వన్ ఉమన్ ఆర్మీ | Mumbai Maria DSouza Woman Behind Zero Waste Societies | Sakshi
Sakshi News home page

వన్ ఉమన్ ఆర్మీ

Published Mon, Jan 20 2020 2:19 AM | Last Updated on Mon, Jan 20 2020 2:19 AM

Mumbai Maria DSouza Woman Behind  Zero Waste Societies - Sakshi

మారియా డిసౌజా

మోదీ వచ్చాక దేశంలో చెత్తశుద్ధి మొదలైంది. ఇదే పనిని.. మోదీ రాకముందే ముంబయిలో.. మారియా డిసౌజా చిత్తశుద్ధితో చేశారు! ఇప్పటికీ ఆ సిటీలో ఎక్కడ స్వచ్ఛ కార్యక్రమం ప్రారంభమైనా అత్యవసర సమయాల్లో సైన్యాన్ని దింపినట్లుగా.. మారియా డిసౌజాకు స్వాగతం పలుకుతుంటారు. అవును. ఆమె సైన్యమే. వన్‌ ఉమన్‌ ఆర్మీ!

‘జనం మీరు చేపట్టిన పనిని వ్యతిరేకిస్తున్నారు, తీవ్రంగా విమర్శిస్తూ దుయ్యబడుతున్నారు... అంటే దాని అర్థం మీరు సరైన దారిలో వెళ్తున్నారని’. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత ఆరోగ్యం కోసం ఒక సామాజిక ఉద్యమాన్ని చేపట్టినప్పుడు తనకు వ్యతిరేకత ఎదురైన నేపథ్యంలో ఈ మాట అనలేదు మారియా డిసౌజా. అదే ఉద్యమంలో ముంబయిలోని నలభైకి పైగా నివాస ప్రాంతాలను, అక్కడ నివసించే వారిని కలుపుకుని ఉద్యమాన్ని విజయవంతం చేసిన తర్వాత అన్నమాట ఇది! ఆమె ముంబయిలో రోజూ బయల్పడే పదివేల టన్నుల చెత్తను ఉపయుక్తంగా మార్చడంలో కీలక పాత్ర వహించారు. వన్‌ మ్యాన్‌ ఆర్మీ అనే నానుడిని చెరిపేసి వన్‌ ఉమన్‌ ఆర్మీ అనే కొత్త భావనకు ప్రేరణ అయ్యారు.

శుభ్రత పాఠాలు
మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ ముంబయి.. నగర పౌరుల పచ్చటి భవిష్యత్తు కోసం 1997లో ఏఎల్‌ఎమ్‌ (అడ్వాన్స్‌ లొకాలిటీ మేనేజ్‌మెంట్‌) ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టింది. అందులో నగరంలో నివసిస్తున్న అందరినీ భాగస్వామ్యం చేస్తూ స్థానికంగా కమిటీలు ఏర్పాటు చేయాలనుకుంది. ఆ కమిటీలు స్థానిక కాలనీల వాళ్లందరినీ చైతన్యవంతం చేయాలి. ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొనేందుకు చురుకుగా ముందుకు వచ్చారు బంద్రాలోని సెయింట్‌ స్టానిస్టాలస్‌ స్కూల్‌ టీచర్‌ మారియా డిసౌజా. ఆమె పని చేసే స్కూలు బయట గేటు పక్కన  చెత్తతో నిండి పొర్లిపోతున్న రెండు పెద్ద డస్ట్‌బిన్‌ల నుంచే జీరో వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఉద్యమాన్ని మొదలు పెట్టారు.

మున్సిపల్‌ సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా చెత్తను తొలగించకపోవడం, ఒకరోజు వర్షానికి నేలంతా చెత్త పరుచుకుని పిల్లలు కాలు పెడితే పాదం మడమలోతుకు కూరుకుపోవడంతో ఇక ఆమె ఊరుకోలేకపోయారు. పిల్లల చేతనే నగరపాలక సంస్థకు పెద్ద ఉత్తరం రాయించారు డిసౌజా. ఆ ఉత్తరం భారీ కదలికనే తెచ్చింది. అధికారి ఒకరు స్వయంగా వచ్చిచూసి వెంటనే చెత్త తీయించేశారు. దాంతో పిల్లల్లో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. జీరో వేస్ట్‌మేనేజ్‌మెంట్‌ గురించి స్కూలు గోడల మీద నినాదాలు రాయడం, చెత్త పేరుకుపోయి దోమలు ఎక్కువైతే వచ్చే అనారోగ్యాలతోపాటు, చెత్త నుంచి వచ్చే దుర్వాసనను పీల్చడంతో వచ్చే శ్వాసకోశ సమస్యలను స్థానికులకు వివరించడంలో మారియా టీచర్‌తో భాగస్వాములయ్యారు. ఇదే ఇతివృత్తంతో చిన్న చిన్న నాటకాలు వేయడంలో కూడా పిల్లలకు శిక్షణనిచ్చారామె.

చేదు అనుభవాలు
స్థానికుల్లో చైతన్యం తెచ్చే క్రమంలో ఆమెకు ఎదురైన చేదు అనుభవాలు అన్నీ ఇన్నీ కావు. కొంతమంది ‘ఆ చెత్త గొడవేంటో మీరు చూసుకోండి, మా పిల్లలను ఇన్‌వాల్వ్‌ చేయద్దు’ అని ప్రతిఘటించారు. మరికొందరు.. దారిలో వెళ్తుంటే ఆమె మీద కుళ్లిన టొమాటోలు, ఇంట్లో వచ్చిన చెత్తను పడేశారు. దాంతో మారియా తన ప్రయత్నాన్ని చర్చిలు, వాటికి అనుబంధంగా ఉన్న హాస్పిటళ్లు, స్కూళ్లలో అమలు చేసి చూపించారు. ఇంటింటికీ వెళ్లి వివరించారు. ‘చెత్తను ఎరువుగా మార్చుకోవడానికి సిద్ధమే కానీ, వాసన భరించలేం’ అన్న వాళ్లను మారియా ‘‘మరి ఈ చెత్తనంతటినీ తీసుకెళ్లి నగరానికి దూరంగా మరొక చోట పడేసినప్పుడు అక్కడ నివసించే వాళ్లు ఈ దుర్వాసనను ఎందుకు భరించాలి’’ అని సూటిగా ప్రశ్నించారు. ‘‘నగరంలోని చెత్తను తరలించడానికి నగరపాలక సంస్థకు అయ్యే ఖర్చు చాలా పెద్దది. మనం ఎక్కడి చెత్తను అక్కడే స్థానికంగా ఎరువుగా మార్చుకోగలిగితే, చెత్త రవాణాకు అయ్యే ఖర్చును నగరపాలక సంస్థ మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తుంది.

చెత్తను తరలించే డబ్బు కూడా మనం పన్నుల రూపంలో చెల్లించిన డబ్బే. అంటే మన డబ్బే’’ అని పిల్లలకు పాఠం చెప్పినట్లు చెప్పారు మారియా. చెత్తలో ఆహారాన్ని వెతుక్కుంటూ పక్షులు వచ్చి వాలడం, పక్షుల కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం కలగడం వంటి పరిణామాలను తెలియచేశారు మారియా. తడి చెత్త, పొడి చెత్త, ఈ వేస్ట్, హాస్పిటల్‌ వేస్ట్‌... నాలుగు రకాలుగా వర్గీకరించడం మొదలుపెట్టారామె. ఇరవై ఏళ్ల పాటు సాగిన ఆమె ఉద్యమం ఇప్పుడు గుర్తించదగిన స్థాయికి చేరింది. ముంబయి ప్రక్షాళన కార్యక్రమంలో నడివీధిలో ఆమె వేసిన అడుగులు ఇప్పుడు ఫలితాన్ని చూపిస్తున్నాయి. తన 68 ఏళ్ల ప్రస్థానంలో ఇరవై ఏళ్ల జీవితాన్ని జీరో వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఉద్యమం కోసమే కేటాయించారు మారియా. పిల్లలను భాగస్వాములను చేయడంతో రాబోయే తరం గురించిన చింత లేదని, ఈ ఉద్యమం కొనసాగుతుందనే భరోసా కలుగుతోందని, తన విద్యార్థులకు రుణపడి ఉంటానని చెప్పారామె.
– మంజీర

ముంబయిలో బాలీవుడ్‌ నటుడు షారూక్‌ ఖాన్‌ ఇల్లు ‘మన్నత్‌’, రేఖ ఇల్లు ‘బసేరా’, సల్మాన్‌ ఖాన్‌ నివసించే గ్యాలక్సీ అపార్ట్‌మెంట్‌... అన్నీ బంద్రాలోనే ఉన్నాయి. అరేబియా మహా సముద్రం తీరాన బంద్రా బండ్‌ స్టాండ్‌లో మార్నింగ్‌ వాకింగ్‌ చేసే వాళ్లకు ఒక సిమెంట్‌ బెంచ్‌ మీద రాజ్‌కపూర్‌ కనిపిస్తాడు. అప్పటి వరకు నడిచి నడిచి సేద దీరడానికి కూర్చున్నట్లు బెంచ్‌ మీద వెనక్కు వాలి ఎడమ చేతిని బెంచి మీదకు చాచిన రాజ్‌కపూర్‌ విగ్రహం ఉంటుంది. రాజ్‌కపూర్‌ పక్కన కూర్చుని ఆయన తమ భుజం మీద చేతిని వేసినట్లు మురిసిపోతూ ఫొటోలు తీసుకుంటూ ఉంటారు ముంబయికి వెళ్లిన పర్యాటకులు. సినిమా వాళ్లు నివసించే ప్రదేశం, సృజనాత్మకంగా ఉండడం సహజమే.. అనుకోవడమూ మామూలే. అయితే అదే బంద్రాలో జీరో వేస్ట్‌ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి స్కూలు పిల్లలు వీధి నాటకాలు వేయాల్సి వచ్చింది. తెర మీద తప్ప నేల మీద పెర్ఫార్మ్‌ చేయడానికి వాళ్లెవరూ ఇష్టపడకపోవడంతో ఈ సామాజిక ఉద్యమానికి మారియా డిసౌజా స్కూలు పిల్లలు ముందుకు వచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement