పింప్రిలో డెంగీ వ్యాధి జోరు | Rapid action squad formed for dengue disease | Sakshi
Sakshi News home page

పింప్రిలో డెంగీ వ్యాధి జోరు

Published Sun, Sep 14 2014 10:08 PM | Last Updated on Sat, Sep 2 2017 1:22 PM

Rapid action squad formed for dengue disease

 పింప్రి, న్యూస్‌లైన్ : నగరంలో డెంగీ వ్యాధి విజృంభిస్తోంది. అనేకమంది ఇప్పటికే ఈ వ్యాధిబారినపడ్డారు. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్ ఆరోగ్య విభాగం యుధ్ధప్రాతిపదికన ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యాధిపీడితుల సంఖ్య స్వల్పంగానే ఉంది. కాగా ఈ వ్యాధి మరింత విజృం భించే అవకాశముందంటూ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య విభాగం అధికారులు ఇప్పటికే హెచ్చరించారు.

 అంతేకాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. అయితే ఈ సూచనలను కార్పొరేషన్లు పట్టించుకోకపోవడంతో డెంగీ పీడితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దోమల నివారణకు మందులను సమకూర్చకపోవడం, మొక్కుబడిగా నోటీసులు పంపడం తదితర కారణాల వల్ల దోమలు విపరీతంగా వృద్ధి చెందాయి. దీనికి తోడు వాతావరణం కూడా దోమల సంఖ్య పెరిగేందుకు దోహదం చేసింది. గతంతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఈసారి డెంగీ రోగుల సంఖ్య తక్కువగా నమోదైంది.

ఈ వ్యాధిపీడితులకు ప్రాథమిక దశ నుంచే పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నామని, అంతేకాకుండా ర్యాపిడ్ యాక్షన్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశామని జిల్లా పరిషత్ ఆరోగ్య అధికారి డాక్టర్ నందకుమార్ దేశ్‌ముఖ్ తెలిపారు.వాతావరణంలో మార్పులే డెంగీకి కారణమని పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్.టి.పరదేశీ పేర్కొన్నారు. నగరవాసులకు ఈవ్యాధిపై అవగాహన కల్పిస్తున్నామన్నా రు. పుణేలో ఈ ఏడాది జూన్‌లో 279 మంది, జూలైలో 630 మంది, ఆగస్టులో 591మంది, సెప్టెంబరులో 466 మంది ఈ వ్యాధిబారినపడ్డారు. డెంగీ రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో దీనిని నియంత్రించే దిశగా కార్పొరేషన్ ఆరోగ్య విభాగం అడుగులు వేస్తోంది.

 దోమలు బాగా వృద్ధి చెందుతున్న ప్రాంతాలను గుర్తించడం ప్రారంభించింది. స్వార్‌గేట్ ప్రాంతంలో టైర్లను ఉంచిన ప్రదేశాలలో దోమల ఉత్పత్తిని గమనించిన కార్పొరేషన్ అధికారులు సంబంధిత దుకాణదారులకు రూ. పదివేల మేర జరిమానా విధించారు. మరో 38 ప్రదేశాలను గుర్తించి సంబంధితులకు నోటీసులను జారీ చేశామని కార్పొరేషన్ కీటక నాశిని విభాగం అధికారి డాక్టర్ సంజీవ్ వావరే తెలిపారు. డెంగీ రోగుల సంఖ్య నానాటికీ పెరగడం రాజకీయ పార్టీలకు ఓ ఆయుధం లభించినట్లయింది. దీనిపై ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్న కార్పొరేషన్ కమిషన ర్ కుణాల్ కుమార్ ఆరోగ్య శాఖ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి వారిని పరిశీలనకు పంపుతున్నారు.

 పుణేలోనూ...
 పుణే నగరంలోనూ నానాటికీ  ఈవ్యాధిపీడితుల సంఖ్య పెరుగుతోంది. దీంతో చికిత్సకు అవసరమైన ప్లేట్‌లెట్లకు డిమాండ్  విపరీతంగా పెరిగిపోయింది. ఆగస్టు నెలలో నగరంలో ప్రతి రోజూ సగటున 19 మంది ఈ వ్యాధి బారినపడగా, ఈ నెలలో ఆరంభం లో ఈ సంఖ్య 36కు చేరుకుంది. కాగా 15 రోజులుగా ప్లేట్‌లెట్‌లకు డిమాండ్ విపరీతంగా పెరగడంతో బ్లడ్ బ్యాంకుల్లోనూ ఇవి లభించడం లేదని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆస్పత్రి డాక్టర్ ఆన ంద్ చాఫేకర్ తెలిపారు.దాతల నుంచి తీసుకున్న రక్తంలోని ప్లేట్‌లెట్లను వేరుచేసేందుకు ఐదు రోజులు పడుతోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement