ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కార్యాలయం
లక్ష్యం..కను‘మరుగు’
Published Mon, Sep 19 2016 11:49 PM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM
– మరుగుదొడ్ల నిర్మాణానికి సమీపిస్తున్న గడువు
– అక్టోబర్ 2 నాటికి 50 గ్రామాల్లో పూర్తికావాలి
– కానీ ఇప్పటికి 12 గ్రామాల్లోనే పూర్తి
– 38 గ్రామాల్లో వివిధ దశల్లోనే ఆగిపోయిన వైనం
స్వచ్ఛభారత్ మిషన్ పథకం కింద ప్రతి ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యం మరుగున పడిపోయింది. అక్టోబర్ 2 నాటికి జిల్లాలోని 50 గ్రామ పంచాయతీలను బహిరంగ మలవిసర్జన రహిత (ఓడీఎఫ్) గ్రామాలుగా తీర్చిదిద్దాలని అధికారులు నిర్ధేశించుకున్నారు. గడువు సమీపిస్తున్నా జిల్లా అధికారులు నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. ఇప్పటివరకు కేవలం 12 పంచాయతీల్లోనే మరుగుదొడ్లు పూర్తయ్యాయి. మరో 38 పంచాయతీల్లో వివిధ దశల్లోనే ఆగిపోయాయి.
చిత్తూరు(కార్పొరేషన్) :
ఆత్మగౌరవమే నినాదంగా 2014 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రధానిlమోదీ స్వచ్ఛభారత్ మిషన్ పథకం కింద వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే ఇది పురోగ దిశగా సాగడంలేదు. ఈ మరుగుదొడ్డ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు సమకూర్చుతాయి. 2015 మార్చి 15వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో పథకం అమలులోకి వచ్చింది. ఒక్కో మరుగుదొడ్డికి కేంద్రం రూ. 7,200, రాష్ట్ర ప్రభుత్వం రూ.7,800 చొప్పున మంజూరు చేస్తుంది. 4 ఇంటూ 6 సైజుతో వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించాలి. నిర్మాణం పూర్తయిన 45 రోజుల్లో సంబంధిత లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాలో జమచేయాలి.
అక్టోబర్ 2 నాటికి 50 గ్రామాలు టార్గెట్
అక్టోబర్ 2 నాటికి జిల్లాలోని 50 గ్రామ పంచాయతీలను ఓడీఎఫ్‌గా తీర్చిదిద్దాలని అధికారులు నిర్ధేశించుకున్నారు. ఆయా పంచాయతీల్లో మొత్తం 1,6075 వేల మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు 12 పంచాయతీల్లో 1,268 మరుగుదొడ్లు మాత్రమే పూర్తయ్యాయి. 14 వేల మరుగుదొడ్లు వివిధ దశల్లోనే నిలిచిపోయాయి. మిగిలిన మరుగుదొడ్లు అసలే ప్రారంభంకాలేదు.
12 గ్రామాల్లోనే పూర్తి
చిత్తూరు మండలంలోని చింతలగుంట పంచాయతీలో (117 మరుగుదొడ్లు), చంద్రగిరి మండలం ఏజీపల్లెలో (15), నెన్నూర్‌లో (41), కుప్పంలోని గుండ్లసాగరం పంచాయతీలో (313), శాంతిపురం మండలంలోని కోనేరు కుప్పం గ్రామంలో (188), నగరి నియోకవర్గ పరిధిలోని ఎమ్‌ఎస్‌వీఎమ్‌పురంలో (46), సత్యవేడులోని ఏఎస్‌పురం గ్రామంలో (5), ఏర్పేడు మండలంలోని పాపానాయుడుపేటలో (11) మరుగుదొడ్లు పూర్తిచేశారు.
38 పంచాయతీల్లో పెండింగ్
పలమనేరులోని మదనపల్లె, రాజుపల్లె, పీలేరులోని వాగాల, గంగాపురం, బలంవారిపల్లె, పూతలపట్టులోని అరగొండ, కీనాటంపల్లె, చిత్తూరులోని ఎన్‌ఆర్‌పేట, పాలూరు, జీడీనెల్లూరులోని పాతపాళ్యం, నగరిలో అడవికొత్తూరు, శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని మామండూరు, సత్యవేడులోని బొప్పరాజుపాళ్యం, చంద్రగిరిలోని దేవరకొండ, తిరుపతి రూరల్‌లో రామానూజపల్లె ప్రాంతాల్లో మరుగుదొడ్లు వివిధ దశల్లోనే ఆగిపోయాయి.
ఈ ఏడాది 516 గ్రామపంచాయతీలు లక్ష్యం
ఈ ఆర్థిక సంవత్సరానికిగాను ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ 250, ఎన్‌ఆర్‌జీఎస్ కింద 266 గ్రామ పంచాయతీలను ఓడీఎఫ్‌గా తీర్చిదిద్దాలని అధికారులు నిర్ధేశించుకున్నారు. ఇందులో అక్టోబర్ 2 నాటికి 50 గ్రామపంచాయతీల్లో లక్ష్యం పూర్తిచేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇందులో 30 శాతం కూడా ఇంతవరకు పూర్తిచేయలేకపోయారు. ఇక మిగిలిన 11 రోజుల్లో 70 శాతం పూర్తిచేయాల్సి ఉంది.
బిల్లులు ఆలస్యం
మరుగుదొడ్ల నిర్మాణానికి ముందుకొచ్చిన లబ్ధిదారులకు పంచాయతీ కార్యదర్శులు, మండల కార్యాలయ సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. జియోట్యాగ్‌లు, ఎంబుక్‌ల పేరుతో రోజుల తరబడి తిప్పుకోవడం రివాజుగా మారుతోంది. దీనికితోడు ఇటీవల ఆడిట్‌పేరుతో పంచాయతీ సెక్రటరీలు సుమారు రెండు నెలలపాటు గ్రామపంచాయతీల వైపు కన్నెత్తి చూడలేదు. పైగా రెండు నెలల నుంచి బిల్లులు ఆగిపోయాయని సంబంధిత సిబ్బందే చెబుతున్నారు. అప్పులు చేసి మరుగదొడ్ల నిర్మించినా సకాలంలో బిల్లులు రాక అగచాట్లు పడాల్సి వస్తోందని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు.
లక్ష్యాన్ని చేరుకుంటాం
అక్టోబర్ 2 నాటికి 50 గ్రామ పంచాయతీను ఓడీఎఫ్‌లుగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాం. ఇప్పటివరకు 12 పంచాయతీల్లో లక్ష్యాన్ని పూర్తిచేశాం. మిగిలిన పంచాయతీల్లోనూ పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టి అక్టోబర్ 2 నాటికి లక్ష్యాన్ని చేరుకుంటాం. రాష్ట్ర కార్యాలయ మార్పు వల్ల బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యమైంది. ప్రస్తుతం బిల్లులు మంజూరు చేస్తున్నాం.
– వేణు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ
Advertisement
Advertisement