tap connection
-
ఎస్సీ ప్రాంతాలకు రూ.3,853.93 కోట్లతో మంచినీరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఎస్సీ నివాసిత ప్రాంతాల్లో మంచినీరు అందించేందుకు రూ.3,853.93 కోట్లు ఖర్చు చేస్తున్నారు. జల్‌జీవన్ మిషన్(జేఎంఎం) ద్వారా 45,13,256 మంది ఎస్సీలకు మేలు కలగనుంది. రాష్ట్రంలో జల్‌జీవన్ మిషన్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, మైదాన ప్రాంతాల్లో మొత్తం రూ.25,485.36 కోట్ల అంచనాతో 71,201 పనులు చేపట్టాలని ప్రతిపాదించారు. ఎస్సీ ప్రాంతాల్లో రూ.3,853.93 కోట్లతో తొలిదశ పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ఎస్సీలకు చెందిన 7,917 శివారు ప్రాంతాలున్నాయి. వాటిలో 4,852 ప్రాంతాలకు సమృద్ధిగా నీరు అందుతోంది. మరో 3,065 ప్రాంతాలకు నిర్దేశించినంత (మనిíÙకి 55 లీటర్లు) నీటి సరఫరాలేదని అధికారులు అంచనా వేశారు. దీంతో ఎస్సీ ప్రాంతాల్లో నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా మొత్తం 19,619 పనులు ప్రతిపాదించారు. నీటి ట్యాంకు (రక్షిత నీటిపథకాలు), పైపులైను వంటి నిర్మాణాలు చేపట్టనున్నారు. ఎస్సీ నివాసిత ప్రాంతాల్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చేలా చర్యలు చేపట్టారు. 2024 నాటికి మొత్తం మూడుదశల్లో పనులు పూర్తిచేయాలని నిర్ణయించారు. ఎస్సీ కాలనీలు, ఎస్సీలు అత్యధికంగా నివసిస్తున్న ప్రాంతాలు, జగనన్న కాలనీల్లో వాటర్ ట్యాంకులు, పైపులైన్లు, ట్యాప్ కనెక్షన్లు ఇచ్చే పనులు పూర్తయితే 45,13,256 మంది ఎస్సీలకు లబ్ధికలుగుతుంది. వేగంగా పనులు పూర్తి చేస్తాం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల భాగస్వామ్యంతో చేపట్టిన పనుల్ని వేగవంతంగా పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టాం. అత్యవసరమైన రక్షిత మంచినీటి సౌకర్యాన్ని మెరుగుపరచాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో ఇప్పటికే పనుల పురోగతిపై సమీక్షించాం. పనులకు అడ్డంకులు లేకుండా చూడటం, వేగంగా జరిగేలా చూడటం, బిల్లుల చెల్లింపు వంటి అన్ని అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ప్రభుత్వం జల్‌జీవన్ మిషన్ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైదాన ప్రాంతాల్లో అవసరమైనమేరకు మంచినీటిని అందించడం కోసం కృషిచేస్తోంది. గ్రామీణ నీటిసరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) యంత్రాంగం సమన్వయంతో ప్రస్తుత వేసవిలో ఎక్కడా మంచినీటి కొరత తలెత్తకుండా చేశాం. – మేరుగు నాగార్జున, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి -
‘అమృత్’పై విజిలెన్స్
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు కార్పొరేషన్ పరిధిలో ఇంటింటికీ మంచినీటి సరఫరా కోసం ఉచిత కుళాయి కనెక్షన్ ఇచ్చేందుకు ఉద్దేశించిన అమృత్ పథకం అమలు తీరుపై విచారణ ప్రారంభం కానుంది. ఈ పథకం అమలులో భారీగా అక్రమాలు జరిగాయంటూ విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో పనుల వివరాలు ఇవ్వాలంటూ నగర పాలక సంస్థకు విజిలెన్స్ అధికారులు లేఖ రాసినట్టు తెలిసింది. ఈ మొత్తం వివరాల ఆధారంగా అవకతవకలను గుర్తించే పనిలో విజిలెన్స్ అధికారులు ఉన్నట్టు సమాచారం. ఈ పథకాన్ని 2016 నవంబరు 5నప్రారంభించారు. మొత్తం రూ.58.25 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనుల్లో పైపులైన్ వేయడం మొదలుకుని..ఉచితంగా ఇవ్వాల్సిన కుళాయి కనెక్షన్ కోసం డబ్బు వసూలు చేయడం వరకూ అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థను కాదని అధికార పార్టీ నేత చెప్పిన వారికే సబ్ కాంట్రాక్టు అప్పగించడం వల్ల పనులు నాసిరకంగా జరిగాయనే విమర్శలున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ నేతలు చేసిన నీరు–చెట్టు పనులపై విజిలెన్స్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా అమృత్ పథకంపై విచారణలోనూ ఏయే నిజాలు బయటకు వస్తాయో చూడాల్సి ఉంది. అడుగుకు మించి తవ్వరే! కర్నూలు కార్పొరేషన్ పరిధిలో మొత్తం 51 డివిజన్లు ఉన్నాయి. ఇందులో కర్నూలు నియోజకవర్గంలో 35, పాణ్యం 13, కోడుమూరు నియోజకవర్గ పరిధిలో 3 డివిజన్లు ఉన్నాయి. ఈ డివిజన్లలో లక్షా 10 వేల ఇళ్లు ఉన్నాయి. కుళాయి కనెక్షన్లు మాత్రం 48 వేలే ఉన్నాయి. దీంతో మిగిలిన వారందరికీ ఉచితంగా కుళాయి కనెక్షన్లు మంజూరు చేసి..మంచినీరు అందించాలనేదే అమృత్ పథక ఉద్దేశం. అయితే, ఈ ఉద్దేశాన్ని అధికార పార్టీ కాంట్రాక్టర్లు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. మొత్తం రూ.58.25 కోట్లతో చేపట్టిన ఈ పనుల్లో వినియోగించిన పైపులు కూడా నాసిరకంగా ఉన్నాయనే విమర్శలున్నాయి. టెండర్ నిబంధనల ప్రకారం పైపులైన్ అడుగున్నర లోతులో వేయాలి. పైపులైన్ కింద శాండ్ బెడ్ కూడా వేయాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం అడుగు లోతు కూడా తవ్వకుండానే పైపైన మట్టి తీశారు. శాండ్బెడ్ లేకుండానే పైపులైను వేశారనే ఆరోపణలున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో చిన్న చిన్న పనులు చేస్తే కూడా పైపులైన్లు పగిలిపోయి ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక పైపులైన్ కోసం రోడ్డును తవ్విన ప్రాంతాల్లో తిరిగి గుంతలు పూడ్చలేదు. ఇష్టానుసారం చేశారు మా ఇంటి (డోర్ నంబర్ : 339–1 ఏ) వద్ద అమృత్ స్కీమ్ కింద పైపులైన్ పనులు చేపట్టారు. అధ్వానంగా, ఇష్టానుసారంగా చేశారు. గుంతలు తవ్వి అలానే వదిలేశారు. వీటిని పూడ్చాలని మునిసిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. ఇక్కడ పనులు పూర్తి చేస్తే కుళాయి కనెక్షన్ తీసుకోవచ్చు. అయితే.. మా కాలనీలో ఇళ్లు లేని చోట పైపులైన్ వేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఈ దుస్థితి. – నారాయణ, సొసైటీ కాలనీ,28వ డివిజన్ -
కుళాయి భారమాయె!
ఆదోని: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంజూరైన రూ.200 కుళాయి కనెక్షన్ పథకానికి ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. ఆస్తి పన్ను రూ.500 దాటితే తెల్లరేషన్ కార్డు ఉన్న వారు కూడా రూ.200 కుళాయి కనెక్షన్‌కు అనర్హులను చేస్తూ జీఓ నం.159ను మే నెల 17న విడుదల చేసింది. జీఓ విడుదలైన నాటి నుంచి తెల్లరేషన్ కార్డుదారులు చేసుకున్న కుళాయి కనెక్షన్ల దరఖాస్తులను అధికారులు పెండింగ్‌లో ఉంచారు. ఆదోని మున్సిపాలిటీలో దాదాపు 250 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆస్తిపన్ను రూ.500 దాటిన వారందరికీ మున్సిపల్ తాగునీటి సరఫరా విభాగం అధికారులు రూ.6500 డిపాజిట్ చెల్లించాలని సూచిస్తున్నారు. దీంతో పేదలు బిక్కమొహం వేస్తున్నారు. ప్రభుత్వం ఆస్తిపన్ను తరచుగా పెంచుతోంది. దీంతో రెండు గదులున్న మట్టి ఇల్లు కూడా ఆస్తి పన్ను కూడా రూ.500 దాటింది. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల కారణంగా తెల్లరేషన్ కార్డు కలిగిన నిరుపేదల్లో 90శాతం పైగా రూ.200 కుళాయి కనెక్షన్‌కు అనర్హులుగా మారారు. తాజా జీఓపై ప్రజలు మండిపడుతున్నారు. తాగునీరు ఎట్టా..? ఆదోని పట్టణంలో 1,84,000 మంది నివాసం ఉంటున్నారు. ఆవాసాలు 36వేలకు పైగా ఉన్నాయి. పట్టణంలో 6వేలకు పైగా కుళాయి కనెక్షన్లు ఉండగా వాటిలో పబ్లిక్వి వెయ్యి లోపే. కనెక్షన్లు ఉన్న వారు తప్ప మిగిలిన వారు మాత్రం తాగునీటికోసం పబ్లిక్ కుళాయిపై ఆధారపడ్డారు. అయితే రూ.200 కుళాయి కనెక్షన్ పథకం అమల్లోకి వచ్చిన తరువాత పబ్లిక్ కుళాయిల ఏర్పాటును మున్సిపల్ అధికారులు నిలిపివేశారు. ఎక్కడైనా పబ్లిక్ కుళాయిలు చెడిపోతే మరమ్మతు కూడా చేయడం లేదు. దీంతో రూ.200 కుళాయి కనెక్షన్ తీసుకోవడానికి ఎంతోమంది పేదలు దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే తాజా జీఓతో పేదలు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నిరుపేదలకు ఎంతో సదుపాయంగా ఉన్న రూ.200కే కుళాయి కనెక్షన్ పథకంను ఆస్తి పన్ను సాకు చూపి నీరుగార్చడం దుర్మార్గమని, శనివారం జరిగే కౌన్సిల్ సమావేశంలో ఈ విషయమై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆదోని మున్సిపల్ వైస్ చైర్మన్ అల్తాప్ అహ్మద్ అన్నారు. -
రూపాయికే నల్లా కనెక్షన్!
♦ ‘మిషన్ భగీరథ’తో ఇంటింటికీ తాగునీరు ♦ తాండూరులో మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం ♦ నల్లా లేని నివాసాలపై మున్సిపల్ అధికారుల సర్వే మిషన్ భగీరథ పథకంలో భాగంగా పట్టణాల్లోని ఇంటింటికీ నల్లా కనెక్షన్ తప్పని సరి అని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇవ్వాలంటూ జీఓ 372ను జారీ చేసింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాల గొంతు తడిపేందుకు ఇది ఎంతగానో తోడ్పడనుంది. తాండూరు: మార్కెట్లో కప్పు టీ ధర రూ.5. అలాంటిది తాగునీటి నల్లా కనెక్షన్ రూ.1కే లభిస్తుందంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా!.. కానీ ఇది నిజం. మిషన్ భగీరథ పథకంలో భాగంగా.. ఇక రూ.1కే నల్లా కనెక్షన్లు లభించనున్నాయి. ఈ మేరకు తెలంగాణ సర్కార్ ఇటీవల 372 జీవో జారీ చేసింది. దీంతో పట్టణా(మున్సిపాలిటీ)ల్లో దారిద్య్రరేఖకు దిగువనున్న పేద వర్గాల నుంచి కనెక్షన్ కోసం వసూలు చేస్తున్న రూ.200 రుసుం రద్దయ్యింది. నల్లా కనెక్షన్లు తీసుకోవడంలో పేదలకు వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మిషన్ భగీరథలో భాగంగా తాండూరుకు కృష్ణా జలాలు అందనున్నాయి. ఇందుకోసం పట్టణ శివారులోని విలియంమూన్ సమీపంలో మాస్టర్ బ్యాలెన్సింగ్ (ఎంబీఆర్) రిజర్వాయర్‌ను నిర్మించనున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, పాత తాండూరు ప్రాంతాల్లో 10 మిలియన్ లీటర్స్ ఫర్ డే(ఎంఎల్డీ) సామర్థ్యంతో ఎలివేటెడ్ సర్వీసు రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా పట్టణంలోని ప్రతి ఇంటికీ కృష్ణా జలాలు అందించడానికి అధికారులు ప్రణాళికలు వేశారు. 7వేల కనెక్షన్లు... తాండూరు పట్టణంలో 70 వేలకుపైగా జనాభా ఉంది. మొత్తం 31 వార్డుల్లో అసెస్మెంట్ చేసిన నివాసాలు 11 వేలు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం 7 వేల ఇళ్లకు మాత్రమే నల్లా కనెక్షన్లు ఉండగా.. మరో 1,500 కమర్షియల్ కనెక్షన్లున్నాయి. ఇప్పటికీ నల్లాలు లేని కుటుంబాల సంఖ్య 2,500 వరకు ఉంటుందని అధికారుల అంచనా. వీరందరికీ రూ.1కి నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పట్టణంలోని కనెక్షన్ల వివరాలపై బిల్ కలెక్టర్ల ద్వారా సర్వే చేయిస్తున్నారు. కనెక్షన్లు లేని నివాసాల ప్రాంతంలో పైప్లైన్లు ఉన్నాయా..? లేవా? అక్రమ కనెక్షన్లు ఏమైనా ఉన్నాయా అనే అంశంపై సర్వే చేయనున్నారు. ఒకవేళ అక్రమ నల్లా కనెక్షన్లు ఉన్నా రూ.1కింద వాటిని క్రమబద్ధీకరించాలని అధికారులు యోచిస్తున్నారు. పైప్‌లైన్ సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో వెంటనే కనెక్షన్లు ఇస్తామని, లేని చోట జూలై నాటికి లక్ష్యాన్ని పూర్తి చేస్తామని మున్సిపల్ కమిషనర్ సంతోష్‌కుమార్ చెప్పారు. -
ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్!
జీహెచ్ఎంసీ సహా 73 పురపాలికల్లో అమలుకు సర్కారు నిర్ణయం ► పైపులు, రోడ్డు తవ్వకాల ఖర్చు నగర, పురపాలికలదే ► అనుమతి లేని నల్లాల క్రమబద్ధీకరణా ఒక్క రూపాయికే ► పతిపాదనలను ఆమోదించిన సర్కార్ ► ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు ► నల్లా కనెక్షన్ లేని 25 లక్షల ► పేద కుటుంబాలకు లబ్ధి ► ఏడాది కిందే ప్రతిపాదనలు.. ► మంత్రి కేటీఆర్ చొరవతో కదలిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పేదలను ఆకట్టుకునే మరో ప్రతిష్టాత్మక పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. కేవలం ఒక్క రూపాయికే మంచినీటి నల్లా కనెక్షన్‌ను అందజేయాలని నిర్ణయించింది. అంతేకాదు ఇప్పటికే అనుమతి లేకుండా ఉన్న నల్లా కనెక్షన్లనూ కేవలం ఒక్క రూపాయికే క్రమబద్ధీకరించనుంది. కొత్త నల్లా కనెక్షన్‌కు కావాల్సిన పైపులు, రోడ్డు తవ్వకాల వ్యయాన్ని స్థానిక నగర, పురపాలక సంస్థలే భరిస్తాయి. గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్రంలోని 73 పట్టణ, నగర ప్రాంతాల్లో అమలు చేసే ఈ పథకంతో దాదాపు 25 లక్షల పేద కుటుంబాలకు ప్రయోజనం కలుగనుంది. ఈ పథకానికి సంబంధించి సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశముంది. ఏడాది కిందే ప్రతిపాదనలు పేదలకు రూపాయికే నల్లా కనెక్షన్ మంజూరు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు నేతృత్వంలో కేబినెట్ సబ్‌కమిటీ ఏడాది కిందటే ప్రతిపాదించింది. సీఎం కేసీఆర్ అయితే ఉచితంగానే నల్లా కనెక్షన్ మంజూరు చేయాలని భావించారు. అందుకు మున్సిపల్ చట్టాలు ఒప్పుకోవని నిర్ధారణకు రావడంతో నామమాత్రంగా రూపాయి వసూలు చేయాలని నిర్ణయించారు. కానీ ఆ తర్వాత ఈ అంశం పక్కన పడిపోయింది. తాజాగా పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు చొరవతో ఈ ప్రతిపాదనలకు మోక్షం లభించింది. రూపాయికే నల్లా కనెక్షన్ ప్రతిపాదనకు ఆయన ఇటీవలే ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తూ పురపాలక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర 72 నగర, పురపాలక సంస్థల్లో ఈ పథకాన్ని అమలు చేస్తారు. హైదరాబాద్ జల మండలి సైతం తన పరిధిలోని నగర, పురపాలికల్లో ఈ పథకాన్ని అమలు చేయనుంది. ‘ఆసరా’ కుటుంబాలకూ వర్తింపు పురపాలక సంస్థలో కొత్త నల్లా కనెక్షన్ కోసం రూ.1,200 చార్జీగా చెల్లించడంతో పాటు పైపులు, రోడ్డు తవ్వకాల ఖర్చును భరించాల్సి ఉండేది. పేద కుటుంబాలపై భారాన్ని తగ్గించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం నల్లా కనెక్షన్ చార్జీలను రూ.200కు తగ్గించింది. పైపులు, రోడ్డు తవ్వకాల ఖర్చులను స్థానిక పురపాలక సంస్థలే భరించాలని ఆదేశించింది. తెల్ల రేషన్‌కార్డు గల కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేసింది. అయితే తాజాగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇళ్లకు నల్లా కనెక్షన్ల మంజూరును మరింత సరళీకృతం చేస్తోంది. తెల్లరేషన్‌కార్డు లేని పేద కుటుంబాలకు ప్రత్యామ్నాయ అర్హతలను సైతం పరిశీలిస్తోంది. ఆసరా పింఛన్లు అందుకుంటున్న కుటుంబాలకు సైతం వర్తింపజేయాలని యోచిస్తోంది. పేదలకు ప్రయోజనం.. పురపాలికలకు ఆదాయం రాష్ట్రంలోని 67 పాత పురపాలికల్లో 12.98 లక్షల కుటుంబాలుండగా 9.25 లక్షల కుటుంబాలకు, గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు నగర శివార్లలో కొత్తగా ఏర్పడిన ఐదు మున్సిపాలిటీల పరిధిలోని మరో 16 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్లు లేవు. అంటే మొత్తంగా పట్టణాలు, నగరాల పరిధిలో 25 లక్షల గృహాలకు నల్లా కనెక్షన్లు లేవు. పబ్లిక్ కుళాయిల వద్ద నీటిని మోసుకెళ్తూ పేద కుటుంబాల్లోని మహిళలు నిత్యం అవస్థలు పడుతున్నారు. ఈ గృహాలన్నింటికీ నల్లా కనెక్షన్ మంజూరు చేస్తే ఇటు పేద కుటుంబాలతో పాటు అటు పురపాలికలకు సైతం ప్రయోజనం కలుగుతుందని పురపాలక శాఖ ప్రభుత్వానికి నివేదించింది. అనుమతి లేని నల్లా కనెక్షన్లవారు ప్రస్తుతం నీటి బిల్లులేమీ కట్టడం లేదు. క్రమబద్ధీకరిస్తే వారంతా నీటి బిల్లులు చెల్లిస్తారు. దాంతోపాటు కొత్త నల్లా కనెక్షన్ మంజూరు చేస్తే ప్రతి నెలా రూ.40 నుంచి రూ.200 వరకు నీటి బిల్లులు వస్తాయి. నాలుగు నెలల్లోనే రూ.200 రాయితీ తిరిగి రానుంది. తర్వాత మున్సిపాలిటీలకు ప్రతి నెలా నీటి బిల్లుల రూపంలో అదనపు ఆదాయం వస్తుంది. అంతేగాకుండా మురికివాడల్లోని పేద కుటుంబాలకు రక్షిత మంచినీరు అందుతుందని, దీంతో ప్రజలు కలుషిత నీటితో సంక్రమించే రోగాల నుంచి విముక్తి పొందుతారని పురపాలక శాఖ తన ప్రతిపాదనల్లో పేర్కొంది. -
‘కుళాయి’ పేరిట తమ్ముళ్ల వసూళ్లు
మోసపోయిన కాలువ కట్ట వాసులు అక్రమ క నెక్షన్లు తొలగించిన పంచాయతీ సిబ్బంది యనమలకుదురు(పెనమలూరు): యనమలకుదురులో తెలుగుతమ్ముళ్లు కుళాయి కనెక్షన్లు ఇప్పిస్తామని అమాయక ప్రజల వద్ద నుంచి సొమ్ము దండుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. వ్యవహారం బయటపడటంతో పంచాయతీ సిబ్బంది ఆఘమేఘాలపై రంగంలోకి దిగి అక్రమ కుళాయి కనెక్షన్లు తొలగించారు. జరిగిన మోసాన్ని తెలుసుకున్న గ్రామస్తులు తెలుగు తమ్ముళ్లపై దుమ్మెత్తి పోస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. యనమలకుదురు గ్రామంలో బందరు కాలువ కట్ట ఇందిరానగర్ వన్, టు ప్రాంతాల్లో చాలామందికి వ్యక్తిగత కుళాయి కనెక్షన్లు లేవు. వారంతా వీధుల్లో ఉన్న పంచాయతీ కుళాయి నీటిపైనే ఆధారపడుతున్నారు. కాగా, తమ ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇవ్వమని స్థానికులు కొద్ది రోజుల కిందట అప్పటి కార్యదర్శి రామకోటేశ్వరరావును కోరగా ఆయన కుదరదని నిరాకరించారు. వీరి అవసరాన్ని ఇద్దరు తమ్ముళ్లు సొమ్ము చేసుకున్నారు. తమకు టీడీపీ బడా నేత అండదండలు ఉన్నాయని, తమకు సొమ్ము చెల్లిస్తే కుళాయి కనెక్షన్లు తామే ఇస్తామని గ్రామస్తులను నమ్మించారు. ఒక్కో కనెక్షన్‌కు రూ 5 వేలు నుంచి పదివేలు వసూలు చేశారు. దాదాపు 125 అక్రమ కనెక్షన్లు గత పదిరోజుల్లో ఇచ్చారు. వీటికి ఎటువంటి గ్రామ పంచాయతీ అనుమతులు లేవు. జరిగిన మోసంపై పంచాయతీకి ఫిర్యాదు! కాగా తమ్ముళ్లకు సొమ్ము కట్టి రశీదులు అందని వారు కొందరు జరిగిన మోసాన్ని తెలుసుకుని గ్రామ పంచాయతీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వైస్సార్‌కాంగ్రెస్ నేతలు పేదలకు మద్దతుగా నిలిచారు. అక్రమ కనెక్షన్ల గుట్టురట్టవ్వటంతో టీడీపీ నేతలు కంగారుపడి సొమ్ము వసూళ్లు చేసిన వారితో తమకు సంబంధం లేదని, అక్రమ కుళాయి కనెక్షన్లు తొలగించాలని పంచాయతీపై ఒత్తిడి తీసుకు వచ్చారు. దీంతో గురువారం పంచాయతీ సిబ్బంది రంగంలోకి దిగి అక్రమ కనెక్షన్లు తొలగించారు. తమ వద్ద సొమ్ము వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తమకు అధికారికంగా కుళాయి కనెక్షన్ ఇవ్వాలని కోరుతున్నారు. -
వచ్చేది వేసవికాలం
సాక్షి, మంచిర్యాల : జిల్లాలో కాలమేదైనా కన్నీటి కష్టాలు తప్పవు. గతేడాది కూడా మంచినీటి కోసం ప్రజలు అవస్థలు పడ్డారు. ఇప్పటివరకు అధికారులు నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోలేదు. రెండు నెలల్లో వేసవి సమీపిస్తోంది. ప్రధానంగా మున్సిపాలిటీల్లో మంచినీటి సమస్య ఉంది. మంత్రి ప్రకటించినట్టుగా కొన్నిచోట్ల నల్లాలు తొలగిం చారు. కొన్నిచోట్ల తొలగించకపోవడంతో నీరు వృథాగా పోతోంది. కాగా, కొత్త కనెక్షన్ కోసం రూ.200 చెల్లించినా వేలాది మందికి నల్లా కనెక్షన్ ఇవ్వలేదు. కేవలం భైంసా పట్టణంలోనే 300 మందికిపైగా కొత్త నల్లా కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మిగిలిన మున్సిపాలిటీల్లోనూ వేలాది మంది దరఖాస్తు చేసుకుని కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు మాత్రం పైప్‌లైన్ నిర్మాణాలు సక్రమంగా లేవని, సాంకేతిక కారణాలతో కొత్త కనెక్షన్లు ఇవ్వడం లేదంటున్నారు. ప్రచారం కరువు నీటివృథా అరికట్టడం, నీటి సరఫరా విస్తరణ కోసం పబ్లిక్ నల్లాలు తొలగించి, వాటి స్థానంలో ఇంటికో నల్లా కనెక్షన్ ఇస్తున్నట్లు ప్రజలకు అవగాహన కల్పించడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారు. పబ్లిక్ నల్లాలు అధికంగా ఉన్న వాడల్లో శిబిరాలు ఏర్పాటు చేయాలి. అక్కడే నల్లా కనెక్షన్ దరఖాస్తుఫారాలు తీసుకుని, రూ.200లకే నల్లా కనెక్షన్ మంజూరు చేయాలి. ఇది చాలాచోట్ల జరగలేదు. కానీ, బల్దియాల్లో పబ్లిక్ నల్లాలను మాత్రం చాలావరకు తొలగించారు. ఇదిలాఉండగా, గులాబీ కార్డుదారులకు కొత్త కనెక్షన్ కోసం ఒక్కో మున్సిపాలిటీలో రూ.3,600 నుంచి రూ.7,200 వరకు వసూలు చేస్తున్నారు. దీంతో గులాబీ కార్డుదారులూ పబ్లిక్ కుళాయిలపైనే ఆధారపడుతున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో బడానాయకులు ఇంట్లో ఓ నల్లా ఉన్నా ఎక్కువ నీటి కోసం తమ పలుకుబడితో పబ్లిక్ కుళాయిలు తొలగింపుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. పైప్లైన్లు లేక.. బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని అశోక్‌నగర్, గంగారాంనగర్, కొత్తబస్టాండ్ ఏరియా, రవీందర్‌నగర్, అంబేద్కర్‌నగర్, సుబ్బరావుపల్లె తదితర ప్రాంతాల్లో పైప్లైన్లు ఉన్నా అధికారులు నల్లా కనెక్షన్లు ఇవ్వడం లేదు. కాగజ్‌నగర్ మున్సిపల్ పరిధిలోని ఆర్‌ఆర్‌వో కాలని, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏరియా, త్రినేత్ర శివాలయం ప్రాంతాల్లో పైప్‌లైన్ నిర్మాణమే జరగలేదు. దీంతో ప్రజలు ఏటా తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని సుమారు ఏడు శివారు ప్రాంతాల్లో పైప్‌లైన్ నిర్మాణం లేదు. దీంతో అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని రాజీవ్‌నగర్ కొత్త కాలని, 345- ఇందిరమ్మ కాలని, తిలక్‌నగర్, వడ్డెరకాలని(కొంత ప్రాంతం) పలు శివారు కాలనిల్లో తాగునీటి సరఫరా చేసేందుకు మూడేళ్ల క్రితమే పైప్లైన్లు వేశారు. కానీ వెంటనే కనెక్షన్లు ఇవ్వలేదు. అవి పగిలిపోయాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు ట్యాంకర్లనే ఆశ్రయిస్తున్నారు. పైప్లైన్లు లేకపోవడంతోనే.. మంగతాయారు, కమిషనర్, బెల్లంపల్లి మున్సిపాలిటీ. పబ్లిక్ నల్లాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. నిరుపేదలకు రూ. 200లకే ఇంటికో నల్లా కనెక్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. కానీ, పలు చోట్ల పైప్‌లైన్ నిర్మాణం పూర్తికాక, సాంకేతిక కారణాల వల్ల ఇవ్వలేకపోతున్నాం. పనులు పూర్తయిన వెంటనే నల్లా కనెక్షన్లు ఇస్తాం. అలాగే చాలా మంది కొత్త నల్లా కనెక్షన్ కోసం సమర్పించిన దరఖాస్తులో వివరాలు సరిగా లేవు. అసంపూర్తి దరఖాస్తులున్న వారికి కనెక్షన్లు ఇవ్వం.