అధికారులు.. ప్రజలకు.. దడఖాస్తులు!
* ఇప్పటికి అందిన మొత్తం అర్జీలు: 11.24 లక్షలు
* ఆహార భద్రత : 7.65 లక్షలు
* సామాజిక పింఛన్లు : 2.59 లక్షలు
* కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ : 0.99 లక్షలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలో వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు 16లక్షల మంది లబ్ధిపొందుతున్నారు. ఇందులో 10.7లక్షల మంది రేషన్ కార్డుదారులు, 2.6లక్షల మంది పింఛన్‌దారులు, 2లక్షల మంది ఉపకారవేతనాలు, ఫీజు రాయితీ పొందుతున్నారు. తాజాగా సర్కారు తలపెట్టిన దరఖాస్తు ప్రక్రియలో వీరంత నమోదు చేసుకోవాల్సి ఉంది. అంతేకాకుండా కొత్తగా సంక్షేమాన్ని పొందగోరేవారు కూడా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నేపథ్యంలో బుధవారం నాటికి 11.24లక్షల దరఖాస్తులందాయి.
దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 20 వరకు గడువుంది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా దరఖాస్తుల సంఖ్య 20లక్షలకుపైగా చేరే అవకాశం లేకపోలేదని అధికారయంత్రాంగం అంచనా వేస్తోంది. ఇటీవల నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో జిల్లా జనాభా దాదాపు 63 లక్షలకు చేరడం.. కుటుంబాల సంఖ్య 16 లక్షలు నమోదు కావడంతో దరఖాస్తులు కూడా అదేస్థాయిలో రావచ్చని భావిస్తోంది.
కేంద్రాల సంఖ్య పెంపు..
* ప్రస్తుతం గ్రామ, మండల కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే దరఖాస్తులు స్వీకరించే కేంద్రాల సంఖ్య తక్కువగా ఉంది.
* దీంతో కేంద్రాల వద్ద వందల మంది గంటల తరబడి బారులు తీరాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో అదనంగా కేంద్రాలు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఇందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో దరఖాస్తుదారులు ఇబ్బందులు పడకుండా పలుచోట్ల కొత్తగా కేంద్రాలు ఏర్పాటుచేసి స్థానికంగా విస్తృత ప్రచారం చేస్తోంది. గ్రేటర్ పరిధిలో 30 కౌంటర్లు ఏర్పాటు చేయడమేకాకుండా 650 చౌకధరల దుకాణాల్లోనూ దరఖాస్తులు స్వీకరించే వెసులుబాటు కల్పించింది.
కంగారు వద్దు.. పరిశీలన రోజూ ఇవ్వొచ్చు
కలెక్టర్ శ్రీధర్
అనివార్య కారణాల వల్ల గడువులోపు దరఖాస్తులు సమర్పించకపోయినా.. పరిశీలన రోజు నేరుగా అధికారుల కు అందజేసే వెసులుబాటు కల్పిస్తున్నట్లు కలెక్టర్ ఎన్.శ్రీధర్ స్పష్టం చేశారు. నిర్ణీత వ్యవధిలోపు దరఖాస్తులు ఇవ్వాలనే ఆత్రుతతో కేంద్రాల వద్ద దరఖాస్తుదారులు బారులు తీరడాన్ని దృష్టిలో ఉంచుకొని అదనంగా మరిన్ని కేంద్రాలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ‘వైకల్య నిర్ధారణ పరీక్షలకు వికలాంగులు సదరమ్ శిబిరాలకు రావాల్సిన అవసరంలేదు. ఐకేపీ ద్వారా వారికి స్లిప్పులు పంపిణీ చేస్తాం. నిర్ధేశిత రోజులో సదరమ్ శిబిరాలకు వస్తే సరిపోతుంది’ అని కలెక్టర్ పేర్కొన్నారు.
వికలాంగుల పింఛన్ల లబ్ధిదారులు ప్రత్యేకంగా ఇప్పుడు వైకల్య నిర్ధారణ పత్రాలు సమర్పించాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ 21వ తేదీ నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. ముందుగా కేటగిరీల వారీగా దరఖాస్తులను విభజిస్తామని తెలిపారు. దరఖాస్తుతోపాటు సమగ్ర కుటుంబ సర్వే వివరాల పత్రాన్ని కూడా జతపరిచి క్షేత్రస్థాయి పరిశీలనాధికారులకు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ముందుగా ప్రకటించే షెడ్యూల్ ప్రకారం స్థానిక వీఆర్‌ఓ, వీఆర్‌ఏ, గ్రామ కార్యదర్శి సహకారంతో దరఖాస్తులను పరిశీలించనున్నట్లు కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు.