కుళాయి కనెక్షన్ ఇవ్వాలని కోరుతున్నారు.