పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న సిబ్బంది
నక్కపల్లి(పాయకరావుపేట): పంచాయతీ సిబ్బంది ఆకలితో అలమటిస్తున్నారు. నాలుగు నెలలుగా జీతాలకు నోచుకోక పస్తులతోనే విధులకు హాజరయ్యే దుస్థితి. పంచాయతీల్లో నిధులున్నప్పటికీ వాటి వినియోగంపై ప్రభుత్వం ఆంక్షలతో ఈ పరిస్థితి నెలకొంది. గతంలో సంక్రాంతి, ఉగాది పండుగలప్పుడూ వీరికి జీతాలు చెల్లించకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. జిల్లా వ్యాప్తంగా 37 మేజర్‌పంచాయతీలు, 888 మైనర్ పంచాయతీలు ఉన్నాయి. వీటిని 558 పంచాయతీ క్లస్టర్లుగా విభజించారు. వీటిలో కార్యనిర్వాహణాధికారులు, బిల్‌కలెక్టర్లు, అటెండర్లు, గుమస్తాలు, పారిశుద్ధ్యకార్మికులు, పార్ట్‌టైం అసిస్టెంట్లు మొత్తంగా సుమారు 4వేలమందికి పనిచేస్తున్నారు. వీరికి జీతాలు పంచాయతీ సాధారణ నిధుల నుంచి చెల్లిస్తుంటారు. చాలా పంచాయతీల్లో పారిశుద్ధ్య సిబ్బందిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించి గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. రక్షిత మంచినీటి పథకాల నిర్వాహణను స్విచ్‌బోర్డు ఆపరేటర్లతో చేయిస్తుంటారు. ఏడాదికి కొంత బడ్జెట్ కేటాయించి, దాని పరిధికి లోబడి పారిశుద్ధ్య సిబ్బంది, పార్ట్‌టైం అసిస్టెంట్లకు వేతనం చెల్లించాల్సి ఉంటుంది. రెగ్యులర్ ఉద్యోగులైన కార్యనిర్వాహణాధికారులు, బిల్‌కలెక్టర్లు, అటెండర్లు, గుమస్తాలకు కూడా పంచాయతీ నిధుల నుంచే జీతాలు చెల్లిస్తుంటారు. ఇంటి పన్నులు వసూళ్లు, సెస్సులు, డైలీమార్కెట్లు, షాపింగ్‌కాంప్లెక్స్‌లు పంచాయతీకి వచ్చే ఆదాయ వనరులు. ప్రత్యేక గ్రాంట్లు ద్వారా సమకూరే ఆదాయం నుంచి ఏటా 15నుంచి 35 శాతం సిబ్బంది జీతాలకు ఖర్చు చేస్తుంటారు. పంచాయతీలకు ఈ ఆదాయం యథావిధిగానే సమకూరుతుంది. ఇంటి పన్నుల వసూళ్లు కూడా సక్రమంగానే జరుగుతున్నాయి.
సెస్సుల రూపంలో వచ్చే ఆదాయం బాగానే వస్తోంది. ఐనప్పటికీ సిబ్బందికి జీతాలు చెల్లించే విషయంలో స్థానిక సంస్థలపై ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తోంది. వీరి జీతాలను సబ్‌ట్రెజరీల ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెలా పంచాయతీ పాలకవర్గాలు జమాఖర్చులను ఆమోదించి సిబ్బందికి చెల్లించాల్సిన జీతాలను బిల్లు పెట్టి ట్రెజరీకి పంపిస్తుంటారు.అక్కడ కొర్రి వేయడం వల్ల జీతాలు చెల్లించని పరిస్థితి నెలకొంది. రాష్ట్రప్రభుత్వం దుబారాఖర్చులు చేపడుతూ నిధుల వినియోగం పై ఆప్రకటిత ఆంక్షలు (ఫ్రీజింగ్) విధించడం వల్ల పంచాయతీల్లో పనిచేసే సిబ్బందికి జీతాలు చెల్లించని దుస్థితి. ఒక్క సిబ్బంది జీతాలే కాకుండా పంచాయతీలో వీధి దీపాలు, రక్షితమంచినీటి పథకాల నిర్వాహణ, చిన్నచిన్న మరమ్మతు పనుల కోసం కూడా నిధులు డ్రాచేసే అవకాశం లేదని సిబ్బంది పేర్కొంటున్నారు. ఉదాహరణకు పాయకరావుపేట మేజర్ పంచాయతీలో 64 మంది పనిచేస్తున్నారు. వీరికి నాలుగు నెలల నుంచి జీతాలు చెల్లించలేదు.
సుమారు రూ.7.84 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఏళ్ల తరబడి పంచాయతీల్లో పనిచేస్తున్నాం కాబట్టి సకాలంలో జీతాలు చెల్లించక పోయినా వేరే గత్యంతరం లేక పస్తులుంటూనే విధులు నిర్వర్తించాల్సి వస్తున్నదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటి రెండు నెలలయితే ఫర్వాలేదు.ఏకంగా నాలుగు నెలల నుంచి జీతాలు చెల్లించకపోతే ఎలా బతకాలంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బంది కోరుతున్నారు. ఈవిషయాన్ని డీపీవో కృష్ణకుమారి వద్ద ప్రస్తావించేందుకు ప్రయత్నించగా ఆమె అమరావతిలో కమిషనర్ సమావేశానికి హాజరు కావడంతో అందుబాటులో లేరు. పాయకరావుపేట పంచాయతీ ఈవో లవరాజు వద్ద జీతాల బకాయిలు విషయం ప్రస్తావించగా పంచాయతీలో సుమారు 64 మంది సిబ్బంది పనిచేస్తున్నారని నాలుగు నెలల నుంచి జీతాలు చెల్లించలేదని తెలిపారు. దాదాపు 7.80 లక్షలు బకాయి ఉందన్నారు. ట్రెజరీ ఆంక్షలు కారణంగా చెల్లించలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment