మూడో దశ ప్రయోగాలు షురూ!
10,335 మందిని పరిశీలించనున్న ఐసీఎంఆర్, పాన్ ఆసియా
పూర్తిగా స్వదేశీ టెక్నాలజీలతో అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: సీజన్ మారిందంటే ప్రజలను బెంబేలెత్తించే డెంగీ వ్యాధికి చెక్ పడే అవకాశం కన్పిస్తోంది. భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), పాన్ ఆసియా బయోటెక్ కంపెనీలు కలిసికట్టుగా తయారు చేస్తున్న టీకా ‘డెంగీఆల్’ కీలకమైన మూడో దశ ప్రయోగాలకు సిద్ధమైంది. ఈ దశలోనూ ఆశించిన ఫలితాలు వస్తే టీకా అందుబాటులోకి రావడమే తరువాయి అవుతుంది. ఈ టీకా తయారీ ప్రక్రియ యావత్తూ దేశీయంగానే జరిగిందని, డెంగీపై పోరాటంలో టీకా అభివృద్ధి కీలక మలుపు అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం: నడ్డా
ఏదైనా వ్యాధి నివారణకు అభివృద్ధి చేసే టీకా మూడు దశల ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే పాన్ ఆసియా బయోటెక్ డెంగీఆల్‌పై ఇప్పటివరకు రెండు దశల ప్రయోగాలను పూర్తి చేసింది. తాజాగా బుధవారం హరియాణాలోని రోహతక్‌లో ఉన్న పండిట్ భగవత్ దయాళ్ శర్మ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో మూడో దశ ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ.. డెంగీఆల్ మూడో దశకు చేరుకోవడం ప్రజారోగ్య సంరక్షణపై ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీల సాయంతో ఈ టీకాను అభివృద్ధి చేయడం ఆరోగ్య రంగంలో ఆత్మ నిర్భర్ భారత్‌కు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.
కోవిడ్‌కు ముందే రెండు దశలు పూర్తి
డెంగీ వ్యాధికి ప్రస్తుతం ఎలాటి టీకా లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో కనీసం నాలుగు రకాల డెంగీ వైరస్‌లను నియంత్రించే లక్ష్యంతో టీకా తయారీ ప్రయత్నాలు మొదలయ్యాయి. అమెరికా లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అభివృద్ధి చేసిన ఒక టెట్రా వేలంట్ టీకా ప్రపంచ వ్యాప్తంగా ప్రీ క్లినికల్, క్లినికల్ ట్రయల్స్‌లో ప్రభావశీలంగా కనిపించింది.
అయితే దేశంలోని పాన్ ఆసియా బయోటెక్‌కు కూడా ఇది అందుబాటులోకి రావడంతో ఆ కంపెనీ ఐసీఎంఆర్‌తో కలిసి ప్రయోగాలు మొదలుపెట్టింది. తొలి, మలి దశ ప్రయోగాలు కోవిడ్‌కు ముందు 2018 – 19లోనే పూర్తి చేసింది. మూడో దశ ప్రయోగాల కోసం 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 19 కేంద్రాలను ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా 10,335 మందిపై జరిగే మూడో దశ ప్రయోగాల్లో భాగంగా టీకాలు తీసుకున్న వారిని రెండేళ్ల పాటు పరిశీలించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment