సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై డెంగీ పంజా విసురుతోందని.. ఈ ఏడాది ఇప్పటివరకు 583 డెంగీ కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ పేర్కొంది. అందులోని ఇటీవలి మే, జూన్ నెలల్లోనే అధికంగా కేసులు నమోదయ్యాయని నివేదికలో వెల్లడించింది. సాధారణంగా వానాకాలం సీజన్ మొదలయ్యాక డెంగీ, ఇతర విష జ్వరాలు వ్యాపిస్తుంటాయి. కానీ ఈసారి వానాకాలం సీజన్ ప్రారంభం కాకముందే మే నెలలోనే డెంగీ కేసులు నమోదవడం ఆందోళనకరంగా మారింది.
అత్యధికంగా హైదరాబాద్‌లో 218 డెంగీ కేసులురాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 44, మేడ్చల్ మల్కాజిగిరి, వరంగల్ జిల్లాల్లో 38 చొప్పున కేసులు నమోదయ్యాయి. వానలు మొదలైన నేపథ్యంలో డెంగీ కేసులు పెరిగే అవకాశం ఉంటుందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
ఆ పది జిల్లాల్లో రిస్క్
రాష్ట్రంలో డెంగీ హైరిస్క్ జిల్లాలను ప్రజారోగ్య కార్యాలయం గుర్తించింది. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, మేడ్చల్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సంగారెడ్డి, పెద్దపల్లి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో డెంగీ కేసులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో గతేడాది నమోదైన డెంగీ కేసుల్లో ఈ జిల్లాల్లోనే 80 శాతం వరకు నమోదైనట్టు పేర్కొంది.
ఇక ఈ ఏడాది ఇప్పటివరకు 121 మలేరియా కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, కొమురంభీం ఆసిఫాబాద్, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలను హైరిస్క్ జిల్లాలుగా వైద్యారోగ్యశాఖ గుర్తించింది. గతేడాది రాష్ట్రంలో నమోదైన మలేరియా కేసుల్లో ఈ ఏడు జిల్లాల్లోనే 91.5 శాతం కేసులు వచ్చాయని పేర్కొంది.
అధికారులతో మంత్రి సమీక్ష
వానాకాలం మొదలైన నేపథ్యంలో డెంగీ, మలేరియా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది. వర్షాకాలం నేపథ్యంలో వ్యాధుల నియంత్రణపై ప్రత్యేకంగా అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలతో మంత్రి హరీశ్‌రావు తాజాగా సమీక్ష నిర్వహించారు.
కలుషిత నీటి ద్వారా వచ్చే వ్యాధులు మిషన్ భగీరథతో తగ్గిపోయాయని.. కానీ కీటకాలతో వ్యాపించే వ్యాధుల నియంత్రణపై ప్రధానంగా దృష్టి పెట్టాలని అన్ని జిల్లాల వైద్యాధికారులను ఆదేశించారు. మలేరియాను గుర్తించే 8 లక్షల ర్యాపిడ్ కిట్లను, డెంగీని గుర్తించే 1.23 లక్షల ఎలిజా కిట్లను ఇప్పటికే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment