ఆదోని: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంజూరైన రూ.200 కుళాయి కనెక్షన్ పథకానికి ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. ఆస్తి పన్ను రూ.500 దాటితే తెల్లరేషన్ కార్డు ఉన్న వారు కూడా రూ.200 కుళాయి కనెక్షన్‌కు అనర్హులను చేస్తూ జీఓ నం.159ను మే నెల 17న విడుదల చేసింది. జీఓ విడుదలైన నాటి నుంచి తెల్లరేషన్ కార్డుదారులు చేసుకున్న కుళాయి కనెక్షన్ల దరఖాస్తులను అధికారులు పెండింగ్‌లో ఉంచారు. ఆదోని మున్సిపాలిటీలో దాదాపు 250 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆస్తిపన్ను రూ.500 దాటిన వారందరికీ మున్సిపల్ తాగునీటి సరఫరా విభాగం అధికారులు రూ.6500 డిపాజిట్ చెల్లించాలని సూచిస్తున్నారు. దీంతో పేదలు బిక్కమొహం వేస్తున్నారు. ప్రభుత్వం ఆస్తిపన్ను తరచుగా పెంచుతోంది. దీంతో రెండు గదులున్న మట్టి ఇల్లు కూడా ఆస్తి పన్ను కూడా రూ.500 దాటింది. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల కారణంగా తెల్లరేషన్ కార్డు కలిగిన నిరుపేదల్లో 90శాతం పైగా రూ.200 కుళాయి కనెక్షన్‌కు అనర్హులుగా మారారు. తాజా జీఓపై ప్రజలు మండిపడుతున్నారు.
తాగునీరు ఎట్టా..?
ఆదోని పట్టణంలో 1,84,000 మంది నివాసం ఉంటున్నారు. ఆవాసాలు 36వేలకు పైగా ఉన్నాయి. పట్టణంలో 6వేలకు పైగా కుళాయి కనెక్షన్లు ఉండగా వాటిలో పబ్లిక్‌వి వెయ్యి లోపే. కనెక్షన్లు ఉన్న వారు తప్ప మిగిలిన వారు మాత్రం తాగునీటికోసం పబ్లిక్ కుళాయిపై ఆధారపడ్డారు. అయితే రూ.200 కుళాయి కనెక్షన్ పథకం అమల్లోకి వచ్చిన తరువాత పబ్లిక్ కుళాయిల ఏర్పాటును మున్సిపల్ అధికారులు నిలిపివేశారు. ఎక్కడైనా పబ్లిక్ కుళాయిలు చెడిపోతే మరమ్మతు కూడా చేయడం లేదు. దీంతో రూ.200 కుళాయి కనెక్షన్ తీసుకోవడానికి ఎంతోమంది పేదలు దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే తాజా జీఓతో పేదలు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నిరుపేదలకు ఎంతో సదుపాయంగా ఉన్న రూ.200కే కుళాయి కనెక్షన్ పథకంను ఆస్తి పన్ను సాకు చూపి నీరుగార్చడం దుర్మార్గమని, శనివారం జరిగే కౌన్సిల్ సమావేశంలో ఈ విషయమై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆదోని మున్సిపల్ వైస్ చైర్మన్ అల్తాప్ అహ్మద్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment