సాక్షి ముంబై: మహారాష్ట్రలో లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే పేర్కొన్నారు. కరోనాకు అడ్డుకట్ట వేయాలంటే లాక్‌డౌన్ మినహా మిగత ఎలాంటి ప్రత్యామ్నాయం లేదన్నారు. మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇలాంటి నేపథ్యలో మినీ లాక్‌డౌన్, వీకెండ్ లాక్‌డౌన్ ప్రభావం అంతగా చూపడంలేదని తెలుస్తోంది. ముఖ్యంగా మినీ లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన అనంతరం కూడా రోజు రోజుకి కరోనా రోగుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా యాక్టివ్ కేసుల సంఖ్య అయిదు లక్షలు దాటింది. ఈ సంఖ్య ప్రపంచంలోనే ఏడవ స్థానంలో ఉండగా మరోవైపు ప్రతి రోజు కరోనా రోగుల సంఖ్య 60 వేల చేరువలో నమోదవుతోంది. ఈ సంఖ్య ప్రపంచంలోనే మూడవ స్థానం, మరోవైపు మృతుల సంఖ్య పెరుగుతోంది. వీటన్నింటి దృష్ట్యా రాష్ట్రంలో లాక్ డౌన్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఈ విషయంపై ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే శనివారం సాయంత్రం ఆన్‌లైన్‌లో అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ఇతర మహావికాస్ ఆఘాడి నేతలలతోపాటు ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్, మహారాష్ట్ర చీఫ్ సెక్రటరి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా రాష్ట్రంలోని కరోనా పరిస్థితి, లాక్‌డౌన్ అంశంపై చర్చలు జరిగాయి.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ లాక్‌డౌన్ మినహా ఎలాంటి ప్రత్యామ్నయం లేదని పేర్కొన్నారు. ముఖ్యంగా ఏప్రిల్ 15వ తేదీ తర్వాత ప రిస్థితి మరింత దారుణంగా మారే అవకాశాలున్నాయన్నారు. సెకండ్ వేవ్‌లో యువత కూడా పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. ఇలాంటి నేపథ్యలో ప్రజల ప్రాణాలు ముఖ్యమని దీంతో కొంత కష్టమైన కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదన్నారు. కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు ముందుగా కనీసం ఎనిమిది రోజుల లాక్‌డౌన్ విధించి ఆ తర్వాత ఆంక్షలను కొంత శిథిలం చేస్తూ ఒక్కొ సేవలను ప్రారంభిస్తామంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. లాక్‌డౌన్ విధించినట్టయితే నెల రోజుల్లో పరిస్థితిని నియంత్రణలోకి వచ్చేఅవకాశాలున్నాయన్నారు. అయితే నిపుణులు మాత్రం కరోనా గొలుసును తెంచేందుకు (కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు) కనీసం రెండు వారాల లాక్‌డౌన్ అమలు చేయాలని సూచించారు.
ప్రజల్లో కోపోద్రిక్తతలు పెరుగుతాయి: దేవేంద్ర ఫడ్నవీస్
లాక్‌డౌన్ విధించడాన్ని ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫఢణవీస్ వ్యతిరేకించారు. దీంతో ప్రజల్లో కోపోద్రిక్తతలు పెరుగుతాయన్నారు.. కరోనా రోగుల సంఖ్య పెరుగుతుందని దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఆంక్షలు విధించాలి, కాని లాక్‌డౌన్ విధించడం సరికాదన్నారు. లాక్‌డౌన్ విధించినట్లయితే పేదలకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని ఆయన డిమాండు చేశారు.
రెండు రోజుల్లో తుది నిర్ణయం..!
లాక్‌డౌన్‌కు సంబంధించి రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా ఈ విషయంపై మరోసారి టాస్క్‌ఫోర్స్‌తోపాటు ఇతర అధికారులతో ఆదివారం ముఖ్యమంత్రి చర్చించనున్నారు. అదేవిదంగా లాక్‌డౌన్ అమలు చేసేందుకు ముందస్తు ఏర్పాట్లతోపాటు మార్గదర్శకాలు రూపొందించాల్సి ఉంది. దీంతో రెండు రోజుల్లో లాక్‌డౌన్‌కు సంబంధించి తుది నిర్ణయం ప్రకటిస్తారని తెలిసింది.
కరోనాతో కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి
ముంబై సెంట్రల్: నాందేడ్ జిల్లాలోని దెగలూర్–బిలోలి నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రావ్‌సాహెబ్ అంతాపూర్కర్(55) కరోనాతో మృతి చెందారు. బాంబే హాస్పిటల్‌లో కరోనాకు చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యాక నాందేడ్‌లోని ఆసుపత్రిలో చికిత్సనందించారు. కానీ, పరిస్థితి క్షీణించడంతో ముంబైలోని బాంబే ఆసుపత్రికి తరలించారు. చికిత్స జరుగుతుండగానే రావుసాహెబ్ ప్రాణం వదిలారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత మంత్రి అశోక్ చవాన్‌కు సన్నిహితుడు. కరోనాతో మహారాష్ట్రలో మృతి చెందిన ఎమ్మెల్యేలలో ఇతను రెండోవారు. ఇంతకు క్రితం పండర్‌పూర్ మంగళ్‌వేడా నియోజకవర్గానికి చెందిన రాష్ట్రవాది కాంగ్రెస్ ఎమ్మెల్యే భారత్ భాల్కే కూడా కరోనా వ్యాధితోనే మరణించారు. ప్రస్తుతం ఆ నియోజక వర్గంలో ఉపఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఇంతలో మరో ఎమ్మెల్యే రావ్‌సాహెబ్ అంతాపూర్కర్ కూడా కరోనా బారిన పడి మృతి చెందడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment