కోవిడ్ ఆంక్షల్ని లెక్కచేయకుండా ముంబైలోని జుహూ బీచ్‌లో భారీ సంఖ్యలో గుమిగూడిన ప్రజలు
సాక్షి ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మినీ లాక్ డౌన్ (పాక్షిక లాక్ డౌన్)ను ప్రకటించింది. ఉదయం సెక్షన్ 144, నైట్ కర్ఫ్యూతోపాటు వీకెండ్‌లో అంటే వచ్చే శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి సోమవారం ఉదయం ఏడు వరకు (శని, ఆది) సంపూర్ణ లాక్‌డౌన్ ఉండనుంది. అత్యవసర సేవలను ఈ ఆంక్షల నుంచి మినహాయించారు. ఆంక్షలు సోమవారం ఉదయం అమల్లోకొస్తాయి. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి.
మినీ లాక్‌డౌన్ నిర్ణయాన్ని ప్రతిపక్ష నాయకులు స్వాగతించారు. ప్రజలందరూ సహకరించాలని ప్రతిపక్ష నేతలు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఈ నియమాలను అమలు చేసేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తుందని దీంతో లాక్‌డౌన్ పరిస్థితులు ఏర్పడ్డాయని ఈ విషయంపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా ముఖ్యమంత్రి అనేక మంది నిపుణులు, పారిశ్రామిక వేత్తలు, పత్రిక యాజమాన్యం, సంపాదకులతోపాటు దాదాపు అన్ని రంగాల వారితోపాటు ప్రతిపక్ష నాయకులతో చర్చలు జరిపారు. ఇలా అందరితో చర్చలు జరిపిన అనంతరం ఆదివారం మంత్రి మండలి సమావేశం నిర్వహించారు.
పాక్షిక లాక్‌డౌన్ అమలు చేయాలని ఈ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలో కరోనాకు అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో కరోనా రోగుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి. ముఖ్యంగా శనివారం 49447 కరోనా కేసులు నమోదుకాగా ఈ సంఖ్య ఆదివారం 57 వేలు దాటింది. మినీలాక్ డౌన్‌లో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో పనిచేయాలి. ప్రైవేట్ ఉద్యోగులు ఇంటి నుంచి (వర్క్ ఫ్రం హోం) పనులు చేయాలి. హోటళ్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, «ధార్మిక, దర్శనీయ స్థలాలు, మైదానాలు, జిమ్‌లు, సెలూన్లు మూసి వేయనున్నారు. హోటళ్లు పార్సిల్ సేవలు కొనసాగించవచ్చు. రైళ్లు, విమాన సేవలు యథావిధిగా కొనసాగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment