తిరుగుడే తిరుగుడు
⇒పన్నుల వసూలుకు మిస్తున్న పంచాయతీ సిబ్బంది
⇒ఈనెల 30 వరకు గడువు పెంచడంతో కలెక్షన్‌కు చర్యలు
⇒మిగిలిన రూ.3.19 కోట్ల వసూలుకు ప్రత్యేక ప్రణాళిక
⇒వంద శాతం లక్ష్యంగా అధికారుల కృషి
వరంగల్ రూరల్: ఆర్థిక సంవత్సరం గతనెల 31వ తేదీతో ముగిసింది. అయినప్పటికీ జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో వసూలు కావాల్సిన పన్నులు ఇంకా మిగిలిపోయాయి. ఇదే పరిస్థితి రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఉండడంతో ప్రభుత్వం పన్నుల వసూళ్లకు ఈనెల 30వ తేదీ వరకు గడువు పొడిగించింది. ఇందులో భాగంగా జిల్లాలో మిగిలిపోయిన రూ.3.19 కోట్ల వసూలుకు అధికా రులు కృషి చేస్తు న్నారు. ప్రభుత్వం ఇచ్చిన గడువును సద్వినియోగం చేసుకోవాలన్న భావనతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని జిల్లా పంచాయతీ అధికారి నుంచి కారోబార్ వరకు పన్నుల వసూళ్లలో నిమగ్నమయ్యారు.
72.55 శాతం వసూళ్లు..
జిల్లాలోని 15 మండలాల్లో 269 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఆయా జీపీల్లో కలిపి గత ఆర్థిక సంవత్సరం (2016–17) రూ.11,64,00,173 మేరకు ఆస్తి, నీటి పన్నులు వసూలు చేయాల్సి ఉంది. అయితే గడువు ముగిసిన మార్చి 31వ తేదీ వరకు రూ.8,44,47,385(72.55శాతం) పన్నులే వసూలయ్యాయి. అంటే ఇంకా రూ.3.19 కోట్ల వరకు వసూలు చేయాల్సి ఉంది. కానీ ఆర్థిక సంవత్సరం ముగియడంతో ఆ నగదు బకాయిగా పేరుకుపోతుందని భావించారు. అయితే, ఈ పరిస్థితి చాలా జిల్లాల్లో ఉండడంతో ఈనెల 30వ తేదీ వరకు పన్నుల వసూళ్లకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు బకాయిలు వంద శాతం పూర్తి చేయాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నామని జిల్లా పంచాయతీ అధికారి పిండి కుమారస్వామి ‘సాక్షి’కి తెలిపారు.
నోట్లు రద్దుతోనే..
కొత్తగా ఏర్పడిన వరంగల్ రూరల్ జిల్లా పూర్తిగా గ్రామీణ ప్రాంతం. దీంతో ఆస్తి, నీటి పన్నుల వసూళ్లలో ఉద్యోగులకు ఇబ్బం దులు ఎదురయ్యేవి. కానీ గత ఆర్థిక సంవత్సరం మధ్యలో కేంద్ర ప్రభుత్వం రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసింది. దీంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం రద్దయిన నోట్లతో పన్నులు చెల్లించవచ్చని ప్రకటించింది. ఈ మేరకు జిల్లాలో రూ.11.64 కోట్ల వరకు ఉన్న పన్నుల్లో రూ. 8.44 కోట్ల వరకు వసూలయ్యాయి. అంటే నోట్ల రద్దు అంశం పన్నులు భారీగా వసూలయ్యేందుకు ఉపకరించిందని చెప్పొచ్చు.
అందరి సహకారంతో ముందుకు..
జిల్లాలో ఆస్తి, నీటి పన్నులు రూ.3 కోట్లకు పైగా వసూలు కావాల్సి ఉంది. మార్చి 31వ తేదీ వరకు వసూలైన పన్నులు లెక్కిస్తే ఈ బాకీ తేలింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 30వ తేదీ వరకు పన్నుల స్వీకరణకు అవకాశం కల్పించగా అప్పటి నుంచి గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ పన్నులు వసూలు చేస్తున్నాం. అన్ని గ్రామపంచాయతీల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ఈఓ పీఆర్‌డీల సహకారం తీసుకుంటూ కార్యదర్శులు పన్నులు వసూళ్లలో నిమగ్నమయ్యారు. ఏది ఏమైనా ప్రభుత్వం ఇచ్చిన గడువు సద్వినియోగం చేసుకుని వంద శాతం పన్నులు వసూలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.