Panchayat staff
-
సమస్యల పరిష్కారానికి సమ్మె
బిజినేపల్లిరూరల్: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఏళ్ల నుంచి చాలీచాలని కూలీతో వెట్టి చాకిరీ చేస్తున్నా గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఈ నెల 23నుంచి తెలంగాణవ్యాప్తంగా సమ్మె బాట పడుతున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్ శ్రీను తెలిపారు. శుక్రవారం బిజినేపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఆ యా గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులతో కలిసి సమ్మె నోటీసును అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికు ల వలె గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలని, జీఓనం. 212, 112లను సవరించి ఈ జీఓలు వర్తించే వారందరినీ పర్మినెంట్ చేయాలని, కర్ణాటక రాష్ట్ర తరహాలో గ్రామ పంచాయతీ ఉద్యోగస్తులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. పం చాయతీ కార్యదర్శుల పోస్టుల్లో ప్రస్తుతం పనిచేస్తున్న కారోబార్, బిల్ కలెక్టర్ వంటి ఉద్యోగాల్లో పంచాయతీ కార్మికులకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. పలు రకాల ఒప్పందాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ఈ డిమాండ్లు నెరవేర్చే వరకు ఈ నెల 23 నుంచి తెలంగాణవ్యాప్తంగా సమ్మె చేస్తున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో బీఎల్ఎఫ్ మండల చైర్మన్ హన్మంతు, టీమాస్ మండల చైర్మన్ రాంచందర్, బీఎల్ఎఫ్ కోకన్వీనర్ చంద్రశేఖర్, కార్మిక మండల అధ్యక్షులు సత్యనారాయణ, సీఐటీయూ జిల్లా నాయకుడు శుభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీడీఓకు సమ్మె నోటీసు తెలకపల్లి: మండల కేంద్రమైన తెలకపల్లి మేజర్ గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీఓ లక్ష్మీకాంత్‌రెడ్డి, ఈఓ సాదిక్బాబాకు సమ్మె నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి గోపాస్ లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 23నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు తెలిపారు. కార్మికులు రూ.3వేల జీతంతో ఎలా బతుకుతారని ప్రశ్నించారు. కార్యక్రమంలో కార్మికులు అంబయ్య, సుధాకర్, ఉస్సేన్, మశమ్మ, రాంచంద్రమ్మ, అనసూయ, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు. -
ఖాళీ కడుపులతో విధులు
నక్కపల్లి(పాయకరావుపేట): పంచాయతీ సిబ్బంది ఆకలితో అలమటిస్తున్నారు. నాలుగు నెలలుగా జీతాలకు నోచుకోక పస్తులతోనే విధులకు హాజరయ్యే దుస్థితి. పంచాయతీల్లో నిధులున్నప్పటికీ వాటి వినియోగంపై ప్రభుత్వం ఆంక్షలతో ఈ పరిస్థితి నెలకొంది. గతంలో సంక్రాంతి, ఉగాది పండుగలప్పుడూ వీరికి జీతాలు చెల్లించకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. జిల్లా వ్యాప్తంగా 37 మేజర్పంచాయతీలు, 888 మైనర్ పంచాయతీలు ఉన్నాయి. వీటిని 558 పంచాయతీ క్లస్టర్లుగా విభజించారు. వీటిలో కార్యనిర్వాహణాధికారులు, బిల్కలెక్టర్లు, అటెండర్లు, గుమస్తాలు, పారిశుద్ధ్యకార్మికులు, పార్ట్‌టైం అసిస్టెంట్లు మొత్తంగా సుమారు 4వేలమందికి పనిచేస్తున్నారు. వీరికి జీతాలు పంచాయతీ సాధారణ నిధుల నుంచి చెల్లిస్తుంటారు. చాలా పంచాయతీల్లో పారిశుద్ధ్య సిబ్బందిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించి గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. రక్షిత మంచినీటి పథకాల నిర్వాహణను స్విచ్‌బోర్డు ఆపరేటర్లతో చేయిస్తుంటారు. ఏడాదికి కొంత బడ్జెట్ కేటాయించి, దాని పరిధికి లోబడి పారిశుద్ధ్య సిబ్బంది, పార్ట్‌టైం అసిస్టెంట్లకు వేతనం చెల్లించాల్సి ఉంటుంది. రెగ్యులర్ ఉద్యోగులైన కార్యనిర్వాహణాధికారులు, బిల్కలెక్టర్లు, అటెండర్లు, గుమస్తాలకు కూడా పంచాయతీ నిధుల నుంచే జీతాలు చెల్లిస్తుంటారు. ఇంటి పన్నులు వసూళ్లు, సెస్సులు, డైలీమార్కెట్లు, షాపింగ్‌కాంప్లెక్స్‌లు పంచాయతీకి వచ్చే ఆదాయ వనరులు. ప్రత్యేక గ్రాంట్లు ద్వారా సమకూరే ఆదాయం నుంచి ఏటా 15నుంచి 35 శాతం సిబ్బంది జీతాలకు ఖర్చు చేస్తుంటారు. పంచాయతీలకు ఈ ఆదాయం యథావిధిగానే సమకూరుతుంది. ఇంటి పన్నుల వసూళ్లు కూడా సక్రమంగానే జరుగుతున్నాయి. సెస్సుల రూపంలో వచ్చే ఆదాయం బాగానే వస్తోంది. ఐనప్పటికీ సిబ్బందికి జీతాలు చెల్లించే విషయంలో స్థానిక సంస్థలపై ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తోంది. వీరి జీతాలను సబ్‌ట్రెజరీల ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెలా పంచాయతీ పాలకవర్గాలు జమాఖర్చులను ఆమోదించి సిబ్బందికి చెల్లించాల్సిన జీతాలను బిల్లు పెట్టి ట్రెజరీకి పంపిస్తుంటారు.అక్కడ కొర్రి వేయడం వల్ల జీతాలు చెల్లించని పరిస్థితి నెలకొంది. రాష్ట్రప్రభుత్వం దుబారాఖర్చులు చేపడుతూ నిధుల వినియోగం పై ఆప్రకటిత ఆంక్షలు (ఫ్రీజింగ్) విధించడం వల్ల పంచాయతీల్లో పనిచేసే సిబ్బందికి జీతాలు చెల్లించని దుస్థితి. ఒక్క సిబ్బంది జీతాలే కాకుండా పంచాయతీలో వీధి దీపాలు, రక్షితమంచినీటి పథకాల నిర్వాహణ, చిన్నచిన్న మరమ్మతు పనుల కోసం కూడా నిధులు డ్రాచేసే అవకాశం లేదని సిబ్బంది పేర్కొంటున్నారు. ఉదాహరణకు పాయకరావుపేట మేజర్ పంచాయతీలో 64 మంది పనిచేస్తున్నారు. వీరికి నాలుగు నెలల నుంచి జీతాలు చెల్లించలేదు. సుమారు రూ.7.84 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఏళ్ల తరబడి పంచాయతీల్లో పనిచేస్తున్నాం కాబట్టి సకాలంలో జీతాలు చెల్లించక పోయినా వేరే గత్యంతరం లేక పస్తులుంటూనే విధులు నిర్వర్తించాల్సి వస్తున్నదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటి రెండు నెలలయితే ఫర్వాలేదు.ఏకంగా నాలుగు నెలల నుంచి జీతాలు చెల్లించకపోతే ఎలా బతకాలంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బంది కోరుతున్నారు. ఈవిషయాన్ని డీపీవో కృష్ణకుమారి వద్ద ప్రస్తావించేందుకు ప్రయత్నించగా ఆమె అమరావతిలో కమిషనర్ సమావేశానికి హాజరు కావడంతో అందుబాటులో లేరు. పాయకరావుపేట పంచాయతీ ఈవో లవరాజు వద్ద జీతాల బకాయిలు విషయం ప్రస్తావించగా పంచాయతీలో సుమారు 64 మంది సిబ్బంది పనిచేస్తున్నారని నాలుగు నెలల నుంచి జీతాలు చెల్లించలేదని తెలిపారు. దాదాపు 7.80 లక్షలు బకాయి ఉందన్నారు. ట్రెజరీ ఆంక్షలు కారణంగా చెల్లించలేదన్నారు. -
పంచాయతీల్లోనూ బయోమెట్రిక్ !
కడప ఎడ్యుకేషన్ :‘సార్.. విద్యుత్ కనెక్షన్ దరఖాస్తుపై మీ సంతకం కావాలి ఎక్కడున్నారు’.. ‘మా ఇంటి నిర్మాణానికి ప్లానింగ్ కావాలి సర్’... పంచాయతీ కార్యదర్శులకు ఆయా గ్రామాల ప్రజల అడిగే ఇలాంటి ప్రశ్నలకు అటువైపు నుం చే వచ్చే సమాధానం.. ‘బయట ఉన్నా... రేపు రండి’ అని. ఇక ఇలాంటి సమాధానాలకు చెక్ పడినట్లే. పంచాయతీ కార్యదర్శుల కోసం వెతుక్కుంటూ పోవాల్సిన కష్టాలకు కాలం చెల్లినట్లే.అవును ఇకపై పంచాయతీ సిబ్బంది కచ్చితంగా కార్యాలయంలో ఉండాల్సిందే. అక్కడ ఏర్పాటు చేసే బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదు చేసుకోవాల్సిందే. ఈ విధానాన్ని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని అన్ని పంచాయతీల్లో బయోమెట్రిక్ యంత్రాల ఏర్పాటుకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. అన్నిచోట్లా అమలయ్యేనా? జిల్లాలో 790 గ్రామపంచాయతీలకు గాను 617 వాటికి మాత్రమే సొంతభవనాలు ఉన్నాయి. మిగతా చోట్ల సొంత భవనాలులేవు. మరి ఇక్కడ బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేస్తారా ..లేదా అన్నదానిపై అనుమానాలు ఉన్నాయి. అలాగే పలు పంచాయతీల్లో కార్యదర్శులు కొరత కూడా ఉంది. ప్రస్తుతం క్లస్టర్లవారీగా కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. దీని ప్రకారం ఒక్కో గ్రామంలో ఒక్కో రోజు ఉండే విధంగా నిబంధనలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది ఎక్కడా అమలుకాకపోయినా.. బయోమెట్రిక్ నిబంధన అమలైతే ఆయా కార్యదర్శి కచ్చితంగా పంచాయతీ కార్యాలయానికి వచ్చి బయోమెట్రిక్ విధానంలో హాజ రును నమోదు చేసుకోవాల్సిందే. ఈ అడ్డంకులన్నీ అధిగమించి బయోమెట్రిక్ పద్ధతి అమలవుతుందా లేదా వేచి చూడాలి. బయోమెట్రిక్ తప్పనిసరి జిల్లాలోని అన్ని పంచాయతీల్లో బయోమెట్రిక్ డివైస్‌లు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. ఈ నెల చివరినాటికి కచ్చితంగా అన్ని పంచాయతీ కార్యాలయాల్లో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేయాల్సిందే. ప్రతి కార్యదర్శి ఏప్రిల్ 1 నుంచి కచ్చితంగా బయోమెట్రి క్ హాజరు నమోదు చేయాల్సిందే. – ఖాదర్‌బాషా, జిల్లా పంచాయతీ అధికారి -
తిరుగుడే తిరుగుడు
⇒పన్నుల వసూలుకు మిస్తున్న పంచాయతీ సిబ్బంది ⇒ఈనెల 30 వరకు గడువు పెంచడంతో కలెక్షన్‌కు చర్యలు ⇒మిగిలిన రూ.3.19 కోట్ల వసూలుకు ప్రత్యేక ప్రణాళిక ⇒వంద శాతం లక్ష్యంగా అధికారుల కృషి వరంగల్ రూరల్: ఆర్థిక సంవత్సరం గతనెల 31వ తేదీతో ముగిసింది. అయినప్పటికీ జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో వసూలు కావాల్సిన పన్నులు ఇంకా మిగిలిపోయాయి. ఇదే పరిస్థితి రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఉండడంతో ప్రభుత్వం పన్నుల వసూళ్లకు ఈనెల 30వ తేదీ వరకు గడువు పొడిగించింది. ఇందులో భాగంగా జిల్లాలో మిగిలిపోయిన రూ.3.19 కోట్ల వసూలుకు అధికా రులు కృషి చేస్తు న్నారు. ప్రభుత్వం ఇచ్చిన గడువును సద్వినియోగం చేసుకోవాలన్న భావనతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని జిల్లా పంచాయతీ అధికారి నుంచి కారోబార్ వరకు పన్నుల వసూళ్లలో నిమగ్నమయ్యారు. 72.55 శాతం వసూళ్లు.. జిల్లాలోని 15 మండలాల్లో 269 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఆయా జీపీల్లో కలిపి గత ఆర్థిక సంవత్సరం (2016–17) రూ.11,64,00,173 మేరకు ఆస్తి, నీటి పన్నులు వసూలు చేయాల్సి ఉంది. అయితే గడువు ముగిసిన మార్చి 31వ తేదీ వరకు రూ.8,44,47,385(72.55శాతం) పన్నులే వసూలయ్యాయి. అంటే ఇంకా రూ.3.19 కోట్ల వరకు వసూలు చేయాల్సి ఉంది. కానీ ఆర్థిక సంవత్సరం ముగియడంతో ఆ నగదు బకాయిగా పేరుకుపోతుందని భావించారు. అయితే, ఈ పరిస్థితి చాలా జిల్లాల్లో ఉండడంతో ఈనెల 30వ తేదీ వరకు పన్నుల వసూళ్లకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు బకాయిలు వంద శాతం పూర్తి చేయాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నామని జిల్లా పంచాయతీ అధికారి పిండి కుమారస్వామి ‘సాక్షి’కి తెలిపారు. నోట్లు రద్దుతోనే.. కొత్తగా ఏర్పడిన వరంగల్ రూరల్ జిల్లా పూర్తిగా గ్రామీణ ప్రాంతం. దీంతో ఆస్తి, నీటి పన్నుల వసూళ్లలో ఉద్యోగులకు ఇబ్బం దులు ఎదురయ్యేవి. కానీ గత ఆర్థిక సంవత్సరం మధ్యలో కేంద్ర ప్రభుత్వం రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసింది. దీంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం రద్దయిన నోట్లతో పన్నులు చెల్లించవచ్చని ప్రకటించింది. ఈ మేరకు జిల్లాలో రూ.11.64 కోట్ల వరకు ఉన్న పన్నుల్లో రూ. 8.44 కోట్ల వరకు వసూలయ్యాయి. అంటే నోట్ల రద్దు అంశం పన్నులు భారీగా వసూలయ్యేందుకు ఉపకరించిందని చెప్పొచ్చు. అందరి సహకారంతో ముందుకు.. జిల్లాలో ఆస్తి, నీటి పన్నులు రూ.3 కోట్లకు పైగా వసూలు కావాల్సి ఉంది. మార్చి 31వ తేదీ వరకు వసూలైన పన్నులు లెక్కిస్తే ఈ బాకీ తేలింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 30వ తేదీ వరకు పన్నుల స్వీకరణకు అవకాశం కల్పించగా అప్పటి నుంచి గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ పన్నులు వసూలు చేస్తున్నాం. అన్ని గ్రామపంచాయతీల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ఈఓ పీఆర్డీల సహకారం తీసుకుంటూ కార్యదర్శులు పన్నులు వసూళ్లలో నిమగ్నమయ్యారు. ఏది ఏమైనా ప్రభుత్వం ఇచ్చిన గడువు సద్వినియోగం చేసుకుని వంద శాతం పన్నులు వసూలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. -
‘కుళాయి’ పేరిట తమ్ముళ్ల వసూళ్లు
మోసపోయిన కాలువ కట్ట వాసులు అక్రమ క నెక్షన్లు తొలగించిన పంచాయతీ సిబ్బంది యనమలకుదురు(పెనమలూరు): యనమలకుదురులో తెలుగుతమ్ముళ్లు కుళాయి కనెక్షన్లు ఇప్పిస్తామని అమాయక ప్రజల వద్ద నుంచి సొమ్ము దండుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. వ్యవహారం బయటపడటంతో పంచాయతీ సిబ్బంది ఆఘమేఘాలపై రంగంలోకి దిగి అక్రమ కుళాయి కనెక్షన్లు తొలగించారు. జరిగిన మోసాన్ని తెలుసుకున్న గ్రామస్తులు తెలుగు తమ్ముళ్లపై దుమ్మెత్తి పోస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. యనమలకుదురు గ్రామంలో బందరు కాలువ కట్ట ఇందిరానగర్ వన్, టు ప్రాంతాల్లో చాలామందికి వ్యక్తిగత కుళాయి కనెక్షన్లు లేవు. వారంతా వీధుల్లో ఉన్న పంచాయతీ కుళాయి నీటిపైనే ఆధారపడుతున్నారు. కాగా, తమ ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇవ్వమని స్థానికులు కొద్ది రోజుల కిందట అప్పటి కార్యదర్శి రామకోటేశ్వరరావును కోరగా ఆయన కుదరదని నిరాకరించారు. వీరి అవసరాన్ని ఇద్దరు తమ్ముళ్లు సొమ్ము చేసుకున్నారు. తమకు టీడీపీ బడా నేత అండదండలు ఉన్నాయని, తమకు సొమ్ము చెల్లిస్తే కుళాయి కనెక్షన్లు తామే ఇస్తామని గ్రామస్తులను నమ్మించారు. ఒక్కో కనెక్షన్‌కు రూ 5 వేలు నుంచి పదివేలు వసూలు చేశారు. దాదాపు 125 అక్రమ కనెక్షన్లు గత పదిరోజుల్లో ఇచ్చారు. వీటికి ఎటువంటి గ్రామ పంచాయతీ అనుమతులు లేవు. జరిగిన మోసంపై పంచాయతీకి ఫిర్యాదు! కాగా తమ్ముళ్లకు సొమ్ము కట్టి రశీదులు అందని వారు కొందరు జరిగిన మోసాన్ని తెలుసుకుని గ్రామ పంచాయతీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వైస్సార్‌కాంగ్రెస్ నేతలు పేదలకు మద్దతుగా నిలిచారు. అక్రమ కనెక్షన్ల గుట్టురట్టవ్వటంతో టీడీపీ నేతలు కంగారుపడి సొమ్ము వసూళ్లు చేసిన వారితో తమకు సంబంధం లేదని, అక్రమ కుళాయి కనెక్షన్లు తొలగించాలని పంచాయతీపై ఒత్తిడి తీసుకు వచ్చారు. దీంతో గురువారం పంచాయతీ సిబ్బంది రంగంలోకి దిగి అక్రమ కనెక్షన్లు తొలగించారు. తమ వద్ద సొమ్ము వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తమకు అధికారికంగా కుళాయి కనెక్షన్ ఇవ్వాలని కోరుతున్నారు. -
డెంగీ పంజా!
పల్లెలు మంచం పట్టాయి.. జ్వరాలతో వణుకుతున్నాయి.. అసలే వర్షాకాలం.. ఆపై వైరల్ ఫీవర్, డెంగీ స్వైరవిహారం చేస్తున్నాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల పంచాయతీ కార్మికుల నిరవధిక సమ్మెతో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాల్లో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. సిద్దిపేట రూరల్ : సిద్దిపేట మండలం శంకర్‌నగర్, సీతారాంపల్లి గ్రామాల్లో ఇటీవల కొందరు జ్వరాల బారిన పడడంతో వైద్యాధికారులు క్యాంపు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో 13 మంది నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. 13 మందిలో తొమ్మిది మందికి డెంగీ పాజిటివ్, నలుగురికి వైరల్ ఫీవర్ ఉన్నట్లు తేలింది. ఇందులో సీతారాంపల్లికి చెందిన పడిగె రాజయ్య, జీర్కపల్లి నగేష్, శంకర్‌నగర్‌కు చెందిన పడిగె సత్తయ్య, పడిగె గణేష్, పడిగె బాలయ్య, పిట్ల దివ్య, రెడ్డి దివ్యతో పాటు అనిల్‌కుమార్‌లకు డెంగీ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా సుమారు పక్షం రోజుల నుంచి సీతారాంపల్లి, శంకర్‌నగర్‌లో ఇంటికి ఇద్దరు వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. ఇదిలా ఉండగా.. జ్వరాలు నమోదు అవుతున్న గ్రామాల్లో వైద్య సిబ్బంది శిబిరాలు నిర్వహిస్తూ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేశారు. వైరల్ గ్రామాలు... నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పలువురు విషజ్వరాల బారిన పడినట్లు వైద్యులు గుర్తించారు. సిద్దిపేట మండలం మాచాపూర్ మదిర గ్రామాలైన సీతారాంపల్లి, శంకర్‌నగర్, బక్రిచెప్యాల, చిన్నకోడూరు మండలం చంద్లాపూర్, రామునిపట్ల, నంగునూరు మండలం ఓబులాపూర్, నాగరాజుపల్లి గ్రామాల్లో వైరల్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. చింతమడకలో కూడా వైరల్ ఫీవర్ ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. ఓబులాపూర్‌లో డీప్తిరియాతో నక్కల నిర్మల (35) ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. పడకేసిన పారిశుద్ధ్యం.. పంచాయితీ కార్మికుల సమ్మెతో వీధులు, మోరీలు చెత్తతో నిండిపోయాయి. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారుతోంది. తీరా పరిస్థితి విషమించాక అధికారులు పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. ఆయా గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. పారిశుద్ధ్యం లోపించడం వ ల్లే దోమలు వృద్ది చెంది మలేరియా, ఫైలేరియా, మెదడు వాపు, డెంగీ, చికున్ గున్యా లాంటి వ్యాధులు ప్రబలుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా సిద్దిపేట మండలంలోని సీతారాంపల్లి, శంకర్‌నగర్ గ్రామాల్లో మరుగుదొడ్లు ఉన్నా.. వాడకంలోలేవు. వాడుకోవాలని ప్రచారం చేస్తున్నప్పటికీ అధికారుల పర్యవేక్షణ లోపంతో మూలానపడుతున్నాయి. భయమేసింది... మొదట తలనొప్పి రావడంతో సిద్దిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నాను. నొప్పితో పాటు జ్వరం రావడంతో వైద్యులు రక్త పరీక్షలు నిర్వహించారు. అయినా జ్వరం తగ్గలేదు. దీంతో హైదరాబాద్‌లో ఐదు రోజుల పాటు చికిత్స చేయించుకున్నాను. కొంచెం జ్వరం తగ్గడంతో ఇంటికి వచ్చాను. మళ్లీ జ్వరం రావడంతో ప్రభుత్వ వైద్యులు గ్రామంలో క్యాంపు నిర్వహించి రక్త నమూనాలను సేకరించారు. అందులో డెంగీ ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. - పడిగె చిన్న నారాయణ, వ్యాధిగ్రస్తుడు శంకర్‌నగర్ ప్రజలకు అవగాహన కల్పించాలి... గ్రామానికి చెందిన నక్కల నిర్మల డిప్తీరియాతో మరణించింది. దీంతో ప్రజలు భయపడుతున్నారు. గ్రామంలో మూడు రోజులుగా వైద్య సిబ్బంది క్యాంపు ఏర్పాటు చేసి చికిత్స చేస్తున్నారు. పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. - సందబోయిన వెంకటేశం, సర్పంచ్ ఓబులాపూర్ ఆందోళన చెందవద్దు టైగర్ మస్కిటో కుట్టడంతోనే డెంగీ వ్యాధి సోకుతుంది. దీనికి మందులు లేవు. నివారణకు చర్యలు తీసుకోవాలి. జ్వరం సోకగానే వెంటనే వైద్యుల సలహా సూచనలు తీసుకోవాలి. ఇంటి పరిసరాలు, వ్యక్తిగత పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఐదేళ్లలోపు పిల్లలకు, 60 ఏళ్లు పైబడిన వారికి, గర్భిణులకు సోకే ప్రమాదం ఉంది. ఇంట్లో దోమల నివారణకు తెరలు ఉపయోగించుకోవాలి. సిద్దిపేట నియోజకవర్గంలోని ఏడు గ్రామాల్లో డెంగీ లక్షణాలు బయటపడ్డాయి. అన్ని గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాం. - శివానందం, క్లస్టర్ వైద్యాధికారి సిద్దిపేట -
3 రోజులే గడువు!
సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులకు ముగియనున్న వ్యవధి చేవెళ్ల రూరల్: సంక్షేమ పథకాలకోసం దరఖాస్తులు చేసుకునేందుకు ఈనెల 15 చివరి తేదీ కావడంతో గ్రామ పంచాయతీలు జనంతో జాతరను తలపిస్తున్నాయి. సెలవు రోజైన ఆదివారం కూడా కార్యదర్శులు, వీఆర్ఓలు, పంచాయతీ సిబ్బంది ప్రజలనుంచి దరఖాస్తులు స్వీకరించారు. రేషన్, పింఛన్ల కోసం కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలని, అందుకు 15 తేదీనే చివరి గడువని చెప్పడంతో జనం ఉరుకులు పరుగుల మీద అర్జీలు పెట్టుకుంటున్నారు. ఒక్కసారిగా వెల్లువలా దరఖాస్తులు వస్తుండడంతో వాటిని స్వీకరించేందుకు సిబ్బంది సైతం ఇబ్బంది పడుతున్నారు. దరఖాస్తుదారులు సరైన వివరాలు ఇవ్వకపోవడం, ఆధార్, ఇతర ధ్రువీకరణ పత్రాలు వాటికి అనుసంధానం చేయకపోవడంతో మళ్లీ వారికి చెప్పి తెప్పిస్తున్నారు.