swacchabharath
-
వన్ ఉమన్ ఆర్మీ
మోదీ వచ్చాక దేశంలో చెత్తశుద్ధి మొదలైంది. ఇదే పనిని.. మోదీ రాకముందే ముంబయిలో.. మారియా డిసౌజా చిత్తశుద్ధితో చేశారు! ఇప్పటికీ ఆ సిటీలో ఎక్కడ స్వచ్ఛ కార్యక్రమం ప్రారంభమైనా అత్యవసర సమయాల్లో సైన్యాన్ని దింపినట్లుగా.. మారియా డిసౌజాకు స్వాగతం పలుకుతుంటారు. అవును. ఆమె సైన్యమే. వన్ ఉమన్ ఆర్మీ! ‘జనం మీరు చేపట్టిన పనిని వ్యతిరేకిస్తున్నారు, తీవ్రంగా విమర్శిస్తూ దుయ్యబడుతున్నారు... అంటే దాని అర్థం మీరు సరైన దారిలో వెళ్తున్నారని’. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత ఆరోగ్యం కోసం ఒక సామాజిక ఉద్యమాన్ని చేపట్టినప్పుడు తనకు వ్యతిరేకత ఎదురైన నేపథ్యంలో ఈ మాట అనలేదు మారియా డిసౌజా. అదే ఉద్యమంలో ముంబయిలోని నలభైకి పైగా నివాస ప్రాంతాలను, అక్కడ నివసించే వారిని కలుపుకుని ఉద్యమాన్ని విజయవంతం చేసిన తర్వాత అన్నమాట ఇది! ఆమె ముంబయిలో రోజూ బయల్పడే పదివేల టన్నుల చెత్తను ఉపయుక్తంగా మార్చడంలో కీలక పాత్ర వహించారు. వన్ మ్యాన్ ఆర్మీ అనే నానుడిని చెరిపేసి వన్ ఉమన్ ఆర్మీ అనే కొత్త భావనకు ప్రేరణ అయ్యారు. శుభ్రత పాఠాలు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబయి.. నగర పౌరుల పచ్చటి భవిష్యత్తు కోసం 1997లో ఏఎల్ఎమ్ (అడ్వాన్స్ లొకాలిటీ మేనేజ్మెంట్) ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టింది. అందులో నగరంలో నివసిస్తున్న అందరినీ భాగస్వామ్యం చేస్తూ స్థానికంగా కమిటీలు ఏర్పాటు చేయాలనుకుంది. ఆ కమిటీలు స్థానిక కాలనీల వాళ్లందరినీ చైతన్యవంతం చేయాలి. ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొనేందుకు చురుకుగా ముందుకు వచ్చారు బంద్రాలోని సెయింట్ స్టానిస్టాలస్ స్కూల్ టీచర్ మారియా డిసౌజా. ఆమె పని చేసే స్కూలు బయట గేటు పక్కన చెత్తతో నిండి పొర్లిపోతున్న రెండు పెద్ద డస్ట్బిన్ల నుంచే జీరో వేస్ట్ మేనేజ్మెంట్ ఉద్యమాన్ని మొదలు పెట్టారు. మున్సిపల్ సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా చెత్తను తొలగించకపోవడం, ఒకరోజు వర్షానికి నేలంతా చెత్త పరుచుకుని పిల్లలు కాలు పెడితే పాదం మడమలోతుకు కూరుకుపోవడంతో ఇక ఆమె ఊరుకోలేకపోయారు. పిల్లల చేతనే నగరపాలక సంస్థకు పెద్ద ఉత్తరం రాయించారు డిసౌజా. ఆ ఉత్తరం భారీ కదలికనే తెచ్చింది. అధికారి ఒకరు స్వయంగా వచ్చిచూసి వెంటనే చెత్త తీయించేశారు. దాంతో పిల్లల్లో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. జీరో వేస్ట్‌మేనేజ్‌మెంట్ గురించి స్కూలు గోడల మీద నినాదాలు రాయడం, చెత్త పేరుకుపోయి దోమలు ఎక్కువైతే వచ్చే అనారోగ్యాలతోపాటు, చెత్త నుంచి వచ్చే దుర్వాసనను పీల్చడంతో వచ్చే శ్వాసకోశ సమస్యలను స్థానికులకు వివరించడంలో మారియా టీచర్‌తో భాగస్వాములయ్యారు. ఇదే ఇతివృత్తంతో చిన్న చిన్న నాటకాలు వేయడంలో కూడా పిల్లలకు శిక్షణనిచ్చారామె. చేదు అనుభవాలు స్థానికుల్లో చైతన్యం తెచ్చే క్రమంలో ఆమెకు ఎదురైన చేదు అనుభవాలు అన్నీ ఇన్నీ కావు. కొంతమంది ‘ఆ చెత్త గొడవేంటో మీరు చూసుకోండి, మా పిల్లలను ఇన్వాల్వ్ చేయద్దు’ అని ప్రతిఘటించారు. మరికొందరు.. దారిలో వెళ్తుంటే ఆమె మీద కుళ్లిన టొమాటోలు, ఇంట్లో వచ్చిన చెత్తను పడేశారు. దాంతో మారియా తన ప్రయత్నాన్ని చర్చిలు, వాటికి అనుబంధంగా ఉన్న హాస్పిటళ్లు, స్కూళ్లలో అమలు చేసి చూపించారు. ఇంటింటికీ వెళ్లి వివరించారు. ‘చెత్తను ఎరువుగా మార్చుకోవడానికి సిద్ధమే కానీ, వాసన భరించలేం’ అన్న వాళ్లను మారియా ‘‘మరి ఈ చెత్తనంతటినీ తీసుకెళ్లి నగరానికి దూరంగా మరొక చోట పడేసినప్పుడు అక్కడ నివసించే వాళ్లు ఈ దుర్వాసనను ఎందుకు భరించాలి’’ అని సూటిగా ప్రశ్నించారు. ‘‘నగరంలోని చెత్తను తరలించడానికి నగరపాలక సంస్థకు అయ్యే ఖర్చు చాలా పెద్దది. మనం ఎక్కడి చెత్తను అక్కడే స్థానికంగా ఎరువుగా మార్చుకోగలిగితే, చెత్త రవాణాకు అయ్యే ఖర్చును నగరపాలక సంస్థ మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తుంది. చెత్తను తరలించే డబ్బు కూడా మనం పన్నుల రూపంలో చెల్లించిన డబ్బే. అంటే మన డబ్బే’’ అని పిల్లలకు పాఠం చెప్పినట్లు చెప్పారు మారియా. చెత్తలో ఆహారాన్ని వెతుక్కుంటూ పక్షులు వచ్చి వాలడం, పక్షుల కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం కలగడం వంటి పరిణామాలను తెలియచేశారు మారియా. తడి చెత్త, పొడి చెత్త, ఈ వేస్ట్, హాస్పిటల్ వేస్ట్... నాలుగు రకాలుగా వర్గీకరించడం మొదలుపెట్టారామె. ఇరవై ఏళ్ల పాటు సాగిన ఆమె ఉద్యమం ఇప్పుడు గుర్తించదగిన స్థాయికి చేరింది. ముంబయి ప్రక్షాళన కార్యక్రమంలో నడివీధిలో ఆమె వేసిన అడుగులు ఇప్పుడు ఫలితాన్ని చూపిస్తున్నాయి. తన 68 ఏళ్ల ప్రస్థానంలో ఇరవై ఏళ్ల జీవితాన్ని జీరో వేస్ట్ మేనేజ్మెంట్ ఉద్యమం కోసమే కేటాయించారు మారియా. పిల్లలను భాగస్వాములను చేయడంతో రాబోయే తరం గురించిన చింత లేదని, ఈ ఉద్యమం కొనసాగుతుందనే భరోసా కలుగుతోందని, తన విద్యార్థులకు రుణపడి ఉంటానని చెప్పారామె. – మంజీర ముంబయిలో బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ ఇల్లు ‘మన్నత్’, రేఖ ఇల్లు ‘బసేరా’, సల్మాన్ ఖాన్ నివసించే గ్యాలక్సీ అపార్ట్మెంట్... అన్నీ బంద్రాలోనే ఉన్నాయి. అరేబియా మహా సముద్రం తీరాన బంద్రా బండ్ స్టాండ్‌లో మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్లకు ఒక సిమెంట్ బెంచ్ మీద రాజ్‌కపూర్ కనిపిస్తాడు. అప్పటి వరకు నడిచి నడిచి సేద దీరడానికి కూర్చున్నట్లు బెంచ్ మీద వెనక్కు వాలి ఎడమ చేతిని బెంచి మీదకు చాచిన రాజ్‌కపూర్ విగ్రహం ఉంటుంది. రాజ్‌కపూర్ పక్కన కూర్చుని ఆయన తమ భుజం మీద చేతిని వేసినట్లు మురిసిపోతూ ఫొటోలు తీసుకుంటూ ఉంటారు ముంబయికి వెళ్లిన పర్యాటకులు. సినిమా వాళ్లు నివసించే ప్రదేశం, సృజనాత్మకంగా ఉండడం సహజమే.. అనుకోవడమూ మామూలే. అయితే అదే బంద్రాలో జీరో వేస్ట్‌ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి స్కూలు పిల్లలు వీధి నాటకాలు వేయాల్సి వచ్చింది. తెర మీద తప్ప నేల మీద పెర్ఫార్మ్ చేయడానికి వాళ్లెవరూ ఇష్టపడకపోవడంతో ఈ సామాజిక ఉద్యమానికి మారియా డిసౌజా స్కూలు పిల్లలు ముందుకు వచ్చారు. -
‘స్వచ్ఛత’లో వెనుకంజ
సాక్షి, ఆదిలాబాద్‌రూరల్: స్వచ్ఛ సర్వేక్షణ్–2019 ర్యాంకుల్లో ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఎంతో వెనుకబడింది. ఈ సారి జాతీయస్థాయిలో 330వ స్థానంలో నిలిచింది. గతంలో 133వ ర్యాంకులో ఉన్న మున్సిపాలిటీ ఈ సారి వెనక్కి వెళ్లింది. ఈ ఏడాది మైనస్ మార్కులు ఉండడంతో ర్యాంకుల్లో వెనుకబడ్డామని అధికారులు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా నగరాలు, పట్టణాలను స్వచ్ఛమైన నివాస ప్రాంతాలుగా మార్చాలన్న లక్ష్యంతో మున్సిపాలిటీల్లో స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఇది ఏ మేరకు అమలవుతుందో తెలుసుకునేందుకు 2017 నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్‌ను ప్రారంభించింది. ఏటా జనవరిలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ బృందం సభ్యులు పరిశుభ్రతను పరిశీలించి స్వచ్ఛతపై వివరాలు సేకరించిన తర్వాత మార్పులను బట్టి ర్యాంకు కేటాయిస్తారు. ఈ బృందం సభ్యులు కాలనీల్లో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వివరాల సేకరణతోపాటు స్థానికుల నుంచి వివరాలు సేకరించి కేంద్రానికి పంపిస్తారు. ఈ వివరాల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులను ప్రకటిస్తుంది. గతం కంటే ఈసారి మరిన్ని నిబంధనలు పొందుపర్చడంతో కొంత ర్యాంకు తగ్గిందని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే గతంలో మైనస్ మార్కులు ఉండేవి కావు, ఈ సారి మైనస్ మార్కులు ఉండడంతో ర్యాంకులో వెనుకపడ్డట్లు తెలుస్తోంది. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో తగ్గిన ర్యాంకు.. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఆదిలాబాద్ మున్సిపాలిటీ 2017లో 195వ ర్యాంకు సాధించింది. 2018లో 2,423 మార్కులు సాధించి 133వ ర్యాంకు పొందింది. 2017తో పోలిస్తే 2018లో మెరుగైన ర్యాంకు సాధించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2019లో ఆదిలాబాద్ మున్సిపాలిటీ జాతీయ స్థాయిలో 330వ ర్యాంకు సాధించగా, రాష్ట్ర స్థాయిలో 11వ ర్యాంకు సాధించింది. వీటిలో మెరుగైతేనే.. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మార్పులు, మెరుగైన ర్యాంకు సాధించాలంటే మొదటగా ప్రత్యేక ప్రణాళిక రూపొదించుకోవాల్సి ఉంటుంది. ర్యాంకు సాధించుకోవాలంటే పట్టణ ప్రజల్లో పరిశుభ్రతపై చైతన్యం తేవాలి. పారిశుధ్య సిబ్బంది మున్సిపాలిటీల్లో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించి పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలి. బహిరంగ మల, మూత్ర విసర్జనను వంద శాతం నిషేధించాలి. ప్రతీ ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేరు చేసి అందించేలా చూడడంతోపాటు పారిశుధ్య కార్మికులు బాధ్యతగా చెత్తను ప్రతీ రోజు తీసుకెళ్లేలా చూడాలి. మున్సిపాలిటీల్లో తడి, పొడి చెత్త సేకరణకు ప్రజలకు రెండు చెత్త బుట్టలు అందించాలి. వాటి వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రత్యేక ప్రశ్నావళి ద్వారా ప్రజల నుంచి వివరాలను రాబడతారు. స్వచ్ఛ సర్వేక్షణ్ బృందంలోని అధికారులు మున్సిపాలిటీ నాలుగు విభాలుగా విభజించి మార్కులు కేటాయిస్తారు. సర్వీస్ లెవల్ బెంచ్ మార్కులు 1250, థర్డ్ పార్టీ ఆఫీసర్ల పరిశీలన ద్వారా 1250 మార్కులు, సిటిజన్ ఫీడ్ బ్యాక్ ద్వారా 1250 మార్కులు, సర్టిఫికెట్, ఓడీఎఫ్ గ్యార్బేజీ, ప్రీసిటీ, కెపాసిటీ బిల్డిండ్ ద్వారా మరో 1250 మార్కులకు కేటాయించి ర్యాంకు ప్రకటిస్తారు. మరిన్ని నిబంధనలు పొందుపర్చడంతోనే.. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో గతంలో మైనస్ మార్కులు ఉండేవి కావు. ఈసారి మరిన్ని నిబంధనలు పొందుపర్చారు. దీంతో ర్యాంకు తగ్గింది. వచ్చే సంవత్సరం పట్టణ ప్రజలకు మరింత అవగాహన కల్పించి, మెరుగైన ర్యాంకు సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తాం. – మారుతిప్రసాద్, మున్సిపల్ కమిషనర్, ఆదిలాబాద్ -
లక్ష్యం..కను‘మరుగు’
– మరుగుదొడ్ల నిర్మాణానికి సమీపిస్తున్న గడువు – అక్టోబర్ 2 నాటికి 50 గ్రామాల్లో పూర్తికావాలి – కానీ ఇప్పటికి 12 గ్రామాల్లోనే పూర్తి – 38 గ్రామాల్లో వివిధ దశల్లోనే ఆగిపోయిన వైనం స్వచ్ఛభారత్ మిషన్ పథకం కింద ప్రతి ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యం మరుగున పడిపోయింది. అక్టోబర్ 2 నాటికి జిల్లాలోని 50 గ్రామ పంచాయతీలను బహిరంగ మలవిసర్జన రహిత (ఓడీఎఫ్) గ్రామాలుగా తీర్చిదిద్దాలని అధికారులు నిర్ధేశించుకున్నారు. గడువు సమీపిస్తున్నా జిల్లా అధికారులు నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. ఇప్పటివరకు కేవలం 12 పంచాయతీల్లోనే మరుగుదొడ్లు పూర్తయ్యాయి. మరో 38 పంచాయతీల్లో వివిధ దశల్లోనే ఆగిపోయాయి. చిత్తూరు(కార్పొరేషన్) : ఆత్మగౌరవమే నినాదంగా 2014 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రధానిlమోదీ స్వచ్ఛభారత్ మిషన్ పథకం కింద వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే ఇది పురోగ దిశగా సాగడంలేదు. ఈ మరుగుదొడ్డ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు సమకూర్చుతాయి. 2015 మార్చి 15వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో పథకం అమలులోకి వచ్చింది. ఒక్కో మరుగుదొడ్డికి కేంద్రం రూ. 7,200, రాష్ట్ర ప్రభుత్వం రూ.7,800 చొప్పున మంజూరు చేస్తుంది. 4 ఇంటూ 6 సైజుతో వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించాలి. నిర్మాణం పూర్తయిన 45 రోజుల్లో సంబంధిత లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాలో జమచేయాలి. అక్టోబర్ 2 నాటికి 50 గ్రామాలు టార్గెట్ అక్టోబర్ 2 నాటికి జిల్లాలోని 50 గ్రామ పంచాయతీలను ఓడీఎఫ్‌గా తీర్చిదిద్దాలని అధికారులు నిర్ధేశించుకున్నారు. ఆయా పంచాయతీల్లో మొత్తం 1,6075 వేల మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు 12 పంచాయతీల్లో 1,268 మరుగుదొడ్లు మాత్రమే పూర్తయ్యాయి. 14 వేల మరుగుదొడ్లు వివిధ దశల్లోనే నిలిచిపోయాయి. మిగిలిన మరుగుదొడ్లు అసలే ప్రారంభంకాలేదు. 12 గ్రామాల్లోనే పూర్తి చిత్తూరు మండలంలోని చింతలగుంట పంచాయతీలో (117 మరుగుదొడ్లు), చంద్రగిరి మండలం ఏజీపల్లెలో (15), నెన్నూర్లో (41), కుప్పంలోని గుండ్లసాగరం పంచాయతీలో (313), శాంతిపురం మండలంలోని కోనేరు కుప్పం గ్రామంలో (188), నగరి నియోకవర్గ పరిధిలోని ఎమ్ఎస్వీఎమ్పురంలో (46), సత్యవేడులోని ఏఎస్పురం గ్రామంలో (5), ఏర్పేడు మండలంలోని పాపానాయుడుపేటలో (11) మరుగుదొడ్లు పూర్తిచేశారు. 38 పంచాయతీల్లో పెండింగ్ పలమనేరులోని మదనపల్లె, రాజుపల్లె, పీలేరులోని వాగాల, గంగాపురం, బలంవారిపల్లె, పూతలపట్టులోని అరగొండ, కీనాటంపల్లె, చిత్తూరులోని ఎన్ఆర్పేట, పాలూరు, జీడీనెల్లూరులోని పాతపాళ్యం, నగరిలో అడవికొత్తూరు, శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని మామండూరు, సత్యవేడులోని బొప్పరాజుపాళ్యం, చంద్రగిరిలోని దేవరకొండ, తిరుపతి రూరల్‌లో రామానూజపల్లె ప్రాంతాల్లో మరుగుదొడ్లు వివిధ దశల్లోనే ఆగిపోయాయి. ఈ ఏడాది 516 గ్రామపంచాయతీలు లక్ష్యం ఈ ఆర్థిక సంవత్సరానికిగాను ఆర్డబ్ల్యూఎస్ శాఖ 250, ఎన్ఆర్జీఎస్ కింద 266 గ్రామ పంచాయతీలను ఓడీఎఫ్‌గా తీర్చిదిద్దాలని అధికారులు నిర్ధేశించుకున్నారు. ఇందులో అక్టోబర్ 2 నాటికి 50 గ్రామపంచాయతీల్లో లక్ష్యం పూర్తిచేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇందులో 30 శాతం కూడా ఇంతవరకు పూర్తిచేయలేకపోయారు. ఇక మిగిలిన 11 రోజుల్లో 70 శాతం పూర్తిచేయాల్సి ఉంది. బిల్లులు ఆలస్యం మరుగుదొడ్ల నిర్మాణానికి ముందుకొచ్చిన లబ్ధిదారులకు పంచాయతీ కార్యదర్శులు, మండల కార్యాలయ సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. జియోట్యాగ్‌లు, ఎంబుక్‌ల పేరుతో రోజుల తరబడి తిప్పుకోవడం రివాజుగా మారుతోంది. దీనికితోడు ఇటీవల ఆడిట్పేరుతో పంచాయతీ సెక్రటరీలు సుమారు రెండు నెలలపాటు గ్రామపంచాయతీల వైపు కన్నెత్తి చూడలేదు. పైగా రెండు నెలల నుంచి బిల్లులు ఆగిపోయాయని సంబంధిత సిబ్బందే చెబుతున్నారు. అప్పులు చేసి మరుగదొడ్ల నిర్మించినా సకాలంలో బిల్లులు రాక అగచాట్లు పడాల్సి వస్తోందని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. లక్ష్యాన్ని చేరుకుంటాం అక్టోబర్ 2 నాటికి 50 గ్రామ పంచాయతీను ఓడీఎఫ్లుగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాం. ఇప్పటివరకు 12 పంచాయతీల్లో లక్ష్యాన్ని పూర్తిచేశాం. మిగిలిన పంచాయతీల్లోనూ పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టి అక్టోబర్ 2 నాటికి లక్ష్యాన్ని చేరుకుంటాం. రాష్ట్ర కార్యాలయ మార్పు వల్ల బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యమైంది. ప్రస్తుతం బిల్లులు మంజూరు చేస్తున్నాం. – వేణు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ