
3 రోజులే గడువు!
సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులకు ముగియనున్న వ్యవధి
చేవెళ్ల రూరల్: సంక్షేమ పథకాలకోసం దరఖాస్తులు చేసుకునేందుకు ఈనెల 15 చివరి తేదీ కావడంతో గ్రామ పంచాయతీలు జనంతో జాతరను తలపిస్తున్నాయి. సెలవు రోజైన ఆదివారం కూడా కార్యదర్శులు, వీఆర్‌ఓలు, పంచాయతీ సిబ్బంది ప్రజలనుంచి దరఖాస్తులు స్వీకరించారు. రేషన్, పింఛన్ల కోసం కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలని, అందుకు 15 తేదీనే చివరి గడువని చెప్పడంతో జనం ఉరుకులు పరుగుల మీద అర్జీలు పెట్టుకుంటున్నారు.
ఒక్కసారిగా వెల్లువలా దరఖాస్తులు వస్తుండడంతో వాటిని స్వీకరించేందుకు సిబ్బంది సైతం ఇబ్బంది పడుతున్నారు. దరఖాస్తుదారులు సరైన వివరాలు ఇవ్వకపోవడం, ఆధార్, ఇతర ధ్రువీకరణ పత్రాలు వాటికి అనుసంధానం చేయకపోవడంతో మళ్లీ వారికి చెప్పి తెప్పిస్తున్నారు.