వారంపాటు లాక్‌డౌన్‌.. కుటుంబాలు రోడ్డున పడతాయి | Pune Imposes Night Curfew To Control COVID19 Surge | Sakshi
Sakshi News home page

వారంపాటు లాక్‌డౌన్‌.. కుటుంబాలు రోడ్డున పడతాయి

Published Sun, Apr 4 2021 12:00 AM | Last Updated on Sun, Apr 4 2021 9:00 AM

Pune Imposes Night Curfew To Control COVID19 Surge - Sakshi

సాక్షి, ముంబై: పుణే, పింప్రి–చించ్‌వడ్‌ కార్పొరేషన్లలో వారం రోజులపాటు విధించిన లాక్‌డౌన్‌ను హోటల్‌ రంగాల యజమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. లాక్‌డౌన్‌ను కాలా దివస్‌గా అభివర్ణించారు. కాగా, పుణేలో లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిందని, వారంపాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని పుణే రీజినల్‌ పోలీస్‌ కమిషనర్‌ సౌరబ్‌ రావ్‌ విలేకరులతో వెల్లడించారు. అయితే పుణేలో హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు మూసివేయాలని తీసుకున్న నిర్ణయాన్ని యునైటెడ్‌ హాస్పిటాలిటీ అసోసియేషన్, రెస్టారెంట్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు అజింక్య షిండే తప్పుబట్టారు. ‘‘గత సంవత్సరం విధించిన లాక్‌డౌన్‌ వల్ల 40 శాతం హోటళ్లు, రెస్టారెంటు ఇప్పటికే మూతపడ్డాయి. దీని కారణంగా ఆర్థికంగా నష్టపోయాం, ఈ షాక్‌ నుంచి ఇంతవరకు తేరుకోనేలేదు. మళ్లీ లాక్‌డౌన్‌ అమలు చేయడమేంటి. ప్రస్తుతం 50 శాతం వ్యాపారాలు నడుస్తున్నాయి. నష్టాల్లో ఉన్నప్పటికీ కస్టమర్లకు సేవలందించాలనే ఉద్ధేశంతో ఎలాగో కొనసాగిస్తున్నాం. హోటళ్లు మూసివేయడం వల్ల లక్షలాది మంది ఉపాధి కోల్పోతున్నారు. దీనికి ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందా...?’’ అని అజింక్య నిలదీశారు.  

ఆర్డర్లు తగ్గడంతో.. 
పుణే–పింప్రి–చించ్‌వడ్‌ జంట నగరాలలో అనేక ఐటీ, ఆటోమెబైల్, ఇంజినీరింగ్, వైద్య, విద్యా సంస్థలున్నాయి. రాష్ట్రంతోపాటు దేశంలోని నలుమూలల నుంచి ఏటా లక్షలాది మంది విద్య, ఉద్యోగ, ఉపాధి వేటలో వస్తుంటారు. వీరంతా ఒంటరిగా, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటంతో రెండు పూటల భోజనం కోసం హోటళ్లపై ఆధారపడతారు. కానీ, వాటిని మూసివేయడం వల్ల పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చింది. గత్యంతరం లేక స్విగ్గి, జోమాటో ద్వారా ఆన్‌లైన్‌లో భోజనం, టిఫిన్‌లను ఆర్డర్‌ చేస్తే వారు ఎక్కువ చార్జీలు వేస్తూ కస్టమర్ల నడ్డి విరుస్తున్నారు. లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న తెలుగు హోటల్‌ యజమానులు.. జంట నగరాలలోని హింజ్వాడి, తాతేవాడి, బోసరి, ఎంఐడీసీ, చాకణ్, చికిలీ, విశ్రాంతి వాడి, కల్యాణ్‌ నగర్, మగర్‌ పట్టా, క్యాంపు తదితర ప్రాంతాలలో తెలుగువారు హోటళ్లు హాస్టళ్లు నడుపుతున్నారు. గత ఏడాది విధించిన లాక్‌డౌన్‌ వల్ల సగానికి పైగా మూతపడ్డాయి. దీంతో అనేక మంది స్వగ్రామాలకు తరలిపోయారు. మళ్లీ రావడానికి జంకుతున్నారు. ఉన్న వారిలో కొందరు పెద్ద హోటళ్ల స్థాయి నుంచి చిన్నచిన్న పార్శిల్‌ అందించే స్టాళ్ల స్థాయికి మారిపోయారు.  

వారంపాటు లాక్‌డౌన్‌ 
సాక్షి, ముంబై: రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు పుణే సిటీతోపాటు పింప్రి–చించ్‌వడ్, జిల్లాలో శనివారం నుంచి వారం రోజులపాటు లాక్‌డౌన్‌ విధించారు. ఈ సందర్భంగా హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, మాల్స్, సినిమా హాళ్లు, పుణే సిటీ బస్సులు, వివిధ మతాల ప్రార్థనా మందిరాలు, వారాంతపు సంతలు, మార్కెట్లు వారం రోజులపాటు మూసి ఉంటాయి. పగలు 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు నైట్‌ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. దీంతో పుణేకర్లు సాయంత్రం ఆరు లోపే ఇళ్లకు చేరుకోవల్సి ఉంటుంది. అయితే పెళ్లిలు, అంత్యక్రియలు మినహా ఇతర ఎలాంటి శుభకార్యాలు, సామాజికి సేవా, సంస్కృతిక కార్యక్రమాలు, రాజకీయ సభులు, ఇతర కార్యక్రమాలపై నిషేధం విధించారు.

రోజురోజుకు పెరుగుతున్న కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకుని ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్‌చార్జీ మంత్రి అజిత్‌ పవార్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పుణే జిల్లాలో పెరుగుతున్న కరోనా వైరస్‌పై ఆరా తీశారు. దీంతో కరోనా నియంత్రణకు లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత రీజినల్‌ పోలీసు కమిషనర్‌ సౌరబ్‌ రావ్‌ విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే కార్యాలయాలు సాయంత్రం 6 గంటలకు మూసివేస్తారు. దీంతో విధులు ముగించుకుని సాయంత్రం ఇళ్లకు వెళ్లే ఉద్యోగులను పోలీసులు ఎలాంటి ఇబ్బందులకు గురిచేయరని ఆయన అన్నారు. కరోనా నియమాలు కచ్చితంగా అమలు చేసేందుకు పెట్రోలింగ్‌ నిరంతరం జరుగుతుందని రావ్‌ స్పష్టంచేశారు. 

అమల్లోకి ఆంక్షలు.. 
హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, మాల్స్, సినిమా థియేటర్లు, పుణే సిటీ బస్సులు, ప్రార్థన మందిరాలు మూసిఉంటాయి. ఎలాంటి ధార్మిక, సంస్కృతికి కార్యక్రమాలకు అనుమతి లభించదు. ఏప్రిల్‌ 30వ తేదీ వరకు పాఠశాలలు, కాలేజీలు మూసి ఉంటాయి. కానీ, పరీక్షలు జరుగుతాయి. హోటళ్లు తెరిచే ఉంచుతారు, తినుబండారాలు పార్శిల్స్‌ ఇచ్చేందుకు అనుమతి ఉంది. మెడికల్, తదితర అత్యవసర సేవలు కొనసాగుతాయి. పెళ్లికి ఇరువైపుల నుంచి కేవలం 50 మంది హాజరుండాలి. ఇదివరకు అనుమతి పొందిన పెళ్లిళ్లే జరగాలి. కొత్త వాటికి అనుమతి లేదు. అదేవిధంగా అంత్యక్రియలకు కేవలం 20మంది ఉండాలి. ఉద్యానవనాలు ఉదయం తెరిచి ఉంటాయి.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement