నిండు కుండలా జలాశయాలు | Pot full reservoirs | Sakshi
Sakshi News home page

నిండు కుండలా జలాశయాలు

Published Tue, Sep 2 2014 4:03 AM | Last Updated on Sat, Sep 2 2017 12:43 PM

నిండు కుండలా జలాశయాలు

నిండు కుండలా జలాశయాలు

  •      తగ్గిన వరద ఉధృతి..
  •      పెరిగిన సందర్శకుల తాకిడి
  •      తెరుచుకోని గేట్లు
  • సాక్షి,సిటీబ్యూరో,రాజేంద్రనగర్/మణికొండ: కురుస్తున్న వర్షాలకు భారీగా నీరు చేరడంతో నిండు కుండలా తొణికిస లాడుతున్న హిమాయత్‌సాగర్ జలాశయానికి సోమవారం వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. గత రెండు రోజులుగా నిత్యం 11,500 క్యూసెక్కుల వరదనీరు జలాశయంలోకి చేరగా..

    సోమవారం వరద ప్రవాహం 1100 క్యూసెక్కులకు తగ్గిందని జలమండలి ట్రాన్స్‌మిషన్ విభాగం చీఫ్ జనరల్ మేనేజర్ విజయ్‌కుమార్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. తాండూరు, పరిగి ప్రాంతాల్లో వర్షపాతం తగ్గడంతోనే వరద తగ్గిందని చెప్పారు. దీంతో గేట్లు ఎత్తాలన్న యోచనను విరమించుకున్నామన్నారు. ఈసీ వాగు నీటి చేరికతో సాగర్ నీటిమట్టం 11 అడుగుల మేర పెరిగిందని తెలిపారు. జలాశయం గరిష్ట నీటిమట్టం 1763.500 అడుగులకు గాను సోమవారం నాటికి 1755 అడుగులకు చేరిందన్నారు.
     
    గండిపేట్‌కు మూడు అడుగులు..
     
    ఉస్మాన్‌సాగర్ (గండిపేట్) జలాశయం గరిష్ట నీటి మట్టం 1790 అడుగులకు కాగా, సోమవారం నాటికి 1772 అడుగులకు చేరింది. మూడు రోజులుగా ఈ జలాశయంలో మూసీ వాగు నీరు చేరుతుండటంతో నీటి మట్టం మూడు అడుగుల మేర పెరిగింది. చేవేళ్ల, వికారాబాద్ పరిధిలో ఆశించిన స్థాయిలో వర్షపాతం లేకపోవడంతో ఈ జలాశయానికి వరద అంతగా లేదు. కాగా గండిపేట్ జలాశయం ఎగువన అక్రమార్కులు ఇసుక ఫిల్టర్ల ఏర్పాటు, కందకాలు తవ్వడం, ఫాంహౌస్‌లు, కళాశాలల రక్షణ గోడలు ఏర్పాటు కారణంగా వరద ఉధృతి తగ్గినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
     
    సింగూరు, మంజీరాకూ జలకళ

     
    కురుస్తున్న వర్షాలకు గ్రేటర్ దాహార్తిని తీరుస్తున్న మెదక్ జిల్లాలోని సింగూరు, మంజీరా జలాశయాలు సైతం జలకళ సంతరించుకున్నాయి. గ తేడాదితో పోలిస్తే జలాశయాల్లో నీటి నిల్వలు భారీగా పెరిగాయి. సింగూరులో 1717.932 అడుగులకు గాను సోమవారం నాటికి 1703.167 అడుగుల మేర నీరు చేరింది. మంజీరా గరిష్ట మట్టం 1651.750 అడుగులకు గాను 1646.400 అడుగుల మేర నిల్వలున్నాయి. అక్కంపల్లి (కృష్ణా) జలాశయంలో 245 మీటర్ల గరిష్ట మట్టానికి 243.100 మీటర్ల మేర నిల్వలున్నాయి. నాగార్జున సాగర్ (నల్లగొండ) జలాశయంలో 590 అడుగుల నీటి మట్టానికి 552.700 అడుగుల మేర ఉన్నాయని జలమండలి తెలిపింది.
     
    భారీగా పెరిగిన సందర్శకులు
     
    జంట జలాశయాల గేట్లు తెరుస్తారన్న సమాచారంతో సోమవారం జంట నగరాల నుంచి భారీగా సందర్శకులు తరలి వచ్చారు. నిండు కుండల్లా మారిన జలాశయాల వద్ద సోమవారం ఆట విడుపుతో సందడి చేశారు. హిమాయత్ సాగర్‌లో సందర్శకులు పెరగటంతో కట్టపైకి వాహనాలను అనుమతించకుండా గేట్ల వద్దనే నిలిపివేశారు. దీంతో పర్యాటకులు నడుచుకుంటూ వెళ్లి జలాశయం అందాలను వీక్షించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement