వచ్చేది వేసవికాలం | Promoting drought on water save | Sakshi
Sakshi News home page

వచ్చేది వేసవికాలం

Published Thu, Jan 23 2014 4:32 AM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM

Promoting drought on water save

సాక్షి, మంచిర్యాల : జిల్లాలో కాలమేదైనా కన్నీటి కష్టాలు తప్పవు. గతేడాది కూడా మంచినీటి కోసం ప్రజలు అవస్థలు పడ్డారు. ఇప్పటివరకు అధికారులు నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోలేదు. రెండు నెలల్లో వేసవి సమీపిస్తోంది. ప్రధానంగా మున్సిపాలిటీల్లో మంచినీటి సమస్య ఉంది. మంత్రి ప్రకటించినట్టుగా కొన్నిచోట్ల నల్లాలు తొలగిం చారు.

కొన్నిచోట్ల తొలగించకపోవడంతో నీరు వృథాగా పోతోంది. కాగా, కొత్త కనెక్షన్ కోసం రూ.200 చెల్లించినా వేలాది మందికి నల్లా కనెక్షన్ ఇవ్వలేదు. కేవలం భైంసా పట్టణంలోనే 300 మందికిపైగా కొత్త నల్లా కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మిగిలిన మున్సిపాలిటీల్లోనూ  వేలాది మంది దరఖాస్తు చేసుకుని కనెక్షన్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు మాత్రం పైప్‌లైన్ నిర్మాణాలు సక్రమంగా లేవని, సాంకేతిక కారణాలతో కొత్త కనెక్షన్లు ఇవ్వడం లేదంటున్నారు.

 ప్రచారం కరువు
 నీటివృథా అరికట్టడం, నీటి సరఫరా విస్తరణ కోసం పబ్లిక్ నల్లాలు తొలగించి, వాటి స్థానంలో ఇంటికో నల్లా కనెక్షన్ ఇస్తున్నట్లు ప్రజలకు అవగాహన కల్పించడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారు. పబ్లిక్ నల్లాలు అధికంగా ఉన్న వాడల్లో శిబిరాలు ఏర్పాటు చేయాలి. అక్కడే నల్లా కనెక్షన్ దరఖాస్తుఫారాలు తీసుకుని, రూ.200లకే నల్లా కనెక్షన్ మంజూరు చేయాలి. ఇది చాలాచోట్ల జరగలేదు. కానీ, బల్దియాల్లో పబ్లిక్ నల్లాలను మాత్రం చాలావరకు తొలగించారు.

 ఇదిలాఉండగా, గులాబీ కార్డుదారులకు కొత్త కనెక్షన్ కోసం ఒక్కో మున్సిపాలిటీలో రూ.3,600 నుంచి రూ.7,200 వరకు వసూలు చేస్తున్నారు. దీంతో గులాబీ కార్డుదారులూ పబ్లిక్ కుళాయిలపైనే ఆధారపడుతున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో బడానాయకులు ఇంట్లో ఓ నల్లా ఉన్నా ఎక్కువ నీటి కోసం తమ పలుకుబడితో పబ్లిక్ కుళాయిలు తొలగింపుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు.

 పైప్‌లైన్లు లేక..
     బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని అశోక్‌నగర్, గంగారాంనగర్, కొత్తబస్టాండ్ ఏరియా, రవీందర్‌నగర్, అంబేద్కర్‌నగర్, సుబ్బరావుపల్లె తదితర ప్రాంతాల్లో పైప్‌లైన్లు ఉన్నా అధికారులు నల్లా కనెక్షన్లు ఇవ్వడం లేదు.

     కాగజ్‌నగర్ మున్సిపల్ పరిధిలోని ఆర్‌ఆర్‌వో కాలని, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏరియా, త్రినేత్ర శివాలయం ప్రాంతాల్లో పైప్‌లైన్ నిర్మాణమే జరగలేదు. దీంతో ప్రజలు ఏటా తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు.

   ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని సుమారు ఏడు శివారు ప్రాంతాల్లో పైప్‌లైన్ నిర్మాణం లేదు. దీంతో అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.

     మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని రాజీవ్‌నగర్ కొత్త కాలని, 345- ఇందిరమ్మ కాలని, తిలక్‌నగర్, వడ్డెరకాలని(కొంత ప్రాంతం) పలు శివారు కాలనిల్లో తాగునీటి సరఫరా చేసేందుకు మూడేళ్ల క్రితమే పైప్‌లైన్లు వేశారు. కానీ వెంటనే కనెక్షన్లు ఇవ్వలేదు. అవి పగిలిపోయాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు ట్యాంకర్లనే ఆశ్రయిస్తున్నారు.

 పైప్‌లైన్లు లేకపోవడంతోనే..
 మంగతాయారు, కమిషనర్, బెల్లంపల్లి మున్సిపాలిటీ.
 పబ్లిక్ నల్లాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. నిరుపేదలకు రూ. 200లకే ఇంటికో నల్లా కనెక్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. కానీ, పలు చోట్ల పైప్‌లైన్ నిర్మాణం పూర్తికాక, సాంకేతిక కారణాల వల్ల ఇవ్వలేకపోతున్నాం. పనులు పూర్తయిన వెంటనే నల్లా కనెక్షన్లు ఇస్తాం. అలాగే చాలా మంది కొత్త నల్లా కనెక్షన్ కోసం సమర్పించిన దరఖాస్తులో వివరాలు సరిగా లేవు. అసంపూర్తి దరఖాస్తులున్న వారికి కనెక్షన్లు ఇవ్వం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement