కిషోరి పెడ్నేకర్‌ను అభినందిస్తున్న ఉద్ధవ్ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రే
సాక్షి, ముంబై: ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో ముందుగా ఊహించినట్టుగానే శివసేన తన పట్టును నిలుపుకుంది. మేయర్ పీఠంతోపాటు డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకుంది. ముంబై మేయర్ శివసేన సీనియర్ మహిళా కార్పొరేటర్ కిషోరి పెడ్నేకర్, డిప్యూటీ మేయర్‌గా అడ్వొకేట్ సుహాస్ వాడ్కర్‌లు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ముఖ్యంగా రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో శివసేననే మళ్లీ అధికారంలోకి వస్తుందని అందరూ భావించారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ప్రకటించిన రిజర్వేషన్ ప్రక్రియలో ముంబై మేయర్ పదవి ఓపెన్ కేటగిరీలోకి వచ్చింది. దీంతో అనేక మంది ప్రయత్నించినప్పటికీ చివరికి శివసేన తరఫున మేయర్ పదవికి కిషోరి పెడ్నేకర్, డిప్యూటీ మేయర్ పదవికి సుహాస్ వాడ్కర్ సోమవారం నామినేషన్లు వేసిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ తరఫున నామినేషన్ దాఖలు చేయలేదు. మరోవైపు కాంగ్రెస్, ఎన్సీపీలు కూడా నామినేషన్‌లు దాఖలు చేయకపోవడంతో శివసేనకే మేయర్ పదవి ఖాయమైంది. అయితే శుక్రవారం అధికారికంగా కిషోరి పెడ్నేకర్, సుహాస్ వాడ్కర్‌లు ఏకగ్రీవంగా విజయం సాధించినట్టు ప్రకటించారు.
50 ఏళ్ల తర్వాత ఏకగ్రీవం...
ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో 50 ఏళ్ల తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అందించిన వివరాల మేరకు 1888లో స్థాపించిన ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో 50 ఏళ్ల కిందట ఏకగ్రీవంగా ఎన్నుకోగా మళ్లీ 2019లో మేయర్ డిప్యూటీ మేయర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఉద్ధవ్ ఠాక్రే అభినందనలు..
శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే నూతన మేయర్, డిప్యూటీ మేయర్లను అభినందించారు. ముంబై మేయర్‌గా కిషోరి పెడ్నెకర్, డిప్యూటి మేయర్‌గా సుహాస్ వాడ్కర్‌లు ఎంపికైన తర్వాత స్వయంగా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్యా ఠాక్రేలు ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు చేరుకున్నారు. అనంతరం అక్కడ వారిద్దరికీ అభినందనలు తెలిపారు.
నర్స్ నుంచి మేయర్‌గా..
ముంబై మేయర్‌గా ఎంపికైన శివసేన సీనియర్ కార్పొరేర్ కిషోరి పెడ్నేకర్ రాజకీయ పయనం వినూత్నంగా సాగింది. ముఖ్యంగా ఓ ఆసుపత్రిలో నర్స్‌గా విధులు నిర్వహించే ఆమె రాజకీయాల్లోకి రావడమే కాకుండా దేశంలోనే అత్యంత సంపన్నమైన కార్పొరేషన్‌గా గుర్తింపు పొందిన ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని కైవసం చేసుకున్నారు. కిషోరి పెడ్నేకర్ తండ్రి మిల్లు కార్మికునిగా పనిచేసేవారు. అయితే వివాహం అనంతరం నావాశేవాలోని ఓ ఆసుపత్రిలో ఆమె నర్స్‌గా చేరింది. ఇలా నర్స్‌గా విధులు నిర్వహిస్తూ అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తూ తనదైన ముద్రను వేసుకుంది. అదే సమయంలో శివసేనలో చేరిన ఆమె లోయర్ పరేల్, వర్లీ పరిసరాల్లో పనులు చేయడం ప్రారంభించింది.
2002లో కార్పొరేటర్‌గా...
శివసేనలో ప్రారంభంలో చిన్న చిన్న పదవులతో ప్రారంభమైన కిషోరి పెడ్నేకర్ పయనం కార్పొరేటర్ ఎన్నికల వరకు చేరింది. మొదటిసారిగా ఆమె 2002లో కార్పొరేటర్‌గా విజయం సాధించారు. అనంతరం 2019లో మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. ఇలా ఆమె బీఎంసీలో అత్యున్నత పీఠాన్ని కైవసం చేసుకున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా వర్లీ అసెంబ్లీ నుంచి పోటీ చేసిన శివసేన యువనేత గెలుపులో కిషోరి పెడ్నెకర్ తనదైన ముద్రను వేసుకున్నారు. దీంతోనే ఆమెకు ఈ పదవి లభించిందని కూడా ఊహాగానాలు వస్తుండటం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment