Dengue disease
-
డెంగీకి రెండేళ్లలో టీకా!
సాక్షి, హైదరాబాద్: సీజన్ మారిందంటే ప్రజలను బెంబేలెత్తించే డెంగీ వ్యాధికి చెక్ పడే అవకాశం కన్పిస్తోంది. భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), పాన్ ఆసియా బయోటెక్ కంపెనీలు కలిసికట్టుగా తయారు చేస్తున్న టీకా ‘డెంగీఆల్’ కీలకమైన మూడో దశ ప్రయోగాలకు సిద్ధమైంది. ఈ దశలోనూ ఆశించిన ఫలితాలు వస్తే టీకా అందుబాటులోకి రావడమే తరువాయి అవుతుంది. ఈ టీకా తయారీ ప్రక్రియ యావత్తూ దేశీయంగానే జరిగిందని, డెంగీపై పోరాటంలో టీకా అభివృద్ధి కీలక మలుపు అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం: నడ్డాఏదైనా వ్యాధి నివారణకు అభివృద్ధి చేసే టీకా మూడు దశల ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే పాన్ ఆసియా బయోటెక్ డెంగీఆల్పై ఇప్పటివరకు రెండు దశల ప్రయోగాలను పూర్తి చేసింది. తాజాగా బుధవారం హరియాణాలోని రోహతక్‌లో ఉన్న పండిట్ భగవత్ దయాళ్ శర్మ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో మూడో దశ ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ.. డెంగీఆల్ మూడో దశకు చేరుకోవడం ప్రజారోగ్య సంరక్షణపై ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీల సాయంతో ఈ టీకాను అభివృద్ధి చేయడం ఆరోగ్య రంగంలో ఆత్మ నిర్భర్ భారత్‌కు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.కోవిడ్‌కు ముందే రెండు దశలు పూర్తిడెంగీ వ్యాధికి ప్రస్తుతం ఎలాటి టీకా లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో కనీసం నాలుగు రకాల డెంగీ వైరస్‌లను నియంత్రించే లక్ష్యంతో టీకా తయారీ ప్రయత్నాలు మొదలయ్యాయి. అమెరికా లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అభివృద్ధి చేసిన ఒక టెట్రా వేలంట్ టీకా ప్రపంచ వ్యాప్తంగా ప్రీ క్లినికల్, క్లినికల్ ట్రయల్స్‌లో ప్రభావశీలంగా కనిపించింది.అయితే దేశంలోని పాన్ ఆసియా బయోటెక్‌కు కూడా ఇది అందుబాటులోకి రావడంతో ఆ కంపెనీ ఐసీఎంఆర్‌తో కలిసి ప్రయోగాలు మొదలుపెట్టింది. తొలి, మలి దశ ప్రయోగాలు కోవిడ్‌కు ముందు 2018 – 19లోనే పూర్తి చేసింది. మూడో దశ ప్రయోగాల కోసం 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 19 కేంద్రాలను ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా 10,335 మందిపై జరిగే మూడో దశ ప్రయోగాల్లో భాగంగా టీకాలు తీసుకున్న వారిని రెండేళ్ల పాటు పరిశీలించనున్నారు. -
రాష్ట్రంపై డెంగీ పంజా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై డెంగీ పంజా విసురుతోందని.. ఈ ఏడాది ఇప్పటివరకు 583 డెంగీ కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ పేర్కొంది. అందులోని ఇటీవలి మే, జూన్ నెలల్లోనే అధికంగా కేసులు నమోదయ్యాయని నివేదికలో వెల్లడించింది. సాధారణంగా వానాకాలం సీజన్ మొదలయ్యాక డెంగీ, ఇతర విష జ్వరాలు వ్యాపిస్తుంటాయి. కానీ ఈసారి వానాకాలం సీజన్ ప్రారంభం కాకముందే మే నెలలోనే డెంగీ కేసులు నమోదవడం ఆందోళనకరంగా మారింది. అత్యధికంగా హైదరాబాద్‌లో 218 డెంగీ కేసులురాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 44, మేడ్చల్ మల్కాజిగిరి, వరంగల్ జిల్లాల్లో 38 చొప్పున కేసులు నమోదయ్యాయి. వానలు మొదలైన నేపథ్యంలో డెంగీ కేసులు పెరిగే అవకాశం ఉంటుందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఆ పది జిల్లాల్లో రిస్క్ రాష్ట్రంలో డెంగీ హైరిస్క్ జిల్లాలను ప్రజారోగ్య కార్యాలయం గుర్తించింది. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, మేడ్చల్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సంగారెడ్డి, పెద్దపల్లి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో డెంగీ కేసులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో గతేడాది నమోదైన డెంగీ కేసుల్లో ఈ జిల్లాల్లోనే 80 శాతం వరకు నమోదైనట్టు పేర్కొంది. ఇక ఈ ఏడాది ఇప్పటివరకు 121 మలేరియా కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, కొమురంభీం ఆసిఫాబాద్, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలను హైరిస్క్ జిల్లాలుగా వైద్యారోగ్యశాఖ గుర్తించింది. గతేడాది రాష్ట్రంలో నమోదైన మలేరియా కేసుల్లో ఈ ఏడు జిల్లాల్లోనే 91.5 శాతం కేసులు వచ్చాయని పేర్కొంది. అధికారులతో మంత్రి సమీక్ష వానాకాలం మొదలైన నేపథ్యంలో డెంగీ, మలేరియా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది. వర్షాకాలం నేపథ్యంలో వ్యాధుల నియంత్రణపై ప్రత్యేకంగా అన్ని జిల్లాల డీఎంహెచ్వోలతో మంత్రి హరీశ్‌రావు తాజాగా సమీక్ష నిర్వహించారు. కలుషిత నీటి ద్వారా వచ్చే వ్యాధులు మిషన్ భగీరథతో తగ్గిపోయాయని.. కానీ కీటకాలతో వ్యాపించే వ్యాధుల నియంత్రణపై ప్రధానంగా దృష్టి పెట్టాలని అన్ని జిల్లాల వైద్యాధికారులను ఆదేశించారు. మలేరియాను గుర్తించే 8 లక్షల ర్యాపిడ్ కిట్లను, డెంగీని గుర్తించే 1.23 లక్షల ఎలిజా కిట్లను ఇప్పటికే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపామని తెలిపారు. -
‘డెంగీ’ఉంది..‘జ్వర’భద్రం
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం సీజనల్ వ్యాధుల పెరుగుదలతో పాటు డెంగీ వ్యాప్తి అత్యధికంగా ఉన్నందున జ్వరం వస్తే వెంటనే పరీక్షలు చేయించుకుని అది డెంగీనా లేక కరోనా అన్నది నిర్ధారించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో డెంగీ కేసులు పెరుగుతున్నాయని, అయితే ఇదే సమయంలోనూ కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు. ప్రధానంగా డెంగీ, కరోనాలకు సంబంధించిన లక్షణాలు దాదాపుగా ఒకే విధంగా ఉన్నందున కచ్చితమైన నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, వేడుకలు అంటూ విపరీతంగా తిరిగేస్తున్నారని, ఇప్పుడు నమోదవుతున్న కేసుల్లోనూ ఇలా ఏదైనా సమూహంలో గడిపి వచ్చిన వారిలోనే ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులుంటున్నాయని స్పష్టం చేస్తున్నారు. కుటుంబంలోని ఒకరికి వస్తే సహజంగానే అందరూ దాని బారిన పడుతున్నట్టుగా చెబుతున్నారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, వైరల్ జ్వరాలు పెరుగుతున్నందున వాటి లక్షణాలు, కరోనా నేపథ్యంలో ఎలాంటి పరీక్షలు చేయించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’తో పల్మనాలజిస్ట్ డా.వి.వి.రమణప్రసాద్, కన్సల్టెంట్ ఫిజీషియన్ డా.ప్రభుకుమార్ చల్లగాలి తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ముఖ్యాంశాలు వారి మాటల్లోనే... డెంగీ వచ్చిన వారిలో కూడా కరోనా పాజిటివ్ లక్షణాల మాదిరే దగ్గు, జ్వరం, గొంతునొప్పి ఉంటున్నాయి. వీరి పరీక్షల్లో తెల్ల రక్తకణాలు, ప్లేట్లెట్ల సంఖ్య తక్కువగా ఉండటంతో పాటు డెంగీ పాజిటివ్‌గా ఉంటోంది. సీజనల్ ఫ్లూ, వైరల్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించి డెంగీ ఇతర సీజనల్ వ్యాధులను నిర్ధారించుకోవాల్సి ఉంది. ముందుగా కరోనా ఉందా లేదా అన్నది తెలుసుకోవాలి. డెంగీ లక్షణాలు ఉండి, ఆర్టీపీసీఆర్లో కరోనా నెగెటివ్ వచ్చినా ఐదురోజుల తర్వాత దగ్గు, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలుంటే సీటీ స్కాన్‌తో నిర్ధారించాల్సి వస్తోంది. డెంగీకి ర్యాపిడ్టెస్ట్ మాదిరి ఎన్సెస్ వన్ యాంటీజెన్, డెంగీ సీరోలజీ టెస్ట్‌లు చేసి నిర్ధారిస్తున్నాము. ప్రస్తుతం డెంగీ సీజన్ కావడంతో ఈ కేసులు పెద్ద సంఖ్యలోనే వస్తున్నాయి. ఆస్తమా, దీర్ఘకాలిక బ్రాంకైటిస్, గొంతునొప్పి, ఇతర వైరల్ లక్షణాలున్న సీజనల్ వ్యాధుల కేసులు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. మళ్లీ టీబీ కేసులు పెరుగుతున్నాయి. అందువల్ల వీటన్నింటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. డా.వి.వి.రమణప్రసాద్, పల్మనాలజిస్ట్, స్లీప్ డిజార్డర్స్ స్పెషలిస్ట్, కిమ్స్ ఆస్పత్రి ప్రతీరోజు వైరల్ జ్వరాలు, టైఫాయిడ్, మలేరియా, డెంగీకి సంబంధించి కేసులు నమోదవుతున్నాయి. వాటిలో కొన్ని కోవిడ్ కేసులుంటున్నాయి. గతానికి భిన్నంగా మలేరియా, టైఫాయిడ్, డెంగీ, కోవిడ్, ఊపిరితిత్తుల సమస్యలు, అన్నీ చలిజ్వరంతో వస్తున్నాయి. ఒళ్లు, కంటి నొప్పులు, ఎముకలు చిట్లేంత నొప్పులు, కీళ్లు, కండరాలు, కంటి వెనక నొప్పులు ఇలా రకరకాల నొప్పులతో జ్వరాలు వస్తుండటంతో వైద్యపరీక్షలతో నిర్ధారించుకోవాల్సి వస్తోంది. ఈ జ్వరాలతో రోగులకు విపరీతమైన బలహీనత, తట్టుకోలేని నొప్పులతోపాటు కడుపు ఉబ్బరం, అసౌకర్యంగా ఉండటం వంటి లక్షణాలు కన్పిస్తున్నాయి. వర్షాకాలంలో నీటిలో కాలుష్యం పెరగడం, దోమలు, ఈగలు పెరిగిపోవడం, ప్రధానంగా ఆహారం, మంచినీరు వంటివి కలుషితం కావడంతో జ్వరాల కేసులు పెరుగుతున్నాయి. డెంగీలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడంతోపాటు పొట్టలో రక్తస్రావం అయ్యి, కాళ్ల రక్తనాళాల రంగుమార్పు, నల్లటిరంగులో మలవిసర్జన వంటివి జరుగుతాయి. వీటిని బట్టి ఎక్కడో రక్తస్రావం అవుతుందని గ్రహించాలి. అవసరమైన డెంగీ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. ప్లేట్లెట్ల సంఖ్యను జాగ్రత్తగా గమనిస్తూ, చికిత్స తీసుకోవాలి. ప్రభుత్వాలు కూడా ప్రతీ జిల్లాలో ప్లేట్లెట్ల యూనిట్లను ప్రజలకు అందుబాటులో ఉంచేలా చూడాలి. – డా. ప్రభుకుమార్ చల్లగాలి, కన్సల్టెంట్ ఫిజిషియన్, వృందాశ్రీ జూబ్లీ క్లినిక్ సరైన సమయంలో చికిత్సతోనే... ఒకరోజు అకస్మాత్తుగా గొంతునొప్పితో కూడిన చలిజ్వరం వచ్చింది. మూడు రోజుల తర్వాత మా కుటుంబవైద్యుడి దగ్గరకు వెళ్లాను. వైరల్ జ్వరం అనే అనుమానంతో అన్ని వైద్యపరీక్షలు చేయించారు. డెంగీ జ్వరం నిర్ధారణ అయింది. ఇంట్లోనే ఉంటూ తగిన చికిత్స తీసుకున్నాను. రెండు మూడు రోజుల్లో పూర్తిగా తగ్గిపోయింది. ఐతే ఇంట్లో నలుగురు కుటుంబసభ్యులకు కూడా ఇవే లక్షణాలతో జ్వరం వచ్చింది. వారుకూడా ఫోన్లోనే వైద్యుడిని సంప్రదించి మందులు వాడారు. ఇప్పుడు అందరూ కోలుకున్నారు. –అప్పరాజు అనిల్ కృష్ణ, మణికొండ -
డెంగీ దోమల్లో వ్యాధి వ్యాప్తిని తగ్గించే ‘వోబాకియా’ బ్యాక్టీరియా!
ఈ సీజన్లో డెంగీ మన తెలుగు రాష్ట్రాల ప్రజల్ని ఎంతగా గడగడలాడించిందో తెలుసు కదా. ఇక్కడే కాదు... మనలాంటి వేడి వాతావరణం ఉండే ఎన్నో దేశాల్లో డెంగీ వేధిస్తోంది. డెంగీ వ్యాధిని అదుపు చేయడానికి ఒక మార్గాన్ని కనుకున్నారు మలేషియాలోని కౌలాలంపూర్ పరిశోధకులు. అక్కడి పరిశోధకులే కాదు... ఆస్ట్రేలియా, వియత్నాం వంటి దేశాలతో పాటు యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో, మెల్బోర్న్ వంటి విద్యాసంస్థల్లో జరిగిన పరిశోధనల కారణంగా మానవాళికి మేలు చేసే ఒక శుభవార్త లోకానికి తెలిసింది. పరిశోధనశాలల్లో ఉన్న డెంగీని వ్యాప్తి చేసే ఏడిస్ ఈజిపై్ట దోమల్లోకి ‘వొబాకియా (Wolbachia) అనే బ్యాక్టీరియాని ఇంజెక్ట్ చేసి వాటిని బయటి వాతావరణంలోకి విడుదల చేశారు. ఆ బ్యాక్టీరియాతో ఇన్ఫెక్ట్ అయిన తర్వాత అవే దోమల్లో ప్రత్యుత్పత్తి జరిగాక పుట్టిన తర్వాతి తరం దోమల్లో డెంగీని వ్యాప్తి చేసే శక్తి గణనీయంగా తగ్గిపోయినట్లుగా పరిశోధకులు గుర్తించారు. ఈ కారణంగానే ఆ మరుసటి ఏడాది అక్కడ 40 శాతం తక్కువగా డెంగీ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఉష్ణమండల (వాతావరణంలో వేడిమి 36 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న) ప్రాంతాల్లో డెంగీ వ్యాప్తి గణనీయంగా తగ్గడం గుర్తించిన పరిశోధకులు... ఈ పరిశోధన ఫలితాలు ‘కరంట్ బయాలజీ’ అనే జర్నల్‌లో నమోదయ్యాయి. ప్రస్తుతానికి ఈ వొబాకియా పరిశోధనలు డెంగీకి మాత్రమే పరిమితమయ్యాయి. ఇలాంటి హానిచేయని బ్యాక్టీరియాలను ఉపయోగించి మరిన్ని వ్యాధులను అదుపు చేసే విధంగా పరిశోధనలు సాగుతున్నాయి. -
‘ఆరోగ్యశ్రీ పరిధిలోకి డెంగీని తీసుకురావాలి’
సాక్షి, హైదరాబాద్: డెంగీ జ్వరాన్ని ఆరోగ్య శ్రీ పరిధిలోనికి తీసుకురావాలని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజానీకాన్ని డెంగీ పట్టిపీడిస్తోందని ఆవే దన వ్యక్తం చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా హాల్లో విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ స్పందించి డెంగీను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం ద్వారా పేదల ఆరోగ్యాన్ని, వారి ఖర్చును కాపాడాలని కోరారు. కేన్సర్ చికిత్సకు కూడా రూ.లక్షలు ఖర్చవుతోందని, కేన్సర్ రోగుల కోసం ధనిక భక్తుల సాయంతో చినజీయర్ స్వామి చికిత్స చేయించాలని కోరారు. ఇందుకోసం ఓ ట్రస్టు పెట్టి పేదలకు సేవ చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు, చినజీయర్ స్వామికి లేఖ రాయనున్నట్టు తెలిపారు. సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించిన ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని జగ్గారెడ్డి సీఎంను కోరారు. -
ఒకే ఇంట్లో ముగ్గురికి డెంగీ
కాజీపేట: ఒకే ఇంట్లో ముగ్గురు పిల్లలకు డెంగీ సోకిన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని సోమిడి ఎస్సీ కాలనీకి చెందిన మురికిపుడి వినయ్‌కుమార్ ఇద్దరు పిల్లలు, అతని తమ్ముడు విక్రం కుమార్ కుమారుడికి నాలుగు రోజుల కింద తీవ్ర జ్వరం రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఆ పిల్లలు డెంగీ వ్యాధితో బాధపడుతున్నట్లుగా ధృవీకరించారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయమై సోమిడి అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి అర్చనను వివరణ కోరగా.. ఒకే ఇంట్లో ముగ్గురికి జ్వరాలు వచ్చిన మాట వాస్తవమేనని, మెరుగైన చికిత్స అందించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. -
ఇన్ఫోసిస్‌లో జాబొచ్చింది కానీ అంతలోనే..
సాక్షి, మెదక్ రూరల్: డెంగీతో యువ ఇంజినీర్ మృతి చెందిన సంఘటన హవేళిఘనాపూర్ మండలం నాగాపూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన ఒంటరి నరేందర్‌రెడ్డి, మంజుల కుమార్తె భవ్య(21) నర్సాపూర్ బీవిఆర్‌ఐటీ కళాశాలలో ఇంజనీరింగ్ సీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. భవ్యకు ఐదు రోజులు క్రితం డెంగీ జ్వరం సోకడంతో అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబీకులు మెదక్ ఆసుపత్రిలో చికిత్స చేయించి మెరుగగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని రష్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో యశోద ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు తెలిపారు. ఎంతో ఖర్చుతో చికిత్స చేయించినప్పటికీ భవ్య మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. భవ్య ఇటీవల క్యాంపస్‌లో నిర్వహించిన సెలక్షన్లో ఇన్ఫోసిస్ ఉద్యోగానికి నియామకమై ఉద్యోగంలో చేరకముందే మృత్యువు ఒడికి చేరడంతో కుటుంబీకుల రోధనలు మిన్నంటాయి. శనివారం సాయంత్రం భవ్య అంత్యక్రియలు స్వగ్రామమైన నాగాపూర్‌లో నిర్వహించారు. -
బాలుడికి ముఖ్యమంత్రి ఆపన్నహస్తం
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్): డెంగీ వ్యాధితో బాధపడుతున్న నాలుగేళ్ల బాలుడు శశిధర్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసానిచ్చారు. విజయవాడ కస్తూరిభాయిపేటకు చెందిన ఎం.శశిధర్(4)కు కొన్ని రోజుల క్రితం జ్వరం రావడంతో తల్లిదండ్రులు హాస్పటల్లో చేర్పించగా అది డెంగీ అని, మెదడుకు వ్యాపించడంతో వెంటనే ఆపరేషన్ చేయించాలన్నారు. సుమారు రూ.3 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. కూలిపనులు చేసుకునే బాలుడి తల్లిదండ్రులు తమ కొడుకును బతికించుకునేందుకు డబ్బుల కోసం అన్ని ప్రయత్నాలు చేశారు. ఈ విషయంపై సోమవారం పలు పత్రికల్లో కథనాలు రావడంతో వీటిని చదివిన ముఖ్యమంత్రి స్పందించారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వెంటనే బాలుడికి సహాయం చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం కార్యాలయం నుంచి అధికారులు బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి శశిధర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందిస్తామని, వైద్యానికి సంబంధించిన అన్ని కాగితాలను తీసుకొని రావాలని సూచించారు. తమ బాలుడి పరిస్థితిని తెలుసుకొని ముఖ్యమంత్రి నేరుగా స్పందించడంపై తల్లిదండ్రులు, విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులంతా హర్షం వ్యక్తం చేశారు. -
సీఎస్, ఇతర ఐఏఎస్‌లపై హైకోర్టు గరంగరం
సాక్షి, హైదరాబాద్: ‘డెంగీ విజృంభణకు నిర్లక్ష్యం కారణమని తేలితే క్రిమినల్ చర్యగా పరిగణించాలా? నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణమైతే ఎవరిది బాధ్యత? మృతుల కుటుంబా లకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తే ప్రభుత్వం చెల్లిస్తుందని భావిస్తారేమో.. ఐఏఎస్ అధికారుల జేబుల నుంచే ఇవ్వాల్సి వస్తుంది. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున చెల్లించాలని ఆదేశాలివ్వగలం. ఐఏఎస్‌లకు శిక్షణ ప్రజల డబ్బుతోనే ఇస్తారు. వారు రోగాలతో బాధలు పడుతుంటే పట్టించుకోకపోతే ఎలా.. ఒక్కసారి మూసీ నది ఒడ్డుకు మీరు వెళితే ఎంత దారుణమైన పరిస్థితుల నడుమ జనం ఉన్నారో కనబడుతుంది.’ అని హైకోర్టు తీవ్ర స్వరంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శైలేంద్రకుమార్ జోషి, ఇతర ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. స్వైన్‌ఫ్లూ, డెంగీ, మలేరియా, వంటి విషజ్వరాలతో బాధపడేవాళ్లకు సర్కార్ వైద్యం అందేలా ఆదేశాలివ్వాలని వైద్యురాలు ఎం.కరుణ, న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారించింది. బుధవారం హైకోర్టు ఆదేశాల మేరకు విచారణకు సీఎస్‌తోపాటు ప్రజా ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ స్వయంగా హాజరయ్యారు. హైకోర్టుకు హాజరైన ఐఏఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ కమిటీకి సీఎస్ నేతృత్వం వహించాలని, ప్రతి శుక్రవారం కోర్టుకు వచ్చి ఏవిధమైన చర్యలు తీసుకున్నారో, నివారణ చర్యలు ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజేయాలని ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను నవంబర్ 1కి వాయిదా వేసింది. కోర్టు మెట్లు ఎక్కేవారు కాదు ‘ఉన్నతాధికారులు తమ విధుల్ని సక్రమంగా నిర్వర్తిస్తే కోర్టు మెట్లు ఎక్కరు. ఇక్కడున్న సీనియర్ ఐఏఎస్‌లు మూసీ నదికి వెళ్లి చూస్తే అది ఎంత పెద్ద దోమల ఉత్పత్తి కేంద్రంగా మారిందో చూడొచ్చు. హైకోర్టు పక్కనే ఉన్న మూసీ కలుషితం కావడం వల్ల దోమలు కోర్టులోని వాళ్లను కుడుతున్నాయి. రోజూ పత్రికల్లో ప్రతి పేజీలోనూ ప్రజల సమస్యలు, జనం రోగాల గురించి కథనాలు వస్తున్నాయి. మీరు పత్రికలు చడవడం లేదా లేక చదివినా స్పందించడం లేదా.. ప్రజల విశ్వాసాలు, నమ్మకాలను ప్రభుత్వం మీ చేతుల్లో పెట్టింది. సగటు జీవి సణుగుడు అర్థం చేసుకోండి’అని ఘాటుగా కోర్టు వ్యాఖ్యానించింది. వర్షాలు మొదలయ్యాక చర్యలా? కిక్కిరిసిన కోర్టు హాల్లో విచారణ ప్రారంభమైన వెంటనే సీఎస్ జోషి.. హైకోర్టు సూచనల్ని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని, 30 రోజులకు పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సారథ్యంలో కార్యాచరణ అమలు చేస్తున్నామని తెలిపారు. పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. 12,751 గ్రామాల్లో నిరంతరం వాటన్నింటినీ అమలు చేస్తున్నామని చెప్పారు. గడిచిన నెలలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయో, 30 రోజుల కార్యాచరణ ప్రణాళికను ఎప్పట్నుంచి అమలు చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నిస్తే.. సెప్టెంబర్ నెల మధ్యలో అమలు మొదలైందని సీఎస్ చెప్పారు. జూన్‌లో వర్షాలు మొదలైతే సెప్టెంబర్ నెల సగం అయ్యే వరకూ ఎందుకు ఆగుతున్నారని అడిగింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని సీఎస్ చెప్పిన జవాబు పట్ల హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ప్రజారోగ్యమే ప్రభుత్వ ప్రథమ విధి ప్రజారోగ్యానికి ఎన్నికల కోడ్‌కు సంబంధం ఏమిటని, రాజ్యాంగంలో ప్రజారోగ్యమే ప్రభుత్వ ప్రథమ విధి అని చెబుతోందని ధర్మాసనం గుర్తు చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. రేపు రంగారెడ్డి, హైదరాబాద్ లాంటి జిల్లాల్లో భూకంపం వంటి విపత్తు సంభవిస్తే ఇలాగే చెబుతారా అని నిలదీసింది. చిన్న దేశం శ్రీలంకలో డెంగీ, మలేరియాలను పూర్తిగా నిర్మూలించాలని 2016లో లక్ష్యంగా పెట్టుకుని ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచిందని, మనం కనీసం హైదరాబాద్ జంట నగరాల్లో ఆవిధంగా చెయ్యలేమా అని ప్రశ్నించింది. భోపాల్, ఉదయ్‌పూర్ వంటి నగరాలు పరిశుభ్రతకు చిరునామాగా ఉన్నాయని, ఉదయపూర్‌లో 8 సరస్సులున్నాయని, అక్కడ డెంగీ వంటి మాటే వినపడదని పేర్కొంది. చివరకు డెంగీతో ఒక జడ్జి కూడా చనిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. రూ.50 లక్షల చొప్పున చెల్లించాలని ఆదేశిస్తే సరి విచారణ మధ్యలో అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కల్పించుకుని ఫాగింగ్ మెషీన్లు రెట్టింపు చేశామని, అత్యవసర ప్రదేశాల్లో 70 మెషీన్లతో పాటు వాహనాల ద్వారా కూడా ఫాగింగ్ చేస్తున్నామని తెలిపారు. మీరు చెబుతున్న ఫాగింగ్ మెషీన్ల సంఖ్యలోనే తేడాలున్నాయని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫలితంగానే ప్రజల ప్రాణాలు పోతున్నాయని, మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున చెల్లించాలని ఆదేశిస్తే సరిపోతుందని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. హైదరాబాద్ పరిసరాల్లో దోమల ఉత్పత్తి కేంద్రాలు 427 ఉన్నాయని, బ్రీడింగ్ సెంటర్ 401 ఉన్నవాటిని 235కు తగ్గించామని ఏజీ చెప్పబోతుంటే వర్షాకాలం ప్రారంభంలో దోమల నివారణ చర్యలు తీసుకుని ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని, లార్వా దశలోనే నాశనం చేసేలా ప్రణాళికలుండాలని సూచించింది. అయినా కేసులు పెరిగాయి.. రూరల్ ఏరియాలో 1,09,780 ప్రాంతాల నుంచి వ్యర్థాలను తొలగించారని, 2.79 లక్షల ఇతర ప్రాంతాల నుంచి కూడా వ్యర్థాలను తొలగించారని, నిరుపయోగంగా ఉన్న 16,380 బావుల్ని తొలగించామని సీఎస్ జోషి చెప్పగానే.. సీజే కల్పించుకుని చాలా సంతోషమని, అయినా డెంగీ కేసులు పెరిగినట్లుగా ప్రభుత్వ రికార్డులే చెబుతున్నాయని వ్యాఖ్యానించింది. ఆ వివరాల్ని సరిగ్గా తయారు చేయలేదని సీఎస్ చెప్పగానే, జనవరిలో వంద కేసులుంటే ఇప్పుడు 2 వేల కేసులకు పెరిగాయని ధర్మాసనం గుర్తు చేసింది. మరో ఐఏఎస్ అధికారి అరవింద్.. మంత్రి తలసాని నేతృత్వంలో ఒక సబ్ కమిటీ రెండు సార్లు సమావేశమైందని చెప్పారు. కార్పొరేషన్ పరిధిలో ఎన్ని వాహనాల ద్వారా ఎన్ని టన్నుల చెత్త తొలగింపు చేస్తున్నది.. దోమల నివారణకు తీసుకుంటున్న చర్యల్ని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ వివరించారు. గల్లీల్లో తిరిగేందుకు వీలుగా కొత్తగా 1,400 ఆటోల్ని కొనుగోలు చేశామని, చెత్తను క్రషింగ్ చేస్తున్నామని వివరించారు. ఇది హర్షించదగ్గ విషయమేనని, అయితే వర్షాకాలం ప్రారంభానికి ముందే ప్రణాళికలుండాలన్న కీలక విషయాన్ని మరిచిపోయారని హైకోర్టు వ్యాఖ్యానించింది. వెయ్యి పవర్ స్ప్రేయర్లు, 800 సాధారణ స్ప్రేయర్లు, ఫాగింగ్ వాహనాలు 60 ఏర్పాటు చేయాలని ఆదేశించింది. తమ ఉత్తర్వుల్ని ఖాతరు చేయపోతే కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాల్సివస్తుందని హెచ్చరించింది. మలేరియా, పోలియో వంటి వాటిని దాదాపు నివారించామని, డెంగీ విషయంలో ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నిస్తూ విచారణను వాయిదా వేసింది. -
డెంగీ బెల్స్
డెంగీ హైరిస్క్ జిల్లాగా నిజామాబాద్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది. క్షేత్ర స్థాయిలో నివారణ చర్యలు పకడ్బందీగా అమలు కాకపోవడంతోనే జిల్లాలో కేసుల నమోదుకు కారణమవుతోంది.జిల్లా కేంద్రంలోనే డెంగీ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. జూన్ నుంచి డిసెంబ ర్ సీజనల్ వ్యాధులు వ్యాపిస్తాయి. అయితే అవగాహన కార్యక్రమాలు నామమాత్రంగా కొనసాగుతున్నాయి. మరోవైపు డెంగీ చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడీ కొనసాగుతోంది. వ్యాధి నిర్ధారణకే రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు వసూలు చేస్తున్నారు. వాస్తవానికి డెంగీ నిర్ధారణ కేవలం ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఉంది. ఇక్కడ నిర్ధారణ అయితేనే డెంగీ సోకినట్లు అధికారులు గుర్తిస్తారు. నిజామాబాద్ అర్బన్: రాష్ట్రంలో డెంగీ కేసులు అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో నమోదవుతున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. డెంగీ హైరిస్క్ జిల్లాల్లో నిజామాబాద్ మొదటి స్థానంలో ఉంది. దీనికి సంబంధించి హైదరాబాద్‌లో జిల్లా కలెక్టర్లతో సమావేశం జరగనుంది. జిల్లాలో ప్రతియేటా డెంగీ కేసులు నమోదు అవుతున్నాయి. క్షే త్రస్థాయిలో వ్యాధి నివారణకు పకడ్బందీ చర్యలు అమలు కాకపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. దీంతో వ్యాధిగ్రస్తులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 2017 సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 212 కేసులు నమోదు అయితే జిల్లా కేంద్రంలోనే 122 కేసులు నమోదు అయ్యాయి. 2018లో 156 కేసులు నమోదు అయితే జిల్లా కేంద్రంలో 17 కేసులు నమోదు అయ్యాయి. జిల్లా కేంద్రంలోని మాలపల్లి, అర్సపల్లి, వినాయక్‌నగర్, అంబేడ్కర్‌కాలనీ, అబీబ్‌నగర్, మహాలక్ష్మీనగర్, గౌతంనగర్, నాగారం, నిజాంకాలనీ, సంజీవయ్యకాలనీ, ఎల్లమ్మగుట్ట, డ్రైవర్స్‌కాలనీ ప్రాంతాల్లో ఎక్కువగా డెండీ కేసులు నమోదు అవుతున్నాయి. 2017లో వినాయక్‌నగర్‌లో 2,789 మంది జనాభా ఉండగా 13 కేసులు అత్యధికంగా ఇక్కడే నమోదు అయ్యాయి. డిచ్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 24 కేసులు నమోదు అయ్యాయి. బోధన్ ప్రాంతంలో అత్యధికంగా 29 కేసులు నమోదు అయ్యాయి. ఆర్మూర్ ఆరోగ్యకేంద్రం పరిధిలో 16 కేసులు నమోదు అయ్యాయి. ఒక్కో కేసుకు రూ. 400 ఖర్చు డెంగీ కేసు నమోదు కాగానే ఒక్కో కేసుకు రూ. 400 ఖర్చు చేస్తూ నివారణ చర్యలు చేపడుతున్నారు. ఒకవేళ అందుబాటులో స్ప్రేమందు లేకుంటే కొనుగోలు చేస్తున్నారు. ఇలా ఒక్కో కేసుకు 500 వరకు ఖర్చు చేస్తున్నారు. ఇదివరకు లక్షలాదిరూపాయలు ఖర్చు చేశారు. అయిన వ్యాధుల నియంత్రణ జరగడం లేదు. అటకెక్కిన అవగాహన.... ఈ వ్యాధుల నివారణకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలి. సీజనల్ వ్యా ధులు జూన్ నుంచి డిసెంబర్ వరకు వ్యాపిస్తాయి. ఈ కాలంలోనే వ్యాధుల నమోదు అధికంగా ఉం టుంది. ముందస్తు చర్యలు చేపట్టి జాగ్రత్తలు తీ సుకోవాలి. కళాజాత బృందాలచేత గ్రామాల్లో ప్ర చారం చేపట్టాలి. కరపత్రాల పంపిణీ, ఆరోగ్య కేం ద్రాల్లో అవగాహన కార్యక్రమాలు కొనసాగించాలి. ప్రస్తుతం ఈ కార్యక్రమాలు నామమాత్రంగా కొనసాగుతున్నాయి. ఇటీవల మలేరియా శాఖ ఆధ్వర్యంలో వ్యాధుల నియంత్రణపై అవగాహన కార్యక్రమాలను పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో నిర్వహించారు. వాస్తవానికి గ్రామాల్లో నిర్వహిస్తే ఎంతో ప్రయోజనం చేకూరేది. పాఠశాలల్లో నిర్వహిస్తే నివారణ కార్యక్రమాలు విద్యార్థులు ఎలా చేపడుతారని విమర్శలు వచ్చాయి. ప్రైవేట్‌లో దోపిడీ.. మరోవైపు డెంగీ వ్యాధి నిర్ధారణపై ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడీ కొనసాగుతుంది. తీవ్రమైన జ్వరం, ఒళ్లునొప్పులతో ఆస్పత్రికి రాగానే రక్తపరీక్షలు నిర్వహిస్తున్నారు. డెంగీ వ్యాధి నిర్ధారణ పేరిట రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆపై 15 రోజుల నుంచి 20 రోజుల వరకు ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. వెరసి రూ. 50 వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తున్నారు. ఇలా ప్రైవేట్ ఆస్పత్రుల్లో బాధితులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. వాస్తవానికి డెంగీ నిర్ధారణ కేవలం ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఉంది. ఇక్కడ నిర్ధారణ అయితేనే డెంగీ సోకినట్లు అధికారులు గుర్తిస్తారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖకు సమాచారం అందించి రోగి నివాస ప్రాంతంలో నివారణ చర్యలు చేపడుతారు. కాని ఇదీ క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదు. డెంగీ వ్యాధి నమోదు అయితే సమాచారం అందించాలని మలేరియా శాఖ ప్రైవేటు ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది కేవలం రెండు ఆస్పత్రులు 2 కేసులు నమోదు అయినట్లు సమాచారం ఇచ్చాయి. మిగతా ఆస్పత్రులు స్పందించలేదు. అధికారులు క్షేత్రస్థాయిలో కఠిన చర్యలు చేపడితే తప్ప రోగుల నిలువుదోపిడీ, వ్యాధి నివారణ జరగదని పలువురు పేర్కొంటున్నారు. అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.... అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. వ్యాధి నిర్ధారణ అయితే తక్షణమే నివారణ చర్యలు చేపడుతాం. వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకునేలా ఆరోగ్య కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. వైద్యశాఖ సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. –డాక్టర్ సుదర్శనం, జిల్లా ఇన్చార్జి వైద్యాధికారి నియంత్రణే మేలు... డెంగీ నియంత్రణ ఎంతో మేలు. వ్యాధి రాకుండా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఇంటిపరిసరాల్లో నీటిని నిల్వ ఉంచకూడదు. ఈ వ్యాధికి సంబంధించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి. – డాక్టర్ జలగం తిరుపతిరావు, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రభుత్వ మెడికల్ కళాశాల -
కోరలు చాస్తున్న డెంగీ
సాక్షి, ఆదిలాబాద్: డెంగీ అప్పుడే కోరలు చా స్తోంది. గతేడాది జిల్లాను వణికించిన ఈ వ్యాధి మరోసారి ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 14 జిల్లాలను హైరిస్క్‌గా గుర్తించగా..ఇందులో ఆదిలాబాద్ జిల్లా కూడా ఉంది. ప్రధానంగా దీని చికిత్సకు పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి రావడంతో రోగం పేరెత్తితేనే సామాన్యుల్లో వణుకు పుడుతోంది. దీనికితోడు వ్యాధికి గురైన రోగి కొద్ది నెలల పాటు కోలుకోలేని పరిస్థితి ఉండడం ఇబ్బందిగా మారుతోంది. దోమ చెలగాటం.. దోమ చెలగాటం.. మనిషికి డెంగీ సంకటం అన్న రీతిలో ఉంది. వర్షాకాలంలో ఈ వ్యాధి విజృంభిస్తుంది. ఆర్థో వైరస్‌లో వ్యాప్తి చెంది ప్రమాదకరమైన వ్యాధిగా మారుతుంది. ఎడిస్ ఎజిప్టే అనే దోమ కుట్టడం వలన డెంగీ వస్తుంది. ఈ వ్యాధి సోకిన రోగిని కుట్టి మరో వ్యక్తిని ఈ దోమ కుట్టడం వల్ల డెంగీ వ్యాప్తి చెందుతుంది. ఏడాదికేడాది డెంగీ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సీజన్ లేని సమయంలో కూడా పాజిటీవ్ కేసులు నమోదు కావడం తీవ్రతను తెలియజేస్తుంది. ఆదిలా బాద్‌లో కొన్ని సంవత్సరాల క్రితం రిమ్స్ వైద్యుడు డెంగీ వ్యాధితో మృతి చెందడం కలకలం రేపింది. ప్రాణా లు కాపాడే వైద్యునికే ప్రాణ రక్షణ లేని పరిస్థితులు రిమ్స్ వైద్య కళాశాలలో ప్రస్పుటం అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గట్టి చర్యలు చేపడితేనే రోగుల ప్రాణాలకు రక్షణ కలగనుంది. ఒకవైపు సీజనల్ వ్యాధులు.. వర్షాకాలంలో ఒకవైపు సీజనల్ వ్యాధులతో జనాలు సతమతం అవుతుండగా, పట్టణ ప్రాంతాల్లో డెంగీ వ్యాధి ఆందోళన కలిగిస్తోంది. డయేరియా (నీళ్ల విరేచనాలు), మలేరియా, చికున్‌గున్యా, యెల్లోఫీవర్ వంటి వ్యాధులు మనుషులను చుట్టుముడుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా పాజిటీవ్ కేసులు అధికంగా నమోదవుతాయి. గిరిజనులకు దోమ తెరలను పంపిణీ చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. అయితే గిరిజనులు ఈ తెరలను ఉపయోగించడం లేదన్న విమర్శలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో వారిలో అవగాహన కలిగించేందుకు వైద్యఆరోగ్యశాఖ చర్యలు చేపట్టనుంది. సమన్వయం అవసరం.. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నివారణకు వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరం. ప్రధానంగా పంచాయతీరాజ్, విద్య, ఇరిగేషన్, మైనింగ్, ఐసీడీఎస్, మత్స్య శాఖల మధ్య సమన్వయం కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. యాంటీ లార్వ ఆపరేషన్ చేపట్టడం ద్వారా దోమలను నివారించాలని యోచిస్తుంది. ప్రధానంగా చీకటి ప్రదేశాల్లో, నీళ్లు నిల్వ ఉండే ప్రాంతాల్లో దోమలు ప్రత్యుత్పత్తి ద్వారా వృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో శాఖల మధ్య సమన్వయం కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. శుక్రవారం వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కలెక్టర్లు, ప్రాజెక్టు ఆఫీసర్లు, ఐటీడీఏ అధికారులు, జిల్లా వైద్యాధికారులతో హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. జిల్లా నుంచి అధికారులు పాల్గొననున్నారు. జిల్లా పరిస్థితులకు సంబంధించి నివేదిక రూపొందించి మంత్రికి అందజేయనున్నారు. సీజన్లో అప్రమత్తంగా ఉంటాం సీజన్లో అప్రమత్తంగా ఉంటాం. వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి జిల్లా ప రిస్థితులను నివేదిస్తాం. డీఎంహెచ్ఓ పరిధిలో 52 వైద్యుల పోస్టులకు గాను 48 పొజిషన్లో ఉండగా, నా లుగు ఖాళీలు ఉన్నాయి. అవి కూడా భర్తీ చే సేందుకు చర్యలు తీసుకుంటాం. మంత్రి ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపడతాం. – డాక్టర్ రాజీవ్‌రాజ్, డీఎంహెచ్ఓ -
పేదింటి బిడ్డకు పెద్ద కష్టం
సాక్షి, విశాఖపట్నం : విధి ఎప్పుడు ఎవరితో ఎలా ఆడుకుం టుందో ఎవరికీ తెలీదు. విధి మూలంగా కొందరు ప్రాణాలు కోల్పోతే మరికొందరు మంచానికే పరిమితమవుతున్నారు. ఇప్పుడు చదువుతున్న ధనోజ్(ఆరేళ్లు) కన్నీటి గాధ అటువంటిదే. నిత్యం ఆటపాటలతో తోటివారితో సరదాగా గడపాల్సిన లేత వయసులో రెండు కిడ్నీలు పాడవడంతో మంచానికే పరిమితమయ్యాడు. తనకేం కష్టం వచ్చిందో కూడా తెలి యని వయసు. తన బాధను చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులను చూసి తనకేదో అయిపోందనుకే చిన్నారి ఆవేదన వర్ణనాతీతం. పూర్తి స్థాయిలో వైద్యం చేయించుకుందామంటే ఆర్థిక పరిస్థితి అడ్డుపడుతోంది. ఆటో డ్రైవర్‌గా ఉన్న దనోజ్ తండ్రి రెండు నెలల కిందట తన ఇద్దరు పిల్లల వైద్యం కోసం సుమారు రూ.2 లక్షలు, ధనోజ్ కోసం గత నాలుగు రోజుల్లో మరో రూ.2 లక్షలు ఖర్చుచేశాడు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం ప్రస్తుతం చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో ఆపన్నులు సాయం కోసం ఎదురుచూస్తోంది.అనకాపల్లి రేబాక గ్రామానికి చెందిన ముమ్మన సత్యనారాయణ ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిం చుకుంటున్నాడు. భార్య లలిత గృహిణి. వీరికి ప్రదీప్, ధనోజ్, నితిన్ సంతానం. ధనోజ్, నితిన్‌కు రెండు నెలల క్రితం డెంగ్యూ వ్యాధి సోకడంతో రూ.2 లక్షల వరకూ ఖర్చయ్యింది. జ్వరం తగ్గిందనుకున్న పది రోజల్లోనే ధనోజ్‌కు మొహం పొంగింది. వెంటనే సమీపంలో ఉన్న లండన్ చిల్డ్రన్స్ హాస్పటల్లో చేర్చారు. వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అకస్మాత్తుగా ఓ రోజు రోడ్డుపై సొమ్మసిల్లి పడిపోయాడు. తర్వాత రోజు నిద్రలో మూర్చపోయినట్టు నాలుక కరుచుకోవడం చూసి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించిన లండన్ చిల్డ్రన్స్ హాస్పటల్ వైద్యులు విశాఖలోని ఓమ్నీ ఆర్కే ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించగా రెండు కిడ్నీలు పాడైనట్లు చెప్పారు. ప్రస్తుతం బాలునికి డయాలసిస్ చేస్తున్నారు.ఆర్థికంగా చితికిపోయామని, సాయం చేసి తన బిడ్డను కాపాడాలని సత్యనారాయణ వేడుకుంటున్నాడు. సాయం చేసే దాతలు 9949718928 నంబరుకు ఫోన్ చేయాలని అభ్యర్థించాడు. ఖాతాదారుని పేరు ముమ్మన లలిత, భారతీయ స్టేట్‌బ్యాంక్, అకౌంట్ నంబరు 38316378836, గవరపాలెం బ్రాంచ్, అనకాపల్లి, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఎస్బీఐఎన్0011112లో డబ్బులు వేసి సాయం చేయవచ్చు. -
ఊరూరా డెంగీ
జిల్లావ్యాప్తంగా డెంగీ విజృంభిస్తోంది. ఊరూవాడ.. పట్టణం, నగరం.. తేడా లేకుండా ప్రజలను మంచం పట్టిస్తోంది. ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. సకాలంలో వైద్యం అందితే సరి.. లేకుంటే అంతే. సంబంధిత వైద్యాధికారులు మాత్రం డెంగీ కేసులు పెద్దగా నమోదు కాలేదని, ఇక మరణాలు అసలే లేవని చెబుతున్నారు. కరీంనగర్ హెల్త్: ఇటీవల కురిసిన వర్షాలు, వాతా వరణంలో చోటుచేసుకుంటున్న మార్పులతో జిల్లాలో డెంగీతోపాటు విషజ్వరాలు కూడా తీవ్రస్థాయిలో విజృభిస్తున్నాయి. అధికారిక రికార్డుల ప్రకారం ఇప్పటివరకు జిల్లాలో డెంగీ మరణాలు లేవని, కేవలం 44 డెంగీ కేసులు మాత్రమే నమోదు అయినట్లు తెలుపుతున్నా.. కేసుల నమోదుకంటే రెట్టింపు మరణాలు జరిగాయి. జూలై పదో తేదీ వరకు కేవలం ఏడు కేసులు మాత్రమే నమోదు కాగా.. సెప్టెంబర్ 8వరకు 27 పీహెచ్సీ పరిధిలో ఏకంగా 44 కేసులు నమోదయ్యాయి. ఇది కేవలం అధికారుల రికార్డుల మేరకే.. అనధికారికంగా అనేకమంది బాధపడుతున్నా.. వారిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. 27 పీహెచ్సీ పరిధిలో నమోదైన కేసులు.. జిల్లాలోని 27 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 44 డెంగీ కేసులు నమోదు అయినట్లు వైద్యధికారులు తెలిపారు. కరీంనగర్ అర్బన్‌లోని హౌసింగ్‌బోర్డు కాలనీ పీహెచ్సీ పరిధిలో రెండు, సప్తగిరి కాలనీ పీహెచ్సీ పరిధిలో నాలుగు, కొత్తపల్లి పీహెచ్సీ పరిధి చింతకుంటలో రెండు, సీతారాంపూర్‌లో ఒకటి, మల్కాపూర్‌లో రెండు, గోపాల్‌పూర్‌లో ఒకటి, చేగుర్తిలో ఒకటి, వెల్ధి పీహెచ్సీ పరిధిలోని ఊటూర్లో ఒకటి, మానకొండూర్ పీహెచ్సీ పరిధిలోని నిజాయితీగూడెంలో రెండు, ఖాదర్‌గూడెంలో ఒకటి, చిగురుమామిడి పీహెచ్సీ పరిధి నవాబుపేటలో ఒకటి, రేకొండలో నాలుగు, బొమ్మనపల్లిలో ఒకటి, చొప్పదండి పీహెచ్సీ పరిధి భూపాలపట్నంలో ఒకటి, కాట్నపల్లిలో ఒకటి, తిమ్మాపూర్ పీహెచ్సీ పరిధి నుస్తులాపూర్‌లో ఒకటి, గొల్లపల్లిలో ఒకటి, శంకరపట్నం పీహెచ్సీ పరిధి కన్నాపూర్‌లో ఒకటి, అంబాల్పూర్లో ఒకటి, కాచాపూర్‌లో రెండు, ఎరడపల్లిలో రెండు, చెల్పూర్ పీహెచ్సీ పరిధిలోని హుజురాబాద్‌లో ఒకటి, చెల్పూర్లో ఒకటి, సైదాపూర్ పీహెచ్సీ పరిధి ఎక్లాస్‌పూర్‌లో ఒకటి, వావిలాల పీహెచ్సీ పరిధి వావిలాలలో ఒకటి, వీణవంక పీహెచ్సీ పరిధి వీణవంకలో ఒకటి, ఇల్లందకుంట పీహెచ్సీ పరిధి పాతర్లపల్లిలో ఆరు కేసుల చొప్పున మొత్తం 44 డెంగీ కేసులు నమోదైనట్లు అధికారుల రికార్డుల ద్వారా తెలుస్తోంది. కానీ.. అనధికారికంగా అనేక మంది డెంగీబారిన పడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నారు. ఇప్పటికీ తీసుకుంటూనే ఉన్నారు. రెట్టింపు మరణాలు జిల్లాలో డెంగీవ్యాధితో మరణాలు లేవని అధికారిక లెక్కలు తెలుపుతున్నా.. 100కుపైగా మరణాలు జరిగినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవల కరీంనగర్ మండలం దుర్శేడ్‌కు చెందిన గౌడ సరస్వతి (60) డెంగీతో మరణించిన విషయం విదితమే. ఈ మధ్యకాలంలో డెంగీతోపాటు వాతావరణ మార్పులతో విషజ్వరాలు ప్రబలి ప్రజలు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. విషజ్వరాల కారణంగా ప్రభుత్వ ఆస్పత్రిలో అదనపు పడకలు వేసి సేవలు అందించాల్సి వస్తోందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది ఇప్పటివరకు మలేరియా 7, చికున్‌గున్యా 51 కేసులు, మలేరియా నాలు కేసులు మాత్రమే నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. -
కల చెదిరింది.. కన్నీరు మిగిలింది..!
విధి వక్రీకరించింది. బ్యాంకు ఉద్యోగమే లక్ష్యంగా పట్టుదలతో చదువుతున్న ఆ యువకుడిని డెంగీ జ్వరం రూపంలో మృత్యువు కబలించింది. కూలీనాలీ చేస్తూ చదివిస్తున్న తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చింది. ఈ విషాద ఘటన రేగిడి మండలం చినశిర్లాం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. రేగిడి : మండలంలోని చినశిర్లాం గ్రామానికి చెందిన వజ్జిపర్తి తిరుపతిరావు(20) అనే డిగ్రీ విద్యార్థి డెంగీ జ్వరంతో మృత్యుఒడికి చేరాడు. వారం రోజులుగా జ్వరం రావడంతో తల్లిదండ్రులు రాజాంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులుల సూచనలు మేరకు విశాఖలోని ఓ ప్రైవేటు ఆకస్పత్రికి తరలించి చికిత్సను అందించారు. ఓ వైపు చికిత్స అందించగా..మరోవైపు యువకుడు ప్లేట్లేట్స్ పడిపోయాయి. డెంగీ జ్వరం లక్షణాలతో తిరుపతిరావు బాధపడుతున్నట్లు అక్కడ వైద్యులు తెలిపారని, బంధువులు వద్ద అప్పు చేసి మెరుగైన వైద్యం అందిస్తుండగానే కుమారుడు మృత్యువాత పడ్డాడని తల్లిదండ్రులు బోరును విలపిస్తున్నారు. రెక్కలకష్టంతో చదివిస్తుండగా.... తిరుపతిరావు తల్లిదండ్రులు బుచ్చమ్మ, గురువులు రజక వృత్తిపై ఆధారపడి బతుకుతున్నారు. ఓ వైపు రైతు పనులు చేస్తూ మరో వైపు కుల వృత్తి చేసుకుంటూ వచ్చిన అరకొర సొమ్ముతో తిరుపతిరావును, అతని సోదరుడు భవానీని చదివిస్తున్నారు. తిరుపతిరావు చదువులో చురుగ్గా ఉండటం, ఇంతలోనే మృత్యువు ఒడికి చేరడం ఆ కుటుంబాన్ని విషాదంలో నింపింది. వారం రోజులు క్రితం వరకు తమతో తిరిగే స్నేహితుడు ఇక లేడని తెలుసుకున్న తోటి స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చేతికందికొచ్చే కొడుకు మృతిచెందడంతో తండ్రి గురువులు సొమ్మసిల్లిపడిపోయాడు. ‘బ్యాంకు ఉద్యోగం చేసి మిమ్మల్ని పోషిస్తానన్నావు..నాన్నా.. తిరుపతి....లే..’ అంటూ ఆ తండ్రి విలపించడం అందరినీ కంటతడిపెట్టించింది. ‘అన్నయ్యా..బస్సులు తక్కువుగా ఉన్నాయి లే అన్నయ్యా..వేగంగా వెళదాం..’ అంటూ తిరుపతిరావు సోదరుడు భవాని మృతదేహంపై పడి రోదించడం అక్కడివారిని కలచివేసింది. బ్యాంకు ఉద్యోగమే లక్ష్యంగా.. డెంగీ జ్వరంతో మృతిచెందిన తిరుపతిరావు రాజాంలోని ఓ ప్రయివేటు కళాశాలలో బీకాం తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ఓ వైపు కాంపిటేటివ్ పరీక్షలకు చదువుతుండగా, మరో వైపు బ్యాంకు ఉద్యోగాన్ని లక్ష్యంగా పెట్టుకుంటున్నట్లు తిరుపతిరావు స్నేహితులు విలేకరులకు తెలిపారు. తిరుపతిరావు మృతిపట్ల రాజాంలోని ఎస్‌ఎస్‌ఎన్‌డిగ్రీ కళాశాలకు సెలవు ప్రకటించారు. కళాశాల యాజమాన్యంతోపాటు స్నేహితులు మృతదేహం వద్దకు చేరుకొని నివాళులు అర్పించారు. -
డెంగీతో వైద్యాధికారి మృతి
కోటపల్లి (చెన్నూర్): మంచిర్యాల జిల్లా వేమనపల్లి ప్రాథమిక వైద్యాధికారి కామెర రశ్పాల్ (26) డెంగీ వ్యాధికి బలయ్యారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస వదిలారు. కోటపల్లి మండలం మల్లంపేటకు చెందిన రశ్‌పాల్‌కు వారం క్రితం జ్వరం రాగా స్వీయ చికిత్స చేసుకున్నా తగ్గలేదు. దీంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. రక్తకణాల సంఖ్య పూర్తిగా తగ్గడంతో ప్లేట్లెట్స్ ఎక్కించినప్పటికీ కోలుకోలేదు. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ సాయంతో చికిత్స అందించారు. సోమవారం రాత్రి కరీంనగర్‌కు, అక్కడి నుంచి హైదరాబాద్ తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. పెళ్లి అయిన మూడు నెలలకే.. రశ్‌పాల్‌కు మూడు నెలల కిందట ప్రగతితో వివాహం జరిగింది. పెళ్లి అయిన మూడు నెలలకే రశ్పాల్ మరణించడంతో మల్లంపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నిరుపేద కుటుంబానికి చెందిన రశ్పాల్ కష్టపడి చదివి డాక్టర్ కొలువు సాధించాడని, అతడి లక్ష్యం ఐఏఎస్ అని, అది నెరవేరకుండానే మరణించాడని మృతుడి తల్లిదండ్రులు విలపిస్తూ చెప్పారు. కాగా, చికిత్స సమయంలో డబ్బులు లేకపోవడంతో తోటి డాక్టర్లు తలా కొంత జమ చేసి చికిత్సకు తోడ్పాటు అందించారు. -
వర్షాకాలంలో పసిపాపకు అన్ని జాగ్రత్తలు చెప్పారు... ఎందుకు?
పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా పాప వయసు రెండు నెలలు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ప్రవసం తర్వాత మా ఊరికి వచ్చేశాం. ‘వర్షాకాలంలో వ్యాధులు ఎక్కువ. జాగ్రత్తగా ఉండండి’ అంటూ అక్కడి పెద్ద డాక్టర్లు చాలా జాగ్రత్తలు చెప్పారు. వాళ్లు అంతగా చెప్పడానికి కారణమేమిటి? – మల్లయ్య, ముస్త్యాల (వరంగల్ జిల్లా) వర్షాకాలంలో అనేక వ్యాధులు విజృంభిస్తాయి. నీళ్లు కలుషితం కావడం వల్ల డయేరియా, టైఫాయిడ్, కామెర్ల వంటి వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఎక్కువ. ఈ సీజన్లో మంచినీళ్ల పైపుల పక్కనే ఉండే మురుగునీళ్ల వ్యవస్థలోని కలుషిత జలాలు, మంచినీటితో కలిసిపోవడం జరగవచ్చు. లేదా వరదనీటితో పొంగిపోయే డ్రైనేజీలు మంచినీటి వనరులను కలుషితం చేయవచ్చు. ఇలా నీటికాలుష్యం వల్ల నీళ్లవిరేచనాలు, టైఫాయిడ్, కామెర్ల వంటి వ్యాధులు వస్తాయి. ఇక మరోవైపు ఈ సీజన్లో నీళ్లు నిలిచిపోవడం వల్ల దోమలు పెరుగుతాయి. దోమల సంతతి పెరగడానికి వర్షాకాలం చాలా అనువుగా ఉండటం వల్ల వాటి ద్వారా వాపించే వ్యాధులు ఎక్కువవుతాయి. దోమకాటు వల్ల డెంగ్యూ, చికన్‌గున్యా, మలేరియా వంటి వ్యాధులు విజృంభించే అవకాశాలు ఎక్కువ. ఇక ఈ సీజన్లో తేమ శాతం ఎక్కువగా ఉండటం, ఎండ తక్కువగా ఉండటం వల్ల... ఈ వాతావరణం బ్యాక్టీరియా, వైరస్లు పెరగడానికి చాలా అనుకూలం. దాంతో ఈ అనువైన పరిస్థితుల కారణంగా అటు కలుషిత జలాలు, ఇటు దోమలు, మరో పక్క బ్యాక్టీరియా–వైరసులు పెచ్చరిల్లడం వల్ల వాటి కారణంగా వచ్చే వ్యాధులు చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. పసిపిల్లలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వారు ఈ వ్యాధులబారిన తేలిగ్గా పడుతుంటారు. చాలామంది పిల్లలు ఈ సీజన్లోజలుబు, శ్వాససంబంధమైన వ్యాధులతో సతమతమవుతుంటారు. అందువల్ల మీ జిల్లా కేంద్ర ఆసుపత్రి వైద్యులు చెప్పిన విధంగా పాప ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటి పరిసరాల్లో నీరు మడుగు కట్టకుండా జాగ్రత్త పడాలి. పరిసరాల్లో పూలకుండీలు, కొబ్బరిచిప్పలు వంటి వాటిల్లోనూ నీరు చేరి, అక్కడ దోమలు తమ సంతతిని వృద్ధి చేసుకోకుండా చూసుకోవాలి. ఇంట్లో అందరూ కాచిచల్లార్చిన నీటిని వాడటం చాలా మంచిది. ఇలాంటి జాగ్రత్తల ద్వారా వానాకాలపు వ్యాధులనుంచి మీ పసిపాపనే గాక... మిమ్మల్ని మీరూ రక్షించుకోవచ్చు. పిల్లల్లో డెంగ్యూను గుర్తించడం ఎలా? మా బాబు వయసు 11 నెలలు. వర్షాకాలంలో డెంగ్యూవ్యాధి ఎక్కువగా కనిపిస్తుందని విన్నాను. ఇంట్లో పసిపిల్లాడు ఉండటం వల్ల చాలా ఆందోళన పడుతున్నాము. ఆ వ్యాధిని ఎలా గుర్తించాలి? అది ప్రమాదకరస్థాయికి చేరినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? దయచేసి వివరంగా తెలపండి. – సి. యాదగిరి, మునుగోడు (నల్లగొండ జిల్లా) డెంగ్యూ వ్యాధి ప్రారంభ లక్షణాలు సాధారణంగా వచ్చే ఇతర వైరల్ జ్వరాలలాగే ఉంటాయి. అయితే జ్వరం తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ఈ జ్వరంతో వణుకుతారు. మందులు వాడటం వల్ల తీవ్రత తాత్కాలికంగా తగ్గుతుంది. ఎముకలు, కీళ్లు, కళ్లు నొప్పిగా ఉంటాయి. కళ్లు, ముఖం ఎర్రబారుతాయి. ఒంటిపైన అంతటా దద్దుర్లు కనిపిస్తాయి. ఆయాసంగా ఉండటం, ఆకలి మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సాధారణ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే వ్యాధి ముదురుతుంది. అప్పుడు తీవ్రమైన పొట్టనొప్పి, మూత్రం తగ్గిపోవడం, వాంతులు, మలంలో రక్తం పడటం, శరీర భాగాల్లోకి నీరు చేరడం, విపరీతమైన నిస్సత్తువ కనిపిస్తాయి. పసిపిల్లల్లో ఈ లక్షణాలు కనిపించనప్పుడు ఆలస్యం చేయకుండా పిల్లల వైద్యనిపుణుడికి చూపించి, వ్యాధి డెంగ్యూ అవునో కాదో నిర్ధారణ చేసుకోవాలి. ఇందుకోసం రక్తపరీక్షలు చేయించినప్పుడు రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య వేగంగా పడిపోవడం, ఎర్రరక్తకణాల సంఖ్య తగ్గిపోతుండటం కనిపిస్తాయి. బిడ్డకు సోకింది డెంగ్యూ అని నిర్ధారణ అయితే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించాలా, లేక ఇంటి వద్దనే ఉంచి చికిత్స చేయగలమా అని పిల్లల వైద్యుడు నిర్ణయిస్తాడు. బిడ్డ చురుకుగా ఉండి, మామూలుగానే తింటూ ఉంటే, డెంగ్యూ వ్యాధి లక్షణాలు కనిపిస్తూ, వ్యాధి నిర్ధారణ అయినప్పటికీ ఇంటివద్దనే ఉంచి, పిల్లల వైద్యనిపుణుడి పర్యవేక్షణలో చికిత్స చేయించడం సాధ్యమవుతుంది. వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉండి, బిడ్డ మందకొడిగా ఉన్నట్లయితే వెంటనే ఆసుపత్రిలో చేర్చుకొని, వైద్యుల నిరంతర పర్యవేణలో చికిత్స అందించాల్సి ఉంటుంది. ప్రతివర్షాకాలంలోనూపాపకు నలత... పరిష్కారం చెప్పండి మా పాప వయసు మూడేళ్లు, ప్రతివర్షాకాలంలోనూ అనారోగ్యానికి గురవుతూ వస్తోంది. కొన్నిసార్లు తీవ్రమైన జ్వరంతో ఆసుపత్రిలో చేర్చాల్సి వస్తోంది. వర్షాకాలం వ్యాధుల నుంచి పాపను రక్షించుకోవడం ఎలా? దయచేసి వివరంగా చెప్పండి. – కె. ప్రమీల, మహబూబ్‌నగర్ చికిత్స కంటే నివారణ మేలు అన్న సూక్తి పిల్లలతో పాటు అందరికీ వర్తిస్తుంది. అయితే పిల్లల విషయంలో మరీ ముఖ్యం. ఎందుకంటే పిల్లల్లో కొద్దిపాటి నలత కనిపించిన ఇంటిల్లిపాదీ చాలా ఆందోళనకు, మనోవేదనకు గురవుతుంటారు. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వేదనకు గురికాకుండా ఉండటం సాధ్యమవుతుంది. అందుకోసం ఈ సాధారణ సూచనలు పాటించండి. ∙మీ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా పొడిగా ఉంచుకోండి ∙లోతట్టు ప్రాంతాల్లో, ఖాళీ స్థలాల్లో వాననీరు నిలిపోకుండా చూసుకోండి ∙మీరు నీటిని నిల్వ ఉంచే పాత్రలు, ట్యాంకులు, డ్రమ్ములపై మూతపెట్టి ఉంచండి. ∙మీ ఇంట్లోని పిల్లలను ఎప్పుడూ దోమతెరలో పడుకోబెడుతుండండి ∙పిల్లల శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే వస్త్రాలనే ధరింపజేయండి ∙అవసరమైతే తాత్కాలికంగా మస్కిటో రిపల్లెంట్ క్రీమ్స్ వాడవచ్చు ∙బాగా కాచివడబోసిన లేదా ఫిల్టర్ చేసిన నీటిని మాత్రమే తాగడానికి వాడండి. పిల్లలకు ఇలాంటి నీటినే విధిగా ఇవ్వాలి ∙వంటకు వాడే నీరు ఏమాత్రం కలుషితం కాకుండా, పూర్తిగా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ∙పిల్లలకు బయటనుంచి కొనితెచ్చిన పండ్లరసాలు, ఇతర తినుబండారాలను ఈ సీజన్లో అస్సలు ఇవ్వకండి ∙పిల్లల చేతులు (ఆమాటకొస్తే మీ చేతులు కూడా) ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా జాగ్రత్త తీసుకోండి. ఇందుకోసం సబ్బు లేదా లిక్విడ్ హ్యాండ్‌వాష్‌తో తరచూ చేతులను శుభ్రం చేస్తుండండి ∙ఇంట్లో పెద్దవారికి జలుబు చేస్తే వారు నోటికి, ముక్కుకు వస్త్రం అడ్డుగా పెట్టుకోవాలి. పొడుగు చేతుల చొక్కలను ధరించాలి. ఎందుకంటే తుమ్మాల్సి వచ్చినప్పుడు మోచేతి మడతలోనే తుమ్మడం వల్ల వ్యాధులను సంక్రమింపజేసే క్రిములు ఇతరులకు... ముఖ్యంగా పసిపిల్లలకూ వ్యాపించకుండా జాగ్రత్తపడటానికి ఇది ఉపకరిస్తుంది ∙పిల్లలను వీలైనంత వరకు జనసమ్మర్థం ఎక్కువగా ఉండే మార్కెట్లు, సినిమాహాళ్ల వంటి చ్లోకు తీసుకెళ్లవద్దు. ఇలాంటి కొన్ని జాగ్రత్తలతో చిన్నారులు ఈ సీజన్లో వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. డాక్టర్ చేతన్ ఆర్ ముందాడ సీనియర్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్, యశోద మదర్ అండ్ చైల్డ్ ఇన్స్టిట్యూట్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
ఆయుర్వేదంతో డెంగీకి చెక్
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న డెంగీ వ్యాధికి చెక్ పెట్టే ఆయుర్వేద ఔషధాన్ని భారత శాస్త్రవేత్తలు రూపొందించారు. ప్రపంచంలో డెంగీ నివారణ కోసం రూపొందించిన మొట్టమొదటిదిగా చెపుతున్న ఈ ఔషధం వచ్చే ఏడాది మార్కెట్లోకి రానుంది. ఆయుష్, ఐసీఎంఆర్ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పని చేసే ద సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్(సీసీఆర్ఏఎస్) శాస్త్రవేత్తలు ఈ ఔషధాన్ని రూపొందించారు. కర్ణాటకలోని బెల్గామ్‌లో ఉన్న సీసీఆర్ఏఎస్ ప్రాంతీయ పరిశోధనా కేంద్రంలో ఈ ఔషధం భద్రత, సామర్థ్యంపై ప్రయోగాత్మకంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. డబుల్ బ్లైండ్ ప్లాస్బో అనే కంట్రోల్డ్ క్లినికల్ ట్రయల్ ద్వారా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు సీసీఆర్ఏఎస్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ విద్యా కేఎస్ ధిమాన్ తెలిపారు. మానవులపై పరిశోధనలు చేసే ఈ పద్ధతికి అంతర్జాతీయంగా ఆమోదం ఉందని చెప్పారు. ఆయుర్వేదంలో వినియోగిస్తున్న 7 మూలికలతో గత ఏడాది జూన్‌లో ఔషధాన్ని సిద్ధం చేశామని చెప్పారు. పైలట్ స్టడీలో 90 మంది రోగులకు ద్రవ రూపంలో ఔషధం ఇచ్చామని, ఇకపై నిర్వహించే క్లినికల్ ట్రయల్స్‌లో దీనిని ట్యాబ్లెట్ రూపంలో ఇస్తామని చెప్పారు. దోమల ద్వారా వ్యాప్తి చెందే డెంగీ వల్ల తీవ్రమైన జ్వరం, ఒళ్లు నెప్పులు, తీవ్ర తలనొప్పి, వాంతులు, చర్మ సంబంధ సమస్యలు మొదలైనవి వస్తాయి. ఏటా 40 కోట్ల మంది డెంగీ బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. ప్రస్తుతం డెంగీకు ఎటువంటి మందు లేదు. డెంగీ లక్షణాల ఆధారంగా ముందస్తు నివారణ చర్యలు మాత్రమే చేపడుతున్నారు. దీంతో ప్రభుత్వాలు.. ఆరోగ్య సంస్థలు దీనికి అడ్డుకట్ట వేయడంపై దృష్టి సారించాయి. -
యూ అండ్ డెంగ్యూ
దోమ లేని ప్రదేశం లేదు! దోమ రాలేని ప్రదేశం లేదు! మరి జాగ్రత్త ఎలా? దోమను దరి చేరనివ్వకపోవడమే! చేరినా.. ధైర్యాన్ని జారన్వికపోవడమే! డెంగ్యూను ఎదుర్కోవాలంటే మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ వైరస్ వల్ల వస్తుంది. ఇది ఏడిస్ ఈజిపై్ట అనే దోమ వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. దీని వేళ్ల కణుపుల దగ్గర తెల్లటి పులి చారల్లాంటి మచ్చలు ఉంటాయి కాబట్టి దీన్ని టైగర్ మస్కిటో అని కూడా అంటారు. చాలా మందకొడిగా ఉండే ఈ దోమ సాధారణంగా పగటి వేళల్లో కుడుతుంటుంది. పెద్దగా దూరాలూ ఎగరలేదు. అయిత కుట్టినప్పుడు డెంగ్యూ వచ్చేలా చేస్తుంది కాబట్టి దీన్ని ప్రమాదకరంగా పరిగణించాలి. సాధారణంగా డెంగ్యూ దానంతట అదే తగ్గిపోతుంది. అంటే ఇది సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అన్నమాట. ఆరోగ్యవంతుడైన వ్యక్తి శరీరంలోకి వైరస్ ప్రవేశించిన ప్రవేశించిన 4 నుంచి 7 రోజుల్లోపు ఆ వ్యక్తికి డెంగ్యూ లక్షణాలు బయటపడతాయి. చాలా వైరస్‌లలాగే డెంగ్యూ తనంతట తానే తగ్గిపోతుంది. అయితే ఈలోపు కొందరిలో ప్లేట్లెట్లు ఉండాల్సిన సంఖ్య కంటే తగ్గితే అది అంతర్గత రక్తస్రావానికి దారితీస్తుంది. అది చాలా ప్రమాదం. డెంగ్యూలో రకాలు : 1. అన్ డిఫరెన్షియేటెడ్ ఫీవర్ లేదా క్లాసికల్ డెంగ్యూ ఫీవర్– ఇది ఇతర ఫీవర్స్లాగానే అనిపించే జ్వరంలా అనిపించడంతో అన్–డిఫరెన్షియేటెడ్ ఫీవర్ అని అంటారు. ఇక డెంగ్యూ సోకినప్పుడు ఇతర వైరల్ ఫీవర్లలాగే ఇందులోనూ జ్వరం వస్తుంది కాబట్టి డెంగ్యూ సోకినప్పుడు వచ్చే జ్వరాన్ని క్లాసికల్ డెంగ్యూ ఫీవర్ అంటారు. 2. డెంగ్యూ హెమరెజిక్ ఫీవర్ – అంతర్గత అవయవాల్లో రక్తస్రావం కావడం. 3. డెంగ్యూ షాక్ సిండ్రోమ్ – అవయవాల్లో అంతర్గత రక్తస్రావంతో పాటు... బీపీ పడిపోయి షాక్‌లోకి వెళ్లడం. డెంగ్యూలోని సాధారణ లక్షణాలు జ్వరం, తలనొప్పి (ముఖ్యంగా నుదురు ప్రాంతంలో), కళ్ల వెనక నొప్పి, ఒళ్లు నొప్పులు, రాష్, ఒంటిపై ఎర్రని మచ్చలు రావడం, చిగుళ్ల నుంచి రక్తం కారడం, రక్తంలోని ప్లేట్లెట్స్ తగ్గిపోవడం మలేరియాలో అయితే నిర్ణీత సమయానికి ప్రతిరోజూ వస్తూ ఉంటుంది. కానీ డెంగ్యూ సోకిన వ్యక్తిలో జ్వరం ఎప్పుడైనా రావచ్చు. డెంగ్యూ వచ్చిన వారిలో వచ్చే నొప్పి ఎముకల విరిగినంత తీవ్రంగా వచ్చినట్లుగా అనిపిస్తుంది. అందుకే దీన్ని ‘బ్రేక్ బోన్ ఫీవర్’ అని కూడా అంటారు. డెంగ్యూ హేమరేజిక్ ఫీవర్ : రక్తంలోని ప్లేట్లెట్స్ తగ్గిపోతున్న కొద్దీ అంతర్గత అవయవాల్లో రక్తస్రావం జరిగేందుకు అవకాశాలు. ఒకవేళ అంతర్గత అవయవాల్లో రక్తస్రావం అయితే అదిచాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఈ అంతర్గత రక్తస్రావం లక్షణాలు ముందుగా కనుగొనడానికి టోర్నికేట్ అనే పరీక్షను నిర్వహించవచ్చు. చర్మం పై ఎర్రని మచ్చలు కనబడుతున్నా, కళ్లలో,నోటిలో మచ్చలు వచ్చినా, చిగుళ్ల నుంచి రక్తం కారుతున్నా, ఇంజెక్షన్ ఇచ్చినచోట లేదా ఇతర ప్రదేశాల నుంచి రక్తస్రావం జరుగుతున్నా, వాంతుల్లో రక్తం ఉన్నా లేదా విరేచనం నల్లగావస్తున్నా (రక్తం కడుపులో ఉన్న యాసిడ్‌తో కలిసినప్పుడు నల్లగా మారుతుంది) డెంగ్యూ హెమరేజిక్ జ్వరంగా అనుమానించాలి. అయితే కొందరు ఒంట్లో ఐరన్ తక్కువగా ఉండటం వల్లఐరన్ టాబ్లెట్లు వాడుతుంటారు. వాళ్లకు కూడా మలం నల్లగానే వస్తుంది. ఇలా ఐరన్ టాబ్లెట్లు వాడే వారు ఈ లక్షణాలన్ని తెలుసుకొని ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ టాబ్లెట్లువాడని వారిలో మలం నల్లగా వస్తుంటే మాత్రం వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. డెంగ్యూ షాక్ సిండ్రోమ్ : డెంగ్యూ సోకినప్పుడు జరిగే అంతర్గత రక్తస్రావం వల్ల కాళ్లు, చేతులు, ముఖంలో వాపు కనిపించవచ్చు. కొందరిలో పొట్టలో, ఊపిరితిత్తుల బయట, గుండె చుట్టూనీరు చేసి ఆయాసం పెరగవచ్చు. సాధారణంగా రెండు నుంచి ఏడు రోజుల జ్వరం వచ్చి తగ్గిన తరువాత ప్లేట్లెట్స్ పడిపోవడం, ఫలితంగా అంతర్గత అవయవాల్లో రక్తస్రావం జరగడంతోపాటు బీపీ తగ్గిపోయి మూత్రం సరిగా రాకపోవడం, షాక్ లాంటి చాలా తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. డెంగ్యూ వచ్చిన వారు జ్వరం తగ్గిపోయాక... అది తగ్గిపోయింది కదా ఇంకేంప్రమాదం ఉండదనే అపోహతో నిర్లక్ష్యం చేయకూడదు. వచ్చింది డెంగ్యూ అని తెలిశాక... ఆ తర్వాత కూడా కొంతకాలం డాక్టర్ ఫాలో అప్‌లో ఉండటం మంచిది. నిర్ధారణ పరీక్షలు : సీబీపీ పరీక్ష చేయాలి. ∙ డెంగ్యూ ఎన్ఎస్1 యాంటీజెన్ పరీక్ష అవసరం. ∙డెంగ్యూ ఐజీఎమ్ అనే పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అయితే వ్యాధి నిర్ధారణ రిపోర్టులు వచ్చేందుకు పట్టే సమయంఎక్కువ కాబట్టి అప్పటి వరకు ఆగకుండా... లక్షణాలను బట్టి ముందుగానే చికిత్స తీసుకోవడం మంచిది. పైగా దీనికి చేసే చికిత్స కూడా లక్షణాలను బట్టి చేసేదే. నిర్ణీతమైన చికిత్స లేదు.కాబట్టి లక్షణాలు కనిపించగానే చికిత్స మొదలుపెట్టడం మంచిది. ఇప్పుడు అందుబాటులో మరింత అధునాతనమైన నిర్ధారణ పరీక్ష : ఇప్పుడు ఐపీఎఫ్ (ఇమ్మెచ్యూర్ ప్లేట్లెట్ ఫ్రాక్షన్) అనే అత్యాధునిక పరీక్ష అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది పెద్ద పెద్ద ఆసుపత్రుల్లోనే అందుబాటులో ఉంది. ప్లేట్లెట్లనుఎక్కించడానికి సంబంధించి, డెంగ్యూ పేషెంట్లకు ఈ పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది. రక్తంలో ప్లేట్లెట్లకు సంబంధించిన ఖచ్చితమైన వివరాలతో పాటు శరీరంలో ప్లేట్లెట్ల ఉత్పాదనకలిగిన బోన్‌మ్యారో పనితీరు కూడా ఈ పరీక్ష ద్వారా తెలుస్తుంది. అంతేకాకుండా ప్లేట్లెట్లు వృద్ధి చెందుతాయా, లేదా, ఒకవేళ ప్లేట్లెట్లు ఎక్కించడం ఎంతమేరకు అవసరం... లాంటిచికిత్సకు ఉపకరించే ఎన్నో విషయాలు ఈ పరీక్ష ద్వారా వైద్యులు నిర్ధారణ చేస్తారు. అందుకు తగ్గట్లుగా ప్లేట్లెట్స్ మార్పిడి, చికిత్స విధానాన్ని అవలంబిస్తారు. ఒకవేళ బోన్మ్యారోలోలోపం ఉంటే పైపై చికిత్సలను ఆపేసి, ప్రధానమైన మూలాల్లోకి వెళ్లి మెరుగైన చికిత్సను సకాలంలో అందించి, పేషెంట్ ప్రాణాలను కాపాడతారు. డెంగ్యూకు గురైన ప్రతి పేషెంట్‌కీ ప్లేట్లెట్లమార్పిడి అవసరం ఉండదు. డెంగ్యూ వచ్చినవారు ఇంట్లోనే చికిత్స తీసుకుంటూ ఉన్నప్పుడు పెద్దలైతే రోజూ 3 – 4 లీటర్ల వరకు, పిల్లలైతే రోజూ 2 లీటర్ల వరకు ద్రవాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. డెంగ్యూలో కనిపించే ఇతర లక్షణాలు సివియర్ డీహైడ్రేషన్, నిరంతరంగా బ్లీడింగ్ అవడం, ప్లేట్ లెట్స్ తక్కువవుతుంటాయి. దాంతో రక్తం గడ్డకట్టదు. రక్తపోటు పడిపోతుంది. లివర్ ఎన్లార్జ్ అయి డ్యామేజ్ అయ్యే ప్రమాదమూఉంటుంది. హార్ట్‌బీట్ నిమిషానికి 60 కంటే తక్కువకు కూడా పడిపోవచ్చు. బ్లీడింగ్, ఫిట్స్ వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమే డ్యామేజ్ అవుతుంది.హార్ట్‌బీట్ 60 కంటే తక్కువగా పడిపోవడం అన్నది ప్రమాదకరమైన సూచన. ఇలాంటి పరిస్థితి వస్తే ఇంటెన్సిక్ కేర్‌లో ఉంచాల్సిన అవసరం పడవచ్చు. డెంగ్యూ కనిపించగానే యాంటీబయాటిక్స్ ఇవ్వడం సరికాదు... చాలా మంది డాక్టర్లు డెంగీ లక్షణాలు కనిపించగానే యాంటీబయాటిక్ మందులు ఉపయోగిస్తుంటారు. అయితే డెంగీ రోగికి జ్వరం వంటి లక్షణాలు కనిపించగానే యాంటీబయాటిక్స్‌వాడటం సరికాదు. ఇలా మందుల వల్ల ప్లేట్లెట్ కౌంట్ తగ్గి్గతే అది అంతర్గత రక్తస్రావానికి దారితీయవచ్చు. ఫలితంగా మందులే ప్రమాదకరం కావచ్చు. డాక్టర్లు బాగా ఆలోచించాకే ఇతర మందులు కూడా... మనం వాడే చాలారకాల ఇతర మందులు సైతం ప్లేట్లెట్ కౌంట్‌ను తగ్గించే అవకాశాలున్నాయి. ఉదాహరణకు ర్యానిటడిన్, సెఫలోస్పోరిన్, క్యాప్టప్రిల్, ఏసీ ఇన్హిబిటార్స్, బ్రూఫెన్,డైక్లోఫినాక్, యాస్పిరిన్ వంటి అనేక మందులు ప్లేట్లెట్ కౌంట్‌ను తగ్గించడం లేదా ప్లేట్లెట్ ఫంక్షన్‌ను ప్రభావితం చేస్తాయి. అందుకే రోగి పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతమరీ అవసరం అయితేనే యాంటి బయాటిక్స్‌తోపాటు ఏ ఇతర మందులనైనా ఇవ్వాలి. నివారణ ఎంతో మేలు... ఏ వ్యాధి విషయంలోనైనా చికిత్స కంటే నివారణ మేలు. ఇది నిల్వ నీటిలో సంతానోత్పత్తి చేసుకుంటుంది. ఈ ప్రక్రియ పదిరోజుల వ్యవధి పడుతుంది. కాబట్టి ఇల్లు, ఇంటి పరిసరాల్లో నీరునిల్వ అనేదే జరగకుండా ఒకరోజు నీటిని పూర్తిగా ఖాళీ చేసి డ్రై డే గా పాటించాలి.ఇంట్లోని మూలల్లో, చీకటి ప్రదేశంల్లో ఎడిస్ ఎజిపై్ట విశ్రాంతి తీసుకుంటుంది. కాబట్టి ఇల్లంతా వెలుతురు, సూర్యరశ్మి పర్చుకునేలా చూసుకోవాలి. అదే సమయంలో బయటి నుంచిదోమలు రాకుండా కిటికీలకు, డోర్స్‌కు మెష్ అమర్చుకోవాలి.ఈ దోమ నిల్వ నీటిలో గుడ్లు పెడ్తుంది కాబట్టి కొబ్బరి చిప్పలు, డ్రమ్ములు, బ్యారెల్స్, టైర్లు, కూలర్లు, పూలకుండీల కింద పెట్టే ప్లేట్లు మొదలైన వాటిల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. డ్రమ్ములు, బ్యారెల్స్ మొదలైన వాటిని బోర్లించి పెట్టాలి. వాడని టైర్లను తడిలేకుండా ఎండలో పడేయాలి. తాగు నీరు కాకుండా మిగతా అవసరాల కోసం వాడే నీటిలో బ్లీచింగ్ పౌడర్ కలపాలి. దీనివల్ల ఎడిస్ ఎజిపై్ట గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. ఇంట్లో ఉన్నప్పుడూ ఒంటి నిండా ఉండే దుస్తులనే ధరించాలి. హాఫ్ స్లీవ్స్ కంటే ఫుల్ స్లీవ్స్ ఉత్తమం. కాళ్లనూ కవర్చేసే పైజామాలు, సాక్స్ వేసుకుంటే మంచిది. ఏడిస్ ఈజిపై్ట దోమలు ముదురు రంగులకు తేలిగ్గా ఆకర్షితమవుతాయి. కాబట్టి లేత రంగుల దుస్తులను ధరించడం మేలు.పగలు కూడా మస్కిటో రిపల్లెంట్స్ వాడవచ్చు. ఆ రెపల్లెంట్ కంపోజిషన్‌లో పికారిటిన్ లేదా ఆయిల్ ఆఫ్ లెమన్ యూకలిప్టస్ లేదా ఐఆర్ 3535... ఈ మూడింటిలో ఏది ఉన్నా అది వాడవచ్చు. ఈ మస్కిటో రిపల్లెంట్స్ను ప్రతి 4 – 6 గంటలకు ఒకసారి శరీరంపై బట్టలు కప్పని భాగాల్లో స్ప్రే చేసుకోవాలి. ముఖం పైన స్ప్రే చేసుకునే సమయంలో ఇది స్ప్రే కళ్ల దగ్గర స్ప్రే చేసుకోకుండా జాగ్రత్త తీసుకోవాలి. డెంగ్యూకు చికిత్స ఇలా... డెంగ్యూ అనేది వైరస్ కాబట్టి దీనికి నిర్దిష్టమైన మందులు లేవు. కేవలం లక్షణాలకు మాత్రమే చికిత్స చేస్తుంటారు. అంటే సింప్టమేటిక్ ట్రీట్మెంట్ మాత్రమే ఇస్తారన్నమాట. రోగిలక్షణాలను బట్టి చికిత్స ఉంటుంది. వ్యాధి వచ్చిన వ్యక్తి బీపీ పడిపోకుండా ముందునుంచి ఓఆర్ఎస్ ఇవ్వాల్సి ఉంటుంది. షాక్‌లోకి వెళుతున్న వ్యక్తికి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించాలి.రక్తస్రావం జరుగుతున్న వ్యక్తికి తాజా రక్తాన్ని, ప్లేట్‌లెట్స్‌ను, ప్లాస్మా ఎఫ్ఎఫ్పి (ఫ్రెష్ ఫ్రోజెన్ ప్లాస్మా) అవసరాన్ని బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. ప్లేట్లెట్స్ కౌంట్ సాధారణంగా 20 వేల కంటే తక్కువకు పడిపోతే ప్రమాదం. కాబట్టి మరీ తక్కువకు ప్లేట్లెట్స్ సంఖ్య పడిపోయినప్పుడు ఎప్పుడు వాటిని ఎక్కించాలో డాక్టర్ నిర్ణయిస్తారు. చిన్నాపెద్ద తేడా లేకుండా డెంగ్యూ ఎవరికైనా సోకవచ్చు. ముఖ్యంగా గర్భిణీల పట్ల చాలా జాగ్రత్త వహించాలి. వారిలో జ్వరం వస్తే అది డెంగ్యూకావచ్చేమోనని అనుమానించి తక్షణం డాక్టర్‌ను సంప్రదించాలి. ఇక్కడ గుర్తుంచుకోడాల్సిన విషయం ఏమిటంటే... సాధారణ జ్వరం వచ్చిన వారికిఇచ్చినట్లుగా డెంగ్యూ బాధితులకు ఆస్పిరిన్, బ్రూఫెన్ వంటి మందులు ఇవ్వకూడదు. ఎందుకంటే ఆస్పిరిన్ రక్తాన్ని పలచబారుస్తుంది. డెంగ్యూ సోకినప్పుడు ప్లేట్లెట్స్ తగ్గి రక్తస్రావంఅయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఆస్పిరిన్ వంటి మందులు తీసుకుంటే రక్తస్రావం జరిగే అవకాశాలను మరింత పెంచుకున్నట్టే. ఇది చాలా ప్రమాదకరం కాబట్టే ఈ జాగ్రత్త పాటించాలి. అయితే గుండెజబ్బులు ఉన్నవారు ఆస్పిరిన్ మామూలుగానే వాడుతుంటారు. ఇలాంటివారు డెంగ్యూజ్వరం వచ్చినప్పుడు రక్తాన్ని పలచబార్చే మందులు వాడకూడదు. – ప్లేట్లెట్లు లక్ష కంటే తగ్గినప్పుడు ప్రతిరోజూ పరీక్ష చేయించుకోవాలి. అయితే రోజుకు ఒకసారి మాత్రమే ఈ పరీక్ష చేయించుకోవాలి. జ్వరం తగ్గాక ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది. కానీ ఒక్కొక్కసారి పెరిగాక, మళ్లీ తగ్గి, మళ్లీ పెరుగుతాయి. అయితే ప్లేట్లెట్ల సంఖ్య 20,000 కంటే తగ్గితే మాత్రం హాస్పిటల్లో చేరడం అవసరం. ప్రమాద హెచ్చరికలు ఇంట్లో ఎవరైనా విపరీతమైన కడుపునొప్పితో బాధపడ్తున్నా, మలవిసర్జన నలుపు రంగులో అవుతున్నా, ముక్కులోంచి కానీ, చివుళ్లలోంచి కానీ చర్మంలోపల కానీ బ్లీడింగ్ అవుతున్నా, దాహంతో గొంతెండి పోతున్నా, చెమటలు పట్టి శరీరం చల్లబడిపోయినా క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. -
దోమలు పెంచితే జైలే
-
దోమలు పెంచితే జైలే
ముసాయిదాలో ఏముంది? ⇒ అధికారులు నోటీసు ఇచ్చిన 24 గంటల్లోగా తమ పరిసరాల్లో దోమలను నివారించాలి ⇒ లేదంటే సంబంధిత అథారిటీ చర్యలు తీసుకుంటుంది ⇒ ఇళ్లు, తోపుడు బళ్లు, ఇతర స్థలాల్లో దోమలు పెరిగే పరిస్థితులు కల్పిస్తే రూ. 5 వేల వరకూ జరిమానా ⇒ భవన నిర్మాణం, హోటళ్లు తదితర చోట్ల రూ. 50 వేల ఫైన్, నెల రోజులు జైలుశిక్ష ⇒ త్వరలో కొత్త చట్టాన్ని అమలులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది సాక్షి, అమరావతి: దోమల పెంపకం ఏంటి.. జైలు ఏంటి, జరిమానా ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అసలు దోమలను ఎవరైనా పెంచుతారా అనుకుంటున్నారా? ఇటీవల దోమలపై దండయాత్ర చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు దోమల నియంత్రణకు కొత్త చట్టం తీసుకురాబోతోంది. తమ పరిసర ప్రాంతాల్లో దోమలు పెరిగే పరిస్థితులు కల్పిస్తే ఆయా ప్రాంతాల యజమానులపై జరిమానా విధించనున్నారు. అంతేకాదు జైలుకు కూడా పంపించనున్నారు. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లుకు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. త్వరలోనే బిల్లు చట్టరూపం దాల్చనుంది. ఈ చట్టం ప్రకారం.. నివాస గృహాలు, రహదారుల పక్కన తోపుడు బళ్లు పరిసర ప్రాంతాల్లో దోమలు పెరిగే వాతావరణం సృష్టిస్తే తొలిసారి రూ. వెయ్యి జరిమానా విధిస్తారు. అయినా కూడా రెండోసారీ అలాంటి వాతావరణాన్ని సరిదిద్దకపోతే రూ. ఐదు వేలు ఫైన్ వేస్తారు. అంతే కాకుండా దోమ గుడ్ల నివారణకు ఇచ్చిన గడువులోగా చర్యలు తీసుకోకపోతే రోజుకు రూ. వంద చొప్పున ఫైన్ కట్టాల్సి ఉంటుంది. దోమల గుడ్ల పెరుగుదలకు కారణమయ్యే ఖాళీ స్థలాలు, భవన నిర్మాణ స్థలాలు, హోటళ్లు, ఆహార నిల్వ సంస్థలు, కల్యాణ మండపాలు, మైనింగ్ ప్రాంతాలు, ప్రైవేట్, ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లకు తొలిసారి రూ. 25 వేలు.. రెండోసారి రూ. 50 వేలు జరిమానా విధిస్తారు. దీంతో పాటు నెల రోజుల పాటు జైలు శిక్ష కూడా వేసే అవకాశం ఉంది. కేంద్ర సంస్థలకు ఫైన్ తప్పదు.. రైల్వే స్టేషన్లు, పోస్టాఫీసులు, ఓడరేవులు తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో దోమల గుడ్ల పెరుగుదలకు కారణమైతే తొలిసారి రూ. 25 వేలు జరిమానా విధిస్తారు. రెండో సారైతే రూ. 50 వేలు జరిమానా విధించడంతో పాటు బాధ్యులైన వారికి నెల రోజులు జైలు శిక్ష కూడా విధిస్తారు. అలాగే దోమల గుడ్లు పెరగడానికి కారణమైన ఇళ్లు, ఇతర భవనాలు, స్థలాలను తనిఖీ చేసే అధికారాన్ని సంబంధిత అథారిటీకి చట్టంలో కల్పించనున్నారు. దోమల నియంత్రణ చర్యల్లో ఉన్న అధికారులను ఆయా స్థలాల యజమానులు అడ్డుకుంటే.. జరిమానాతో పాటు మూడు నెలల పాటు జైలు శిక్ష కూడా విధించనున్నారు. స్థానిక సంస్థల పరిధిలోని డ్రైయిన్లు, కాల్వలు, ఇతర నీటి సంస్థలు దోమలు పెరగకుండా చర్యలు తీసుకోవాలి. దోమల నివారణ చర్యలు చేపట్టంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత స్థానిక సంస్థల చైర్మన్లు లేదా అథారిటీపై కూడా కేసు నమోదు చేయనున్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు తమ పరిసరాల్లో దోమల నివారణను ఒక విధిగా పరిగణించాలని చట్టంలో స్పష్టం చేయనున్నారు. స్థల యజమాని లేదా ఆ పరిసరాల్లో నివాసం ఉంటున్న వారు తప్పనిసరిగా చేయాల్సిన పనులు. ► నీటితో ఉన్న ఖాళీ డబ్బాలు, బాటిళ్లు, కొబ్బరి బొండాలు, టైర్లు తదితర వాటిల్లో దోమలు గుడ్లు పెడతాయి కాబట్టి.. పరిసరాల్లో అలాంటి వాటిని తొలగించాలి. ► నీరు సాఫీగా పోయేందుకు డ్రైనేజీ పైపుల్లో ఆటంకాలు లేకుండా చూడాలి. బావులు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలి. ► నివాస ప్రాంతాల్లో దోమల పెరగడానికి దోహదపడే కుళ్లిన కూరగాయలు, ఇతర చెత్త చెదారాలను తొలగించాలి. ► దోమల గుడ్లు పెరుగుదలకు ఎటువంటి పరిస్థితులున్నా అలాంటి వాటిని నివారించేందుకు చర్యలు తీసుకోవాలి. ► యజమానులకు నోటీసులిచ్చినా పట్టించుకోని సమయంలో.. అథారిటీ దోమల నివారణ చర్యలు చేపట్టి అందకయ్యే వ్యయాన్ని ఆయా వ్యక్తుల నుంచి వసూలు చేస్తుంది. ► డెంగీ వ్యాధి నివారణకు ఎటువంటి వ్యాక్సిన్ గానీ ప్రత్యేకంగా చికిత్స గానీ లేదని, ఈ నేపథ్యంలో వ్యాధి సోకకుండా ముందస్తు నివారణ చర్యలను చేపట్టడం ఒకటే మార్గమని ప్రభుత్వం అభిప్రాయపడింది. డెంగీతో పాటు మలేరియా, ఫైలేరియా, చికున్‌గున్యా, మెదడువాపు తదితర వ్యాధుల నివారణకు దోమలను గుడ్లు దశలోనే నిర్మూలించాల్సి ఉందని ప్రభుత్వం పేర్కొంది. -
డెంగీ నిర్ధారణ ఇక చాలా సులువు
కేవలం రూ.700కే ఐపీఎఫ్ పరీక్షలను అందుబాటులోకి తెచ్చిన ‘యశోద’ హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా యశోద ఆస్పత్రి వైద్యులు అతి తక్కువ ఖర్చుతో డెంగీ వ్యాధిని నిర్ధారించే అత్యాధునిక పరీక్షా పద్ధతిని అందుబాటులోకి తెచ్చారు. వ్యాధి ఏ దశలో ఉంది? ఏ చికిత్స అవసరం? అనే అంశాలు కేవలం రూ.700 లతో పరీక్ష చేయించుకుంటే తేలిపోతుంది. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో డెంగీ నిర్ధారణకై అత్యాధునిక ఇమ్మెచ్యూర్ ప్లేట్లెట్ ఫ్రాక్షన్ (ఐపీఎఫ్) టెస్ట్‌ను వైద్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్ మెడికల్ డెరైక్టర్ డాక్టర్ ఎ.లింగయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో చాలా ఆస్పత్రుల్లో డెంగీ వ్యాధిని గుర్తించేందుకు సరైన పరిజ్ఞానం లేకపోవడంతో ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారని చెప్పారు. ఐపీఎఫ్ పరీక్ష ద్వారా బోన్‌మ్యారో పనితీరు అంచనా వేసే అవకాశంలో పాటు బోన్‌మ్యారోలో లోపం ఉంటే మెరుగైన చికిత్సలు అందించి పేషెంట్ ప్రాణాన్ని కాపాడవచ్చన్నారు. ప్రస్తుతం ఐపీఎఫ్ టెస్ట్‌తో పాటు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ పరీక్షను అందుబాటులోకి తెచ్చామన్నారు. -
రుద్రారంలో బాలికకు డెంగీ
హైదరాబాద్‌లో చికిత్స గ్రామంలో మరికొందరికి విషజ్వరాలు చిన్నశంకరంపేట: డెంగీ వ్యాధితో బాలిక అస్వస్థతకు గురైన సంఘటన మండలంలోని రుద్రారం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చాకలి వినోద్ కూతురు ధనలక్ష్మి చిన్నశంకరంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. వారం క్రితం విషజ్వరంతో బాధపడుతుండగా స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అయినా తగ్గకపోవడంతో సికింద్రాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా డెంగీ సోకినట్లు నిర్ధారించారు. దీంతో అక్కడ చికిత్సలు అందించారు. గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయడంతో గ్రామానికి చేరుకున్నారు. బాధిత బాలిక తండ్రి వినోద్ మాట్లాడుతూ బాలికకు జ్వరం ఉందని ఆస్పత్రికి తీసుకుపోతే హైదరాబాద్ తీసుకుపొమ్మన్నారన్నారు. అక్కడి డాక్టర్లు పరీక్షలు నిర్వహించి డెంగీ వ్యాధి సోకినట్లు నిర్ధారించారని తెలిపారు. సుమారు రూ. లక్ష వైద్యం కోసం ఖర్చయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వైద్యం ఖర్చులను అందించి ఆదుకోవాలని కోరారు. కాగా గ్రామంలో అనేక మంది విషజ్వరాలతో బాధపడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. వైద్య అధికారులు గ్రామానికి వచ్చి వైద్య పరీక్షలు చేయాలని కోరారు. ఇదే విషయం చిన్నశంకరంపేట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సవిత దృష్టికి తీసుకుపోగా బాలికకు డెంగీ వ్యాధి వచ్చిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. గ్రామానికి వైద్య సిబ్బందిని పంపించి వైద్య పరీక్షలు చేయిస్తానన్నారు. -
టీడీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం
చిత్తూరు: వరదాయపాల్యం మండలంలో టీడీపీ ఎమ్మెల్యే ఆదిత్యకు చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే కాన్వాయ్‌ను రాచకండ్రిగ గ్రామస్తులు సోమవారం అడ్డుకున్నారు. తమ వాడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పట్టించుకోలేదంటూ ఎన్నికల తర్వాత ఇప్పుడు గుర్తొచ్చామాంటూ ఎమ్మెల్యే ఆదిత్యపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే వరదాయపాల్యంలో సీజనల్ వ్యాధులు విజృభించడంతో నిన్న డెంగ్యూ వ్యాధితో తొమ్మిదేళ్ల బాలిక మృతిచెందింది. ఎన్నికలు జరిగిన చాలాకాలం తర్వాత ఎమ్మెల్యే వారి గ్రామానికి రావడంతో గ్రామస్తులు ఆయన కాన్వాయ్‌ను అడ్డుకుని ఆందోళన వ్యక్తం చేశారు. -
డేంజరస్ డెంగీ !
దోమలతోనే వ్యాధి వ్యాప్తి నేడు జాతీయ డెంగీ దినోత్సవం దోమతెరలపై అవగాహన అవసరం ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలి డెంగీ వ్యాధి ప్రమాదకరమైంది. ఈ వ్యాధి దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిచెందుతుంది. పరిసరాల్లో నీళ్లు నిల్వ ఉండ టం, పారిశుద్ధ్య సమస్యలు లోపించడం వల్ల వాటిలో దోమ లు స్థావరాలను ఏర్పరచుకుంటాయి. ఇవి కుట్టడం వల్ల వ్యాధి వస్తుంది. సోమవారం జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం... - అర్వపల్లి వ్యాధి వ్యాపించే విధానం.. ఈ వ్యాధి ఒక రకమైన ఆర్బో వైరస్ వల్ల సంక్రమిస్తుంది ఒకరి నుంచి మరొకరికి ఏడీస్ ఈజిప్టై అనే దోమ కాటు వలన వ్యాప్తి చెందుతుంది ఈ దోమలు పగలేకుడుతాయి. ఈ రకమైన దోమలు ఇళ్ల పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిలో వృద్ధి చెందుతాయి. ఈ దోమలు గుడ్లు పెట్టి పెరుగుటకు కింద తెలిపిన వస్తువులు, పరిసరాలు అనుకూలమైనవి. ఎయిర్‌కూలర్స్, రిఫ్రిజిరేటర్లు, పూలకుండీలు, బయట పడేసిన టైర్లు, నీరు నిల్వ ఉన్న తొట్లు, కుండీలు, ఖాళీ డ్రమ్ములు, భవనాలపై నిలిచిన వాన నీటిలో పనికిరాని, పగిలిన వస్తువుల్లో ఉంటాయి. దోమల నివాసాలను తొలగించుట.. నీటినిల్వను, పనికి రాని కూలర్లను, టైర్లు, పాత్రలు, డ్రమ్ములు, పూలకుండీలు, పనికి రాని వాటిని ఇళ్లు, వెలుపల నీటి నిల్వలను పారబోయూలి. నీటి ట్యాంకులకు మూతలు ఉంచాలి. నీటి నిల్వ గల వాటిని వారానికి ఒకసారి ఖాళీ చేస్తూ వారంలో ఒక రోజు డ్రైడే(పొడిదినం) విధానం పాటించాలి. వ్యక్తిగత జాగ్రత్తలు.. దోమతెరలు, నివారణ మందులు వాడి దోమకాటు నుంచి విముక్తి పొందవచ్చు. శరీరమంతా రక్షణ కలిగే విధంగా దుస్తులు ధరించాలి. ముఖ్యంగా పిల్లలకు శరీర భాగాలు పూర్తిగా కప్పబడునట్లు దుస్తులు వేయాలి. చికిత్స.. ఈ వ్యాధికి సొంత చికిత్స చేయకూడదు. ఆస్ప్రిన్, బ్రూఫెన్, కాంబ్లీఫాం, అనాలజిన్ లాంటి మాత్రలు తీసుకోకూడదు. డెంగ్యూ వస్తే రక్తంలో ప్లేట్లెట్లు తగ్గుతాయని భయపడుతూ ఎంతో మంది రక్తనిధులకు పరుగులు తీస్తారు. ఈ ప్లేట్లెట్ల గురించి అ వగాహన పెంచుకోవాలి. రక్తంలో తెల్లరక్తకణాలు, ఎర్రరక్త కణాలతో పాటు ప్లేట్లెట్లు కూడా ఉంటాయి. ఇవి రక్తస్రావం జరగకుండా రక్తం గడ్డ కట్టడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. సాధారణంగా మన రక్తంలో ఈ ప్లేట్లెట్ కణాలు 1.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకు ఉంటాయి. వీటి సంఖ్య బాగా పడిపోతే రక్తస్రావం కావడానికి దారితీస్తుంది. జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి వాటిని తొలగించాలి. పనికిరాని, వాడుకలో లేని వస్తువులను తొలగించి వేయాలి. ఓవర్‌హెడ్ ట్యాంకులు, సంపులు, డ్రమ్ములు, నీటి తొట్లపై మూతలు పెట్టాలి. ప్రతి శుక్రవారం పొడి దినంగా పాటించాలి. సమాజ పరంగా గ్రామాల్లో వీధులు, మురుగు కాల్వల్లో చెత్తా చెదారం తొలగించాలి. వర్షాలకు ముందు తర్వాత మురికి కాలువల్లో పూడికతీత చేపట్టి, నీరు పారేటట్లు చూడాలి. గ్రామపెద్దలు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు, నాయకులు ప్రజల్లో డెంగ్యూపై అవగాహన కల్పించాలి. వ్యాధి ప్రబలంగానే ఆరోగ్య సిబ్బందికి తెలియజేసి వారి సూచనలు, సలహాలు పాటించాలి. - ఓం ప్రకాష్, జిల్లా మలేరియా అధికారి -
జికా వైరస్‌పై అప్రమత్తం
వైద్యాధికారుల సమీక్షలో కలెక్టర్ ఆదేశం విశాఖపట్నం: జికా వైరస్ వ్యాధిని ఎదుర్కొనేందుకు ముందస్తు ఏర్పాట్లతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం జికా వైరస్ వ్యాధిపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ వైరస్ ప్రస్తుతం అమెరికా, బ్రెజిల్, ఆఫ్రికా, సౌత్ఈస్ట్ ఏషియా, పసిఫిక్ ఐలాండ్స్‌లో వ్యాప్తి చెందిందన్నారు. మన దేశంలో ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు కానప్పటికీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎయిర్‌పోర్టులు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో జికా వైరస్‌పై అవగాహనకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ వ్యాధి ఎక్కువగా గర్భిణులు, నవజాతశిశువుల్లో కనిపిస్తున్నట్లు వరల్త్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరికలు జారీ చేసిందన్నారు. జికా వైరస్ వ్యాధి డెంగ్యూ వ్యాధి లక్షణాలను పోలి ఉంటుందని, పగటిపూట కుట్టే దోమ ద్వారానే ఈవ్యాధి వ్యాపిస్తుదని వివరించారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ నీటికుండీలకు మూతలుపెట్టడం, నిల్వ నీటిని లేకుండా చూడడం, ఖాళీ కొబ్బరిబొండాలు, టైర్లు లేకుండా చూసుకోవాలని కోరారు. ప్రతి రోజు శుక్రవారం డ్రైడేగా పాటించాలన్నారు. గత రెండేళ్లలో డెంగ్యూ వచ్చిన ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వైద్యులు అందుబాటులో ఉండాలి అన్ని ప్రాథమిక వైద్య కేంద్రాల్లో వైద్యులంతా అన్ని వేళల్లో అందుబాటులో ఉండాలని, విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. మాతృ మరణాలపై నిర్వహించే నెలవారీ సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరిలో ఏజెన్సీ ప్రాంతాల్లో రెండు గ్రామీణ ప్రాంతాల్లో రెండు, పట్టణ ప్రాంతాల్లో ఒకటి మొత్తం ఐదు మాతృ మరణాలు సంభవించడంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జె.సరోజని, డీఆర్డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్, డీపీవో వెంకటేశ్వరరావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.