భారీ వర్షాలతో కూలిన బిల్డింగ్‌.. మహిళ మృతి | Woman Died And 4 Injured As Portion Of Building Collapses In Mumbai, Watch Video Inside | Sakshi
Sakshi News home page

భారీ వర్షాలతో కూలిన బిల్డింగ్‌.. మహిళ మృతి

Published Sat, Jul 20 2024 3:16 PM | Last Updated on Sat, Jul 20 2024 5:23 PM

 Woman dead 4 injured as portion of building collapses in Mumbai

ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో రహదారులపై విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. అంధేరి సబ్‌వే ఐదు అడుగుల మేర నీటితో నిండిపోవడంతో అధికారులు ఈ సబ్‌వేను మూసివేశారు.

విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ముంబైలోని గ్రాంట్‌ రోడ్డులో ఓ బహుళ అంతస్తుల బిల్డింగ్‌లోని కొంతభాగం కూలిపోయింది. ఈ ఘటనలో 70 ఏళ్ల వృద్ధ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరో నలుగురికి గాయాలయ్యాయి. గ్రాంట్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలోని స్లీటర్‌ రోడ్డులో నాలుగు అంతస్తుల రూబినిస్సా మంజిల్‌ భవనంలో శనివారం ఉదయం 11 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బిల్డింగ్‌ రెండు, మూడు అంతస్తుల్లోని బాల్కనీతోపాటు కొంత భాగం కూలిపోయింది.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. అయితే భవనం కూలిపోయే సమయానికి అందులో 35 నుంచి 40 మంది చిక్కుకొని ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఇప్పటికీ బిల్డింగ్‌ ముందు కొంత భాగం ప్రమాదకరంగా వేలాడుతూనే ఉంది.

ఈ ఘటనకు చెందిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో శిథిలాల కింద  ఇరుక్కుపోయిన వ్యక్తిని రక్షించేందుకు స్థానికులు కాంక్రీట్ స్లాబ్‌లను తొలగిస్తున్న దృశ్యాలు కనిపిస్తు​న్నాయి. ఇక గత మూడు రోజులుగా ముంబై, దాని పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడటం, బిల్డింగ్‌ శిథిలావస్థలో ఉండటమే ప్రమాదానికి కారణంగా అధికారులు భావిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement