డెంగీ పంజా! | Dengue paw! | Sakshi
Sakshi News home page

డెంగీ పంజా!

Published Fri, Aug 7 2015 11:27 PM | Last Updated on Sun, Sep 3 2017 6:59 AM

Dengue paw!

పల్లెలు మంచం పట్టాయి.. జ్వరాలతో వణుకుతున్నాయి.. అసలే వర్షాకాలం.. ఆపై వైరల్ ఫీవర్, డెంగీ స్వైరవిహారం చేస్తున్నాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల పంచాయతీ కార్మికుల నిరవధిక సమ్మెతో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాల్లో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు.
 
 సిద్దిపేట రూరల్ : సిద్దిపేట మండలం శంకర్‌నగర్, సీతారాంపల్లి గ్రామాల్లో ఇటీవల కొందరు జ్వరాల బారిన పడడంతో వైద్యాధికారులు క్యాంపు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో 13 మంది నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. 13 మందిలో తొమ్మిది మందికి డెంగీ పాజిటివ్, నలుగురికి వైరల్ ఫీవర్ ఉన్నట్లు తేలింది. ఇందులో సీతారాంపల్లికి చెందిన పడిగె రాజయ్య, జీర్కపల్లి నగేష్, శంకర్‌నగర్‌కు చెందిన పడిగె సత్తయ్య, పడిగె గణేష్, పడిగె బాలయ్య, పిట్ల దివ్య, రెడ్డి దివ్యతో పాటు అనిల్‌కుమార్‌లకు డెంగీ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా సుమారు పక్షం రోజుల నుంచి సీతారాంపల్లి, శంకర్‌నగర్‌లో ఇంటికి ఇద్దరు వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. ఇదిలా ఉండగా.. జ్వరాలు నమోదు అవుతున్న గ్రామాల్లో వైద్య సిబ్బంది శిబిరాలు నిర్వహిస్తూ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేశారు.  

 వైరల్ గ్రామాలు...
 నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పలువురు విషజ్వరాల బారిన పడినట్లు వైద్యులు గుర్తించారు. సిద్దిపేట మండలం మాచాపూర్ మదిర గ్రామాలైన సీతారాంపల్లి, శంకర్‌నగర్, బక్రిచెప్యాల, చిన్నకోడూరు మండలం చంద్లాపూర్, రామునిపట్ల, నంగునూరు మండలం ఓబులాపూర్, నాగరాజుపల్లి గ్రామాల్లో వైరల్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. చింతమడకలో కూడా వైరల్ ఫీవర్ ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. ఓబులాపూర్‌లో డీప్తిరియాతో నక్కల నిర్మల (35) ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే.

 పడకేసిన పారిశుద్ధ్యం..
 పంచాయితీ కార్మికుల సమ్మెతో వీధులు, మోరీలు చెత్తతో నిండిపోయాయి. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారుతోంది. తీరా పరిస్థితి విషమించాక అధికారులు పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. ఆయా గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. పారిశుద్ధ్యం లోపించడం వ ల్లే దోమలు వృద్ది చెంది మలేరియా, ఫైలేరియా, మెదడు వాపు, డెంగీ, చికున్ గున్యా లాంటి వ్యాధులు ప్రబలుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా సిద్దిపేట మండలంలోని సీతారాంపల్లి, శంకర్‌నగర్ గ్రామాల్లో మరుగుదొడ్లు ఉన్నా.. వాడకంలోలేవు. వాడుకోవాలని ప్రచారం చేస్తున్నప్పటికీ అధికారుల పర్యవేక్షణ లోపంతో మూలానపడుతున్నాయి.
 
 భయమేసింది...
 మొదట తలనొప్పి రావడంతో సిద్దిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నాను. నొప్పితో పాటు జ్వరం రావడంతో వైద్యులు రక్త పరీక్షలు నిర్వహించారు. అయినా జ్వరం తగ్గలేదు. దీంతో హైదరాబాద్‌లో ఐదు రోజుల పాటు చికిత్స చేయించుకున్నాను. కొంచెం జ్వరం తగ్గడంతో ఇంటికి వచ్చాను. మళ్లీ జ్వరం రావడంతో ప్రభుత్వ వైద్యులు గ్రామంలో క్యాంపు నిర్వహించి రక్త నమూనాలను సేకరించారు. అందులో డెంగీ ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు.             
- పడిగె చిన్న నారాయణ, వ్యాధిగ్రస్తుడు శంకర్‌నగర్
 
 ప్రజలకు అవగాహన కల్పించాలి...
 గ్రామానికి చెందిన నక్కల నిర్మల డిప్తీరియాతో మరణించింది. దీంతో ప్రజలు భయపడుతున్నారు. గ్రామంలో మూడు రోజులుగా వైద్య సిబ్బంది క్యాంపు ఏర్పాటు చేసి చికిత్స చేస్తున్నారు. పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు.
 - సందబోయిన వెంకటేశం, సర్పంచ్ ఓబులాపూర్
 
 ఆందోళన చెందవద్దు
 టైగర్ మస్కిటో కుట్టడంతోనే డెంగీ వ్యాధి సోకుతుంది. దీనికి మందులు లేవు. నివారణకు చర్యలు తీసుకోవాలి. జ్వరం సోకగానే వెంటనే వైద్యుల సలహా సూచనలు తీసుకోవాలి. ఇంటి పరిసరాలు, వ్యక్తిగత పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఐదేళ్లలోపు పిల్లలకు, 60 ఏళ్లు పైబడిన వారికి, గర్భిణులకు సోకే ప్రమాదం ఉంది. ఇంట్లో దోమల నివారణకు తెరలు ఉపయోగించుకోవాలి. సిద్దిపేట నియోజకవర్గంలోని ఏడు గ్రామాల్లో డెంగీ లక్షణాలు బయటపడ్డాయి. అన్ని గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాం.
 - శివానందం, క్లస్టర్ వైద్యాధికారి సిద్దిపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement