సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాలో కోవిడ్ థర్డ్ వేవ్ నుంచి గట్టెక్కినట్టేనని అధికారులతో పాటు వైద్యనిపుణులూ భావిస్తున్నారు. సెకండ్ వేవ్‌లో ఎంత ఉధృతంగా వచ్చిందో అందరికీ తెలిసిందే. సెకండ్ వేవ్‌లో ఆస్పత్రుల్లో చేరిన వారితో పాటు మృతుల సంఖ్య ఎక్కువే. మొదటి, సెకండ్ వేవ్‌లలో తీవ్ర భయాందోళన సృష్టించిన కరోనా.. థర్డ్ వేవ్‌లో ఒమిక్రాన్ వేరియంట్ అంతగా ప్రభావం చూపించకపోవడంతో జిల్లాలో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మొదటి వేవ్‌లో మొత్తం పాజిటివ్ కేసుల్లో 14.4 శాతం మంది ఆస్పత్రుల్లో చేరారు. సెకండ్‌వేవ్‌లో ఈ సంఖ్య 17 శాతానికి పెరిగింది. థర్డ్‌వేవ్‌లో మూడు శాతం వరకు మాత్రమే వెళ్లింది. ఈ నెల మూడో తేదీ నాటికి జిల్లాలో యాక్టివ్ కేసుల సంఖ్య 9,095గా ఉంది. 12వ తేదీ నాటికి 610 కేసులు మాత్రమే. దీన్ని బట్టి పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నదని చెప్పుకోవచ్చు. జిల్లాలో 15 కోవిడ్ కేర్ సెంటర్లు ఉండగా శనివారం నాటికి ఒక్క అడ్మిషన్ కూడా కాలేదు.
అయినా అప్రమత్తంగానే...
మొదటి వేవ్, సెకండ్‌వేవ్‌లతో పోలిస్తే థర్డ్‌వేవ్ ప్రభావం నామమాత్రంగా కూడా లేదనేది తెలిసిందే. అయినా సరే ఏమరుపాటుగా ఉండకూడదని, మరికొన్ని రోజులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ప్రజల్లో కోవిడ్ భయం పోయిందని, వైరస్ ప్రభావం లేదు కదా అని ఇష్టారాజ్యంగా తిరగడం మంచిది కాదని, కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు కోవిడ్ నియంత్రణలో భాగంగా హెల్త్‌కేర్ వర్కర్లకు ప్రికాషన్ డోస్, 60 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోస్, 15–18 ఏళ్లలోపు వారికి ప్రత్యేక టీకా డ్రైవ్ కొనసాగుతూనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment