సాక్షి, ముంబై: కొన్ని రోజులుగా రాజధానివ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ జలాశయాల్లో నీటి మట్టాలు పెరగకపోవడం ఆందోళనకు దారితీస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే నీటి కొరత సమస్య మరింత ఉగ్రరూపం దాల్చడం ఖాయమని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. తగినంత నీరు అందుబాటులో లేనందున నీటి సరఫరా కోతను అదనంగా 10 శాతం పెంచాలని మహానగర పాలక సంస్థ (బీఎంసీ) యోచిస్తోంది. ప్రస్తుతం నగర ప్రజలకు అనధికారికంగా ఐదు శాతం, అధికారికంగా 20 శాతం.. ఇలా మొత్తం 25 శాతం నీటికోత అమలులో ఉన్న విషయం తెలిసిందే.
తాజాగా మరో 10 శాతం సరఫరా తగ్గించేందుకు బీఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే ముంబైకర్లు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నీటి సరఫరా సగానికి తగ్గిపోతే బట్టలు ఉతకడం, స్నానాల వంటి అత్యవసర పనులకూ ఇబ్బందిపడాల్సి ఉంటుందని బాంద్రావాసి ఒకరు అన్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రోజు విడిచి రోజు స్నానం చేయాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. సాధారణంగా జూన్ మొదటి వారం నుంచి వర్షాలు ప్రారంభం కావాలి. కానీ జూన్‌లో వర్షపు బొట్టు దర్శనమివ్వలేదు.
జూలైలో మొదటి వారం అలాగే గడిచింది. రెండో వారం కొంతమేర వరుణుడు కరుణించాడు. అయినప్పటికీ దీని వల్ల ఒరిగిందేమీ లేదని తేలింది. ప్రస్తుతం నగరానికి నీటి సరఫరా చేస్తున్న జలాశయాల్లో కేవలం 30 రోజులకు సరిపడా నీరు నిల్వ ఉంది. ప్రతీరోజు బీఎంసీ నీటి సరఫరా విభాగం అధికారులు జలాశయాల్లో నీటి మట్టాల వివరాలను సేకరిస్తున్నారు. గత నాలుగు సంవత్సరాలతో పోలిస్తే జలాశయాల్లో ఇంత దారుణంగా నీటి మట్టం పడిపోవడం ఇదే మొదటిసారని బీఎంసీ అధికారి ఒకరు చెప్పారు.
2013 జూలై మొదటి వారంలో 4,51,793 మిలియన్ లీటర్ల నీరు నిల్వ ఉండగా, ఈ ఏడాది జూలై మొదటి వారంలో 1,09,241 మిలియన్ లీటర్ల నీరు మాత్రమే నిల్వ ఉంది. దీన్ని బట్టి జలాశయాల్లో ఈ ఏడాది నీటి మట్టం ఏ స్థాయిలో తగ్గిపోయిందో ఇట్టే అర్థమవుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల వాతావరణం కొంత చల్లబడడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. జలాశయాల్లో నీటి మట్టాలు పెరగకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
ఆదుకోని వర్షాలు
Published Wed, Jul 9 2014 11:31 PM | Last Updated on Sat, Sep 2 2017 10:03 AM
Advertisement