వివరాలు వెల్లడిస్తున్న ముంబై మేయర్ కిశోరి పడ్నేకర్ (ఫొటో: IndiaToday)
ముంబై: మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ మళ్లీ దేశంలో కలకలం రేపుతోంది. తాజాగా మహారాష్ట్రలో కూడా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆ రాష్ట్రంలోని ముంబై, నాగ్‌పూర్‌లో కేసుల నమోదు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి, ఓ మేయర్ థర్డ్ వేవ్ వచ్చేసిందని ప్రకటించారు. ఇదిగోండి మీ ఇళ్ల ముందే ఉందని పేర్కొన్నారు. వారిద్దరి ప్రకటనలు ఆ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఎలా ఉందనేది స్పష్టం చేస్తోంది.
చదవండి: జైలులో అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన ఖైదీలు
ఆ రాష్ట్ర మంత్రి నితిన్ రౌత్ ‘నాగ్‌పూర్‌లో థర్డ్ వేవ్ వచ్చేసింది’ అని మంగళవారం తెలిపారు. తాజాగా ముంబై మేయర్ కిశోరీ పడ్నేకర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ‘మూడో దశ రావడం కాదు. వచ్చేసింది! మన ఇంటి ముందరే ముప్పు పొంచి ఉంది. జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం’ అని ఆమె తెలిపారు. ‘నాగ్‌పూర్‌లో వచ్చేసింది అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ముంబైవాసులు జాగ్రత్తలు పాటించాలి’ అని సూచించారు. ‘గత రెండు దశల అనుభవంతో ఇప్పుడు మూడో దశ రాకుండా అడ్డుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది’ అని విలేకరుల సమావేశంలో ఆమె చెప్పారు.
అయితే ఆ ప్రకటనపై ఆమె వివరణ ఇచ్చుకున్నారు. తాజాగా ఆమె బుధవారం మీడియా సమావేశం ఏర్పాటుచేసి ‘నేను అలా అనలేదు’ అని చెప్పారు. ముంబైలో థర్డ్ వేవ్ ఉందని తాను అనలేదని స్పష్టం చేశారు. మంత్రి నితిన్ రౌత్ థర్డ్ వేవ్ ఉన్నట్టు చెప్పడంతో థర్డ్ వేవ్ ఇంటి ముందరే ఉందని చెప్పినట్లు వివరణ ఇచ్చారు. జాగ్రత్తలు అవసరం అని మాత్రమే తాను చెప్పినట్లు వివరించారు.
కరోనాపై మంత్రి ఆదిత్య ఠాక్రే కూడా స్పందించారు. కరోనా ఉందనే విషయాన్ని గుర్తించుకోవాలని సూచించారు. ‘12-18 ఏళ్ల వారికి ఇంకా వ్యాక్సిన్ రాలేదనే విషయాన్ని గుర్తించాలి. ముంబైతో పాటు మహారాష్ట్రలో మూడో దశ రాకుండా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాం. జాగ్రత్తలు పాటిస్తే థర్డ్ వేవ్‌ను అడ్డుకోగలం’ అని ఆదిత్య తెలిపారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో వినాయక చవితి వేడుకలపై కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూనే వేడుకలు చేసుకోవాలని సూచించింది.
చదవండి: ఉత్తరాఖండ్ గవర్నర్ రాజీనామా
Comments
Please login to add a commentAdd a comment