సాక్షి, ముంబై: నగరంలో డెంగీ వ్యాధి పడగ విప్పడంతో మహానగర పాలక సంస్థ (బీఎంసీ) మరింత అప్రమత్తమైంది. బీఎంసీ కార్యాలయాలు, ఆస్పత్రుల ఆవరణలో పేరుకుపోయిన చెత్తచెదారాన్ని తరలించడం ప్రారంభించారు. ఈ సందర్భంగా పరేల్‌లోని కేం ఆస్పత్రిలో రోగులకు వైద్యం అందిస్తున్న రెసిడెన్సీ డాక్టర్లకు డెంగీ వ్యాధి సోకడంతో ఆస్పత్రి యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంది.
అస్పత్రి స్టోర్ రూంలో 30 యేళ్ల నుంచి పేరుకుపోయిన ఏడు టన్నుల చెత్త సామగ్రిని పూర్తిగా తరలించి పరిసరాలను శుభ్రం చేశారు. వారం కిందటే ఆస్పత్రి ఆవరణలో పేరుకుపోయిన పిచ్చి మొక్కలు, చెత్త, శిథిలాలను తొలగించారు. కాని 30 ఏళ్ల నుంచి చేయిపెట్టని ఏడు టన్నుల సామగ్రిని తరలించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. కేం ఆస్పత్రిలో రెసిడెన్సీ వైద్యులు ఉంటున్న మూడు చోట్ల డెంగీ దోమల గుడ్లు ఉన్నట్లు ఆరోగ్య శాఖ సిబ్బంది గుర్తించారు.
దీంతో ఈ చెత్తను వెంటనే తొలగించాలని కేం ఆస్పత్రి పరిపాలన విభాగానికి బీఎంసీ ఆరోగ్య శాఖ నోటీసు జారీచేసింది. దీనిపై స్పందించిన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శుభాంగీ పార్కర్ వెంటనే ఆ చెత్తను ఖాళీ చేయించారు. ప్రతీ వార్డులో ఉన్న స్టోర్ రూమ్‌లను ఆమె తనిఖీ చేసి చెత్త నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
మూడు దశాబ్దాల చెత్తకు ‘మోక్షం’
Published Tue, Nov 11 2014 10:52 PM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM
Advertisement