సాక్షి, ముంబై : నగరానికి మంచినీటి సరఫరా చేసే జలాశయాలు కళకళలాడుతున్నాయి. గతకొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల నీటి మట్టం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇప్పటిదాకా జలాశయాల్లో నీటి నిలువలు సరిపడా లేకపోవడంతో మహానగర పాలక సంస్థ (బీఎంసీ) నీటి కోతలు విధించడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దీన్ని అధిగమించేందుకు హెలికాప్టర్ల ద్వారా కృత్రిమ వర్షాల కోసం రూ.15 కోట్లు మం జూరుచేసి ఉంచారు.
కానీ వర్షాల పుణ్యమా... అని బీఎంసీకి ఆదా అయ్యాయి. ఇక నగరంలో కృత్రిమ వర్షాల ప్రయోగం చేయాల్సిన అవసరం లేదని మహానగర పాలక సంస్థ (బీఎంసీ) కమిషనర్ సీతారాం కుంటే స్పష్టం చేశారు. తక్కువ రోజుల్లో ఊహించిన దానికంటే ఎక్కువే నీటి మట్టం పెరి గిందని, ప్రజలకు నీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని ఆయన వెల్లడించారు.
ఆలస్యంగా వర్షాలు..
ఈ ఏడాది వర్షాలు చాలా ఆలస్యంగా కురిశాయి. జలాశయాల్లో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయింది. చేసేదిలేక రిజర్వు నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గత్యంతరం లేక ముంబైకర్లకు 25 శాతం నీటి కోత విధించాల్సిన దుస్థితి వచ్చింది. అదనంగా మరో 10 శాతం కోత విధించాలనే యోచనలో ఉండగా వరుణ దేవుడు కరుణించాడు. అదనంగా విధించే 10 శాతం నీటి కోతను విరమించుకున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న 25 శాతం నీటి కోతలో నుంచి 10 శాతాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. గత పక్షం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలాశయాల్లో నీటి నిల్వలు పెరిగిపోవడంతో బీఎంసీ నీటి సరఫరా శాఖ ఊపిరి పీల్చుకుంది. ఇటీవల కురిసిన వర్షానికి జలాశయాల్లో 9,54,679 లీటర్ల నీరు వచ్చి చేరింది.
కళకళలాడుతున్న జలాశయాలు
Published Sun, Aug 3 2014 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 11:19 AM
Advertisement