Snehal ambekar
-
వివాదాలతో స్నేహం
ముంబై: ఎప్పుడూ వివాదాల్లో ఉండే ముంబై మేయర్ స్నేహల్ అంబేకర్ ఇప్పుడు మరో సరికొత్త వివాదానికి తెర లేపారు. నగరంలోని రోడ్ల పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ముంబై మున్సిపల్ కమిషనర్ అజోయ్ మెహతాకు ఆమె రాసిన రహస్య లేఖ తీవ్ర దుమారం రేపుతోంది. తాను రాసిన లేఖపై ఎలాంటి వ్యాఖ్యలు చేయని అంబేకర్.. ఆసలు ఆ లేఖ ఎలా లీక్ అయ్యిందో తెలుసుకునేందుకు దర్యాప్తునకు ఆదేశించాలిని కోరారు. ‘ఆ లేఖ రహస్యంగా రాసింది. మరి అది ఎలా బయటికొచ్చింది. దీనిపై దర్యాప్తు జరగాలి’ అని స్నేహాల్ డిమాండ్ చేశారు. కాగా దీనిపై సొంత పార్టీ నుంచే గాక అన్ని వైపుల నుంచి స్నేహాల్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుభవ లేమి వల్లే ఆమె ఇలా వివాదాల్లో చిక్కుకుంటున్నారని విమర్శకులు పేర్కొంటున్నారు. స్నేహాల్ను పదవి నుంచి తప్పించేందుకు సేన నాయకులు ప్రయత్నించినప్పటికీ, ఆమె మేయర్‌గానే కొనసాగుతానని భీష్మించుకుని కూర్చున్నారు. మేయర్ పదవి నిర్వర్తించేంత బలమైన నేత లేకపోవడం, బీజేపీతో సత్సం బంధాలు లేకపోవడంతో సేన ఏం చేయలేకపోతోంది. దూరంగా ఉంటే మంచిది.. కాగా, వివాదాలకు దూరంగా ఉండాలంటూ అంబేకర్‌కు మాతోశ్రీ నుంచి మందలింపు వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ‘ఇదే పరిస్థితిని స్నేహాల్ కొనసాగిస్తే.. త్వరలోనే మేయర్ పదవి ఇంకొకరికి అప్పజెప్పాల్సి వస్తుంది’ అని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ‘మేం మేయర్‌ను మార్చాలని అనుకుంటున్నాం. కానీ ఆమెకు ప్రత్యామ్నాయం ఎవరూ కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో మేయర్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడం కూడా కుదరదు. బీజేపీతో సంబంధాలు అంతంతమాత్రమే. ఈ వివాదాలను ఎత్తి చూపి వారు లబ్ధి పొందాలనుకుం టున్నారు. అందుకే ప్రస్తుతం ఏ నిర్ణయాన్ని తీసుకోలేకపో తున్నాం. మరో ప్రత్యామ్నాయం లేదు. ఆమెను కొనసాగిం చడమే’ అని ఓ సేన సీనియర్ నేత అన్నారు. బీఎంసీ చరి త్రలో ఏ ఒక్క మేయర్ కూడా ఇన్ని వివాదాల్లో చిక్కుకోలేదు. అది కూడా మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలో పే తలెత్తడం గమనార్హం. ఒక వేళ మేయర్‌గా అంబేకర్‌ను కొనసాగించాలని సేన అధినాయకత్వం భావిస్తే.. 2017 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే వరకు ఆమె కొనసాగుతారు. ఇదీ స్నేహాల్ ప్రస్థానం శివసేన నేత సూర్యకాంత్ సతీమణి అయిన స్నేహాల్, 1996లో పార్టీలో చేరారు. 2012లో లోయర్ పరేల్ నుంచి తొలిసారి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ముంబై మేయర్ పదవి ఎస్సీలకు రిజర్వయ్యింది. యామిణి జాదవ్, భారతి బౌడానే కార్పొరేటర్లతో పాటు స్నేహాల్.. మేయర్ పదవికి పోటీ పడగా, అంబేకర్‌ను పదవి వరించింది. ఇవీ వివాదాలు.. నెల రోజుల కిందట ప్రధాని నరేంద్ర మోదీని జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చి దుమారం రేపారు. తనకు కేటాయించిన ప్రభుత్వ కారుకు ఎర్ర బుగ్గను తొలగించేందుకు నిరాకరించారు. ముంబై నగరానికి తాను ముఖ్యమంత్రి లాంటి దాన్నని వ్యాఖ్యానించారు. దీపావళి సందర్భంగా శివాజీ పార్క్‌లోని తన అధికారిక నివాసంలో బాలీవుడ్ గీతాలకు నృత్యం చేసి మరో మారు వివాదంలో చిక్కుకున్నారు. డెంగీ వ్యాధి వ్యాప్తి గురించి మీడియా ఓవర్ యాక్షన్ చేస్తోందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
మోదీని హిట్లర్ తో పోల్చిన స్నేహాల్
ముంబై: శివసేన నాయకురాలు, ముంబై నగర మేయర్ స్నేహాల్ ఆంబేకర్ తన వ్యాఖ్యలతో కలకలం రేపారు. ప్రధాని నరేంద్ర మోదీని జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ తో ఆమె పోల్చారు.' నరేంద్ర మోదీ అంటే నాకు గౌరవం. అయితే అది కొంతవరకే. హిట్లర్ లా ఆయన పరిపాలన సాగుతోంది. ఒకే వ్యక్తి చేతిలో అధికారం కేంద్రీకృతం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అంబేద్కర్ చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలి' అని ఓ ఇంటర్వ్యూలో స్నేహాల్ అన్నారు. ముంబై మహానగరానికి మొదటి దళిత మహిళా మేయర్ గా గతేడాది బాధ్యతలు చేపట్టిన స్నేహాల్ కారుపై ఎర్రబుగ్గ(బీకన్) వివాదంతో పతాక శీర్షికలకు ఎక్కారు. అయితే మేయర్ ఎర్రబుగ్గ కారు వినియోగించడంలో తప్పేమి లేదని పునరుద్ఘాటించారు. కేంద్రం, మహారాష్ట్రలో మిత్రపక్షాలు ఉన్న బీజేపీ, శివసేన మధ్య పరస్పర విసుర్లు కొనసాగిస్తున్నానే ఉన్నాయి. -
డెంగీ బాధితులకు మేయర్ పరామర్శ
సాక్షి, ముంబై: డెంగీ వ్యాధితో బాధపడుతూ అంధేరీలోని కూపర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురిని శుక్రవారం నగర మేయర్ స్నేహల్ అంబేకర్ పరామర్శించారు. అక్కడ వారికి అందుతున్న చికిత్సపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా, గత కొద్ది నెలలుగా నగరాన్ని గజగజలాడిస్తున్న డెంగీ మహమ్మారి మరొకరిని బలితీసుకుంది. దీంతో డెంగ్యూతో మృతి చెందిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. అంధేరిలో నివాసముంటున్న మానసీ (3) అనే చిన్నారికి జ్వరం రావడంతో బుధవారం హోలి స్పిరిట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు డెంగీ అని తేలగా వైద్యం ప్రారంభించారు. కాని చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం చనిపోయింది. గత వారం కిందట డెంగ్యూతో ఐదుగురు చనిపోయారు. అందులో కేం ఆస్పత్రికి చెందిన రెసిడెన్సీ డాక్టర్ శృతి ఖోబ్రగడే (24) కూడా ఉన్నారు. మరో ఏడుగురు రెసిడెన్సీ డాక్టర్లకు సైతం డెంగీ సోకినట్లు పరీక్షల్లో తేలింది. వీరందరు మాహింలోని హిందుజా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదేవిధంగా, నాసిక్‌లో ఇటీవల ఒకేరోజు ఇద్దరు, పింప్రిలో ఒకరు డెంగీతో బాధపడుతూ మరణించారు. ప్రాణాంతకమైన ఈ వ్యాధిని నివారించేందుకు మహానగర పాలక సంస్థ (బీఎంసీ) ఆరోగ్యశాఖ అనేక ప్రయత్నాలు చేస్తోంది. అయినా డెంగీ అదుపులోకి రాకపోవడంతో ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. -
ముదురుతున్న ఎర్రబుగ్గ వివాదం
సాక్షి, ముంబై: స్నేహల్ ఆంబేకర్ ముంబై మేయర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించి నాలుగు రోజులైనా కాలేదు కానీ వివాదాలు మాత్రం ఆమెను ముసురుకుంటున్నాయి. తన కారుపై ఎర్ర బుగ్గ (బీకన్) తొలగించకుండా అలాగే ఉంచాలని పట్టుబట్టిన విషయం తెలిసిందే. మేయర్ వాహనానికి ఎర్రబుగ్గ అమర్చడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ కోర్టును ఆశ్రయిస్తామని ప్రతిపక్షాలు ప్రకటించాయి. దీంతో స్నేహల్ కొత్త వివాదంలో చిక్కుకునే సూచనలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర శాఖల మంత్రులు, ప్రధాన కార్యదర్శులు మినహా ఇతర ఏ ప్రభుత్వ ఉద్యోగులు లేదా పదవుల్లో ఉన్న వారు ఎర్రబుగ్గ వాహనాలను వినియోగించకూడదు. ఇది మేయర్ కూడా వర్తిస్తుంది. అంబేకర్ మాత్రం తన వాహనంపై కచ్చితంగా ఎర్రబుగ్గ ఉండాల్సిందేనని పట్టుబట్టడంతో ఈ వివాదం మరింత రాజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కోర్టు ఆదేశాలను ధిక్కరించడమంటే న్యాయస్థానాన్ని అవమానించడమేనని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఒకవేళ ఆమె తన వాహనంపై ఎర్రబుగ్గ అమర్చుకుంటే, తప్పకుండా కోర్టుధిక్కార పిటిషన్ దాఖలు చేస్తామని విపక్ష నాయకులు హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మేయర్లంతా తమ వాహనాలపై ఎర్రబుగ్గ తొలగించుకోవాల్సిందేనని ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది. ఇది వరకు మేయర్‌గా పనిచేసిన సునీల్ ప్రభు మాత్రం ఎర్రబుగ్గను యథావిధిగా కొనసాగించారు. కొత్త మేయర్ స్నేహల్ ఆంబేకర్ కూడా దాన్ని అలాగే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే ఊరుకునేది లేదని ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఆంబేకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వీవీఐపీలు మాత్రమే ఎర్రబుగ్గలను వాహనాలకు అమర్చుకోవాలి. అంతగా అవసరమనుకుంటే అంబేకర్ పసుపు రంగు బుగ్గ అమర్చుకోవాలి. వీఐపీలకు కేటాయించిన ఎర్రబుగ్గను మేయర్ అమర్చుకోవడం సరికాదు’ అని దేవేంద్ర స్పష్టం చేశారు. దీనిపై స్నేహల్ ఆంబేకర్ వివరణ ఇస్తూ కారుపై ఎర్రబుగ్గ అమర్చుకోవడంపై తనకు పెద్దగా ఆసక్తి లేదన్నారు. ఇతరుల మాదిరిగా తను గొప్పలకు పోవడం లేదని చెప్పారు. ‘దేశ, విదేశాల నుంచి ముంైబె కి వచ్చే వీఐపీలకు స్వాగతం పలకాల్సిన బాధ్యత మేయర్‌ది. ఇలాంటి సందర్భాల్లో వాహనంపై ఎర్రబుగ్గ ఉంటే ప్రాధాన్యం లభిస్తుంది. దీనిపై సీనియర్ నాయకులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాను’ అని ఆమె స్పష్టం చేశారు. అంబేకర్ మేయర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి మొదటిరోజు బాధ్యతలేంటో అడిగి తెలుసుకోకుండా తన చాంబర్ అలంకరణపై దృష్టి పెట్టారని విమర్శలు వచ్చాయి. తన క్యాబిన్‌ను ఎలా అలంకరించాలో కిందిస్థాయి అధికారులకు సూచనలిస్తూ ఆమె చాలా సేపు గడిపారు. ఉద్యోగులతో పరిచయాలు అయ్యాక, కొన్ని పత్రాలపై సంతకాలుచేశారు. శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రేతో భేటీ అయ్యేందుకు బాంద్రాలోని మాతోశ్రీ బంగ్లాకు ఆదరాబాదరగా వెళ్లిపోయారు. -
ఎర్రబుగ్గపై ఎంత మోజో!
సాక్షి, ముంబై: మేయర్‌గా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన స్నేహల్ అంబేకర్‌కు విధినిర్వహణ కంటే ఎర్రబుగ్గ వాహనం, తన కార్యాలయ అలంకరణపై మోజు ఎక్కువంటూ సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మేయర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి మొదటిరోజు ఆమె తన చాంబర్లోకి వచ్చారు. తన పదవీ బాధ్యతలేంటో తెలుసుకోవాల్సి ఉండగా, అదేం పట్టించుకోకుండా తన చాంబర్ అలంకరణపై దృష్టి పెట్టారు. క్యాబిన్‌ను ఎలా అలంకరించాలో కిందిస్థాయి అధికారులకు సూచనలిస్తూ చాలా సేపు గడిపారు. అంతేగాక ప్రభుత్వం అందజేసిన కారుపై ఎర్రబుగ్గ (బీకన్) తొలగించకుండా అలాగే ఉంచాలని పట్టుబట్టారు. తదనంతరం ఉద్యోగులతో మాటామంతి అయ్యాక, కొన్ని పత్రాలపై సంతకాలు చేశారు. శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రేతో భేటీ అయ్యేందుకు బాంద్రాలోని మాతోశ్రీ బంగ్లాకు ఆదరబాదరగా వెళ్లిపోయారు. తన కారుపై ఎర్రబుగ్గా కచ్చితంగా ఉండాల్సిందేనని పట్టుబట్టడంతో అంతా విస్తుపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రధాన కార్యదర్శులు మినహా ఇతర ఏ ప్రభుత్వ ఉద్యోగులు లేదా పదవుల్లో ఉన్న వాళ్లు వాహనాలపై ఎర్రబుగ్గ అమర్చుకోకూడదు. దీన్ని కచ్చితంగా పాటించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం మేయర్లందరికీ లిఖితపూర్వక ఆదేశాలు జారీచేసింది. ఇదివరకు మేయర్ పదవిలో కొనసాగిన సునీల్ ప్రభు ‘మేయర్ పదవి’ ఒక ప్రతిష్టాత్మకమైనదని, తాను నగర ప్రథమ పౌరుడినని పేర్కొంటూ ఎర్రబుగ్గ తొలగించలేదు. ఇదే వాహనాన్ని నూతన మేయర్ స్నేహల్ ఆంబేకర్కు అప్పగించాక, పాత పద్ధతే కొనసాగించాలని పట్టుబట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అక్కడున్న కొందరు విలేకరులు గుర్తు చేశారు. నగర ప్రథమ పౌరురాలిని కాబట్టి అధికారిక వాహనంపై ఎర్రబుగ్గ ఉండాల్సిందేనని అన్నారు. ఇది కచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందని, స్నేహల్ వంటి వారిని చూసి ఇతరులు కూడా తమ వాహనాలపై బుగ్గ అమర్చుకుంటారని మున్సిపల్ అధికారులు విమర్శిస్తున్నారు. -
కారుపై ఎర్రబుగ్గను తొలగించే ప్రసక్తే లేదు!
ముంబై: తన అధికారిక వాహనంపై ఉన్న ఎర్రబుగ్గ (రెడ్ బీకాన్)ను తొలగించేది లేదంటూ ముంబై నగర్ మేయర్ స్నేహాల్ అంబేకర్ తేల్చిచెప్పారు. ఆమె కొత్తగా మేయర్ గా ఎన్నికైన అనంతరం తన అధికారిక వాహనంపై ఎర్రబుగ్గను కల్గి ఉండటంతో వివాదం చెలరేగింది. దీంతో స్పందించిన ఆమె.. ముఖ్యమంత్రి వాహనంపై ఎర్రబుగ్గకు అనుమతి ఇచ్చి.. మేయర్ కారుపై తొలగించాలని పేర్కొనడాన్ని ఆమె తప్పుబట్టారు. అంతేకాకుండా మేయర్ పదవి అనేది సీఎం పదవితో సమానం అంటూ ఎద్దేవా చేశారు. 'మేయర్ స్థానం సీఎం స్థానంతో సమానం. సీఎం వాహనంపై రెడ్ బీకాన్ ఉంటుంది. మరి నాకు ఇబ్బంది ఏంటి' అంటూ ఆమె ఘాటుగా స్పందించారు. ఒకవేళ నా అభిప్రాయాన్ని అడిగితే ఇది సమాధానం చెబుతానని ఆమె మొండికేశారు. సీఎం అధికారిక వాహనంపై ఎర్రబుగ్గను వాడగా అభ్యంతరం లేనిది.. తన వరకూ వచ్చేసరికి ఏమిటిని ప్రశ్నించారు. దీనిపై మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ నిబంధనలు కచ్చితంగా పాటించాలని హితవు పలికారు. ' ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ నియమాలు కూడా ఉంటాయ్' అని స్పష్టం చేశారు. తాజా ప్రభుత్వ నియమావళిలో మేయర్ వాహనంపై రెడ్ బీకాన్ ఉండకూడదని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వైఖరిని మాజీ మేయర్ సునీల్ ప్రభూ కూడా ఖండించారు. మేయర్ తన అధికారి కారుపై ఎర్రబుగ్గను వాడటం ఒక సాంప్రదాయంగా వస్తుందని అభిప్రాయపడ్డారు. -
బీఎంసీ కొత్త మేయర్ స్నేహల్
ముంబై: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) 73వ మేయర్‌గా శివసేన కార్పొరేటర్ స్నేహల్ అంబేకర్ మంగళవారం ఎన్నికయ్యారు. ఇక బీజేపీకి చెందిన అల్కా కేర్కర్ ను ఉప మేయర్ పదవి వరించింది. భారతీయ జీవిత భీమా సంస్థ (ఎల్ఐసీ) మాజీ ఉద్యోగి అయిన స్నేహల్ నగరంలోని జీ-సౌత్ (పరేల్) వార్డు నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుత మేయర్ సునీల్ ప్రభు పదవీకాలం ముగియడంతో మంగళవారం ఉదయం బీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికలు జరిపారు. బీఎంసీలో మొత్తం కార్పొరేటర్ల సంఖ్య 226 కాగా స్నేహల్‌కు అనుకూలంగా 121 మంది ఓటు వేశారు. ఈ పదవికోసం కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీపడిన డాక్టర్ ప్రియతమకు కేవలం 64 ఓట్లే పడ్డాయి. ఇక డిప్యూటీ మేయర్‌గా అల్కా కేర్కర్ ఎన్నికయ్యారు. -
బీఎంసీ మేయర్ ఎన్నికలు
సాక్షి, ముంైబె : బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మేయర్ అభ్యర్థిగా శివసేన తరఫున స్నేహల్ అంబేకర్ నామినేషన్ దాఖలు చేశారు. రెండున్నర సంవత్సరాల క్రితం రాజకీయ రంగప్రవేశం చేసిన స్నేహల్...గత ఎన్నికల్లో కార్పొరేటర్‌గా విజయం సాధించారు. రిజర్వేషన్ కారణంగా ఆమెకు కేవలం రెండున్నర ఏళ్లలోనే మేయర్ పదవి చేపట్టే అవకాశం లభించనుంది. పార్టీ అభ్యర్థిగా స్నేహల్ పేరును శివసేన ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం ఆమె తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ప్రస్తుతం ముంబై మేయర్‌గా ఉన్న సునీల్ ప్రభు పదవీ కాలం ఈ నెల ఎనిమిదో తేదీతోముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల తొమ్మిదో తేదీన మేయర్ ఎన్నికలను నిర్వహించనున్నారు. శివసేన-బీజేపీ కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉండడంతో శివసేన అభ్యర్థి స్నేహల్ మేయర్ ఎన్నిక కావడానికి ఎటువంటి విఘ్నాలు ఎదురుకావనేది సుస్పష్టం. అయినప్పటికీ తొమ్మిదో తేదీన ఎన్నికలు నిర్వహించి అధికారికంగా ఆమెను మేయర్‌గా ప్రకటించనున్నారు. మరోవైపు బీజేపీ కార్పొరేటర్ అల్కా కేర్కర్ డిప్యూటీ మేయర్‌గా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో మేయర్‌గా స్నేహల్, డిప్యూ టీ మేయర్‌గా అల్కా పదవులను అలంకరించనున్నారు. ఇదిలా ఉండగా సంఖ్యాబలం లేకపోయినప్పటికీ కాంగ్రెస్ తరఫున మేయర్ పదవికి డాక్టర్ ప్రియతమా సావంత్, డిప్యూటీ మేయర్ పదవి కి ఎన్సీపీ తరఫున చందన్ శర్మ నామినేషన్ దాఖలు చేశారు. ఎస్సీ కోటాలో ఉన్న లోయర్ పరేల్‌లోని 194వ వార్డు నుంచి స్నేహల్ అంబేకర్ విజయం సాధించారు. దీంతో ఆమెను అత్యున్నతమైన మేయర్ పదవి వరించనుంది. జీవిత భీమా సంస్థలో (ఎల్ఐసీ)లో సీనియర్ సేల్స్ ఎక్గిక్యూటివ్ విధులు నిర్వర్తిస్తున్న స్నేహల్ అంబేకర్ భర్త శివసేన ఉపశాఖ ప్రముఖుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇక డిప్యూటీ మేయర్‌గా ఎన్నిక కానున్న అల్కా కేర్కర్ పశ్చిమ బాంద్రాలోని 93వ ప్రభాగ్ నుంచి ఘన విజయం సాధించారు. 18 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ కార్పొరేటర్‌గా విజయం సాధించిన మొదటి టెర్మ్‌లోనే ఆమెను డిప్యూటీ మేయర్ పదవి వరించనుండడం విశేషం.