vijay wadettiwar
-
అన్‌లాక్ ప్రకటనతో గందరగోళం
సాక్షి, ముంబై: రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ విస్తృతి తగ్గుతున్న నేపథ్యంలో అన్‌లాక్ ప్రక్రియను ఐదు దశల్లో అమలు చేయనున్నట్లు రాష్ట్ర సహాయ, పునరావాస శాఖ మంత్రి విజయ్ వడెట్టివార్ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, మంత్రి చేసిన ఈ ప్రకటన గందరగోళానికి కారణమైంది. ఆయన ఆ ప్రకటన చేసిన రెండు గంటల్లోనే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మరో ప్రకటన వెలువడింది. అన్‌లాక్ ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, లాక్డౌన్ ఇంకా కొనసాగుతుందని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. ఇలా ప్రభుత్వం నుంచి వేర్వేరు ప్రకటనలు రావడంతో ప్రతిపక్షాలు ఘాటుగా స్పందించాయి. ముఖ్యమంత్రికి, మంత్రులతో సమన్వయం కొరవడిందని, అందుకే ఎవరికి ఇష్టమున్నట్లు వారు ప్రకటనలు చేస్తున్నారని ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ప్రవీణ్ దరేకర్ ట్విట్టర్లో దుమ్మెత్తిపోశారు. దీంతో తేరుకున్న రాష్ట్ర సహాయ, పునరావాస శాఖ మంత్రి విజయ్ వడెట్టివార్ తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే ఈ ప్రకటన యావత్ రాష్ట్ర ప్రజల చెంతకు చేరిపోవడంతో గందరగోళం మొదలైంది. ముఖ్యంగా శుక్రవారం నుంచి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అన్‌లాక్ ప్రకియ అమలు కావాల్సి ఉంది. దీంతో ఆయన చేసిన ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ, అన్‌లాక్‌పై స్పష్టత లేకపోవడంతో వివిధ జిల్లాల యంత్రాంగాలు సంది గ్ధంలో పడిపోయాయి. దీనిపై రాష్ట్ర సహాయ, పునరావాస శాఖ మంత్రి విజయ్ వడెట్టివార్ మాట్లాడుతూ.. అన్‌లాక్ ప్రక్రియను తాత్కాలికంగా ఆమోదించామని తెలిపారు. అయితే, దీనిపై తుది నిర్ణ యం మాత్రం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేనే తీసుకుంటారని చెప్పారు. ఈ విషయాన్ని గురువారం నాటి విలేకరుల సమావేశంలో చెప్పడం మర్చిపోయానంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అయితే, అన్‌లాక్ ప్రక్రియపై వివాదాస్పద ప్రకటన చేసిన రాష్ట్ర సహాయ, పునరావాస శాఖ మంత్రి విజయ్ వడెట్టివార్ను ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం పూర్తి సమన్వయంతో పనిచేస్తోందని అజిత్ పవార్ స్పష్టం చేశారు. ఎన్ని పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పడిందనేది ముఖ్యం కాదని, ముఖ్యమంత్రి తీసుకునే అంతిమ నిర్ణయాన్నే అందరూ ఆమోదిస్తారని పేర్కొన్నారు. అన్‌లాక్ ప్రకియపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించా రు. లాక్డౌన్ ఎత్తివేసే ప్రతిపాదనపై ఆలోచిస్తున్నా రని తెలిపారు. కానీ, రాష్ట్ర సహాయ, పునరావాస శాఖ మంత్రి విజయ్ వడెట్టివార్ ఈ విషయాన్ని చెప్పడం మర్చిపోవడం వల్లే గందరగోళం నెలకొం దని పవార్ అభిప్రాయపడ్డారు. ‘కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి స్వయంగా సోషల్ మీడియా, టీవీ ద్వారా రాష్ట్ర ప్రజల ముందుకు వస్తున్నారు. అనేక అంశాలపై ప్రజలకు మార్గదర్శనం చేస్తున్నారు. ఆ తరువాత ఆరోగ్య శాఖ మంత్రిగా రాజేశ్ తోపే కూడా అనేక అంశాలను సువిస్తారంగా వివరిస్తారు. రాష్ట్ర సహా య, పునరావాస శాఖ మంత్రి విజయ్ వడెట్టివార్ కూడా మీడియాతో తరచూ మాట్లాడుతారు. ఇదే తరహాలో గురువారం కూడా ఆయన మాట్లాడారు. అయితే కొన్ని జిల్లాలో అన్‌లాక్ అమలుచేసే అంశాన్ని వెల్లడిస్తుండగా ఒక వాక్యం చెప్పడం మర్చిపోవడం వల్లే గందరగోళం తలెత్తింది’ అని పవార్ పేర్కొన్నారు. ఎవరు ఏం చెప్పినా, ఎలాంటి ప్రకటనలు చేసినా ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చెప్పిందే తమ ప్రభుత్వ తుది నిర్ణయమవుతుందని ఈ సందర్భంగా అజిత్ పవార్ స్పష్టం చేశారు. -
రెండ్రోజుల్లో నిర్ణయం.. సంపూర్ణ లాక్‌డౌన్‌కే మొగ్గు
సాక్షి, ముంబై: బ్రేక్ ది చైన్‌లో భాగంగా ఇటీవల ప్రభుత్వం అమలుచేసిన సెమీ లాక్‌డౌన్‌తో పరిస్థితులు అదుపులోకి వచ్చిన దాఖలాలేమి కనిపించడం లేదని, దీంతో రాష్ట్రంలో మరోసారి సంపూర్ణ లాక్డౌన్ విధించే అవకాశాలున్నాయని సహాయ, పునరావస శాఖ మంత్రి విజయ్ వడెట్టివార్ తెలి పారు. దీనిపై రెండు రోజుల్లో ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే నిర్ణయం తీసుకుంటారని సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వడెట్టివార్ స్పష్టంచేశారు. రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదవుతున్న కరోనా కేసులతో ప్రభుత్వం ఆందోళనలో పడిపోయింది. దీంతో బ్రేక్ ది చైన్‌లో భాగంగా పగలు 144 సెక్షన్, రాత్రి నైట్ కర్ఫ్యూ, వీకెండ్లో సెమి లాక్డౌన్ అమలుచేసిన సంగతి తెలిసిందే. కానీ, పరిస్థితులు అనుకున్నంత మేర అదుపులోకి వచ్చినట్లు వాతావరణం ఎక్కడ కనిపించలేదు. దీంతో ప్రభుత్వం గందరగోళంలో పడిపోయింది. ఇటీవల ఢిల్లీలో ప్రభుత్వం ఆరు రోజుల సంపూర్ణ లాక్డౌన్ అమలు చేసింది. అక్కడ ఎలా అమలు చేశారో, అదే పద్దతిలో రాష్ట్రంలో అమలు చేయాలని, అందుకు అవసరమైన సలహాలు, సూచనలు సేకరిస్తున్నామని వడెట్టివార్ వెల్లడించారు. ఢిల్లీలో లాక్డౌన్ పరిశీలిస్తున్నాం.. ముంబైతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అమలుచేసిన లాక్‌డౌన్‌కు ప్రజల నుంచి పూర్తిస్థాయిలో స్పందన రావడం లేదు. మొన్నటి వరకు లాక్‌డౌన్‌ను వ్యాపార సంఘటనలు వ్యతిరేకించాయి. కానీ, ఇప్పుడు అదే వ్యాపార సంఘటనలు వంద శాతం లాక్‌డౌన్‌కు డిమాండ్ చేస్తున్నాయని వడెట్టివార్ గుర్తుచేశారు. ఈ విషయాన్ని ఉద్దవ్‌ఠాక్రే దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. రెండు రోజుల్లో ఉద్దవ్ లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు. కరోనా రెండో దఫా ఉంటుందని గతంలోనే ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు హెచ్చరించారు. అయితే కరోనా తీవ్రత తక్కువ స్థాయిలో ఉంటుండవచ్చని అందరు భావించారు. కానీ, తాజా పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. తీవ్రత ఈ స్థాయిలో ఉంటుందని ఎవరూ ఊహించలేకపోయారని మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. ఢిల్లీలో అమలుచేసిన సంపూర్ణ లాక్డౌన్ గురించి ఆరా తీస్తున్నామని, ఎలాంటి నియమ, నిబంధనలు అమలు చేస్తున్నారు? ఫలితాలు ఎలా ఉన్నాయి? తదితరాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. చదవండి: (దేశవ్యాప్త లాక్డౌన్లు పరిష్కారం కాదు: టాటా) కేంద్రం సాయం చేయాలి.. కరోనాతో పోరాడేందుకు మహా వికాస్ ఆఘాడీ ప్రభుత్వం దాదాపు రూ.5,500 కోట్లు కేటాయించిందని మంత్రి తెలిపారు. అదేవిధంగా కోవిడ్‌ను నియంత్రించాలంటే ఆరోగ్య శాఖను మరింత బలోపేతం చేయాలని అభిప్రాయం వ్యక్తంచేశారు. రెమ్‌డెసివిర్ మందులు, ఆక్సిజన్ ప్లాంట్, బెడ్ల సంఖ్య పెంపు వీటన్నింటికి రూ.3,300 కోట్లు వరకు అవసరం ఉంటుందని తెలిపారు. అలాగే ఎమ్మెల్యేలు తమ నిధుల నుంచి రూ.కోటి ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇతర ఆదాయ వనరులు కూడా ఉన్నాయని మంత్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ఏప్రిల్ 3వ తేదీన రూ.1,200 కోట్లు అందజేసిందని, కాని ఈ ఏడాది ఏప్రిల్ 19వ తేదీ పూర్తికావస్తునప్పటికీ ఇంతవరకు నిధులు రాలేదన్నారు. ఆలస్యమైనప్పటికీ ఈ సారి రూ.1,600 కోట్లు లభిస్తాయని ఆశిస్తున్నట్లు వడెట్టివార్ అన్నారు. చదవండి: (కరోనాపై ఏం చేద్దాం చెప్పండి..) -
లాక్‌డౌన్‌పై రేపు ముఖ్యమంత్రి ప్రకటన
ముంబై: రోజుకు 50వేల నుంచి 60 వేల కేసులు నమోదవుతుండడంతో మహారాష్ట్రలో కరోనా కల్లోలం రేపుతోంది. దేశంలోనే అత్యధికంగా కేసులు నమోదవుతుండడంతో ప్రస్తుతం ఆ రాష్ట్రంలో భయాందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే కొన్ని జిల్లాలు, ప్రాంతాల్లో పూర్తిస్థాయి లాక్డౌన్ విధించారు. కాగా ప్రస్తుతం భారీగా కేసులు వెలుగులోకి వస్తుండడంతో ఇక లాక్డౌన్ విధించాల్సిందేనని ఆ రాష్ట్ర మంత్రి విజయ్ వాడెట్టివర్ సలహా ఇచ్చారు. దీనిపై ముఖ్యమంత్రి ఓ ప్రకటన చేస్తారని చెప్పడం చూస్తుంటే లాక్డౌన్ విధించే అవకాశం ఉందంటూ తెలుస్తోంది. ముంబైలో ఆయన ఈ విషయమై శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతుండడంతో పూర్తిస్థాయి లాక్డౌన్ విధించాలని ప్రతిపాదన చేసినట్లు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి విజయ్ తెలిపారు. ప్రస్తుతం 5 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని చెప్పారు. ఇదే మాదిరి కొనసాగితే పది లక్షలకు యాక్టివ్ కేసులు చేరుకుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని తెంచి వేయాలి.. ప్రజలను సామూహికంగా ఉండకూడదు అని పేర్కొన్నారు. కరోనా చెయిన్‌ను తెంచేందుకు.. వ్యాప్తిని అడ్డుకట్ట వేసేందుకు మూడు వారాల పాటు కఠిన లాక్డౌన్ విధించాలని మంత్రి విజయ్ స్పష్టం చేశారు. ఈ విషయమై రేపు అఖిలపక్ష సమావేశం ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలో కొనసాగుతుందని చెప్పారు. రేపు ఏ విషయమో ముఖ్యమంత్రి ప్రకటిస్తారు అని తెలిపారు. తాను తన అభిప్రాయం మాత్రం చెప్పినట్లు పేర్కొన్నారు. లాక్డౌన్ అమలు చేస్తే ప్రజలకు నిత్యవసరాలు, కూరగాయలు అందిస్తామని చెప్పారు. ఏది ఏమున్నా రేపు సీఎం ఉద్దవ్ ప్రకటిస్తారని మంత్రి విజయ్ చెప్పి వెళ్లిపోయారు. చదవండి: డ్రగ్స్ ఎమ్మెల్యేలు, వసూల్ మంత్రిని తొలగించండి చదవండి: ‘ఆ నలుగురు’ లేక వృద్ధ దంపతుల ఆత్మహత్య -
బలప్రదర్శన
మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : మంచిర్యాల ఆర్అండ్బీ కాంగ్రెస్ నేతల బలప్రదర్శనకు వేదికైంది. సాక్షాత్తు రాహుల్ దూత ఎదుట మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఇరువ ర్గాలు తోపులాటకు దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాబోయో ఎన్నికల్లో గెలుపు గుర్రాలను ఎంపిక చేయడానికి శుక్రవారం రాహుల్ దూత, మహారాష్ట్రలోని చిమ్మూర్ శాసనసభ్యుడు విజయ్వడెట్టివార్, పీసీసీ పరిశీలకుడు బండి నర్సాగౌడ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి మంచిర్యాలకు వచ్చారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలైన మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశమయ్యారు. నాయకుల రంగప్రవేశం మొదట దివాకర్‌రావు వర్గీయులు ఐబీకి చేరుకున్నారు. ప్లకార్డులు ప్రదర్శించారు. పరిశీలకుడిని కలిసి దివాకర్‌రావు టికెట్ ఇవ్వాలని కోరారు. కొద్ది సేపటి తర్వాత ప్రేంసాగర్‌రావు రంగప్రవేశం చేశారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఇరు వర్గాల కార్యకర్తలు జిందాబాద్ అంటూ పరస్పర నినాదాలు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నినాదాలతో ఒకరిపై ఒకరు దూసుకు వచ్చేందుకు ప్రయత్నించడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. కార్యకర్తలను రెండు వర్గాలుగా వేర్వేరుగా చేశారు. పోలీసులు మధ్యలో నిల్చుని కార్యకర్తలను అదుపు చేయడానికి తంటాలు పడ్డారు. పరిశీలకున్ని మండలం, పట్టణాలవారీగా కలవడానికి అనుమతిచ్చారు. రెండు వర్గాల కార్యకర్తలు లోపలికి దూసుకు వెళ్లడంతో అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. అభిప్రాయాల సేకరణ రెండు గంటలపాటు కార్యకర్తల నినాదాలతో ఐబీ ప్రాంగణం ప్రతిధ్వనించింది. కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరించారు. కులాలవారీగా అభిప్రాయాలను పరిశీలకుడు కోరారు. మూడు నియోజకవర్గాలకు పది దరఖాస్తులు వచ్చాయి. తన వర్గీయులను దూరంగా నెట్టి వేస్తూ ప్రేంసాగర్‌రావు వర్గీయులను ఏమి అనడం లేదని ఆరోపిస్తు పోలీసులతో దివాకర్‌రావు, ఆయన తనయుడు విజిత్‌రావు పోలీసులతో వాదనకు దిగారు. కాగా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తులో మంచిర్యాల సీఐలు రవీంద్రారెడ్డి, కరుణాకర్, ఎస్సైలు వెంకటేశ్వర్లు, శ్రీలత, పోలీసులు ఉన్నారు. తెలంగాణను ఎవరూ అడ్డుకోలేరు.. : పరిశీలకుడు విజయ్ వాడెట్టివార్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ఏ శక్తులు అడ్డుకోలేని రాష్ట్ర పరిశీలకుడు విజయ్ వడెట్టివార్ అన్నారు. ఐబీలో కార్యకర్తలను ఉద్ధేశించి మాట్లాడుతూ, ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన తెలంగాణను ఆపలేరని స్పష్టం చేశారు. సోనియాగాంధీ ఇచ్చిన మాట ప్రకారం సీడబ్ల్యుసీలో తీర్మానం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తోందని చెప్పారు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశం అనంతరం రాష్ట్రం విభజన జరుగుతోందని ఆయన నొక్కి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగుర వేయాలని ఆయన ప్రజలకు పిలుపు నిచ్చారు. సందెట్లో సడేమియా సందెట్లో సడెమియాలా జేబుదొంగలు తమ హస్తలాఘవానికి పని చెప్పారు. కాంగ్రెస్‌లో రెండు వర్గాల నేతలు కయ్యానికి కాలు దూస్తున్న సమయంలో ఆదమరిచి ఉండడాన్ని జేబుదొంగలు అనుకూలంగా మలచుకున్నారు. ఓ వ్యక్తి నుంచి రూ.14 వేలు, మరోవ్యక్తి జేబు నుంచి సెల్ ఫోన్, రూ.20వేలు నగదు తస్కరించారు.