మేయర్‌గా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన స్నేహల్ అంబేకర్‌కు....
సాక్షి, ముంబై: మేయర్‌గా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన స్నేహల్ అంబేకర్‌కు విధినిర్వహణ కంటే ఎర్రబుగ్గ వాహనం, తన కార్యాలయ అలంకరణపై మోజు ఎక్కువంటూ సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మేయర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి మొదటిరోజు ఆమె తన చాంబర్‌లోకి వచ్చారు. తన పదవీ బాధ్యతలేంటో తెలుసుకోవాల్సి ఉండగా, అదేం పట్టించుకోకుండా తన చాంబర్ అలంకరణపై దృష్టి పెట్టారు. క్యాబిన్‌ను ఎలా అలంకరించాలో కిందిస్థాయి అధికారులకు సూచనలిస్తూ చాలా సేపు గడిపారు.
అంతేగాక ప్రభుత్వం అందజేసిన కారుపై ఎర్రబుగ్గ (బీకన్) తొలగించకుండా అలాగే ఉంచాలని పట్టుబట్టారు. తదనంతరం ఉద్యోగులతో మాటామంతి అయ్యాక, కొన్ని పత్రాలపై సంతకాలు చేశారు. శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రేతో భేటీ అయ్యేందుకు బాంద్రాలోని మాతోశ్రీ బంగ్లాకు ఆదరబాదరగా వెళ్లిపోయారు. తన కారుపై ఎర్రబుగ్గా కచ్చితంగా ఉండాల్సిందేనని పట్టుబట్టడంతో అంతా విస్తుపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రధాన కార్యదర్శులు మినహా ఇతర ఏ ప్రభుత్వ ఉద్యోగులు లేదా పదవుల్లో ఉన్న వాళ్లు వాహనాలపై ఎర్రబుగ్గ అమర్చుకోకూడదు.
దీన్ని కచ్చితంగా పాటించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం మేయర్లందరికీ లిఖితపూర్వక ఆదేశాలు జారీచేసింది. ఇదివరకు మేయర్ పదవిలో కొనసాగిన సునీల్ ప్రభు ‘మేయర్ పదవి’ ఒక ప్రతిష్టాత్మకమైనదని, తాను నగర ప్రథమ పౌరుడినని పేర్కొంటూ ఎర్రబుగ్గ తొలగించలేదు. ఇదే వాహనాన్ని నూతన మేయర్ స్నేహల్ ఆంబేకర్‌కు అప్పగించాక, పాత పద్ధతే కొనసాగించాలని పట్టుబట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అక్కడున్న కొందరు విలేకరులు గుర్తు చేశారు. నగర ప్రథమ పౌరురాలిని కాబట్టి అధికారిక వాహనంపై ఎర్రబుగ్గ ఉండాల్సిందేనని అన్నారు. ఇది కచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందని, స్నేహల్ వంటి వారిని చూసి ఇతరులు కూడా తమ వాహనాలపై బుగ్గ అమర్చుకుంటారని మున్సిపల్ అధికారులు విమర్శిస్తున్నారు.