రూపాయికే నల్లా కనెక్షన్! | tap conection one rupee only mission bageeratha scheam | Sakshi
Sakshi News home page

రూపాయికే నల్లా కనెక్షన్!

Published Tue, Jun 7 2016 2:29 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

రూపాయికే నల్లా కనెక్షన్! - Sakshi

రూపాయికే నల్లా కనెక్షన్!

‘మిషన్ భగీరథ’తో ఇంటింటికీ తాగునీరు
తాండూరులో మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం
నల్లా లేని నివాసాలపై మున్సిపల్ అధికారుల సర్వే

మిషన్ భగీరథ పథకంలో భాగంగా పట్టణాల్లోని ఇంటింటికీ నల్లా కనెక్షన్ తప్పని సరి అని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇవ్వాలంటూ జీఓ 372ను జారీ చేసింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాల గొంతు తడిపేందుకు ఇది ఎంతగానో తోడ్పడనుంది. 

తాండూరు: మార్కెట్లో కప్పు టీ ధర రూ.5. అలాంటిది తాగునీటి నల్లా కనెక్షన్ రూ.1కే లభిస్తుందంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా!.. కానీ ఇది నిజం. మిషన్ భగీరథ పథకంలో భాగంగా.. ఇక రూ.1కే నల్లా కనెక్షన్లు లభించనున్నాయి. ఈ మేరకు తెలంగాణ సర్కార్ ఇటీవల 372 జీవో జారీ చేసింది. దీంతో పట్టణా(మున్సిపాలిటీ)ల్లో దారిద్య్రరేఖకు దిగువనున్న పేద వర్గాల నుంచి కనెక్షన్ కోసం వసూలు చేస్తున్న రూ.200 రుసుం రద్దయ్యింది. నల్లా కనెక్షన్లు తీసుకోవడంలో పేదలకు వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మిషన్ భగీరథలో భాగంగా తాండూరుకు కృష్ణా జలాలు అందనున్నాయి. ఇందుకోసం పట్టణ శివారులోని విలియంమూన్ సమీపంలో మాస్టర్ బ్యాలెన్సింగ్ (ఎంబీఆర్) రిజర్వాయర్‌ను నిర్మించనున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, పాత తాండూరు ప్రాంతాల్లో 10 మిలియన్ లీటర్స్ ఫర్ డే(ఎంఎల్‌డీ) సామర్థ్యంతో ఎలివేటెడ్ సర్వీసు రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తారు.  వీటి ద్వారా పట్టణంలోని ప్రతి ఇంటికీ కృష్ణా జలాలు అందించడానికి అధికారులు ప్రణాళికలు వేశారు. 

 7వేల కనెక్షన్లు...
తాండూరు పట్టణంలో 70 వేలకుపైగా జనాభా ఉంది. మొత్తం 31 వార్డుల్లో అసెస్‌మెంట్ చేసిన నివాసాలు 11 వేలు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం 7 వేల ఇళ్లకు మాత్రమే నల్లా కనెక్షన్లు ఉండగా.. మరో 1,500 కమర్షియల్ కనెక్షన్లున్నాయి. ఇప్పటికీ నల్లాలు లేని కుటుంబాల సంఖ్య 2,500 వరకు ఉంటుందని అధికారుల అంచనా. వీరందరికీ రూ.1కి నల్లా కనెక్షన్‌లు ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పట్టణంలోని కనెక్షన్ల వివరాలపై బిల్ కలెక్టర్ల ద్వారా సర్వే చేయిస్తున్నారు. కనెక్షన్లు లేని నివాసాల ప్రాంతంలో పైప్‌లైన్లు ఉన్నాయా..? లేవా? అక్రమ కనెక్షన్లు ఏమైనా ఉన్నాయా అనే అంశంపై సర్వే చేయనున్నారు. ఒకవేళ అక్రమ నల్లా కనెక్షన్లు ఉన్నా రూ.1కింద వాటిని క్రమబద్ధీకరించాలని అధికారులు యోచిస్తున్నారు. పైప్‌లైన్ సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో వెంటనే కనెక్షన్లు ఇస్తామని, లేని చోట జూలై నాటికి లక్ష్యాన్ని పూర్తి చేస్తామని మున్సిపల్ కమిషనర్ సంతోష్‌కుమార్ చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement