సాక్షి, ముంబై: బ్రేక్ ది చైన్‌లో భాగంగా ఇటీవల ప్రభుత్వం అమలుచేసిన సెమీ లాక్‌డౌన్‌తో పరిస్థితులు అదుపులోకి వచ్చిన దాఖలాలేమి కనిపించడం లేదని, దీంతో రాష్ట్రంలో మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్ విధించే అవకాశాలున్నాయని సహాయ, పునరావస శాఖ మంత్రి విజయ్ వడెట్టివార్ తెలి పారు. దీనిపై రెండు రోజుల్లో ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే నిర్ణయం తీసుకుంటారని సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వడెట్టివార్ స్పష్టంచేశారు. రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదవుతున్న కరోనా కేసులతో ప్రభుత్వం ఆందోళనలో పడిపోయింది. దీంతో బ్రేక్ ది చైన్‌లో భాగంగా పగలు 144 సెక్షన్, రాత్రి నైట్ కర్ఫ్యూ, వీకెండ్‌లో సెమి లాక్‌డౌన్ అమలుచేసిన సంగతి తెలిసిందే.
కానీ, పరిస్థితులు అనుకున్నంత మేర అదుపులోకి వచ్చినట్లు వాతావరణం ఎక్కడ కనిపించలేదు. దీంతో ప్రభుత్వం గందరగోళంలో పడిపోయింది. ఇటీవల ఢిల్లీలో ప్రభుత్వం ఆరు రోజుల సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేసింది. అక్కడ ఎలా అమలు చేశారో, అదే పద్దతిలో రాష్ట్రంలో అమలు చేయాలని, అందుకు అవసరమైన సలహాలు, సూచనలు సేకరిస్తున్నామని వడెట్టివార్ వెల్లడించారు.
ఢిల్లీలో లాక్‌డౌన్ పరిశీలిస్తున్నాం..
ముంబైతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అమలుచేసిన లాక్‌డౌన్‌కు ప్రజల నుంచి పూర్తిస్థాయిలో స్పందన రావడం లేదు. మొన్నటి వరకు లాక్‌డౌన్‌ను వ్యాపార సంఘటనలు వ్యతిరేకించాయి. కానీ, ఇప్పుడు అదే వ్యాపార సంఘటనలు వంద శాతం లాక్‌డౌన్‌కు డిమాండ్ చేస్తున్నాయని వడెట్టివార్ గుర్తుచేశారు. ఈ విషయాన్ని ఉద్దవ్‌ఠాక్రే దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. రెండు రోజుల్లో ఉద్దవ్ లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు.
కరోనా రెండో దఫా ఉంటుందని గతంలోనే ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు హెచ్చరించారు. అయితే కరోనా తీవ్రత తక్కువ స్థాయిలో ఉంటుండవచ్చని అందరు భావించారు. కానీ, తాజా పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. తీవ్రత ఈ స్థాయిలో ఉంటుందని ఎవరూ ఊహించలేకపోయారని మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. ఢిల్లీలో అమలుచేసిన సంపూర్ణ లాక్‌డౌన్ గురించి ఆరా తీస్తున్నామని, ఎలాంటి నియమ, నిబంధనలు అమలు చేస్తున్నారు? ఫలితాలు ఎలా ఉన్నాయి? తదితరాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. చదవండి: (దేశవ్యాప్త లాక్‌డౌన్‌లు పరిష్కారం కాదు: టాటా)
కేంద్రం సాయం చేయాలి..
కరోనాతో పోరాడేందుకు మహా వికాస్ ఆఘాడీ ప్రభుత్వం దాదాపు రూ.5,500 కోట్లు కేటాయించిందని మంత్రి తెలిపారు. అదేవిధంగా కోవిడ్‌ను నియంత్రించాలంటే ఆరోగ్య శాఖను మరింత బలోపేతం చేయాలని అభిప్రాయం వ్యక్తంచేశారు. రెమ్‌డెసివిర్ మందులు, ఆక్సిజన్ ప్లాంట్, బెడ్ల సంఖ్య పెంపు వీటన్నింటికి రూ.3,300 కోట్లు వరకు అవసరం ఉంటుందని తెలిపారు. అలాగే ఎమ్మెల్యేలు తమ నిధుల నుంచి రూ.కోటి ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇతర ఆదాయ వనరులు కూడా ఉన్నాయని మంత్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ఏప్రిల్ 3వ తేదీన రూ.1,200 కోట్లు అందజేసిందని, కాని ఈ ఏడాది ఏప్రిల్ 19వ తేదీ పూర్తికావస్తునప్పటికీ ఇంతవరకు నిధులు రాలేదన్నారు. ఆలస్యమైనప్పటికీ ఈ సారి రూ.1,600 కోట్లు లభిస్తాయని ఆశిస్తున్నట్లు వడెట్టివార్ అన్నారు. చదవండి: (కరోనాపై ఏం చేద్దాం చెప్పండి..)
Comments
Please login to add a commentAdd a comment