ఒక పూట కురిసిన భారీ వర్షం మహారాష్ట్ర రాజధాని ముంబైలను అతలాకుతలం చేసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. కేవలం ఆరు గంటల వ్యవధిలోనే సుమారు 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో నగరం మొత్తం జలదిగ్బంధంలోకి చిక్కుకుంది. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కార్లు, బైక్‌లు నీటపై తేలాడుతున్నాయి. దీంతో నగరంలో జనజీవనం స్తంభించిపోయింది.
ఈ క్రమంలో సీఎం ఏక్‌నాథ్ షిండే రాష్ట్ర ప్రజలనుద్ధేశించి సూచన చేశారు. అవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీచ్‌ల దగ్గరకు ఎవరినీ అనుమతించవద్దని పోలీసు కమిషనర్‌ను కూడా ఆదేశించినట్లు తెలిపారు. తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ.. రెస్క్యూ బృందాలు తీసుకున్న చర్యలను వివరించారు. పలు చోట్ల రైల్వే ట్రాక్‌లు నీటమునిగిపోయాయని, రైల్వే, ఎన్డీఆర్‌ఎఫ్, సివిల్ అధికారులు నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. అనేక రైళ్లు రీషెడ్యూల్ అయ్యాయని చెప్పారు.
వర్షం నీటిని తోడేందుకు మునిసిపల్ కార్పొరేషన్‌కు చెందిన 461 మోటార్ పంపులు, రైల్వేశాఖకు చెందిన 200 పంపులు పని చేస్తున్నాయని తెలిపారు. ఉదయం నుంచి అన్ని శాఖలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు.. సెంట్రల్, హార్బర్ రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు.
చదవండి: ముంబైను వణికించిన భారీ వర్షాలు.. 6 గంటల్లో 300 మి. మీ వర్షం
మునిసిపల్ కార్పొరేషన్‌కు చెందిన 461 మోటార్ పంపులు, రైల్వేశాఖకు చెందిన 200 పంపులు తీర ప్రాంతాల్లో ఆరెంజ్ అలెర్ట్ ఉందని,తీరప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లను ఆదేశించినట్లు చెప్పారు. అంతేకాకుండా నగరంలో ఏడు పంపింగ్ స్టేషన్లు కూడా నిర్మిస్తున్నట్లు తెలిపారు.
కాగా ముంబైలో కురిసిన వర్ష బీభత్సానికి స్కూళ్లు, కళాశాలలు సెలవులు ప్రకటించారు, బస్సు, రైళ్ల సేవలకు అంతరాయం ఏర్పడింది. అంతేగాక దాదాపు 50 విమానాల రాకపోకలు రద్దు అయ్యాయి. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment