వివాదాలతో స్నేహం
ముంబై: ఎప్పుడూ వివాదాల్లో ఉండే ముంబై మేయర్ స్నేహల్ అంబేకర్ ఇప్పుడు మరో సరికొత్త వివాదానికి తెర లేపారు. నగరంలోని రోడ్ల పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ముంబై మున్సిపల్ కమిషనర్ అజోయ్ మెహతాకు ఆమె రాసిన రహస్య లేఖ తీవ్ర దుమారం రేపుతోంది. తాను రాసిన లేఖపై ఎలాంటి వ్యాఖ్యలు చేయని అంబేకర్.. ఆసలు ఆ లేఖ ఎలా లీక్ అయ్యిందో తెలుసుకునేందుకు దర్యాప్తునకు ఆదేశించాలిని కోరారు.
‘ఆ లేఖ రహస్యంగా రాసింది. మరి అది ఎలా బయటికొచ్చింది. దీనిపై దర్యాప్తు జరగాలి’ అని స్నేహాల్ డిమాండ్ చేశారు. కాగా దీనిపై సొంత పార్టీ నుంచే గాక అన్ని వైపుల నుంచి స్నేహాల్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుభవ లేమి వల్లే ఆమె ఇలా వివాదాల్లో చిక్కుకుంటున్నారని విమర్శకులు పేర్కొంటున్నారు. స్నేహాల్‌ను పదవి నుంచి తప్పించేందుకు సేన నాయకులు ప్రయత్నించినప్పటికీ, ఆమె మేయర్‌గానే కొనసాగుతానని భీష్మించుకుని కూర్చున్నారు. మేయర్ పదవి నిర్వర్తించేంత బలమైన నేత లేకపోవడం, బీజేపీతో సత్సం బంధాలు లేకపోవడంతో సేన ఏం చేయలేకపోతోంది.
దూరంగా ఉంటే మంచిది..
కాగా, వివాదాలకు దూరంగా ఉండాలంటూ అంబేకర్‌కు మాతోశ్రీ నుంచి మందలింపు వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ‘ఇదే పరిస్థితిని స్నేహాల్ కొనసాగిస్తే.. త్వరలోనే మేయర్ పదవి ఇంకొకరికి అప్పజెప్పాల్సి వస్తుంది’ అని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ‘మేం మేయర్‌ను మార్చాలని అనుకుంటున్నాం. కానీ ఆమెకు ప్రత్యామ్నాయం ఎవరూ కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో మేయర్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడం కూడా కుదరదు. బీజేపీతో సంబంధాలు అంతంతమాత్రమే. ఈ వివాదాలను ఎత్తి చూపి వారు లబ్ధి పొందాలనుకుం టున్నారు. అందుకే ప్రస్తుతం ఏ నిర్ణయాన్ని తీసుకోలేకపో తున్నాం. మరో ప్రత్యామ్నాయం లేదు. ఆమెను కొనసాగిం చడమే’ అని ఓ సేన సీనియర్ నేత అన్నారు.
బీఎంసీ చరి త్రలో ఏ ఒక్క మేయర్ కూడా ఇన్ని వివాదాల్లో చిక్కుకోలేదు. అది కూడా మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలో పే తలెత్తడం గమనార్హం. ఒక వేళ మేయర్‌గా అంబేకర్‌ను కొనసాగించాలని సేన అధినాయకత్వం భావిస్తే.. 2017 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే వరకు ఆమె కొనసాగుతారు.
ఇదీ స్నేహాల్ ప్రస్థానం
శివసేన నేత సూర్యకాంత్ సతీమణి అయిన స్నేహాల్, 1996లో పార్టీలో చేరారు. 2012లో లోయర్ పరేల్ నుంచి తొలిసారి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ముంబై మేయర్ పదవి ఎస్సీలకు రిజర్వయ్యింది. యామిణి జాదవ్, భారతి బౌడానే కార్పొరేటర్లతో పాటు స్నేహాల్.. మేయర్ పదవికి పోటీ పడగా, అంబేకర్‌ను పదవి వరించింది.
ఇవీ వివాదాలు..
- నెల రోజుల కిందట ప్రధాని నరేంద్ర మోదీని జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చి దుమారం రేపారు.
- తనకు కేటాయించిన ప్రభుత్వ కారుకు ఎర్ర బుగ్గను తొలగించేందుకు నిరాకరించారు. ముంబై నగరానికి తాను ముఖ్యమంత్రి లాంటి దాన్నని వ్యాఖ్యానించారు.
- దీపావళి సందర్భంగా శివాజీ పార్క్‌లోని తన అధికారిక నివాసంలో బాలీవుడ్ గీతాలకు నృత్యం చేసి మరో మారు వివాదంలో చిక్కుకున్నారు.
- డెంగీ వ్యాధి వ్యాప్తి గురించి మీడియా ఓవర్ యాక్షన్ చేస్తోందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.