సాక్షి, ముంబై: డెంగీ వ్యాధితో బాధపడుతూ అంధేరీలోని కూపర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురిని శుక్రవారం నగర మేయర్ స్నేహల్ అంబేకర్ పరామర్శించారు. అక్కడ వారికి అందుతున్న చికిత్సపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా, గత కొద్ది నెలలుగా నగరాన్ని గజగజలాడిస్తున్న డెంగీ మహమ్మారి మరొకరిని బలితీసుకుంది. దీంతో డెంగ్యూతో మృతి చెందిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. అంధేరిలో నివాసముంటున్న మానసీ (3) అనే చిన్నారికి జ్వరం రావడంతో బుధవారం హోలి స్పిరిట్ ఆస్పత్రిలో చేర్పించారు.
ఆమెకు డెంగీ అని తేలగా వైద్యం ప్రారంభించారు. కాని చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం చనిపోయింది. గత వారం కిందట డెంగ్యూతో ఐదుగురు చనిపోయారు. అందులో కేం ఆస్పత్రికి చెందిన రెసిడెన్సీ డాక్టర్ శృతి ఖోబ్రగడే (24) కూడా ఉన్నారు. మరో ఏడుగురు రెసిడెన్సీ డాక్టర్లకు సైతం డెంగీ సోకినట్లు పరీక్షల్లో తేలింది. వీరందరు మాహింలోని హిందుజా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదేవిధంగా, నాసిక్‌లో ఇటీవల ఒకేరోజు ఇద్దరు, పింప్రిలో ఒకరు డెంగీతో బాధపడుతూ మరణించారు. ప్రాణాంతకమైన ఈ వ్యాధిని నివారించేందుకు మహానగర పాలక సంస్థ (బీఎంసీ) ఆరోగ్యశాఖ అనేక ప్రయత్నాలు చేస్తోంది. అయినా డెంగీ అదుపులోకి రాకపోవడంతో ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళనకు గురవుతున్నారు.
డెంగీ బాధితులకు మేయర్ పరామర్శ
Published Fri, Nov 7 2014 11:18 PM | Last Updated on Sat, Sep 2 2017 4:02 PM
Advertisement
Advertisement