ఇరు గ్రామాల మధ్య రాజుకున్న వివాదం
ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన ముద్దలాపురం గ్రామస్తులు
అనంతపురం: దేవర దున్నపోతు కోసం రెండు గ్రామాల మధ్య వివాదం రాజుకుంది. కూడేరు మండలం ముద్దలాపురంలో ముత్యాలమ్మ, కదరగుంటలో బొడ్రాయి ప్రతిష్ట సందర్భంగా దేవర నిర్వహణకు గ్రామస్తులు పూనుకున్నారు. ఇందు కోసం దేవరలో బలి ఇచ్చేందుకు గ్రామానికి ఒక దున్నపోతును వదిలారు. ఈ రెండు దున్నపోతులు నాలుగేళ్లుగా సమీప గ్రామాల్లో సంచరిస్తున్నాయి. ఈ నెల 22న దేవర ఉండడంతో ఇటీవల గ్రామంలోకి వచ్చిన దున్నపోతును కదరకుంట గ్రామస్తులు కట్టేశారు.
21వ తేదీన ముద్దలాపురంలో దేవర ఉంది. దీంతో పక్క గ్రామంలో కట్టేసిన దున్నపోతు తమ గ్రామానికి చెందినదేనని ముద్దలాపురం గ్రామస్తులు నిర్ధారణకు వచ్చారు. తమ దున్నపోతును వదిలేస్తు దేవర చేసుకుంటామని కోరగా కడదరకుంట గ్రామస్తులు ఇందుకు ససేమిరా అన్నారు. అది తమదేనని ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. దీంతో గొడవలు జరిగే అవకాశం కనిపిస్తుండడంతో ముద్దలాపురం గ్రామస్తులు శుక్రవారం ఎస్పీని కలిసేందుకు కార్యాలయానికి వెళ్లారు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించే సోమవారం రోజున రావాలంటూ సిబ్బంది సూచించడంతో గ్రామస్తులు అక్కడి నుంచి వెనుదిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment